బీఆర్ఎస్ : చారిత్రక ఆవశ్యకత
వనం
జ్వాలా నరసింహారావు
మనతెలంగాణ
దినపత్రిక (14-12-2022)
75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో, ఆజాద్
కీ అమృత్ మహోత్సవ్ ఘనంగా జరుపుకున్న నేపధ్యంలో, ఈ సుదీర్ఘ
కాలం, కేంద్రంలో అధికారంలో వుంటూ వస్తున్న రెండు ప్రధాన
జాతీయ రాజకీయ పార్టీల పాలనలో, అందని ద్రాక్షపండులాగా
మిగిలిపోయిన, దేశ ప్రజల అవసరాలను,
ఆశయాలను, ఆకాంక్షల్ని నెరవేర్చడానికి, దేశాన్ని
అభివృద్ధి పథంలో విజయవంతంగా ముందుకు నడిపించడానికి, గుణాత్మక
మార్పు తేవడానికి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారధ్యంలో ఆవిర్భవించినదే
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ. ఏ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీనైతే
స్థాపించి, 14 సంవత్సరాలపాటు శాంతియుతంగా, గాంధేయ మార్గంలో
సుదీర్ఘ పోరాటం సలిపి, ఉద్యమ ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం
సాధించి, దాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడానికి ఒక
వినూత్నమైన ‘తెలంగాణ మోడల్’ రూపొందించి, అమలుపరచి, వర్తమాన దేశ పరిస్థితుల దృష్ట్యా
ఆ మోడల్ ను యావత్ భారత దేశంలో అమలు చేయడానికి, అదే తెరాస పార్టీని బీఆర్ఎస్ గా మార్చారు కేసీఆర్. ఈ చారిత్రిక
ఆవశ్యకత నేపధ్యంలో, భారత రాజకీయ యవనికపై ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ గురించి
దేశవ్యాప్త చర్చ వూపందుకున్నది. ప్రజలంతా జరగబోయే పరిణామాల గురించి ఆసక్తిగా ఎదురు
చూస్తున్నారు.
అంబేద్కర్ మహాశయుడు లాంటి భారత రాజ్యాంగ నిర్మాతలు, మన దేశాన్ని రాష్ట్రాల సమాఖ్యగా నిర్వచించారు. రాష్ట్రాలకు, కేంద్రానికి
శాసన, పరిపాలన, ఆర్థిక అధికారాలు వారివారి పరిధిలో ఉండేలా చట్టాలను రూపకల్పన
చేశారు. అధికారాలకు సంబంధించి, కేంద్ర జాబితా, రాష్ట్ర
జాబితా, ఉమ్మడి జాబితాను రూపొందించారు. ఈ విభజన దృష్ట్యా అత్యవసర బాధ్యతలైన దేశ
భద్రత, సమగ్రత, విదేశీ వ్యవహారాల వంటి అంశాలు కొన్ని మాత్రమే తనవద్ద
వుంచుకుని, మిగతా అంశాలను రాష్ట్రాలకు అప్పగించాల్సింది పోయి, అన్నింటినీ తనవద్దే వుంచుకుని, రాష్ట్రాల హక్కులను హరిస్తూ, కేంద్రం పెత్తనం చెలాయిస్తున్నది. దేశాన్ని గత 75
సంవత్సరాలుగా పాలించిన కాంగ్రెస్, బిజెపి పార్టీలు, వాటి
నాయకత్వంలోని కూటములు, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా,
వ్యవహరించి, దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించడంలో అతి
దారుణంగా విఫలమయ్యాయి. ఎప్పుడైతే ‘బలహీన
మైన రాష్ట్రాలు, బలమైన కేంద్రం’ అనే నినాదం
కేంద్రం అనుసరించిందో, అప్పుడే, రాష్ట్రాలు తమ అస్తిత్వాన్ని
కాపాడుకోవడానికి, ప్రాంతీయ పార్టీలకు అధికారాన్ని ఇవ్వసాగాయి.
దేశ రాజకీయాల్లో సంకీర్ణ పార్టీ ప్రభుత్వాల శకం ప్రారంభమయింది.
దేశంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల పాలన
ఫలితంగా నేడు ప్రజలు కనీస వసతులలేమితో కటకటలాడుతున్నారు. ఈరోజుకూ దేశంలో
విద్యుదీకరణకు నోచుకోని గ్రామాలెన్నో ఉన్నాయి. మంచినీరు, రహదారులు,
విద్యుత్ లాంటి సౌకర్యాలు లేని గ్రామాలు, ఆవాస
ప్రాంతాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ప్రతి ఎకరానికి కావలసినంత నీరు ఉన్నప్పటికీ,
కేంద్రం ప్రణాళికా లోపంతో సాగునీరందడం లేదు. తాగునీటి కోసం, సాగు నీటి కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఎన్నో దేశాలు
అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ మనం మాత్రం ఇప్పటికీ కుల, మత ఘర్షణలతో కాలం వెళ్ళదీస్తున్నాం. భారత దేశంలోని మానవ వనరులను వాడుకోలేక
పోతున్నం. అద్భుతమైన యువ సంపత్తి నిర్వీర్యమై పోతున్నది. యువతను మతోన్మాదులుగా
మార్చే కుట్రలు జరుగుతున్నాయి. ఈ భావజాల వ్యాప్తిని అరికట్టి, దేశ ప్రజలను చైతన్యం చేయాల్సి ఉంది. రాజకీయాలు,
పరిపాలన సమూల ప్రక్షాళన జరగాల్సి వుంది.
సిఎం కేసీఆర్ చెప్పినట్లు, మేక్ ఇన్ ఇండియా,
స్వావలంబన భారతమే లక్ష్యమంటూ ఊదరగొట్టే మోదీ సర్కారు, చేతల్లో
మాత్రం ఆ లక్ష్యశుద్ధిని చూపడం లేదు. ‘మేక్ ఇన్ ఇండియా’కు తూట్లు పొడుస్తూ
దిగుమతుల్ని పెంచుకుంటూపోతున్నది. మోదీ హయాంలోనే చైనాతో భారత్ వాణిజ్యం భారీగా
పెరుగుతున్నది. ఇప్పటికీ చాలా వస్తువుల విషయంలో చైనా దిగుమతులపైనే మనం ఆధారపడే
దుస్థితి ఉంది. కేంద్రం అనుసరిస్తున్న లోపభూయిష్టమైన విధానాలు, అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరే దీనికి కారణమంటూ ఆర్థిక నిపుణులు అంటున్నారు.
విదేశాలపై ఆధారపడే దుస్థితి మారాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ పార్టీ అధినేత,
తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దేశ సమగ్రాభివృద్ధికి,
అనేక రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించడం కోసం జాతీయ విధానాలు
రూపొందించాల్సిన అవసరముందని అంటున్నారు కేసీఆర్. విద్య, వైద్యం
తదితర మౌలిక వసతుల అభివృద్ధి పరచడానికి ప్రగతికాముక విధానాలను రూపొందించాల్సి
ఉందని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్
భావిస్తున్నారు.
వ్యవసాయాధారిత భారతదేశంలో
వ్యవసాయరంగం రోజురోజుకీ నిర్లక్ష్యానికి గురవుతున్నందున ఈ దేశానికి నూతన వ్యవసాయ
విధానం (New Agriculture Policy) అవసరమున్నదనీ; అదనపు నీటి వనరులను సక్రమంగా ఉపయోగించుకోవడానికి దేశానికి నూతన జలవనరుల
పాలసీ (New Water Policy) కావాలనీ; పల్లె
పల్లెకూ విద్యుత్ అందించుకోలేక పోవడాన్ని సరిదిద్దడం కోసం నూతన విద్యుత్ పాలసీ (New
Power Policy) కావాలనీ; ఆర్థికంగా ఉజ్వలమైన
స్థాయికి చేరుకునే అవకాశం ఉన్నా అలా జరగనండున నూతన ఆర్ధిక విధానం (New
Economic Policy) కావాలనీ; తెలంగాణకు హరితహారం
స్ఫూర్తితో నూతన పర్యావరణ పాలసీ (New Environmental policy) తేవాల్సి
ఉన్నదనీ; సమన్యాయం, సామాజిక న్యాయం కోసం, దళిత, బడుగు, బలహీన వర్గాల
సామాజిక, ఆర్థిక సాధికారత కోసం, తెలంగాణ అమలు చేస్తున్న
పథకాల స్ఫూర్తితో బలహీన వర్గాల అభ్యున్నతి విధానం (weaker section
upliftment policy) అవసరమనీ; దేశ ప్రగతిలో
మహిళలను మరింత భాగస్వాములను చేసే దిశగా మహిళా సాధికారత విధానం (women
empowerment policy) కావాల్సి ఉందనీ సిఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు
కేసీఆర్ అన్నారు.
ఈ
దిశగా ఒక జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలనే ఆశయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందడుగు
వేశారు. కేసీఆర్ ప్రతిపాదిస్తున్నది కేవలం శుష్కమైన రాజకీయ కూటమిని కాదు. ఒక
ప్రత్యామ్నాయ ప్రణాలికను, సిద్దాంతాన్ని, అభివృద్ధి మోడల్ ను, దేశవ్యాప్త ఉద్యమంలాగా
అమలు చేయడాన్నికేసీఆర్ ప్రతిపాదిస్తున్నారు. తనతో కలిసివచ్చి ఉద్యమంలో నడిచిన శక్తులన్నిటినీ
కలుపుకొని ప్రజాస్వామ్యయుతంగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అనుభవం ఆయన స్వంతం.
ఆ అనుభవం పునాదిగా దేశంలో గుణాత్మక మార్పును సాధించడానికే నేడు సీఎం కేసీఆర్
నడుంకట్టారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ పార్టీని ఏర్పాటు చేశారు. అప్రతిహతంగా
ముందుకు సాగుతున్నారు.
తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం 14
ఏండ్ల పాటు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడి, విజయం సాధించిన
కేసీఆర్, ముఖ్యమంత్రిగా విజయవంతమయ్యారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు
అమలు జరిగాయి, జరుగుతున్నాయి. అన్నిరంగాల సర్వతోముఖాభివృద్ధి,
సంక్షేమం లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు దూసుకు పోతున్నది. అటు
ఉద్యమం చేయడంలోనూ, ఇటు పరిపాలన చేయడంలోనూ విజయవంతమైన కేసీఆర్,
జాతీయ రాజకీయాల్లో మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా తప్పక ఫలిస్తాయని పలు
రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు, మేధావులు, పాత్రికేయులు
అభిప్రాయపడుతూ పత్రికల్లో వ్యాసాలు రాశారు. పలువురు జాతీయ నాయకులు సీఎం కేసీఆర్ కు
ఫోన్ చేసి అభినందించారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుకు, కేసీఆర్
ప్రయత్నాలకు తమ సహకారం ఉంటుందన్నారు.
జాతీయ రాజకీయాల్లోకి రావాలనే సీఎం కేసీఆర్ ఆలోచన ఈనాటిది
కాదు. నాలుగున్నరేళ్ల క్రితమే 2018 మార్చి మొదటివారంలో హైదరాబాద్ లోని
ప్రగతి భవన్ లో మీడియా సమావేశంలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ
రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరాన్ని చెప్పారు. తదనుగుణంగానే 2022 అక్టోబర్ 5న సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి
పేరుతో జాతీయ పార్టీని ఏర్పాటు చేశారు.
గులాబీ జెండా వుంటుందని, తెలంగాణ కార్యక్షేత్రంగా భారత
దేశం అభివృద్ధి చెందుతుందని, సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ
సర్వసభ్య సమావేశంలో స్పష్టంగా ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా
మారుస్తూ తీర్మానం కూడా చేశారు. ఈ తీర్మానాన్ని ఢిల్లీలోని ఎన్నికల సంఘానికి
పంపించగా, డిసెంబర్ 8న ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పార్టీ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’ పార్టీగా కేంద్ర
ఎన్నికల సంఘం ఆమోదించింది.
2022 డిసెంబర్ 9 శుక్రవారం మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు ‘భారత్ రాష్ట్ర సమితి’ ఆవిర్భావం కార్యక్రమాన్ని బీఆర్ఎస్
అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హైదరాబాద్ తెలంగాణ భవన్లో అట్టహాసంగా
నిర్వహించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని దేశవ్యాప్తం చేయాలన్నా, కేంద్రంలోని బీజేపీ విద్వేష, విభజన రాజకీయాలపై
పోరాటం చేయాలన్నా, కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందనే నమ్మకం
క్రమేపీ సర్వత్రా నెలకొంటున్నది. బీఆర్ఎస్ ఆవిర్భావం చారిత్రక ఆవశ్యకత.
(డిసెంబర్ 14న
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభిస్తున్న సందర్భంగా)
No comments:
Post a Comment