భారత భాగ్య విధాత తెలంగాణ
వనం జ్వాలా
నరసింహారావు
ఆంధ్రజ్యోతి
దినపత్రిక (13-12-2022)
(ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలోని భారత్ రాష్ట్ర
సమితి సమీప భవిష్యత్తులో దేశ రాజకీయ యవనికపై ఒక మాహాశక్తిగా ప్రభవించనున్నది.
యావద్భారతీయులకూ శ్రేయస్సు సమకూర్చేందుకు తెలంగాణ అభివృద్ధి నమూనానే తన ప్రణాళికగా
కొత్త జాతీయ రాజకీయ పక్షం జాతికి నివేదించే అవకాశమున్నది)
సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం, కల్వకుంట్ల చంద్రశేఖర్
రావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండవ సారి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్రం ఆవిర్భావం తరువాత, ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఎనిమిదిన్నర సంవత్సరాలు
విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ అతి తక్కువ సమయంలో, ఎవరూ అనుకరించడానికి
సాధ్యపడని తనదైన అరుదైన శైలిలో, రాష్ట్రంలో ప్రతి వ్యక్తి ఒకటికంటే ఎక్కువ రకాలుగా
లబ్దిపొందే తరహాలో, అనేకానేక అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శ్రీకారం
చుట్టి, ద్విగ్విజయంగా అమలుపరచి, చెరగని
ముద్ర వేసిన అపురూపమైన ‘తెలంగాణ తరహా అభివృద్ధి-సంక్షేమ నమూనా’ ను కేసీఆర్
దేశానికి సగర్వంగా పరిచయం చేశారు. ‘తెలంగాణ ఆచరించిన దాన్నే యావత్ దేశం
ఆనుసరిస్తున్నది’ అన్న వర్తమాన నినాదానికి అనుగుణంగా,
ఈ తెలంగాణ నమూనాను చాలా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తున్నాయి. ఆద్యతన
భవిష్యత్తులో, దేశ రాజకీయ యవనిక మీద శరవేగంగా, బలీయమైన శక్తిగా ఎదగనున్న కేసీఆర్
సారధ్యంలోని (బీఆర్ఎస్) భారత్ రాష్ట్ర సమితి, దేశవ్యాప్తంగా ప్రజలంతా లబ్ది
పొందేలా, తెలంగాణ అభివృద్ధి నమూనానే బీఆర్ఎస్ జాతీయ ప్రణాళికగా చేసుకునే అవకాశం
వున్నది.
కేసీఆర్ స్థాపించి నేతృత్వం వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి
సారధ్యంలో, మహాత్మాగాంధీ అడుగుజాడల్లో, అహింసాయుత మార్గంలో, 14 సంవత్సరాల సుదీర్ఘ
శాంతియుత పోరాట ఫలితంగా జూన్ 2, 2014 అవతరించింది ప్రత్యేక తెలంగాణ
రాష్ట్రం. అలా, ఏర్పాటైన రాష్ట్రానికి ప్రప్రధమ
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్, అనేక సమస్యలను,
ఇబ్బందులను, అడ్డంకులను, పొరుగు రాష్ట్రం నుండి, అక్కడి
ప్రోద్బలంతో కేంద్రం నుండి, ఎదుర్కొన్న రాజకీయ, పాలనాపరమైన కుయుక్తులను
సమర్ధవంతంగా అధిగమించి, రాష్ట్రాన్ని విజయపథంలో పయనించడానికి
మార్గం సుగమం చేశారు. కేసీఆర్ దార్శినిక, ముందు చూపు నాయకత్వంలో, తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి,
రాష్ట్రాభివృద్ధి కీలక ఎజెండాగా రాష్ట్రం అభివృద్ధి మార్గాన పురోగమించింది. ఆ
పురోగమనం ఇంకా, ఇంకా కొనసాగుతూ, అన్ని
రంగాలలో తెలంగాణ రాష్ట్రం దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ముందంజలో, అన్ని రాష్ట్రాలకు
ఆదర్శంగా నిలిచిపోయింది.
కేంద్రం నుండి సహకారం శూన్యమైనప్పటికీ, 2021-22
ఆర్ధిక సంవత్సరంలో, జి.ఎస్.డి.పి. (తెలంగాణ రాష్ట్ర స్థూల
దేశీయోత్పత్తి) రు. 11,48,115 కోట్లు కాగా, (2013-14 లో జి. ఎస్.డి.పి. 4,51,580 కోట్ల రూపాయలు మాత్రమే) అదే కాలంలో తలసరి ఆదాయం రు. 2,75,443 అయింది (2013-14 లో తెలంగాణ తలసరి ఆదాయం 1,12,162 రూపాయలు మాత్రమే). ఈ విధమైన గణనీయమైన వృద్ధిరేటుతో ఆదాయాన్ని
పెంచుకుంటూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలబడింది. పెరిగిన ఆదాయాన్ని
ప్రభుత్వం అతి జాగరూకతతో, ఓ పద్ధతి ప్రకారం, రాష్ట్రంలో
మౌలిక రంగాల్లో అభివృద్దికి, ప్రజల వికాసానికి ఖర్చు
చేస్తున్నది. అదే విధంగా విద్యుత్ రంగంలో తెలంగాణ దేశం నివ్వెర పోయేంత గొప్ప
విజయాన్ని సాధించింది. ఏదేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి దిశగా దూసుకు
పోతున్నదనడానికి ప్రామాణికాలలో ప్రధానమైన తలసరి
విద్యుత్ వినియోగంలో కూడా తెలంగాణ రాష్ట్రం 2126
యూనిట్లతో అఖిలభారత సగటు తలసరి విద్యుత్ వినియోగమైన 1255
యూనిట్ల కంటే దాదాపు 70% అధికం.
ప్రజల అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా, ఒక పథకం
తరువాత మరో పథకాన్ని, ఒక కార్యక్రమం తరువాత మరో
కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వాటిని
నిర్వచించి, రూపకల్పన చేసి, అభివృద్ధి
పరచి, మంచీ-చెడులను బేరీజు వేసి,
సంబంధిత అధికారులను, ప్రజాప్రతినిధులను కార్యోన్ముఖులను చేసుకుంటూ
వస్తున్నారు. అలాగే ప్రతి పథకాన్ని, కార్యక్రమాన్ని
క్రమానుగతంగా వాటికి సంబంధించిన అధికారులతో, అనదికారులతో
సుదీర్ఘంగా సమీక్షించి విశ్లేషించేవారు కేసీఆర్. ఈ క్రమంలో ఒక్కోసారి, ఒక్కోరకమైన
నైపుణ్యంకల అనుభవశాలిలాగా నిరూపించుకున్నారు.
ఉదాహరణలు చెప్పాలంటే ఒకటికాదు అనేకం: నీటిపారుదల
ప్రాజెక్టులను రీఇంజనీరింగ్ లేదా రీడిజైన్ చేసేటప్పుడు, వృత్తిపరంగా, అనుభవజ్ఞుడైన
ఇంజనీరుగా కనిపించేవారు. సచివాలయం కాని, పోలీసు కమాండ్ కంట్రోల్
కేంద్రం కాని, సమీకృత కలెక్టర్ కార్యాలయాలు కాని అలాంటి
మరేదైనా నిర్మాణం విషయంలో కాని, సలహా ఇచ్చేటప్పుడు, ఒక
ఆర్కిటెక్టు లాగా అనిపించేవారు. యాదాద్రి లాంటి దేవాలయాల పునర్నిర్మాణం సమీక్షించే
సమయంలో ఒక వాస్తు, ఆగమ శాస్త్ర పండితుడిలాగా
దర్శనమిచ్చేవారు. ప్రజారోగ్యం మెరుగుదల గురించి విశ్లేషించేటప్పుడు ఒక వృత్తిపరమైన
నైపుణ్యంకల వైద్యుడిని గుర్తుకు తెచ్చేవారు. బడ్జెట్ గురించి చర్చించే సమయంలో ఒక
ఆర్ధిక నిపుణుడు ఆయనలో దర్శనం ఇచ్చేవాడు.
గణతంత్ర దినోత్సవానికైనా, సాతంత్ర్య
దినోత్సవానికైనా, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికైనా,
శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టడానికైనా, తయారుచేయాల్సిన ఉపన్యాసం సందర్భంలో
అద్భుతమైన వచన రచయిత ఆయనలో కనిపించేవాడు. న్యాయ సలహా ఇచ్చేటప్పుడు లీగల్
ఎక్స్పర్ట్ దర్శనమిచ్చేవాడు. ప్రపంచ తెలుగు మహాసభల్లాంటి కార్యక్రమాలలో
పాల్గొన్నప్పుడు ఒక అద్వితీయమైన సాహితీవేత్త కనిపించేవాడు. శాసన సభ సభ్యులకు, సర్పంచులకు, శిక్షణా తరగతులు నిర్వహించినప్పుడు కేసీఆర్ ఉపన్యసిస్తుంటే
అనుభవజ్ఞుడైన అధ్యాపకుడు లేదా శిక్షకుడు అనిపించేవారు. వ్యవసాయ సమస్యల మీద
సమీక్షించే సమయంలో అధ్యయనం చేసిన వ్యవసాయ శాస్త్రవేత్తలాగా కనిపించేవారు. ఇలా
ఎన్నో రకాలుగా తన అనుభవాన్ని పంచుకుంటూ, తనదైన శైలిలో కార్యక్రమాల రూపకల్పన చేసి, అమలవడానికి చర్యలు తీసుకున్నారు కేసీఆర్.
ఇవన్నీ ఒక ఎత్తైతే, పరిపాలన,
సంస్థలకు సంబంధించి 1937 నాటి రోజుల్లో, అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ ఆదేశాలమేరకు ఆయన ఏర్పాటు చేసిన
పాలనా సంస్కరణల కమిటీ సభ్యులైన ప్రఖ్యాత పాలనారంగ నిపుణులు, లూథర్ గుల్లిక్, లిండాల్ ఉర్విక్ లు రూపకల్పన చేసిన ‘పోస్డ్ కార్బ్’ (POSDCORB) విధులైన ప్లానింగ్,
ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్,
కోఆర్డినేటింగ్, రిపోర్టింగ్, బడ్జెటింగ్ అనే అంశాలను, తూచా
తప్పకుండా నిర్వహించడంలో, నిర్వర్తించడంలో ఒక కనీవినీ
ఎరుగనటువంటి ‘పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నిపుణుడు’ కేసీఆర్ అంటే
అతిశయోక్తి కాదేమో! తరచూ ఏమాత్రం అలసట లేకుండా, పది-పన్నెండు గంటలకు పైగా కేసీఆర్
అధ్యక్షతన జరిగే శాఖాపరమైన సమీక్షా సమావేశాలలో, సిఎం కేసీఆర్ చెప్పే ప్రతి మాటలో
ఒక సందేశం ఇమిడి వుంటుంది. సమావేశం ముగింపుకు అరగంట, గంట
ముందర ఆద్యంతం తాను చెప్పినదంతా, క్లుప్తంగా, సంక్షిప్తంగా,
విషయాన్ని యథాతధంగా కేసీఆర్ చెప్పే పధ్ధతి ఒక అష్టావధానిని,
ఒక శతావధానిని, ఒక సహస్రావధానిని మరిపిస్తాయి. కేసీఆర్
జ్ఞాపక శక్తి, ధారణా శక్తి అమోఘమనడానికి సిఎం నిర్వహించే
సమీక్షా సమావేశాలు ప్రత్యక్ష నిదర్శనాలు.
ఎనిమిదిన్నర సంవత్సరాల క్రితమే ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం,
తనను తాను పునర్నిర్వచించుకుని, పునర్నిర్మించుకుని, పునరుజ్జీవంపచేసుకుని, పునరుద్దరించుకుని, గతంలోని చెడు అనుభవాలను చెరిపివేస్తూ, అభివృద్ధిపథంలో దూసుకుపోతూ, దాని లక్ష్యాలను, ఆశయాలను సాధించడం సాధారణ విషయం కాదు. ఇది ఇలా సాధ్యపడడానికి, ముఖ్యమంత్రి
కేసీఆర్ నిర్మాణాత్మక నాయకత్వం, పరిపాలనా నైపుణ్యాలు, దూరదృష్టి, వినూత్న ఆలోచనలు ప్రధాన కారణం. భారతదేశంలో,
ఏరాష్ట్రంలో, మునుపెన్నడూ కనీవినీ ఎరుగని వినూత్న పథకాలను, ప్రజోపయోగ
కార్యక్రమాలను అమలు చేసుకుంటూ అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలోనే
అగ్రగామిగా, స్ఫూర్తి దాయకంగా నిలవడానికి కారణం కూడా ఆయన నాయకత్వమే. ఆమరణ నిరాహార
దీక్షతో సహా అనేక విధాల, ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన
పోరాటానికి నాయకత్వం వహించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ కే, ప్రజలు
ఈ రాష్ట్రాన్ని నడిపించే బాధ్యతలు అప్పగించడం వల్ల, ప్రజల కష్ట సుఖాలు, అవసరాలు, ఆకాంక్షలు వాటితో పాటు రాష్ట్ర సమర్థతలు,
వనరులు, క్షుణ్ణంగా తెలిసిన ఆయన సారధ్యంలో తెలంగాణ దృష్టికోణంలో పాలన సాగుతున్నది.
గడిచిన ఆరున్నరేళ్లలో పద్ధతి ప్రకారం జరిగిన కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్రం
ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నది. ఇంకా, ఇంకా అభివృద్ధి
చెందుతున్నది.
దళితబందు; వ్యవసాయాభివృద్ధి; రైతు బంధు; రైతు భీమా; వ్యవసాయ
రుణమాఫీ; రైతు వేదికల నిర్మాణం; పాలనా సంస్కరణలైన జిల్లాల,
రెవెన్యూ డివిజన్ల, మండలాల, పంచాయితీల పెంపు; నూతన పంచాయతీ
రాజ్, మునిసిపల్, రెవెన్యూ చట్టాల
రూపకల్పన; కాళేశ్వరం లాంటి నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం; వ్యవసాయంతో సహా అన్నిరంగాలకు నాణ్యమైన విద్త్యుత్ నిరంతరం సరఫరా; పారిశ్రామికాభివృద్ధి; గణనీయంగా ఐటీ కంపెనీల పెంపు;
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక ద్వారా హైదరాబాద్ నగరం రూపురేఖలలో గొప్ప
మార్పు; యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణం-లక్షలాది మంది యాత్రీకులకు
దర్శనం; చేనేత కార్మికులకు చేయూత;
కేసీఆర్ కిట్స్, బస్తి దవఖానాలు, పల్లె
దవాఖానాలు, సూపర స్పెషాలిటీ ఆసుపత్రులు, దయాగ్నిస్టిక్ కేంద్రాల ఏర్పాటు, కంటి వెలుగు లాంటి
కార్యక్రమాలు, జిల్లాకొక వైద్య కళాశాలల ద్వారా అత్యుత్తమ
ప్రమాణాల వైద్య ఆరోగ్య సేవలు; పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా మౌలిక సదుపాయాల ఏర్పాటు; ఆసరా
పెన్షన్లు; కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, గురుకులాలు, రెండు పడక గదుల ఇళ్లు, గొర్రెల పంపిణీ, బతుకమ్మ చీరెల పంపిణీ; ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల, మైనార్టీల
అభివృద్ధికి ప్రత్యేక ప్రణాలికలు; భూ రికార్డుల నవీకరణ, సుపరిపాలనకు సూచికైన ధరణి పోర్టల్....ఇలా ఎన్నో,
ఎన్నెన్నో, మరెన్నో పథకాల, కార్యక్రమాల
ద్వారా లాభపడని ఇల్లంటూ ఒక్కటంటే ఒక్కటి కూడా రాష్ట్రంలో లేదంటే అతిశయోక్తి
కాదేమో.
పరిపాలన అంటే, సమగ్రమైన, నిర్విరామ, డైనమిక్ అవగాహన. జవాబుదారీతనం, పారదర్షిక, విజ్ఞానదాయక విధాన రూపకల్పన; విశాలమైన,
ప్రతిస్పందించే, సమర్థ పాలన; ప్రాధమిక,
మానవ హక్కులను, విలువలను గౌరవించడం;
అన్ని స్థాయీలలో ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయడం;
సమర్థ, సంస్థాగత, నిర్మాణాత్మక
ప్రణాళిక రచన లాంటివి సుపరిపాలనకు ప్రామాణికం.
తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ నాయకత్వంలో
ప్రస్తుతం గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా అనుభవంలో వున్నదే సుపరిపాన, లేదా, వైవిధ్యభరితమైన పరిపాలన. అందులో భాగంగానే
దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్ప కాలిక
ప్రణాలికలను రూపొందించి పటిష్టంగా అమలు చేయడం జరుగుతున్నది. కేసీఆర్ రాజనీతిజ్ఞత, దూరదృష్టి, నాయకత్వ పటిమ,
నిబద్ధత, ఏకాభిప్రాయం ద్వారా, సంప్రదింపుల ద్వారా, నాణ్యమైన సమీక్షల ఆధారంగా నిర్ణయాలు తీసుకునే విధానం ద్వారా. రాష్ట్రం ఆశ్చర్యకరమైన
అభివృద్ధి, పురోగతి సాధించడానికి బాటలు వేసింది. సరిగ్గా ఇలాంటి
నాయకత్వమే ఇప్పుడు దేశానికి కూడా అవసరం.
ఈ నేపధ్యంలో, వర్తమాన పరిస్థితులలో, దేశంలో రాజకీయపరంగా,
అభివృద్ధి పరంగా గుణాత్మక మార్పు అవసరాన్ని గురించి కేసీఆర్ పదేపదే
నొక్కివక్కాణిస్తున్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే ప్రగతిశీల
ఎజెండా కావాలని, దేశానికి నూతన గమ్యాన్ని నిర్వచించాలని, ప్రజల జీవితాల్లో మౌలికమైన పరివర్తన తేవాలని అనేక సందర్భాలలో చెప్పారు
కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన విధంగానే, ఆమార్గంలోనే,
భారత దేశాన్ని కూడా, పునర్నిర్వచించుకోవాల్సిన, పునర్నిర్మాణం చేయాల్సిన, పునరుజ్జీవంప చేసుకోవాల్సిన అత్యంత ఆవశ్యకతను
ఆయన ఉద్ఘాటిస్తున్నారు. ఇప్పడు దేశం ప్రమాదకర పరిస్థితిలో ఉందని, విద్వేష రాజకీయాలలో చిక్కి విలవిలలాడుతున్నదని, ఈ
విద్వేషపూరిత వాతావరణం దేశాన్ని వంద సంవత్సరాలు వెనుకకు తీసుకపోవడం ఖాయమని, దేశం కోలుకోవడానికి మరో వంద సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదని, తీవ్ర ఆవేదన
వ్యక్తపరుస్తుంటారు కేసీఆర్.
భారత దేశాన్ని, జాతీయ మతతత్వ అతివాద,
మితవాద అతివాద, ప్రమాదకర విద్వేష శక్తుల నుంచి కాపాడడానికి కెసిఆర్ ‘బిజెపి
ముక్త్ భారత్’ కోసం తిరుగులేని పిలుపునిస్తూ, లౌకికవాద, ప్రజాస్వామ్య
సంప్రదాయంతో వెలిగిపోయిన ఒకప్పటి అద్భుతమైన భారతీయ గతాన్ని పునరుద్ధరించాలని
అన్నారు. ఆ దిశగా బీఆర్ఎస్ పార్టీని లాంచనంగా ప్రారంభించిన కేసీఆర్, ‘అబ్ కీ బార్, కిసాన్ సర్కార్’ అనే నినాదాన్ని దేశప్రజల ముందు వుంచుతూ, ఎర్రకోట
మీద గులాబీ జండా ఎగురవేస్తామన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ధీమాను వ్యక్తపరిచారు. సమస్త
రాష్ట్ర ప్రజానీకానికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలను పంచుతున్న
తెలంగాణ నమూనా దేశమంతా అమలు కావాలని పిలుపునిచ్చారు.
(రెండవ పర్యాయం ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ
స్వీకారం చేసి డిసెంబర్ 13 కు 4 సంవత్సరాలు)
No comments:
Post a Comment