సహజ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలి
వనం
జ్వాలా నరసింహారావు
సాక్షి
దినపత్రిక (20-12-2022)
ఈ మధ్యన ఒకటి-రెండు సందర్భాలలో మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్
చదువుతున్న ఒకరిద్దరు చురుకైన విద్యార్థులను కలవడం సంబవించింది. వాళ్లతో మాటా-మాటా
కలిపి, వారి-వారి ప్రొఫెషనల్ విద్యాభ్యాసంలో భాగంగా ఏం నేర్చుకుంటున్నారనీ, అధ్యాపకులు ఏం నేర్పిస్తున్నారనీ ప్రశ్నిస్తే,
వారిదగ్గర నుండి ఆశించిన సమాధానం రాలేదు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తైన తరువాత ఏరకమైన
మెషిన్లమీద పనిచేస్తావని ప్రశ్నిస్తే తెలియదని అమాయకంగా వచ్చింది జవాబు. కంప్యూటర్
ఇంజనీరింగ్ తరువాత సరాసరి ఎదైన్నా ప్రోగ్రామింగ్ చేయగలరా అంటే దానికీ జవాబు లేదు.
సివిల్ ఇంజనీరింగ్ తరువాత ఎలాంటి ప్రాజెక్టులలో పనిచేయాలనుకుంటున్నావని అడిగితే అసలే
అర్థం కాలేదు. అందరూ విద్యార్థులు ఇలాగేనా అంటే కావచ్చు, కాకపోవచ్చు. స్వతహాగా తెలివైన కొందరి విషయంలో
మినహాయింపు వుండవచ్చు. ఇంజనీరింగ్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులన్నీ ఇటీవల కాలంలో ‘నాలెడ్జ్
బేస్డ్’ (అంతంత మాత్రమే) తప్ప ‘స్కిల్ బేస్డ్’ కాకపోవడమే
బహుశా దీనికి కారణం కావచ్చు.
ఇదిలా వుంటే ఎలాంటి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకుండా రకరకాల వృత్తి
నిపుణులు మన దేశంలో, రాష్ట్రంలో
కోకొల్లలు. వారంతా స్వయంశక్తితో వారి-వారి వృత్తుల్లో ఎలా ప్రావీణ్యం సంపాందించుకున్నారో
అనేది కోటి రూకల ప్రశ్న. వారిలో గ్రామీణ వృత్తుల నుండి మొదలుకుని, పట్టణాలలో, నగరాలలో పనిచేస్తున్న వాహనాల
మెకానిక్కులు, ఎయిర్ కండీషన్
మెకానిక్కులు, వాషింగ్
మెషీన్ మెకానిక్కులు, గీజర్
మెకానిక్కులు, ఎలెక్ట్రికల్
కుక్కర్ మెకానిక్కులు, గాస్ పొయ్యి
మెకానిక్కులు, ప్లంబర్లు, ఎలక్ట్రీషయన్లు,
గడియారాలు రిపేరు చేసేవారు, ఇలా రకరకాల
వారున్నారు. వీరు రిపేర్లు చేయడానికి వచ్చేటప్పుడు తమ వెంట ఒక జూనియర్ కుర్రవాడిని
తీసుకు వస్తారు. వాడు కొంతకాలానికి సీనియ అయిపోతాడు. అందుకే వీరు నేర్చుకున్న
విద్య భావితరాలవారికి అందుబాటులోకి తీసుకువచ్చే విధానం, అవసరమైతే వీరికి విద్యార్హతలకు
సంబంధించిన క్వాలిఫికేషన్ లేకపోయినా ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు
ప్రాక్టికల్స్ చెప్పేటప్పుడు ఉపయోగించుకునే విధానం రూపొందిస్తే మంచిదేమో! ఏబై-అరవై
సంవత్సరాలుగా నా అనుభవం ఆధారంగా చేస్తున్న
సూచన ఇది.
ఉదాహరణలు ఎన్నైనా చెప్పుకోవచ్చు: మా ఇంట్లో ఎవరిదైనా చేతి గడియారం
పనిచేయకపోతే, కంపెనీ షో రూమ్ కు పోయి ఇస్తే బాగుచేసి ఇవ్వడానికి సమయం పట్టే
అవకాశాలున్నాయి కాబట్టి, ఎప్పటిలాగే, ఆలవాటున్న ఒక రిపేర్ షాప్ కు పోయాను ఇటీవల.
పంజాగుట్ట సెంటర్ నుండి ఖైరతాబాద్ పోయే దార్లో యశోదా ఆసుపత్రికి పోవడానికి వచ్చే
సందు ముందర వున్న ఆ చిన్న షాప్ లో ఎప్పటిలాగే ఇద్దరు నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ
కూర్చున్నారు. రిపేరుకు తీసుకువెళ్లిన మా శ్రీమతి చేతి గడియారాన్ని చూపించగానే, ఆ
ఇద్దరిలో ఎదురుగా చిన్న బల్ల ముందర కూచున్న సీనియర్ వ్యక్తి (బహుశా) బాటరీ కొత్తది
వేయాలని చెప్పి రు 220 అవుతుందన్నాడు. నేను సరే అనగానే ఐదు నిమిషాలలో ఆ పని
కానిచ్చి నా చేతిలో పెట్టాడు. గతంలో సాధారణంగా 50-60 రూపాయల కంటే ఎక్కువ
తీసుకోలేదు కదా అని అడుగుతే నేను
తీసుకెళ్లిన గడియారం (మా కోడలు అమెరికా నుండి తెచ్చింది) ధర ఎక్కువని, అందుకే బాటరీ ధర కూడా కొంచెం ఎక్కువని అన్నాడు.
అతడి మాటల్లో ఎప్పటిలాగే నిజాయితీ స్పష్టంగా వినిపించింది. అతడితో కాసేపు సంభాషించాలని
అనిపించింది.
ఆ ఇద్దరు వ్యక్తులే కూచునే వీలున్న ఆ షాప్ బహుశా ఆరు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పు (పాతిక చదరపు అడుగుల
విస్తీర్ణం మాత్రమే!) వుంటుంది. దాదాపు గత ఏభై సంవత్సరాలు పైగా తన తండ్రి కాలం
నుంచి అక్కడే రిపేర్లు చేస్తున్నామని, చాలా కాలం
అద్దె చెల్లించామని, తరువాత
కొనుక్కున్నామని, తన పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని షాప్ స్వంతదారుడు అన్నాడు.
తనతో ఒక ఫోటో తీసుకుంటానంటే బిడియపడి సున్నితంగా తిరస్కరించాడు. కనీసం షాప్
విజిటింగ్ కార్డు ఇవ్వమని అడిగితే వేయించే అలవాటు లేదన్నాడు. గడియారాలు రిపేరు
చేసే విద్య ఎప్పటినుంచో తనకు వచ్చని, ఎలా అబ్బిందో
తెలియదని, ఎక్కడా నేర్చుకున్నది కాదని అన్నాడు.
చేతి గడియారాలు రిపేరు చేయడం మిగాతావాటిలాగా అంత తేలికైన విషయం కాదు.
పనిముట్లన్నీ కంటికి అమర్చుకునే ఒక రకమైన భూతద్దంలో చూసుకుంటూ రిపేర్ చేయాలి.
ఇలాంటి నైపుణ్యం ఏ కొద్దిమందికో మాత్రమే వుంటుంది. బహుశా నేర్పితే నేర్చుకునే విద్య
కాదేమోనన్న సందేహం కూడా కలుగుతుంది. అసలు గడియారాల రిపేర్లు కాని, మెకానిజం గురించి కాని ఏవైనా ప్రొఫెషనల్
కోర్సులు ఉన్నాయా అనేది కూడా సందేహమే! ఆ మాటకొస్తే స్వతస్సిద్ధంగా ఒక్క గడియారాల
రిపేర్లు మాత్రమే కాకుండా ఇలా ఎన్నో నైపుణ్యాలు తెలిసినవారు వేలల్లో ఉన్నప్పటికీ
వీరి గురించి సరైన డేటా లేదేమో! వీరిలో చాలా మంది ఐటేఐ, డిప్లొమా కోర్సులు
చదివినవారు కారు. కాని వీరి పని నైపుణ్యం అద్భుతం.
అయితే ఇటీవలి కాలంలో మనం గృహ అవసరాలకు కొనుక్కునే విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలకు కాని, ప్లంబింగ్ లాంటి పనులకు కాని, రిపేర్ల, సర్వీసు అవసరం వచ్చినప్పుడు, కంపెనీ ఆథరైజ్డ్ సర్వీస్
సెంటర్ వాళ్లు గతంలోలా కాకుండా ఆయా పనితనంలో క్వాలిఫైడ్ వ్యక్తులను పంపుతున్నారు.
అయితే వీరి సర్వీసింగ్ చార్జీలు, ముఖ్యంగా వారెంటు కాలం ముగిసినాక పెద్దమొత్తంలో
వుండడంతో స్వంతంగా రిపేర్లు చేసే వ్యక్తులనే పిలవడం చేస్తున్నారు చాలా మంది.
ఇలాంటి వారు స్వంతంగా నేర్చుకున్న పనితనంతోనే క్వాలిఫైడ్ వారికంటే మెరుగ్గా తక్కువ
ధరకు సర్వీసు చేసి పోతున్నారు. వీరు అన్నిరంగాలలో వున్నారు.
మా చిన్నతనంలో ఖమ్మం పట్టణంలో మేమున్న మామిళ్ళగూడెం బజారులో (లంబాడి)
రాము అని ఆర్టీసీలో మెకానిక్ గా పనిచేస్తున్న వ్యక్తి వుండేవాడు. అతడు ఏ మెకానికల్
ఇంజనీరింగ్ చదువుకోలేదు. కాని అద్భుతమైన రీతిలో మెకానిజం తెలిసన వ్యక్తి. ఆ
రోజుల్లో ఖమ్మంలో కార్లు జీపులు బహుశా చాలా తక్కువ. వాటికి కాని, లారీలకు కాని ఏ విధమైన రిపేర్ కావాలన్నా రామునే
దిక్కు. రాముకు సహజ సిద్ధంగా అబ్బిన విద్య అది. వాహనం వున్న ప్రతివారు ఆయన క్లైంట్లే.
ఆయన ఇంటి ముందున్న ఖాళీ జాగానే వర్క్ షాప్. రాత్రింపగళ్ళు కష్టపడి పనిచేసేవాడు.
పెద్దపెద్దవారంతా రాముకు ఎంతో గౌరవం ఇచ్చేవారు.
హైదరాబాద్ లో మా మామయ్య కొడుకు గోపి అని వున్నాడు. వాడు పదవతరగతి
పాసైన తరువాత చదువు ఎక్కువగా అబ్బలేదు. కాని అద్భుతమైన మెకానికల్ బ్రెయిన్. ఇంకా
కంప్యూటర్లు ప్రాముఖ్యత చెందని రోజుల్లో సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ లలో నైపుణ్యం
సంపాదించాడు. ఎట్లా నేర్చుకున్నాడో, ఎవరికీ
తెలియదు. ఇంటర్మీడియేట్ చదవడానికి ప్రయత్నం చేశాడు. కుదరలేదు. ఏఎమ్ఐఇ అనే ఇంజనీరింగ్
కు సమానమైనదని ఆ రోజుల్లో చెప్పుకునే కోర్సులో చేరాడు కాని చదువు ముందుకు సాగలేదు.
హైదరాబాద్ లో ఉద్యోగం రాలేదు. స్నేహితుల సహాయంతోనో అమెరికా చేరుకున్నాడు. చిన్నగా
హార్డ్ వేర్ మెకానిజంలో పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో కంపెనీలు అప్పట్లో అతడిమీద
ఆధారపడేవి. అంచెలంచెలుగా ఎదిగి ఫార్మల్ డిగ్రీలు లేకపోయినా నైపుణ్యం ప్రాతిపదికగా
అక్కడ స్థిరపడిపోయాడు. అతడా విద్య ఎలా నేర్చుకున్నాడు?
చాలా కాలం క్రితం ఆంధ్రా బాంక్ లో కొఠారి చలపతి రావు అనే ఆయన
పనిచేసేవారు. అక్కడ చేరడానికి ముందర కొన్ని చిన్నచిన్న ఉద్యోగాలు కూడా చేశాడు.
ఇంకా అప్పటికి కంప్యూటర్లు పూర్తి స్థాయిలో వాడకంలోకి రాలేదు. కేవలం మామూలు
గ్రాడ్యుయేట్ మాత్రమే అయిన కొఠారి చలపతి రావు స్వయంగా నేర్చుకుని ఆంధ్రా బాంక్
కంప్యూటర్ సిస్టం ఏర్పాటు చేశాడు. ఆయన్ని అంతా కంప్యూటర్ భీష్మ పితామహుడు అని
పిల్చేవారు. ఆయన ఆ విద్య ఎలా నేర్చుకున్నాడు?
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నేను పనిచేస్తున్న
తొలినాళ్లలో, అప్పుడప్పుడే కంప్యూటర్లు (ఇంకా మోడరన్ సిస్టమ్స్ కాని, లాప్ టాప్ కంప్యూటర్లు కాని రాణి రోజుల్లో)
వచ్చిన రోజుల్లో భాస్కర్ అనే నా సహోద్యోగి స్వయంగా వాటి గురించి నేర్చుకుని
సుబ్రహ్మణ్యం అనే మరో ఫాకల్టీతో కలిసి సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేవాడు. మా
అందరికీ ఆయనే నేర్పాడు. అలాగే నాకు తెలిసన కుమార్ ఎన్ మద్దెల అనే యువకుడు డిగ్రీ
పాస్ కాకపోయినా కంప్యూటర్ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్
లకు సంబంధించి అమోఘమైన తెలివితేటలున్నవాడు. వీరిలాంటి వారిని ప్రొఫెషనల్ కోర్సుల
కాలేజీలలో క్వాలిఫికేషన్ లేకపోయినా, రిటైర్ అయినా
ఉపయోగించుకోవాలి.
అసలామాటకొస్తే స్వతస్సిద్ధంగా నేర్చుకునే విద్యలు ఎన్నో వున్నాయి.
గ్రామాలలో యాంత్రీక వ్యవసాయం వచ్చిన తరువాత మరుగున పడిపోయిన, ఎద (విత్తనాలు
చల్లడం) పెట్టడం, వరి నాట్లు
పెట్టడం, తూర్పార పోయడం, కలుపుతీయడం, పైపాటు చేయడం
లాంటి విద్యలను కొనసాగించే ప్రయత్నం చేయాలి. భావితరాల వారికి గతకాలపు కులవృత్తుల గుర్తులు
తెలియాలి. ఇప్పుడు కులవృత్తుల నిర్వచనమే మారిపోతున్నది. ఐఏఎస్, ఐపీఎస్ పిల్లలు
ఐఏఎస్, ఐపీఎస్ కావడం, డాక్టర్ పిల్లలు
డాక్టర్ కావడం, ఇంజనీర్ పిల్లలు
ఇంజనీర్ కావడం, లాయర్ పిల్లలు
లాయర్ కావడం, ఇవీ ఒకవిధంగా నేటి
కుల వృత్తి విద్యలు.
( నా ఆర్టికల్ పూర్తి పాఠం)
మీరు వ్రాసిన ఈవ్యాసం చాలా బాగుందండీ.
ReplyDeleteమీరు వ్రాసిన వ్యాసానికి కొనసాగింపుగా ఒకటి రెండు మాటలు. ఇప్పుడు పెద్దపెద్దసంస్థలుగా ప్రపంచప్రఖ్యాతి గాంచిన కొన్నింటిని స్థాపించి మేథావులుగా అఖండకీర్తిని ఆర్జించిన కొందరు స్కూలు చదువో కాలేజీచదువో మధ్యలో వదిలేసిన వారే. మరి కొందరు ఒక రంగంలో చదువుకొని మరొక రంగంలో పరిశ్రమలు స్థాపించి పేరు సంపాదించుకున్నారు.