అనాదిగా హస్తం ఇలా ... !
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక (24-12-2022)
కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు అన్న వార్తలొచ్చాయి. ఎనిమిదిన్నర
సంవత్సరాలకు పైగా కేంద్రంలో, పలు రాష్ట్రాలలో అధికారానికి దూరంగా వున్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ,
వరుస ఓటముల నుండి గుణపాఠాలు నేర్చుకుంటున్న దాఖలాలు ఏమాత్రం కనబడడం లేదు. అధికారంలో వున్న
భారతీయ జనతా పార్టీకి పటిష్టమైన పోటీ ఇవ్వడానికి దేశవ్యాప్తంగా అన్ని శ్రేణుల్లోనూ
పార్టీని సిద్ధం చేయడానికి బదులుగా జాతీయ స్థాయిలోని అధినాయకత్వం తనకేమీ పట్టనట్లు
ప్రత్యక్షంగా,
పరోక్షంగా ముఠా రాజకీయాలను ప్రోత్సహించడం ప్రజాస్వామ్య మనుగడకు ఆరోగ్యకరం కాదని
అనాలి. ఎట్టకేలకు ఎనిమిది పదులు నిండిన ఖర్గేను అఖిల భారత కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షుడిని చేయగలిగింది.
చాలాకాలానికి నెహ్రూ-గాంధీ కుటుంబేతర వ్యక్తికి ఆ పదవి దక్కింది. బలమైన
అధికార పార్టీతో పాటు బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం, అందునా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం
పదికాలాలపాటు వర్ధిల్లుతుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం చోటుచేసుకుంటున్న రాజకీయ
పరిణామాల నేపధ్యంలో, తమతమ రాష్ట్రాలలో పట్టున్న ప్రాంతీయ పార్టీల నాయకులు
ప్రజాస్వామ్య మనుగడకోసం ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్న నేపధ్యంలో ఇప్పటికీ
కొంతమేరకు అంతో-ఇంతో ఓటుబాంకు కలిగి వున్న భారత జాతీయ కాంగ్రెస్ తనవంతు పాత్ర
పోషించాల్సిన అవసరం వున్నది. పటిష్టమైన క్యాడర్ వున్న ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఈ
దిశగా చొరవతీసుకుని బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి భారత్ రాష్ట్ర
సమితితో కలిసి పనిచేస్తున్న కృషి చూసైనా కాంగ్రెస్ పాఠాలు నేర్చుకుంటే మంచిదేమో!
స్వాతంత్రోద్యమం నాటి భారత జాతీయ కాంగ్రెస్ తరహా వేరు. ఇప్పటి భారత
జాతీయ కాంగ్రెస్ కాంగ్రెస్ (ఐ) తరహా వేరు. సీనియర్ కాంగ్రెస్ నాయకులను, ఆది
నుండి విధేయులుగా ఉన్నవారిని పార్టీ దూరం చేసుకుంటున్నది. వేరే పార్టీలో వుండి కాంగ్రెస్ పార్టీని అహర్నిశలు విమర్శించిన వారిని పార్టీలో
చేర్చుకోవడమే కాకుండా కీలక పదవుల్లో కూర్చోబెట్టుతున్నది. స్వాతంత్ర్యోద్యమం
రోజుల్లో, స్వతంత్రం వచ్చిన తరువాత విలువలకు కట్టుబడిన జవహర్లాల
నెహ్రూ హయాంలో, పార్టీ అనుసరించిన మద్యే మార్గం అతివాద-మితవాద శక్తులను కలుపుకుని భిన్నాభిప్రాయాలను వెల్లడించమని ప్రోత్సహిస్తూ, పార్టీని పటిష్టం చేయడంకాగా, ప్రస్తుతం కీలక
పదవుల్లో వున్న నాయకులను పరస్పరం విమర్శించుకోమని అధిష్టానం నేరుగా ప్రోత్సహించడమే. ఒకటి-రెండు తరాలుగా పార్టీలో వున్న వ్యక్తులు కూడా వీడుతున్నారు.
పార్టీలో విలువల క్షీణత ఒక విధంగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ రోజుల
నుండే మొదలైంది అనాలి. వేరే పార్టీలో వుంటూ కాంగ్రెస్ పార్టీని అహర్నిశలూ దూషించిన
వారిని అక్కున చేర్చుకోవడం మొదలవడంతో సిద్ధాంతాలకు దూరంగా ఒక్కొక్క అడుగే జరగడం పార్టీలో
ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు అధిష్ఠానాన్ని ధిక్కరించడం, పార్టీని వీడిపోవడం, స్వాతంత్ర్యం రాకముందు వున్నప్పటికీ, అవన్నీ
సిద్దాంతపరమైనవే. బాల గంగాధర్ తిలక్, గోపాల కృష్ణ గోఖలే
లాంటి వారు పార్టీతో విభేదించినప్పటికీ దూషించుకోలేదు. గాంధీజీ
నాయకత్వంలో నెహ్రూ, బోసులకు కాంగ్రెస్ పార్టీలో అవకాశం
వచ్చినప్పటికీ, బోసు ధిక్కార ధోరణి గాంధీకి నచ్చలేదు. తనకిష్టమైన జవహర్లాల్ నెహ్రూను, స్వతంత్రం
రాకమునుపు ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వానికి సారధిని చేసేందుకు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా నెహ్రూ వ్యవహరించేందుకు
తోడ్పడ్డారు గాంధీజీ. ఫలితంగా భవిష్యత్‍లో వల్లభాయ్
పటేల్ ప్రధాని అయ్యే అవకాశాలను కూడా పరోక్షంగా దెబ్బ తీయడం జరిగిందని చరిత్రకారుల
విశ్లేషణ.
1948-1950 మధ్య కాలంలో హోమ్ మినిస్టర్ గా వున్న
వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం
చేశారు. దాదాపు అన్ని ప్రొవిన్షియల్ కాంగ్రెస్
అధ్యక్షులుగా పటేల్ మనుషులు ఎన్నికయ్యారు. 1948 లో
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా గెలిచిన పట్టాభి సీతారామయ్య, ఆ తర్వాత ఆయన్ను నెహ్రూ బలపర్చినప్పటికీ, పటేల్
పక్షం మనిషి పురుషోత్తం దాస్ టాండన్ చేతిలో ఓటమి పాలయ్యారు. గాంధీజీ మరణానంతరం, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన
తర్వాత, కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థిగా గవర్నర్ జనరల్
గా పనిచేసిన రాజగోపాలా చారికి నెహ్రూ మద్దతు లభించగా, పటేల్
మద్దతు వున్న రాజేంద్ర ప్రసాద్‌కు ఆ పీఠం దక్కింది. అవన్నీ
కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత పోరాటాలే. అప్పట్లో
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులలో నెహ్రూ అనుచరులని, పటేల్ అనుచరులని వేర్వేరుగా సంబోధించేవారు.
మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్న ప్రకాశం పంతులును
దింపడానికి నీలం సంజీవరెడ్డి, కళా వెంకట్రావులు ఒకటయ్యారు. నీలం-కళా వెంకట్రావుల వ్యూహంలో ముఖ్యమంత్రి పదవి కోల్పోయి, కాంగ్రెస్ వదిలి వెళ్లిపోయిన ప్రకాశం, స్వగృహ
ప్రవేశం చేసి, అదే సంజీవరెడ్డి ప్రోద్బలంతో తిరిగి
ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి అయ్యారు. ఉప ముఖ్య మంత్రి
పదవి దక్కించుకున్న నీలం సంజీవ రెడ్డి చక్రం తిప్పారు. కాంగ్రెస్‌ను
వీడిన ఆయన ప్రత్యర్థి ఎన్జీ రంగా ఆ తరువాత స్వగృహ
ప్రవేశం చేసి గుంటూరు లోక్ సభ సభ్యుడుగా ఎన్నికయ్యారు.
దరిమిలా, నీలం
సంజీవరెడ్డి స్థానంలో బెజవాడ గోపాల రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యారు.
1955 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన
కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నాయకుడిగా నీలం, బెజవాడల మధ్య పోటీ వుండడంతో, అధిష్ఠానం బెజవాడ గోపాల రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరచడంతో ఆయన ముఖ్య
మంత్రి అయ్యారు. నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి
పదవికి ఒప్పుకుని, గోపాలరెడ్డికి వ్యతిరేకంగా, కళా వెంకట్రావును, కల్లూరు చంద్రమౌళిని
కలుపుకుని పనిచేయ సాగారు.
బెజవాడ గోపాలరెడ్డికి పోటీగా, కాసు బ్రహ్మానందరెడ్డిని ప్రోత్సహించిన నీలం
సంజీవరెడ్డి, తమతో అల్లూరి సత్యనారాయణ రాజును
కలుపుకున్నారు. 1956 లో విశాలాంధ్రగా “ఆంధ్ర ప్రదేశ్” రాష్ట్రం అవతరించింది. ముఖ్య మంత్రి పదవికోసం మరో మారు పోటీ మొదలైంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డిల మద్దతు
బెజవాడకు, బూర్గుల, విబి రాజుల మద్దతు నీలంకు లభించింది. ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు నీలంకే మద్దతు పలికారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. తన
మంత్రివర్గంలోనే ఉప ముఖ్య మంత్రిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి కింద బెజవాడ
గోపాలరెడ్డి ఆర్థిక శాఖను నిర్వహించాల్సి వచ్చింది.
1957 లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఎన్నికలలో నీలం వర్గానికి అధిక స్థానాలు వచ్చాయి. తన
స్థానాన్ని పదిలపర్చుకోసాగాడు. కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, పాగా పుల్లారెడ్డి, బొమ్మ కంటి సత్యనారాయణ రావు ప్రభృతులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పార్టీని
వదిలి, “డెమోక్రాటిక్ పార్టీ” ని
స్థాపించారు. పార్టీ వదిలిన మర్రి చెన్నారెడ్డి అప్పుడే
కాకుండా అలా మరి రెండు పర్యాయాలు వదలడం, స్వగృహ ప్రవేశం చేయడం, పదవులను అనుభవించడం అందరికీ తెలిసిందే.
నీలం సంజీవరెడ్డిని జవహర్లాల్ నెహ్రూ, పథకం ప్రకారం 1960 లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారు. సంజీవరెడ్డి స్థానంలో దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారు. తనను వ్యతిరేకించిన ఏసీ సుబ్బారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు
సంజీవయ్య. ఏ కొద్దిమందో తప్ప, దాదాపు కాంగ్రెస్ పార్టీలోని హేమా-హేమీలందరు
సంజీవయ్యను ధిక్కరించిన వారే ! ఐనా పార్టీలో
కొనసాగారు. 1962 లో ఎన్నిక లొచ్చే సమయానికల్లా
సంజీవరెడ్డిని తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకుని రావడం జరిగింది. ఆయన స్థానంలో సంజీవయ్యను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చేశారు. 1964 లో కర్నూల్ బస్సుల జాతీయం కేసులో రాజీనామా చేసేంతవరకు బలీయమైన నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి కొనసాగారు.
1964 లో కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి
అయింతర్వాత, కాసుకు వ్యతిరేకంగా ఏసీ సుబ్బారెడ్డి
అసంతృప్తి కాంగ్రెస్ వర్గానికి బాహాటంగానే నాయకత్వం వహించారు. మర్రి చెన్నారెడ్డి మద్దతు కాసు వర్గానికుండేది. మర్రి
చెన్నారెడ్డి ఎన్నికల కేసులో సభ్యత్వాన్ని కోల్పోయిన దరిమిలా 1969 తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం చేపట్టారు. ఆ
తరువాత చోటు చేసుకున్న పరిణామాలలో కాసు ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేయడం, ఆయన స్థానంలో పీవీ నరసింహా రావు రావడం జరిగింది.
1972 ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానాన్ని
ధిక్కరించి, తెలంగాణ ప్రజా సమితి పేరుమీద ఎన్నికల్లో
పోటీ చేసి ఘన విజయం సాధించారు చెన్నారెడ్డి బలపర్చిన అభ్యర్థులు. ముల్కీ కేసులో తీర్పుపై పీవీ వ్యాఖ్యలకు నిరసనగా తలెత్తిన ఉద్యమం ఫలితంగా
ఆయన పదవి కోల్పోవడం, ఆయన స్థానంలో జలగం ముఖ్యమంత్రి
కావడం జరిగింది. ఎమర్జెన్సీ కాలంలో ఇందిర విధేయుడుగా, అత్యంత సమర్థుడైన ముఖ్య మంత్రిగా పేరు తెచ్చుకున్న జలగం, ఆ తర్వాత కాలంలో, బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్
లో చేరాడు. 1978 శాసనసభ ఎన్నికల్లో, ఇందిరా కాంగ్రెస్ (నేటి అఖిల భారత జాతీయ
కాంగ్రెస్-ఐ) ను డాక్టర్ మర్రి
చెన్నారెడ్డి విజయ పథంలో నడిపించగా, వెంగళ్ రావు
నేతృత్వంలోని కాంగ్రెస్ పరాజయం పాలైంది. చెన్నారెడ్డి
ముఖ్యమంత్రి అయ్యారు మొదటిసారి. వెంగళరావు మళ్ళీ ఇందిర
పంచన చేరి కేంద్రంలో మంత్రి పదవి అనుభవించారు. పీసీసీ
అధ్యక్షుడుగా కూడా పని చేశారు. ఆయన బాటలోనే
బ్రహ్మానందరెడ్డి నడిచారు.
ఇందిర తిరిగి అధికారంలోకి రావడంతో, బహిరంగంగానే, అసమ్మతికి
అధిష్ఠానం ప్రోత్సాహం లభించేది. చెన్నారెడ్డి స్థానంలో ఒకరి
వెంట మరొకరు అంజయ్య, భవనం, విజయ
భాస్కర రెడ్డి ముఖ్య మంత్రులయ్యారు అసమ్మతి పుణ్యమా అని. 1983 లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ను, 1989 లో
మరో పర్యాయం, పీసీసీ అధ్యక్షుడుగా గెలిపించిన
చెన్నారెడ్డి, అధిష్ఠానం ఆశీస్సులతో రెండవసారి ముఖ్యమంత్రి
అయ్యారు. మళ్ళీ అసమ్మతి, మళ్ళీ ధిక్కార స్వరాలు. ఏడాదికే ఆయన
స్థానంలో నేదురుమల్లి జనార్థన్ రెడ్డి ముఖ్య మంత్రయ్యారు. ఆయన్నూ వుండనివ్వలేదు అధిష్ఠానం. మరో మారు విజయ
భాస్కర రెడ్డిని ముఖ్య మంత్రిని చేసి, తెలుగు దేశం ఇంకో
మారు అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసింది.
అప్పట్లో అసమ్మతిని, ధిక్కార స్వరాన్ని వినిపించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పీసీసీ
అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేసినా, కాంగ్రెస్ ను
అధికారంలోకి తేవడానికి మరో పది సంవత్సరాలు పట్టింది. ఆయన
రెండో పర్యాయం ముఖ్య మంత్రి అయింతర్వాత, ఆకస్మికంగా
మరణించడంతో, ఆరేళ్లు వినిపించని ధిక్కార స్వరాలు మళ్లీ
మొదలయ్యాయి. వైఎస్ స్థానంలో తొలుత రోశయ్య, ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి
పూర్వ వైభవం తీసుకుని రాలేక పోయారు.
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా వుండగానే రాష్ట్ర విభజన జరగడం,
2014 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావడం, అప్రతిహతంగా పరిపాలన
సాగించడం తెలిసన విషయమే. ఆ తరువాత 2018 లో జరిగిన ఎన్నికలలో కూడా తెలంగాణ
రాష్ట్రసమితి మరింత మెజారిటీతో గెలవడం ప్రజాభిమానం చూరగొనడం, ముఖ్యమంత్రిగా
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అమలుపరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు యావత్
భారతదేశానికే రోల్ మోడల్ కావడం, ఆయన దృష్టి జాతీయ రాజకీయాల వైపు పారడం నడుస్తున్న
చరిత్ర. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాల స్ఫూర్తితో, తెలంగాణ మోడల్ ప్రత్యామ్నాయ
అజెండాగా భారత రాష్ట్ర సమితికి శ్రీకారం చుట్టిన కేసీఆర్, సెక్యులర్ వాదులను
కలుపుకుని జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా అడుగులు వేస్తున్నారు. ఉభయ
కమ్యూనిస్ట్ పార్టీలతో సహా బీజేపీయేతర ముఖ్యమంత్రుల, పలు రంగాల మేధావుల, ప్రముఖుల మద్దతు
కేసీఆర్ కు లభిస్తున్నది. ‘అబ్ కీ బాద్ కిసాన్ సర్కార్’ అన్న
నినాదంతో న్యూఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం కూడా ప్రారంభించారు.
137 సంవత్సరాల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, ఇటీవల గెలిచిన హిమాచల్
తొ సహా ప్రస్తుతం రెండు-మూడు రాష్ట్రాలలోనే అధికారానికి పరిమితమై పోయిన భారత జాతీయ
కాంగ్రెస్ పార్టీ, తన భవిష్యత్ బాగుకోసం, ప్రజాస్వామ్య మనుగడకోసం, మతోన్మాదాన్ని
అరికట్టడం కోసం ప్రత్యామ్నాయ దిశగా
సెక్యులర్ శక్తులకు పూర్తి మద్దతు పలకడం కంటే వర్తమాన పరిస్థితుల్లో చేయగలిగింది
ఏమీలేదు. అలా కాకపోతే ఆ పార్టీకి బహుశా మనుగడ లేదేమో! ప్రజాస్వామ్యం, లౌకికవాదం బలపడితేనే కాంగ్రెస్
పార్టీ మనుగడ సాధ్యం.
No comments:
Post a Comment