ఉత్తమమైన ధర్మం నిజం చెప్పడమని,
అబద్ధాలాడడం మహాపాపమని అన్న భీష్ముడు
ఆస్వాదన-101
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (26-12-2022)
గణజనులంతా కలసికట్టుగా
వున్న రాజ్యంలో సిరి తాండవిస్తుందని, అందువల్ల
గణవిధానాన్ని శ్రద్ధగా పరిశీలించుకొంటూ వుండాలని భీష్ముడు చెప్పిన తరువాత, ఎన్నో రూపాల వున్న ధర్మాలను ఆచరించడం సాధ్యం
కాదు కాబట్టి ఏ ధర్మాన్ని ఆచరిస్తే మానవుడు ఇహపర లోకాలలో సుఖంగా వుండగలడని
ప్రశ్నించాడు ధర్మరాజు. జవాబుగా భీష్ముడు,
తల్లీ, తండ్రీ,
గురువూ నిత్యం సేవించవలసిన వారని, భక్తితో వారికి సేవలు చేస్తూ, వారేది చెప్పితే దానిని ఆచరణలో పెట్టడం ఉత్తమ
ధర్మమని, ఆ ముగ్గురూ వేదత్రయం లాంటి వారని, ముల్లోకాల లాంటి వారని, త్రిమూర్తుల లాంటి వారని, వీరిలో తల్లికి ఎక్కువ గౌరవమని, తల్లితండ్రుల మీద అభిమానం కలవాడు ఇహపర లోకాలలో
గౌరవించబడతాడని, గురువును సేవించినవాడు అవ్యయానందాన్ని పొందుతాడని చెప్పాడు.
అప్పుడు
ధర్మరాజు మరో ప్రశ్న వేస్తూ, నిజానిజాల విషయంలో మనిషి తనకు తానుగా
ఏవిధంగా ధర్మానికి బద్ధుడై వుండాలో చెప్పమని భీష్ముడిని అడిగాడు. ధర్మాలలోకల్లా
ఉత్తమమైన ధర్మం నిజం చెప్పడమని; పాపాలలోకెల్లా మహాపాపం అబద్ధాలాడడమని; అయితే,
పరాయివాడి సొమ్మును, ఉసురును దోచుకోవాలనుకొనే పాపులతో నిజం
చెప్పడం కన్నా చేటు మరొకటి వుండదని; అబద్ధాలు ఆడైనా అలాంటి వారిని బాధించడం ఎంతో
న్యాయమని; ప్రజలకు మేలు చేసే అబద్ధాలన్నీ
పుణ్యాలు-ధర్మాలు అవుతాయని; సాటి జీవులను వేధించే సత్యాలన్నీ
పాపాలు-అధర్మాలు అవుతాయని; అందరిలో వున్న మంచీ-చెడూ అనేవి అతి సూక్ష్మమైన వివేకంతో
తెలుసుకోనాలని భీష్ముడు సమాధానం ఇచ్చాడు.
ఎలాంటివారు తమ
పాపాలనుండి విముక్తులు కాగలరని ధర్మరాజు అడిగాడు. వర్ణాశ్రమ ఆచారాల నియమాలను
పాటించేవారు, ఇంద్రియ నిగ్రహం కలవారు,
నిందించగా నిందించనివారు, ఉదారగుణం కలవారు, అతిథులను ఆదరించేవారు, వేదాలు వల్లించేవారు, యుద్ధంలో తెగించి పోరాడేవారు, ఏదేవతలనైనా ఒకే విధంగా చూస్తూ మనసుకు నచ్చిన
రూపాన్ని కొల్చేవారు పాపం అనే కొండలను అనాయాసంగా దాటగలుగుతారు. అలాంటప్పుడు
సౌమ్యులు అసౌమ్యులుగాను, అసౌమ్యులు సౌమ్యులుగాను కనిపించడానికి
కారణం ఏమిటని, వారిని ఎలా తెలుసుకోవాలని ధర్మరాజు
ప్రశ్నించాడు. సమాధానంగా భీష్ముడు వ్యాఘ్ర-గోమాయ సంవాదాన్ని ఉదహరించాడు. రాజైనవాడు
ఇతరుల మాయ మాటలకు మోసపోకుండా మంచీ-చెడ్డా నిర్ణయించుకునే సామర్థ్యం కలిగి వుండాలని
చెప్పాడు.
వెంటనే ధర్మరాజు, రాజు ఎలా నడచుకుంటే సుఖపడతాడని అడిగగా,
భీష్ముడు, ఏమరుపాటు లేకుండా, జాగరూకుడిగా, ఎదుటివారి
సాయం కావాలని అనుకొనేవాడు తప్పక సుఖపడుతాడని నక్కల కథ ఆధారంగా చెప్పాడు. శత్రురాజు
అధికబలం కలవాడైతే, అల్ప బలంగల రాజు ఆపదలనుండి ఎలా గట్టెక్కగలడని ప్రశ్నించాడు
ధర్మరాజు. సమాధానంగా భీష్ముడు, సముద్ర సరిత్సంవాదం గురించి
వివరించాడు. బలహీనుడైన రాజు తన బలాన్నీ,
ఎదుటివాడి బలాన్నీ అంచనా వేసుకోవాలని,
మొండిగా పోరుకు దిగకూడదని, పగవాడి మిడిసిపాటును యుక్తిగా
దాటవేయాలని, అప్పుడే ఆ రాజు ఎలాంటి చెరుపూ లేకుండా నిలబడగలడని అన్నాడు.
మంచి కులస్థుడైన
సేవకుడు పదవికి తగిన విధంగా ఉద్యోగ ధర్మం నిర్వర్తించకపోతే రాజు ఏంచేయాలని అడిగాడు
ధర్మరాజు. జవాబుగా ముని-కుక్క ఇతిహాసాన్ని చెప్పాడు భీష్ముడు. తక్కువ జాతివారిని
ఎన్నడూ ఎక్కువగా ఆదరించకూడదని, ఆంతర్యం తెలుసుకోకుండా కేవలం తన కులం
వాడని చెప్పి దుష్టుడిని అందలం ఎక్కించకూడదని,
సామర్థ్యం తెలుసుకోకుండా కేవలం కులాన్ని మాత్రమే ప్రామాణికంగా పెట్టుకొని సేవకులకు
పదవులు ఇవ్వరాదని, సేవకులు ఎలాంటివారో చూసుకొని, వారి-వారి యోగ్యతలను బట్టి ఉత్తమ, మధ్యమ,
అధమ స్థాయి పదవులలో నియమించడం రాజధర్మమని భీష్ముడు అన్నాడు.
పరిజనానికి
నేర్పు, కులం వుండాలని; అవి లేనివారు కోట్లకొద్దీ
వున్నా ప్రయోజనం వుండదని; చాకచక్యం,
పౌరుషం, స్వామిభక్తి, గొప్పతనం, స్నేహితుల బలగం, మంచి నడత వుంటే ఆ రాజు ప్రపంచాన్నంతా
పాలించవచ్చని అంటూ, రాజైనవాడికి జాణతనం, పోటుతనం తప్పనిసరిగా ఉండాలన్నాడు. రాజు
అనేకమైన నడతలతో ప్రజల హృదయాలను చూరగొనాలని,
ప్రజలతో సౌమ్యంగా నెమ్మదిగా మాట్లాడాలని, తన
మంత్రాంగాన్ని పైకి పోక్కనీయకుందా వుండాలని,
ధర్మాన్ని నెత్తిమీద పెట్టుకునేలా చేయాలని, తుచ్చుల కుట్రలను భగ్నం చేయాలని
చెప్పాడు భీష్ముడు. రాజు అనేవాడు చాతుర్యంగల పరిజనులను ఎక్కడబడితే అక్కడ ప్రవేశపెట్టాలని, రహస్యంగా ఎదుటివారి పనులను మెలకువగా
పసికట్టాలని, తనకు తానుగా అన్ని పనులలోని మంచీ-చెడ్డా
విచారించుకోవాలని, రోజువారీ పనులను, ఆదాయ-వ్యయాలను, బొక్కసాన్ని, సంపదలను స్వయంగా చూసుకోవడం రాజ ధర్మమని
అన్నాడు.
ఇదంతా విన్న
ధర్మరాజు రాజులకు సామాన్య విషయమైన దండించడం అనేదాని తీరుతెన్నులను తెలుసుకోవాలని
ఆసక్తిగా వుందన్నాడు. జవాబుగా భీష్ముడు చెప్పడం మొదలుపెట్టాడు. దండనీతి మంచివారిని
మెప్పిస్తుందని, చెడ్డవారి పొగరును అణచివేస్తుందని, కత్తి, గద, తోమరం,
విల్లమ్ములు, రోకలి,
చక్రం, ఈటె,
చిల్లకోల, త్రిశూలం,
గొడ్డలి మొదలైన పదకొండు ధర్మనీతికి పనిముట్లని, దాని ఒంటి రంగు నలుపని, నాలుగు కోరలు, నాలుగు చేతులు, ఎనిమిది కాళ్లు వుంటాయని, లెక్కలేనన్ని చెవులు, కళ్లు వుంటాయని, చూసీచూడగానే రూపురేఖలు భయంకరంగా వుంటాయని అన్నాడు భీష్ముడు.
యజ్ఞారూపధారైన విష్ణువే దండరూపంలో వుంటాడని,
బాగా పాలించిన దండనీతివల్ల ప్రజలు ఎప్పుడూ రాజు అభివృద్ధినే కోరుకుంటారని, అందువల్ల రాజు తప్పక దండనీతిని ఆశ్రయించాలని,
సత్యమార్గంలో ధర్మాన్ని ఆచరించాలని చెప్పాడు భీష్ముడు. వసుహోముడు మాంధాతకు చెప్పిన
దండనీతి శాస్త్రం ఉదాహరించాడు.
ఆ తరువాత మరో
సందేహాన్ని అడిగాడు ధర్మరాజు. ధర్మార్థ కామాలతో ఎలా నడచుకొంటే మంచిదని
ప్రశ్నించాడు. సమాధానం ఇస్తూ భీష్ముడు,
ఎప్పుడూ భోగం అనుభవించాలనుకొనే రాజుకు ధర్మార్థాలు హరించుకు పోతాయని, కామంలో ఆసక్తికల రాజు మంచి మార్గంలో వుండడని,
ధర్మం దక్కించుకోవడానికి ఆధారం అర్థం అని,
అర్థం పట్ల నిష్టతో ఎలాగైనా ధర్మాపేక్షను విడవకూడదని, కామ బుద్ధితో కాకుండా రాజ్యాన్ని ఏలుకునే రాజు
గొప్పవాడవుతాడని చెప్పాడు. అలాంటప్పుడు,
లోకమంతా ఎంతగానో మెచ్చుకునే శీలాన్ని,
దాని స్వరూపాన్ని విప్పిచెప్పమని ప్రార్థించాడు ధర్మరాజు. మంచి ప్రవర్తన కలిగి
వుండడమే శీలం అని, శీలవంతుడు సంపదలతో తులతూగుతాడని,
త్రికరణశుద్ధిగా ప్రాణులకు ఎలాంటి హాని చేయకుండా వుండడమే శీలం అని, శీలం వల్ల ధర్మం, ధర్మం వల్ల సత్యం, సత్యం వల్ల ప్రవర్తన, ప్రవర్తన వల్ల బలం, బలం వల్ల సంపత్తి రాణిస్తాయని, కాబట్టి అన్ని శుభాలకు మూలం శీలం అని వివరించాడు
భీష్ముడు. శీలం వల్ల లోకంలో గౌరవం పొందిన మాంధాత, నాభాగుడు, ప్రహ్లాదుడు మొదలైన రాజులను
ఉదాహరించాడు.
అప్పుడు
ధర్మరాజు భీష్ముడితో, ఆశ అనేదానికి అంతూ-పొంతూ వుండదని, ఆ ఆశ తీరకపోతే దానికన్నా మించిన బాధ
కలుగుతుందని, ఆశను అణచుకోవడం చాలా కష్టమని వ్యాఖ్యానించాడు.
ఆశ అనే దోషాన్ని పోగొట్టుకోవడానికి ఒక కథ చెప్తానని అంటూ, సుమిత్రుడు అనే రాజు చరిత్ర చెప్పాడు. ఆ కథ
సారాంశంగా కొన్ని విషయాలను వివరించాడు. ఆశ ఒక విధంగా తప్పించుకోలేనిదని, ఆశతీరకపోతే కలవరపాటు, ఆదుర్దా కలుగుతుందని, ఎవరైనా,
ఎక్కడైనా, ఏవిషయంగానైనా మనసును దిటవు చేసుకుంటే అతడికి
లభ్యం కానిదేదీలేదని, మనసును ఆశకు వశం చేస్తే ఆశలు నిరంతరం
కొనసాగుతూనే వుంటాయని, ఏదేమైనా ఆశను చంపుకుంటేనే ఎంతో సుఖమని, ఆశ నెరవేరకపోయినా బాధపడకూడదని అన్నాడు.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, శాంతిపర్వం, తృతీయాశ్వాసం
(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment