చెకుముకి రాయి, కిరోసిన్ దీపాలు, కచ్చడం బండి .. !
(గుర్తుకొస్తున్నాయి)
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక (27-12-2022)
ఐదారు
దశాబ్దాల క్రితం గ్రామాలలో వింత, వింత సాంప్రదాయాలు వుండేవి.
గ్రామాలలో ఆద్యంతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. కాకపోతే, వారిలో కొందరు మోతుబరి
రైతులు (భూస్వాములు), కొందరు మామూలు చిన్నకమతాల వ్యవసాయదారులు, కొందరు రైతు
కూలీలు, చాలామంది కేవలం కూలి చేసుకునో,
లేక, మోతుబరి రైతుల దగ్గర పాలేర్లుగానో జీవనం
సాగించేవారు. కూలీలకు, పాలేర్లకు జీతం నగదు రూపేణా కాకుండా ధాన్యం రూపేణా ఇస్తూనే వారి
చిన్నచిన్న అవసరాలకు అవసరం వచ్చినప్పుడు కావాల్సిన పైకం ఇచ్చేవారు పెద్ద రైతులు.
కుటుంబాలకు కావాల్సినవన్నీ గ్రామాలలోనే లభ్యం కావటాన ఆ చెల్లింపులు కూడా నగదు రహిత
లావాదేవీలే. గ్రామస్తులు కొనుక్కోవాల్సినవన్నీ చాలావరకు అమ్మకందారులు ఊరిలోకే
తెచ్చి అమ్మేవారు. కూలీలకు, పాలేర్లకు అవసరమైన మరికొన్నిటిని
పెద్దరైతులు సమకూర్చేవారు జీతంలో భాగంగా, లేదా, అదనంగా.
ఉదాహరణకు
చిన్నతనంలో మా ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం (రాత్రవుతుండగానే)
జరిగే ఒక కార్యక్రమం నాకింకా గుర్తుంది. మాది
పెద్ద వ్యవసాయం. పాలేర్లు (జీతగాళ్లు అని కూడా పిల్చేవాళ్ళం)
కూడా పది మందికి పైగా వుండేవారు. రోజువారీ కూలీకి వచ్చే
వాళ్లు కూడా కొందరుండేవారు. పొలం పనులు చూసుకుని ఇంటికి
తిరిగొచ్చి, పశువులకు ఆ రోజుకు వేయాల్సిన దానా, ఇతర పనులు పూర్తైన తరువాత వీరందరికీ ‘పొగాకు’ పంచే కార్యక్రమం మొదలయ్యేది.
జీత గాళ్లకు ఏటా ఇచ్చే జీతంతో పాటు, ఏడాదికి
రెండు జతల చెప్పులు, ప్రతి రోజు తాగడానికి (పీల్చడానికి) పొగాకు (రోజులు
మారుతున్న కొద్దీ బీడీలు) ఇవ్వడం ఆనవాయితీ. మా నాన్న గారు ప్రతి రోజు పొగాకు కాడల పంపకం చేసేవారు. ఒకే సారి నెలకో-పదిహేను రోజులకో కలిపి ఇచ్చే
ఆనవాయితీ లేదు. పొగాకు పంపిణీ జరిగే సమయంలోనే ఆ రోజు పొలం
పనులను సమీక్షించేవారు. అదొక విధమైన క్రమశిక్షణ. పొగాకును ఒక
మోదుగు ఆకులో చుట్టి, చెకుముకి రాయిని,
ఒక రకమైన ఇనుప ముక్కతో కొట్టి నిప్పును పుట్టించి, నిప్పు వచ్చినప్పుడు ఒకరకమైన
ప్రత్యేక దూదిమీద దానిని అంటుకునేట్లు చేసి, చుట్టలో పెట్టి
పొగ పీల్చేవారు ఆరోజుల్లో. చూడడానికి బలే సరదాగా వుండేది. ఇప్పుడు బహుశా ఈ
విధానాన్ని ఎవరూ ఉపయోగిస్తున్నట్లు లేదు.
ఐదారు
దశాబ్దాల క్రితం విద్యుత్ సరఫరా లేదు. కిరోసిన్ దీపాల వెలుగులోనే చదువుకునే
వాళ్లం. పెట్రోమాక్స్ లైట్లే వీధి దీపాలు. సాయంత్రం కాగానే, చీకటి పడటానికి కొంచెం ముందర, మున్సిపాలిటీ
వాళ్లొచ్చి స్తంభాలకు వీధి దీపాలు తగిలించి పోయేవారు. 1960-1961 ప్రాంతంలో
ఖమ్మంలోని మా ఇంటికి విద్యుత్ కనెక్షన్ వచ్చింది. ఇక మా గ్రామానికి విద్యుత్ 1978
వరకు రాలేదు. అదే సంవత్సరం మా ఇంట్లో కనెక్షన్ పెట్టించుకున్నాం. అంతకు క్రితం పది
సంవత్సరాల ముందు మా పెళ్ళి జరిగినప్పుడు మా ఇంట్లో విద్యుత్ దీపాలు లేవు. పెట్రోమాక్స్ లైట్లే దిక్కు. ఇప్పుడైతే విద్యుత్ కనెక్షన్ లేని గ్రామం, ఇల్లు, లేనే లేదు. 1970 వరకు మాకు "ఫాన్"
గాలి అంటే తెలవదు. "గాస్ పొయ్యి" కూడా దాదాపు అప్పుడే కొన్నాం. అప్పట్లో
కొనాలంటే అదొక పెద్ద ప్రహసనం. దాని ఖరీదు సిలిండర్ డిపాజిట్ తో సహా 300 రూపాయల
లోపే!
తాగే
నీటి కోసం ఇప్పుడున్నన్ని సదుపాయాలు గతంలో లేవు. ఖమ్మంలో మా ఇంటి వెనుక భావి, ఇంటి ముందర మునిసిపాలిటీ నీటి కనెక్షన్ వుండేవి. మునిసిపాలిటీ నీరు
తాగడానికి సరిపోయేది. మిగిలినవాటన్నిటికీ బావి నీరే. ఇప్పటికీ శిధిలావస్థలో వున్న
ఆ బావి వున్నది. ఇప్పటి లాగా ఫ్లెష్ ఔట్ మరుగుదొడ్లుండేవి కావు. సఫాయివాడు
(స్కావెంజర్) ప్రతి రోజు వచ్చి శుభ్రం చేసేవాడు. వాడికి, నెలకు
అప్పట్లో ఐదు రూపాయలిచ్చినట్లు గుర్తు. బెడ్ రూములకు అనుసంధానంగా బాత్ రూములు, లెట్రిన్లు లేవప్పుడు. వంటా-వార్పూ అంతా కట్టెల పొయ్యిల మీదే. స్నానానికి
నీళ్లు కాగ పెట్టడం కూడా కందికట్టె నిప్పుల మీదే. ఇక ఇంట్లో
వుండేది "ఓపెన్ బాత్ రూమే"! ఖమ్మంలోని స్నానాల గదికి కాని, మా వూళ్లోని స్నానాల గదికి కాని, చాలా రోజుల వరకు పైకప్పు
లేదు. పెద్దలు సాధారణంగా వంటిమీద బట్టలతో స్నానాలు బావి దగ్గరే చేసేవారు. స్నానం
చేసి తడిబట్టలు ఆరవేసుకునే ఆచారం వుండేది. పిల్లలం కూడా జీతగాడు బావిలోంచి నీళ్లు
తోడి పోస్తుంటే, ఒక గంట సేపు స్నానం చేసే వాళ్లం. వారానికోసారి కుంకుడు రసంతో తలంట్లుండేవి
(తల మీద స్నానం). దాని కొరకు ప్రత్యేకంగా పని వాళ్లుండే వారు.
ఇంటి
అవసరాలకు కావాల్సిన శనగ, బియ్యం, జొన్న పిండి
విసరడానికి, ‘ఇసురు రాయి’ వుండేది. కారం-పసుపు దంచడానికి
పెద్ద రోలు, రోకలి వుండేవి. ఇవే వీటితో పాటు దోస కాయ
వరుగులు, మామిడి కాయ వరుగులు కోసి ఎండ పెట్టడానికి, మొక్క
జొన్నలు వలవడానికి, అలాంటి పనులనేకం చేయించడానికి వాటిలో
నైపుణ్యం కల పనివారు వుండేవారు. వారికి దినసరి కూలితో పాటు,
పంటలు చేతి కొచ్చిన రోజుల్లో కొంత బోనస్ లాంటిది లభించేది.
చిన్నతనంలో
ప్రయాణాలు చేయడానికి కచ్చడం బండి వుండేది. ఆడవారు మేనాలు కూడా వాడేవారు. కచ్చడం
బండికి, పెద్ద బండికి సైజులో కొంత తేడా వుండి, ఇది చిన్నగా వుంటుంది. కచ్చడం బండి పైన ఒక గుడిసె లాంటిది అమర్చి
వుంటుంది. లోపల కూర్చోవడానికి చిన్న నులక మంచం (దాన్ని ‘చక్కి’ అనేవారు) వేయాలి.
ముందర బండి తోలేవాడు కూచోవడానికి ‘తొట్టి’ వుంటుంది. సామానులు చక్కి కింద అమర్చే
వారు. ఎక్కువలో ఎక్కువ ముగ్గురు, నలుగురు కంటే అందులో కూర్చోవడం కష్టం. ఇక వాటికి
కట్టే ఎద్దులు కూడా చిన్నవిగానే వుంటాయి. ప్రయాణానికి పోయే ముందర వాటి ముఖాలకు
‘పొన్న కుచ్చులు’, ‘ముట్టె తాళ్లు’, మెడకు
‘మువ్వలు-గంటలు’, బండి చిర్రలకు (ఎద్దుల మెడపై బండి ‘కాణీ’
వేసినప్పుడు అది జారి పోకుండా రెండు చిర్రలు అమర్చే వారు) గజ్జెలు, ఎద్దుల మెడలో వెంట్రుక తాళ్లు, నడుముకి ‘టంగు వారు’
అలంకరించేవాళ్లం. ఎద్దులను అదిలించడానికి తోలేవాడి చేతిలో ‘చండ్రకోల’ వుండేది. అది
తోలుతో చేసేవాళ్లు.
ఈ
హంగులన్నీ వున్న కచ్చడం బండిలో ప్రయాణం మెర్సిడీస్ బెంజ్ కారులో కంటే హుషారుగా
వుండేది. ఎద్దులు బండిని లాక్కుంటూ పరుగెత్తుతుంటే, ఆ గజ్జెల
చప్పిడి, మువ్వల సందడి, టంగు వారు
కదలడం, చూడడానికి బలే సరదాగా వుండేది. ఎక్కువమంది వుండి కచ్చడం బండి సరిపోకపోతే,
ఒక పెద్ద బండికి కూడా తాత్కాలికంగా ఒక గుడిసె కట్టించి, అందులో ‘బండి జల్ల’ వేయించి, దాంట్లో ‘బోరెం’ పరిచి,
దాని కింద మెత్తగా వుండేందుకు వరి గడ్డి వేసి, అందులో కూచుని ప్రయాణం చేసే వాళ్లం. కచ్చడం బండిని మా వూళ్లో వున్న
వడ్రంగి కోటయ్య తయారు చేశాడు. మా ఇంటి పక్కనే జగన్నాధం అనే మరో వడ్రంగి ఇల్లుంది.
ఆ ఇద్దరు వడ్రంగులు వూరును పంచుకున్నారు. వారిద్దరూ ప్రతి రైతు దగ్గర ఏడాదికి ఇంత
అని, వార్షికంపైనే వడ్రంగి పనులను చేసేవారు.
No comments:
Post a Comment