Tuesday, December 6, 2022

పరస్పర ఆధారాధేయాలైన బ్రాహ్మణ క్షత్రియులు అన్యోన్యంగా రాజ్యపాలన చేయాలి .... ఆస్వాదన-98 : వనం జ్వాలా నరసింహారావు

 పరస్పర ఆధారాధేయాలైన బ్రాహ్మణ క్షత్రియులు అన్యోన్యంగా రాజ్యపాలన చేయాలి

ఆస్వాదన-98

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (05-12-2022)

బ్రహ్మ నిర్మించిన నీతిశాస్త్రం, వైన్యుడు అనుసరించిన దండనీతి, వర్ణాశ్రమ ధర్మాల వివరాల గురించి భీష్ముడు చెప్పిన తరువాత ధర్మరాజు తన తరువాత సందేహాన్ని అడిగాడు. రాష్ట్ర ప్రజలు ఏ కార్యాచరణ వల్ల సుఖాన్ని పొందుతారో చెప్పమన్నాడు. ధర్మరాజు సందేహ నివృత్తి చేస్తూ భీష్ముడు, ఉత్తమ గుణాలున్న రాజును అభిషేకించి, ఆ రాజు వల్ల సమస్త కార్యాలను నిర్వర్తింప చేసుకుంటూ ప్రజలు సుఖపడుతారని, రాజ్యపాలన అనేది లేకపోతే ప్రజలు దుర్మార్గ వర్తనులై పరస్పరం కలహించుకుంటూ, సంపదలను దొంగిలిస్తారని, బలవంతులు బలహీనులను హింసిస్తారని, రాజు లేకుండా ప్రజలు జీవించలేరని, వ్యవసాయం, వర్తకం, గోరక్షణ మొదలైన జీవనోపాధి మార్గాలన్నీ ధ్వంసమౌతాయని అన్నాడు. దీనికి దృష్టాంతంగా మనువు చరిత్ర ఉదాహరణ ఇచ్చాడు. ప్రజలు గౌరవించని ప్రభువును శత్రువులు లేక్కచేయరని, ప్రజలు రాజును గౌరవిస్తే శత్రువులు సైతం వినమ్రులై అతడి ఆజ్ఞను శిరసావహిస్తారని, రాజు ప్రజలను తండ్రిలాగా కాపాడాలని, విరోధులకు భయంకరుడుగా కనపడాలని, అప్పుడే అసలైన గౌరవం అని చెప్పాడు.

భీష్ముడి చెప్పినది విన్న ధర్మరాజు, మానవులందరికీ రాజు ఏలిక మాత్రమే కాకుండా దైవ స్వరూపుడని బ్రాహ్మణులు చెప్పిన దాంట్లో తనకు సందేహం కలుగుతున్నదని దానికి సరైన వివరణ కావాలని కోరాడు. సమాధానంగా భీష్ముడు, వసుమనుడనే రాజుకు బృహస్పతి చెప్పిన రాజధర్మం వివరించి ధర్మరాజు సందేహాన్ని నివృత్తి చేశాడు. రాజు లేకపోతే ప్రజలు ఇక్కట్ల పాలౌతారని, రాజు లేని రాజ్యంలో ప్రజలు భయాందోళనలకు గురవుతారని, హాహాకారాలు చేస్తూ తల్లడిల్లిపోతారని, రాజు లేకపోతే బంధుమిత్రులు లేనట్లే అని, రాజు వుంటేనే సంపద, సంరక్షణ వుంటాయని, రాజు చార చక్షువని, రాజు దైవ స్వరూపుడని, ఇక ప్రజలు రాజుకు శరీరం లాంటివారని, ప్రజలకు రాజు ఆత్మలాంటి వాడని అంటూ భీష్ముడు, రాజు ప్రజలను సంరక్షించడంలోనూ, ప్రజలు రాజును సేవించడంలోనూ, పరస్పరం విద్యుక్త ధర్మాలను నెరవేర్చాలని చెప్పాడు. రాజును విరాట్టు అని, సమ్రాట్టు అని వేదాలు అనివార్యంగా ఘోషిస్తుంటే రాజును ప్రజలు అర్హమైన రీతిలో పూజించకుండా ఎలా వుంటారని అన్నాడు.

తన సందేహానికి లభించిన వివరణకు సంతృప్తి చెందిన ధర్మరాజు, రాజుగా జనపదాలను ఎలా పాలించాలని, శత్రు సంహారం ఎలా చెయ్యాలని భీష్ముడిని అడిగాడు. రాజు మొట్టమొదట తనను తాను  జయించుకుని ఇంద్రియ నిగ్రహం సాధించాలని, ఆ తరువాతే శత్రువులను జయించాలని భీష్ముడు చెప్పాడు. రాజు తిరిగే ప్రదేశాలలో భద్రత ఏర్పాటు చేయాలని, గూఢచారుల ద్వారా శత్రు-మిత్ర రహస్యాలు తెలుసుకొని తగినట్లు వ్యవహరించాలని, తాను బలహీనుడని శత్రువులు గ్రహించక ముందే తనకంటే బలవంతుడైన శత్రువుతో సంధి చేసుకోవాలని, చివరకు శత్రువుకు ధనమిచ్చైనా తన రాజ్యాన్ని రక్షించుకోవాలని అన్నాడు. శత్రువు మైమరచి వున్నప్పుడు దండెత్తాలాని, లేదా సంక్షోభం కలిగించాలని, అనవసరంగా యుద్ధానికి దిగరాదని, ఒకవేళ యుద్ధమే అనివార్యమైతే సామదానభేదాలు విఫలమైనప్పుడే యుద్ధానికి దిగాలని బోధించాడు.

రాజు ప్రజల ఆదాయంలో ఆరవ భాగాన్ని మాత్రమే పన్నుగా గ్రహించాలని, తన ఆప్తులలో దక్షులైనవారిని మాత్రమే ఆదాయాన్ని పెంచడానికి కారణమైన శాఖల మీద అజమాయిషీకై నియమించాలని, అన్ని వ్యవహారాలను ఒక కంట కనిపెట్టి వుండాలని భీష్ముడు అన్నాడు. స్వామి, అమాత్యుడు, జనపదం, ధనాగారం, సైన్యం, మిత్రులు, దుర్గం అనే రాజ్యంగాలైన ఏడింటిని కనిపెట్టి పరిశీలించాలని; సంధి, విగ్రహం, యానం, ఆసనం, ద్వైదీభావం, సమాశ్రయం అనే ఆరు రాజ్యతంత్రాలను రాజనీతితో నిర్వర్తించాలని; ధర్మం, అర్థం, కామం అనే మూడు పురుషార్థాలను అనుసరించాలని; మంత్రం, ప్రభువు, ఉత్సాహం అనే శక్తిత్రయాన్ని స్వాధీనం చేసుకోవాలని; సత్త్వ, రజస్తమోగుణాలనే మూడింటితో సేవచేయడం రాజనీతని భీష్ముడు చెప్పాడు.

ఆ తరువాత ధర్మరాజు, రాజు, దండనీతి, అనే శ్రేష్టమైన రెండు అంశాలు కార్య సిద్ధిని ఎలా కలిగిస్తాయో, ఆ పద్ధతులు ఏమిటో వివరించమని భీష్ముడిని కోరాడు. ఆయా యుగాలలో నెలకొన్న రాజనీతిని బట్టి ధర్మం కొనసాగుతుందని, కృతయుగంలో వేదాధ్యయనం, యజ్ఞయాగాది ధర్మాచరణ నిర్వహణ అతిశయించే విధంగా ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుందని; త్రేతాయుగంలో ప్రజలకు మిక్కిలి సంతోషాన్ని కలిగించే రీతిలో రాజు ధర్మాన్ని మూడు పాదాలతో నడిపిస్తాడని; ద్వాపర యుగంలో పరిమితమైన మేలు కలిగే విధంగా రాజు ధర్మాన్ని రెండు పాదాలతో నడుపుతాడని; కలియుగంలో రాజు ధర్మం పట్ల శ్రద్ధ వహించడని, ధర్మజ్ఞానం క్రమంగా నశిస్తుందని, అధర్మం అంతటా వ్యాపిస్తుందని, నాలుగు వర్ణాలు, నాలుగు ఆశ్రమాలు వాటికి సంబంధించిన పద్ధతులు క్రమంగా గతి తప్పుతాయని; ఆవిధంగా రాజు అనుసరించే దండనీతి ప్రకారం ధర్మం నశిస్తూ వుంటుందని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

ఎలాంటి నడవడి కల రాజుకు శుభాలు కలుగుతాయని, ఆ శుభ క్రమం తెలియచేయమని భీష్ముడిని ప్రార్థించాడు ధర్మరాజు. ప్రజల తప్పులను పరిశీలించేవాడు, వారు చేసిన పనులను గుర్తించేవాడు, మదం, లోభం, ఆవేశం లేనివాడు, ఆత్మస్తుతి చేసుకోనివాడు, నియమబద్ధంగా విద్యుక్త ధర్మాలను నిర్వర్తించేవాడు, పరాక్రమవంతుడు, నిగర్వి, కుత్సితుడు కానివాడు, పరస్త్రీ లోల్యం లేనివాడు. క్రోధ రహితుడు అయితే ఆ రాజు మిక్కిలి ప్రకాశిస్తాడని భీష్ముడు అన్నాడు. అలాంటి రాజు ప్రజలమీద కాఠిన్యం వహించి కప్పాలను తీసుకోడని, ప్రజల రక్షణే తన ప్రధాన కర్తవ్యంగా భావిస్తాడని చెప్పాడు.

వాయుదేవుడు పురూరవుడికి రాజ ధర్మాన్ని చెప్పిన విషయాన్ని భీష్ముడు ప్రస్తావించి ఆ వివరాలను ఇలా తెలియచేశాడు. ‘బ్రహ్మ ముఖం, బాహువులు, తొడలు, పాదాల నుండి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు జన్మించారు. బ్రాహ్మణుడు అన్ని వర్ణాలకు ఈశ్వరుడిలాంటివాడు. ఈ భూమ్మీద వున్న ధనధాన్యాది సమస్త వస్తువులను తాను అనుభవిస్తూ ఇతరులకు ఇవ్వడానికి అతడికి అర్హత వున్నది. బ్రాహ్మణుడు దండనీతిని ధరించడానికి క్షత్రియుడిని నియోగించాడు. తన సనాతన ధర్మాన్ని సంరక్షిస్తున్నవాడు, విద్వాంసుడు, శాంతుడు అయిన పురోహితుడికి సమస్త సంపదలను సమర్పించి, బ్రాహ్మణుడికి సేవచేస్తూ, అహంకారరహితుడై, దండనీతిని ప్రయోగించే రాజు ఇహపర లోకాలలో ఉత్తమ గతులను పొందుతాడు. రాజుకు రుచి మొదలైన అనుభూతులు పనికి రావు. అందువల్లే సాటిలేని అధికారాన్ని రాజు సంపాదించుకొంటాడు’.

ఇది విన్న ధర్మరాజు, బ్రాహ్మణుడు గౌరవ భావాన్ని పొందడానికి ఎలాంటి ఉత్తమ కార్యాచరణ కావాలో తెలియచేయమని అడిగాడు భీష్ముడిని. రాజు అతడు ఆచరించే యజ్ఞయాగాదుల మూలాన సమస్త దేవలోక వాసులకు సంతృప్తి కలిగించే శుభ పరంపరను పొందుతాడని, దీనికంతటికీ మూలకారణం పురోహితుడి బుద్ధి అని, సమర్థుడైన పురోహితుడి సంరక్షణ లేకపోతే రాజును రాక్షసులు మొదలైన వారు పీడిస్తారని, పురోహితుడి శాంతి కార్యాలవల్ల అశుభాల నివారణ జరుగుతుందని, శత్రు వినాశనం లాంటి ఎన్నో కార్యాలు ఉత్తమ పురోహితుడి వల్లే సాధ్యమవుతుందని, ధర్మరాజు కూడా ఉత్తమ పురోహితుడిని చేరదీసి, గౌరవించి, అతడి వల్ల సమస్త లాభాలను పొందమని చెప్పాడు భీష్ముడు. పురోహితుడి గుణగణాలు ఎలా ఉండాలో కూడా వివరించాడు భీష్ముడు. బ్రాహ్మణ క్షత్రియులు అన్యోన్యంగా, అనుకూలంగా సరైన మార్గంలో రాజ్య కార్యకలాపాలను నిర్వర్తిస్తే సమస్త దేవతలు, సమస్త వర్ణాలవారు మిక్కిలి సంతోషిస్తారు.

బ్రాహ్మణ క్షత్రియుల మధ్య వుండే సంబంధాన్ని కశ్యప ప్రజాపతి మాటలుగా భీష్ముడు చెప్పాడు. ‘క్షత్రియుడికి పుట్టుక స్థానం బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడికి జననస్థానం రాజు. అందువల్ల బ్రాహ్మణ క్షత్రియ వర్గాలు రెండూ పరస్పర ఆధారాధేయాలు కావడం వల్ల అ ఆరెండు వర్ణాలు కలిసి సముచిత కార్యకలాపాలు నెరపినప్పుడే అభ్యున్నతిలో ప్రకాశిస్తాయి. పట్టువదిలితే పరస్పరం వినాశానమౌతాయి. బ్రాహ్మణ క్షత్రియులు పరస్పరం అరమరికలు లేకుండా కలసి మెలసి వుంటే ప్రజలు గౌరవిస్తారు. వాళ్లలో విభేదం వుంటే మాత్రం వారిపట్ల ప్రజలకు ఏమాత్రం గౌరవం వుండదు. బ్రాహ్మణ క్షత్రియులకు అన్యోన్యత లేకపోతే రుద్రదేవుడికి కోపం వస్తుంది. ఆయన ఆగ్రహిస్తే సమస్త ప్రపంచానికి నాశనం కలుగుతుంది. అందువల్ల రాజు, బ్రాహ్మణుడు కలసి మెలసి వుండడం సర్వవిధాలా శ్రేయస్కరం. పుట్టుక వల్ల, పుట్టిన తరువాత ఔన్నత్యం కారణాన బ్రాహ్మణుడు శ్రేష్టుడు కాబట్టి రాజు అతడిని గౌరవించాలి’ అని, రాజు బ్రాహ్మణుడి పట్ల వినయవినమితగాత్రుడై జీవితయాత్ర సాగించాలని అన్నాడు భీష్ముడు.

బ్రాహ్మణ క్షత్రియులు అన్యోన్యంగా వుంటూ రాజు బ్రాహ్మణుడిని గౌరవించడమే మంచిదన్న భీష్ముడు పురోహితుడి విశిష్టతను వివరించే ముచుచికుంద మహారాజు, కుబేరుడి కథ చెప్పాడు. వారిద్దరి మధ్య జరిగిన యుద్ధంలో బ్రహ్మ తేజశ్శక్తి మూలాన ముచుకుంద మహారాజు అపూర్వమైన పరాక్రమం చూపించాడని అన్నాడు. ఈ కథను విన్న ధర్మరాజు, రాజధర్మాలలో పరమ సంపదను, పుణ్యలోక ప్రాప్తిని ప్రసాదించగల ధర్మం ఏదో తెలియచేయమని అడిగాడు. అత్యంత భీతులైన ఉత్తమ జనులకు అభయం ఇచ్చి, వారికి సమస్త సుఖాలు సంప్రాప్తింప చేసి సంతోష పరచడమే రాజుకు వుండాల్సిన విశిష్ట ధర్మం అని పలికాడు భీష్ముడు. మంచివారందరినీ సంరక్షించడమే రాజ ధర్మాలలో ప్రశస్తమైనదని  అన్నాడు.

బ్రాహ్మణుడు మొదలుకొని ఆయా వర్ణాలవారు స్వజాతి ధర్మ నిర్వహణ చేయకుండా తప్పితే ఏమవుతుందని ధర్మరాజు అడగ్గా, ఆపద సమయాలలో ఆయా వర్ణాలవారు స్వజాతి ధర్మాన్ని వదలిపెట్టినా నిందార్హులు కారన్నాడు భీష్ముడు. ఆయా సందర్భాలను, విషయాలను రాజు జాగ్రత్తగా గుర్తించి, ఆయా వర్ణాలవారిని తగిన రీతిలో సంరక్షించడం రాజుకు ఉత్తమ ధర్మం. ప్రజలు చేసే ధర్మానుగుణ ప్రవర్తన వల్ల వారు సంపాదించుకొనే ధర్మంలో నాలుగో వంతు రాజుకు చెందుతుంది. శిక్షార్హులకు సరైన శిక్ష సరైన సమయంలో విధించక పోతే పాపంలో కూడా నాలుగో వంతు రావచ్చని భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు. 

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, ద్వితీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

 

       

No comments:

Post a Comment