Tuesday, December 6, 2022

నాటి చదువులకు సరిలేదు (గుర్తుకొస్తున్నాయి) : వనం జ్వాలా నరసింహారావు

 నాటి చదువులకు సరిలేదు

(గుర్తుకొస్తున్నాయి)

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (07-12-2022)  

ఈ రోజుల్లో ఏవిధంగానైతే పదవతరగతి తరువాత, ఇంటర్మీడియేట్ చదివి డిగ్రీ కాని, ప్రొఫెషనల్ కోర్సు కాని చదవాల్నో, అలాగే అరవై సంవత్సరాల క్రితం. హెచ్ ఎస్ సీ (11 వ తరగతి) తరువాత పియుసి (12 వ తరగతి), ఆ తరువాత డిగ్రీకాని, ప్రొఫెషనల్ కోర్సు కాని చదవాలి. డిగ్రీలో చేరడానికి కాని, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యను అభ్యసించడానికి కాని ప్రత్యేకంగా ఇప్పటిలాగా ఎంసెట్ లాంటి ప్రవేశ పరీక్షలు వుండేవి కావు. పియుసి లో ఆప్షనల్ సబ్జెక్ట్స్ లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టు తయారయ్యేది. ఇంజనీరింగ్, మెడిసిన్ లలో చేరిన తరువాత మొదటి సంవత్సరం పీపీసీ (ప్రి-ప్రొఫెషనల్ కోర్సు) అనేవారు. అందులో క్వాలిఫై అయినవారే మిగతా నాలుగు సంవత్సరాలు కొనసాగించేవారు. ఈ నేపధ్యంలో, హెచ్ ఎస్ సీ (హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్) పరీక్షలు పాసై, లెక్కలు, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం (ఎంపీసీ) ఆప్షనల్ తీసుకుని, 1962 లో ఖమ్మం ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కళాశాల లో ప్రీ-యూనివర్సిటీ (పియుసి) కోర్సులో చేరాను.  

పియుసిలో ఆప్షనల్స్ మూడు సబ్జెక్టులే కాకుండా, ఇంగ్లీష్, తెలుగు, జనరల్ స్టడీస్ సబ్జెక్టులు కూడా వుండేవి అప్పట్లో. జనరల్ స్టడీస్ అందరికీ కామన్. అందులో అన్ని సబ్జెక్ట్లకు సంబంధించిన విషయాలు క్లుప్తంగా వుండేవి. జనరల్ నాలడ్జ్ అవసరమైన పోటీ పరీక్షలు రాసేవారికి చాలా ఉపయోగం. ఇప్పుడు ఆ సౌకర్యం లేదు. లెక్కలు, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం సబ్జెక్టులను ఐచ్చికం (ఆప్షనల్) అని, మిగతా వాటిని కంపల్‌సరీ అని పిలిచే వాళ్లం. హెచ్ ఎస్ సీ వరకు తెలుగు మీడియంలో చదువుకుని, పియుసి లో చేరగానే, ఆంగ్ల మాధ్యమంలో అభ్యసించాలంటే ఇబ్బందికరంగా వుండేది. పోను-పోను అలవాటై పోయింది.

నిజాం సంస్థానం నుంచి విముక్తి పొంది, భారత దేశంలో విలీనమైన హైదరాబాద్ రాష్ట్రంలో, మొదట్లో హైదరాబాద్‌లో తప్ప ఇంకెక్కడా కళాశాలలు లేవు. వరంగల్ జిల్లాలో వున్న ఖమ్మం ప్రాంతాన్ని వేరు చేసి, 1956 లో ఖమ్మం జిల్లా ఏర్పాటయింది. అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, ప్రతి జిల్లాలో కనీసం ఒక్క కళాశాలన్నా వుండాలని తీసుకున్న నిర్ణయం ప్రకారం, అప్పటి ఖమ్మం జిల్లా కలెక్టర్ జీ వీ భట్, ఖమ్మానికి చెందిన ప్రముఖులు బొమ్మకంటి సత్యనారాయణరావు (మాజీ ఎమ్మెల్యే), సర్వదేవభట్ల నరసింహమూర్తి, పర్సా శ్రీనివాసరావు, కవుటూరి కృష్ణమూర్తి, రావులపాటి జానకి రామారావులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ, నిధుల సేకరణ ప్రారంభించింది.

భద్రాచల రామాలయానికి చెందిన ఒక ఆభరణాన్ని వేలం వేసి, అలా సేకరించిన పైకంతో కళాశాల నెలకొల్పాలని భావిస్తున్న నేపధ్యంలో, శ్రీ రామ భక్త గెంటాల నారాయణరావు (జగ్గయ్య పేట వాసి) గారనే లోకోపకార గుణం గల మహానుభావుడు, లక్ష రూపాయలు (అప్పట్లో చాలా ఎక్కువ) విరాళంగా ఇస్తానని కలెక్టర్‌ను కలిసి చెప్పడం, ఆయన ఇచ్చిన మూలధనంతో కళాశాల రూపుదిద్దుకోవడం జరిగింది. ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్న తర్వాత కూడా, కళాశాల పేరు ముందర దాత పేరు కొనసాగిస్తూ వచ్చారు. గుట్టలబాజార్ దాటిన తరువాత గ్రెయిన్ మార్కెట్ ప్రాంతంలో వున్న కళాశాలను, ఇల్లెందు రోడ్డులో నూతన భవనాలను నిర్మించి అక్కడకు మార్చారు. ఇప్పుడు ఖమ్మంలో ఎన్ని కళాశాలలు వున్నాయో లెక్కేలేదు.

కాలేజీ విద్యార్థిగా పి.యు.సి లో చేరడంతో ఒక పెద్దరికం వచ్చిన అనుభూతి కలిగింది. ఇంగ్లీష్, తెలుగు, జనరల్ స్టడీస్ అన్ని గ్రూపులకు అంటే, ఎం.పీ.సీ, బై పీసీ (జీవ శాస్త్రం, భౌతిక-రసాయన శాస్త్రాలు), కామర్స్ (ఎకనామిక్స్, కామర్స్, అకౌంటింగ్), సివిక్స్ (చరిత్ర, భూగోళం, సాంఘికం), కలిపి చెప్పేవారు. భౌతిక, రసాయన శాస్త్రాల క్లాసులు ఎం.పీ.సీ, బై పీసీ గ్రూపులకు కలిపి తీసుకునేవారు. లెక్కల క్లాస్ ప్రత్యేకంగా ఎం.పీ.సీ గ్రూపుకు మాత్రమే వుండేది. తెలుగు క్లాసులలో చెప్పిన మనుచరిత్రలోని పద్యాలు ఇంకా గుర్తున్నాయి. జనరల్ స్టడీస్ క్లాసులను భోధించే లెక్చరర్లు వర్తమాన సంఘటనలను పాఠ్యాంశాలకు అనుసంధానం చేసి ఆసక్తికరంగా చెప్పేవారు. ప్రాక్టికల్స్ క్లాసులను తీసుకునేవారిని ఆ రోజుల్లో "డిమాన్ స్ట్రేటర్" (లెక్చరర్ కంటే ఒక గ్రేడ్ తక్కువ) అనే వారు. ప్రాక్టికల్స్ లో ఉపయోగించే కామన్ బాలెన్స్, పిప్పెట్, బ్యూరెట్ట్, వేర్నియర్ కాలిపర్స్ లాంటివి ఇంకా గుర్తుకొస్తున్నాయి.

ఆ రోజుల్లో కాలేజీ రాజకీయాలకు ప్రాధాన్యత వుండేది. విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు అలవడేవి. ఆ రోజుల్లో ఖమ్మం కాలేజీ ఎన్నికల రాజకీయాలు, శాసన సభ, లోక్ సభ ఎన్నికల రాజకీయాలను మరిపించే విధంగా వుండేవి. కాలేజీలోని రెండు ప్రధాన గ్రూపులకు, జిల్లాకు చెందిన రెండు ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, కమ్యూనిస్ట్ ల అండ దండలు పూర్తి స్థాయిలో వుండేవి. ఒకటి పార్టీ కాగా, అప్పటికి కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో చీలిపోలేదు. కళాశాల రాజకీయాలు స్థానిక కమ్మ హాస్టల్,  మామిళ్ల గూడెం లోని మా ఇల్లు కేంద్రంగా సాగుతుండేవి. ఎన్నికలు ముగిసిన వారం-పది రోజుల పాటు చాలా టెన్షన్ గా వుండేది. కొట్లాటలు జరిగేవి. దరిమిలా అంతా సర్దుకు పోయేది. ప్రతి కోర్సుకూ ప్రవేశ పరీక్షల పధ్ధతి రావడంతో, పోటీ బాగా నెలకొని విద్యార్థులు పూర్తికాలం చదువులకే పరిమితమై, విద్యార్ధి దశనుండి రాజకీయాలకు ఎదగడం తగ్గసాగింది.

పియుసి తరువాత ఇంజనీరింగులో సీటు రానందున, బి ఎస్సీ  డిగ్రీ మొదటి సంవత్సరంలో ఎం.పీ.సీ గ్రూప్ తీసుకుని ఖమ్మం కళాశాలలో చేరాను. ఆ రోజుల్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్లను ఏం చేస్తున్నావని అడుగుతే ఫలానా డిగ్రీ, ఫలానా ఇయర్ అని సమాధానం ఇవ్వక పోయే వాళ్లు. "ఫస్ట్ ఇయర్...రెస్ట్ ఇయర్" అని క్లుప్తంగా చెప్పే వాళ్లు. దానికి కారణం డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పబ్లిక్ పరీక్షలు లేకపోవడమే. చదివినా-చదవక పోయినా రెండో సంవత్సరానికి ప్రమోట్ అయ్యే వాళ్లు. సెకండ్ ఇయర్లో లాంగ్వేజెస్ (ఇంగ్లీష్, తెలుగు), జనరల్ స్టడీస్ (ఇప్పుడు కరిక్యులంలో లేదు) లో పరీక్షలుండేవి. మొత్తం ఆరు పేపర్లుండేవి. థర్డ్ ఇయర్లో ఆప్షనల్ సబ్జెక్టులలో తొమ్మిది పరీక్షలుండేవి. ఎంపీసీ గ్రూప్ వారికి భౌతిక శాస్త్రంలో మాడరన్ ఫిజిక్స్ పేపర్ కలిపి మొత్తం పది పేపర్లుండేవి. పరీక్ష-పరీక్షకు మధ్య ఇప్పటి లాగా దినం విడిచి దినమో, రెండు-మూడు రోజులు శెలవులో వుండక పోయేది. పరీక్ష మొదలవుతే మధ్యలో వచ్చే ఒక్క ఆదివారం మినహా వరుస వెంట పది రోజులు ఏకధాటిగా పరీక్షలు జరిగేవి. మూడు సంవత్సరాలు చదివింది గుర్తుంచుకుని రాయాల్సి వచ్చేది. అదే విధంగా లాంగ్వేజెస్ పేపర్లు రెండేళ్లు చెప్పింది గుర్తుంచుకుని రాయాలి. అతి కష్టం మీద ఫస్ట్ క్లాస్ వచ్చేది.  

బీఎస్పీ (ఎం.పీ.సీ) రెండో సంవత్సరంలో 1964 జూన్ లో న్యూ సైన్స్ కళాశాలలో చేరాను. ఆ కళాశాలను జులై 17, 1956 , నూతన విద్యా సమితి యాజమాన్యం కింద, సి సుదర్శన్ గారు, జిఎస్. మెల్కోటే గారు స్థాపించారు. నారాయణగూడలో వున్న ఆ కాలేజీలో అత్యంత నైపుణ్యం కల మేధావులైన విద్యావేత్తలెందరో పని చేసేవారు. 1982 సంవత్సరంలో కళాశాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకున్న సందర్భంలో, యాజమాన్య బాధ్యతలను, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారతీయ విద్యా భవన్ చేపట్టింది.

హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్నప్పుడే పరిచయమైన స్నేహితులలో పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్,  ఇందిరా గాంధి సార్వత్రిక విశ్వ విద్యాలయం ప్రొ-ఛాన్సలర్ గా పదవీ విరమణ చేసిన వాసిరెడ్డి శివలింగ ప్రసాద్, యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థి సంఘ అధ్యక్షుడు, తెలంగాణ ప్రజా సమితి ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ శ్రీధర్ రెడ్డి, ఐపిఎస్. అధికారిగా సీనియర్ పొజీషన్ లో పదవీ విరమణ చేసిన బొమ్మకంటి శంకర్ రావు, ప్రముఖ నవలా రచయిత్రి పరిమళా సోమేశ్వర్ దంపతులు,  తొలితరం పాత్రికేయుడు, ఉస్మానియా విశావివిద్యాలయం విద్యార్ధి రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించిన ఊటుకూరు వరప్రసాద్, లండన్ నగరంలో బట్రాండ్ రస్సెల్  స్థాపించిన ‘కమిటీ ఆఫ్ వన్ హండ్రెడ్’ ఆదర్శాలను పుణికిపుచ్చుకున్న మహారాజ శ్రీ, క్రికెట్ ఆటలో ఉన్నత శిఖరాలకు చేరుకున్న అబ్దుల్ హాయ్, సాయినాథ్, ప్లహ్లాద్  తదితరులు వున్నారు. ఆ పరిచయాలు (స్వర్గస్థులైన ఇద్దరు మినహా) ఇంకా కొనసాగుతున్నాయి.  

నేను డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో వున్నప్పుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుల మధ్య, ఉపకులపతి డి ఎస్ రెడ్డి వ్యవహారంలో ఘర్షణలు జరిగాయి. ఒక గ్రూపుకు మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు మార్గదర్శకత్వం వహించగా, మరొక గ్రూపుకు నాటి విద్యార్థి నాయకులు ఎం శ్రీధర్ రెడ్డి, పుల్లారెడ్డి, (జన సంఘ్) నారాయణ దాస్, కమ్యూనిస్టు పార్టీ అనుబంధ విద్యార్థి సంఘ నాయకులు నాయకత్వం వహించారు. కోర్టులో  డి ఎస్ రెడ్డికి అనుకూలంగా తీర్పు వచ్చింది. 1969 వరకు ఆయనే వైస్ ఛాన్స్ లర్‍గా కొనసాగారు. 1968 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి అంకురార్పణ  జరిగిప్పుడు ఆయనే వైస్ ఛాన్స్ లర్‍. ఉద్యమం వూపందుకునే సరికి రావాడ సత్యనారాయణ ఆయన స్థానంలో వచ్చారు.

మొత్తం మీద రెండు-మూడు ప్రయత్నాల తరువాత, మార్చ్ 1968 లో లెక్కలు, భౌతిక శాస్త్రం, సెప్టెంబర్ 1968 లో రసాయన శాస్త్రం కంపార్ట్ మెంటల్ గా డిగ్రీ పాసయ్యాను. అలా నా హైదరాబాద్ చదువు, నివాసం ప్రధమ ఘట్టం పూర్తయింది. 1964 లో హైదరాబాద్ చేరుకున్న నేను, నాటి నుంచి నేటి వరకు, గత ఏబై ఎనిమిది సంవత్సరాలుగా, ఈ నగరంతో అనుబంధం పెట్టుకున్నాను. ఎన్ని ఉద్యోగాలు మారినా ఇక్కడే స్థిరపడి పోతానని భావించలేదు. చదువుల్లో మాత్రం అనేకానేక మార్పులు వచ్చాయి. అంతా కాలం మహిమ!

 

No comments:

Post a Comment