బ్రాహ్మణ సంక్షేమంలో దేశానికే దిక్సూచి!
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి
దినపత్రిక (30-05-2023)
సమాజాన్ని ఐక్యంగా వుంచడానికి శాయశక్తులా కృషిచేసినవారిలో అందరితోపాటు
బ్రాహ్మణులు కూడా వున్నారు. ఆధునిక నవసమాజ, సమసమాజ నిర్మాణంలో సహితం బ్రాహ్మణులు తమ శక్త్యానుసారం
ప్రతిభావంతమైన, కీలకమైన పాత్ర పోషించారు. సాంఘిక సంస్కరణల నుండి ఆధునిక శాస్త్ర విజ్ఞానం
దాకా, సాహిత్యం నుండి సినిమాల దాకా,
రాజకీయాల నుండి ప్రజా పరిపాలన దాకా, అద్ద్యాత్మికత నుండి
కమ్యూనిజం వరకూ, సాంప్రదాయ విలువల నుండి ప్రగతిశీల ఆలోచనల
వరకు బ్రాహ్మణులు ఎవరికీ తీసిపోకుండా తమవంతు కృషి సల్పారు. భారత దేశానికి
స్వాతంత్ర్యం లభించిన తరువాత కొంతకాలం దాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రధాన
భూమిక పోషించడంలోను బ్రాహ్మణులకు అవకాశాలు దక్కాయి. దరిమిలా వీరి ఎదుగుదలను
సహించలేని కొన్ని రాష్ట్రాలలో, ముఖ్యంగా దక్షిణాదిలో, బ్రాహ్మణ
వ్యతిరేక ఉద్యమాలు మొదలయ్యాయి.
ఆ ఉద్యమాల ప్రభావంవల్ల వారి హక్కులకు భంగం వాటిల్లడంతో పాటు
ఆధునిక సమాజంలో వారికి చేకూరాల్సిన ఉపాధి అవకాశాలు క్షీణించసాగాయి. ఆర్థికంగా
బ్రాహ్మణులు బాగా చితికి పోయారు. కులవృత్తితో పాటు వ్యవసాయం మీద, భూమి
మీద కూడా ఆధారపడిన బ్రాహ్మణులు, చట్టాల పుణ్యమా అని ఆ రకమైన
ఉపాధిని కోల్పోయారు. పూజారులుగా, అర్చకులుగా, వేద పండితులుగా, కర్మకాండలు నిర్వహించే వారిగా,
వివాహాలలో, అంత్యక్రియలలో, ఇతర పూజా పునస్కారాలలో మాత్రమే వుండిపోయి, రాజకీయంగా,
సామాజికంగా, ఆర్థికంగా ఎదుగుదలకు నోచుకోలేక,
బీదరికంలోకి అడుగు పెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. ఏ కొద్దిమందినో
మినహాయించి, చాలామందిది ఇదే పరిస్థితి. ‘అందరూ సమానులే’ అన్న
రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విరుద్ధం. బ్రాహ్మణుల ఈ స్థితికి బీజాలు ఆంగ్లేయుల
పాలనలోనే పడ్డాయి. భారత దేశ సామాజిక వ్యవస్థలో, బ్రాహ్మణుల ప్రాముఖ్యం బ్రిటీష్
వారికి మొదట్లోనే అవగతమైంది. జాతీయోద్యమంలో పెద్ద ఎత్తున బ్రాహ్మణులు పాల్గొనడమే
కాకుండా ఇతరులులతో పాటు నాయకత్వం వహించడం తమ గుత్తాధిపత్యానికి ప్రమాదమని భావించిన
బ్రిటీష్ ప్రభుత్వం బ్రాహ్మణులను కట్టడి చేసింది.
ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 60 ఏండ్ల ఆంధ్రా వలస పాలనలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో పాటు, తెలంగాణ ఏర్పాటయ్యేదాకా, వివిధ
రంగాలలో బ్రాహ్మణుల పట్ల కూడా తీవ్రమైన వివక్ష స్పష్టంగా వుండేది. రాష్ట్రావతరణ
తరువాత తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని, అందునా
ఆర్థికంగా వెనుకబడిన వారి సంక్షేమాన్ని కాంక్షించి, పలు
పథకాలకు శ్రీకారం చుట్టి అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర
రావు, అదే క్రమంలో, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటు తనంలో
వున్న పేద బ్రాహ్మణుల కోసం, వారి పరిస్థితులను సానుభూతితో అర్థం చేసుకుని, ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం, బ్రాహ్మణుల పట్ల ఆయనకున్న
అభిమానానికి, గౌరవానికి, వారు బాగు
పడాలన్న తపనకు నిదర్శనం.
అలా ఆవిర్బవించిందే కేసీఆర్ మానస పుత్రికగా చెప్పుకోవాల్సిన
‘తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్’. 17 మంది
సభ్యులతో, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి అధ్యక్షతన జనవరి 2017 లో,
దేశంలో ఎక్కడాలేని విధంగా, మొట్టమొదటిసారిగా, ఒక రిజిస్టర్డ్ సొసైటీగా నెలకొల్పారు దీన్ని. గత ఆరు సంవత్సరాలుగా ఈ
పరిషత్ ఆధ్వర్యంలో బ్రాహ్మణుల సంక్షేమానికి అనేక పథకాలను రూపొందించి, సుమారు 6500 మందికి పైగా వ్యక్తులకు లబ్దిచేకూర్చింది. బ్రాహ్మణ సమాజం
గోడు అర్థం చేసుకున్నందుకు తెలంగాణ
రాష్ట్ర ప్రభుత్వం విశాల దృక్పథాన్ని అభినందించి తీరవలసిందే.
హైదరాబాద్ నగరంలో, బాగా రద్దీగా వుండే పాత్రికేయుల కాలనీ
పక్కనవున్న గోపనపల్లి ప్రాంతంలో, డిసెంబర్ 2016 లో, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన
ఆరెకరాల విశాలమైన స్థలంలో నిర్మించిన ‘తెలంగాణ బ్రాహ్మణ సదన్ భవన
సముదాయం’ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చేపట్టిన ప్రాధాన్యత
సంతరించుకున్న కార్యక్రమం. భవిష్యత్తులో బ్రాహ్మణుల సంక్షేమ కార్యక్రమాల
రూపకల్పనకు, అమలుకు అవసరమైన కార్యాచరణ పథకాలకు ఇది కేంద్ర
బిందువు కానున్నది. ఈ భవన సముదాయానికి మంత్రి కేటి రామారావు ఫిబ్రవరి 2017 లో
భూమిపూజ చేసి పునాది వేశారు. ఈ సముదాయంలో, ప్రస్తుతానికి రు.
12.50 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తిచేసుకున్న కళ్యాణమంటపం,
సమాచార కేంద్రం, పీఠాదిపతుల వసతి గృహాలను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్
రావు మేనెల 31, 2023 న లాంఛనంగా ప్రారంభిస్తున్నారు.
ఆద్యతన భవిష్యత్తులో విస్తరణలో భాగంగా, మినీ
ఆడిటోరియం, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం,
బాలుర హాస్టల్, బాలికల హాస్టల్, మెస్
సదుపాయంతో కూడిన సాధారణ వసతి సముదాయం, మహిళా కేంద్రం,
దేవాలయాల సముదాయం నిర్మాణం జరుగనున్నది. సూర్యాపేట, మధిర, ఖమ్మం, పెద్దపల్లి,
బీచ్పల్లిలలో వివిధ స్థాయిలలో బ్రాహ్మణ సదన్ల నిర్మాణం పురోగతిలో వున్నాయి. ‘తెలంగాణ
బ్రాహ్మణ సదన్ భవన సముదాయం’ ప్రారంభోత్సవానికి
రాష్ట్రం, దేశం వివిధ ప్రాంతాల నుండి పీఠాదిపతులు, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, బ్రాహ్మణ సామాజికరంగ ప్రముఖులు, వేద పండితులు, ద్వాదశ జ్యోతిర్లింగాలతో సహా దేశవ్యాప్తంగా వున్న ప్రముఖ దేవాలయాల
అర్చకులతో సహా సుమారు పదివేల మంది పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన
మేరకు ప్రారంభోత్సవం రోజున చండీయాగం, సుదర్శన యాగం
నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఆరోజున చేయాల్సిన కార్యక్రమాలను, కార్యాచరణను
సమీక్షించడానికి, మే నెల 13, 2023న రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఉన్నత
స్థాయి అధికార-అనధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వ భావజాలమైనా, తత్త్వమైనా, ‘సర్వజన హితం’ అనీ, ‘మనుషులందరినీ ప్రేమించడం’ అనీ,
తదనుగుణంగానే అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పేదలయిన
బ్రాహ్మణ వర్గాల సంక్షేమం కోసం కూడా కృషి చేస్తున్నదని,
పూజారుల సంక్షేమానికి పాటు పడుతున్నదని, ప్రభుత్వం అందించిన సహకారంతో పేద బ్రాహ్మణ
పిల్లలకు చక్కటి చదువు అందుతున్నదని, వేదాలు చదువుతూ
దైవకార్యంలో మునిగిన అర్చకుల్లో భరోసా పెరిగిందని
అన్నారు. బ్రాహ్మణ సదన్ భవన సముదాయ నిర్మాణానికి భూమిని కేటాయించి ప్రత్యేకంగా
నిధులు విడుదల చేశామన్నారు. భారతదేశంలో ఎక్కడాలేని విధంగా బ్రాహ్మణుల సంక్షేమానికి
వార్షిక బడ్జెట్ కేటాయింపులు రు 100 కోట్లు అని తెలుసుకున్న ఉత్తర ప్రదేశ్ లాంటి పలు
రాష్ట్రాల ప్రముఖ బ్రాహ్మణ నాయకులు ఆశ్చర్యం, విస్మయం వ్యక్తం చేసిన
విషయాన్నివివరించారు కేసీఆర్.
బ్రాహ్మణ సదన్ సముదాయం నేటి,
భావితరాలవారికి, శాంతిని, భక్తి
భావనలను పంచే ఆధ్యాత్మిక కేంద్రంగాను, అన్ని వర్గాలవారికి
అందుబాటులో వుండే ఒక సామాజికి కేంద్రంగాను ఖ్యాతికెక్కాలని సిఎం ఆకాంక్షించారు. దైవ
భక్తిని, ధ్యానాన్ని, ఆధ్యాత్మికతను పెంపొందించే దిశగా
ఆధ్మాత్మిక గ్రంధాలు, వేదాలు, ఉపనిషత్తులు,
పురాణాలు వంటి సాహిత్యంతో కూడిన పుస్తకాల,
డిజిటల్ గ్రంధాలయాన్ని ఏర్పాటు చేయాలని, అక్కడికి వచ్చేవారికి దైవ కార్యాలకు సంబంధించిన
యజ్ఞయాగాదులు, క్రతువులు, సత్యనారాయణ
వ్రతం లాంటి వివిధ వ్రతాలు, దీక్షలు పట్టే విధానం
తెలుసుకోవడానికి అవసరమైన సమాచారం లభ్యమవ్వాలని కేసీఆర్ సూచించారు. సామాన్యులకు
కూడా అర్థమయ్యే భాషలో, శైలిలో పుస్తకాలను ప్రచురించాలని,
డాక్యుమెంటరీలను రూపొందించాలని సీఎం
అభిప్రాయపడ్డారు. బ్రాహ్మణ సదన్ భక్తి, ఆధ్మాత్మిక
భావజాలవ్యాప్తికి సంబంధించిన ఒక సమగ్ర సమాచార కేంద్రంగా, శిక్షణా
శిబిరంగా, వనరుల కేంద్రంగా కూడా అభివృద్ధి చెందాలన్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా, మొట్టమొదటిసారిగా, ఈ తరహా బ్రాహ్మణ
సదన్ కాని, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కాని ఏర్పాటు కావడానికి ఒక గుణాత్మక నేపధ్యం
వున్నది. ఆరున్నర సంవత్సరాల క్రితం, అక్టోబర్ 23, 2016 న,
హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో,
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి, పక్క రాష్ట్రం నుండి, సుమారు నూరుమంది బ్రాహ్మణ ప్రముఖులతో ఒక మేథోమధన బ్రాహ్మణ
సంక్షేమ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్, బ్రాహ్మణులు సమాజానికి
సంబంధించిన చేస్తున్నారని, అయినా వారిలో చాలామంది పరిస్తితి
దీనంగా వుందని, మంగళహారతి పళ్లెంలో భక్తులు వేసే డబ్బులకోసం
అర్చకులు ఎదురు చూసే దుర్భర పరిస్థితులున్నాయని, వీటిని అధిగమించదానికి
ప్రభుత్వం, మేధావులు కలిసి బ్రాహ్మణుల సంక్షేమానికి ఒక
కార్యాచరణ రూపొందించుకోవాలని అన్నారు.
ఇందులో భాగంగానే మొదలు అన్ని హంగులతో కూడిన ఒక రాష్ట్ర
స్థాయి బ్రాహ్మణ సదనాన్ని హైదరాబాద్ లో నిర్మించుకుందాం అని అంటూ, దాని
నిర్వహణ బాధ్యత కోసం ఒక ధర్మకర్తల మండలి ఏర్పాటు చేద్దామని, ఆ కేంద్రంలో బ్రాహ్మణ సాంప్రదాయ
పరమైన కార్యక్రమాలు జరుపుకునేందుకు ఏర్పాటు చేసుకుందామని సీఎం అన్నారు. అలా బీజం పడి రూపుదిద్దుకున్నదే ‘తెలంగాణ
బ్రాహ్మణ సదన్’. దాని నిర్వహణ కోసం ఏర్పాటయిందే ‘తెలంగాణ బ్రాహ్మణ
సంక్షేమ పరిషత్’. క్రమేపీ పరిషత్ అమలుపరుస్తున్న పథకాల ద్వారా బ్రాహ్మణుల
సంక్షేమం దిశగా తెలంగాణ ఒక ‘రోల్ మోడల్’ అయింది.
బ్రాహ్మణ సదన్ తో పాటు, పరిషత్ అమలుపరుస్తున్న
కార్యక్రమాలలో ప్రధానమైనవి: విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు
రు.20 లక్షలు మించకుండా ఆర్ధిక సహాయం అందించే వివేకానంద విదేశీ విద్య పథకం (780
మంది లబ్దిదారులు); స్వయం ఉపాధికి రు. 5 లక్షలు మించకుండా బ్రాహ్మణుల ఔత్సాహిక
పథకం (5074 మంది లబ్దిదారులు); శ్రీ రామానుజ ఫీజు రీఇంబర్స్ పథకం (436 మంది
లబ్దిదారులు); వేదం పాఠశాలలకు ఏక కాల
గ్రాంట్ (32 పాఠశాలలకు లబ్ది);
వేదాధ్యయనం చేసిన విద్యార్థులకు జీవనోపాధి అలవెన్స్; వేదాధ్యయనం చేస్తున్న
విద్యార్థులకు నెలకు రు. 250 స్తైపెండ్ (245 మంది లబ్దిదారులు); నెలకు రు. 2500
చొప్పున వేదాల, శాస్త్రాల పండితులకు గౌరవ వేతనం (64 మంది
లబ్దిదారులు); నూరు సాంప్రదాయ పాఠశాలలకు
ఆర్ధిక సహాయం లాంటివి వున్నాయి. పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రు.
250 కోట్లకు పైగా విడుదల చేసింది.
ఆనాడు సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశం
తీసుకున్న నిర్ణయాలు బ్రాహ్మణుల సంక్షేమం దిశగా ఒక బహుముఖ వ్యూహం
రూపొందించుకునేందుకు దోహద పడుతున్నాయి. వైదిక విద్యకు ప్రోత్సాహం, ఆధ్యాత్మిక
భావనలు పెంపొందించే వారికి ఆర్థిక చేయూత, సంప్రదాయలు కాపాడే
వారికి, ఆధ్యాత్మిక రచనలు చేసే వారికి ఆర్థికంగా ప్రోత్సాహం,
బ్రాహ్మణుల విద్య, వైద్య వివాహాది అంశాలకు
ప్రాధాన్యత, ప్రతిభావంతులైన పేద బ్రాహ్మణ విద్యార్థులకు తగు
ప్రోత్సాహం, నైపుణ్యాభివృద్ధికి, స్వయం
ఉపాధికి, యువ పారిశ్రామికవేత్తలకు తోడ్పాటుకు, తదితర
కార్యక్రమాల అమలుకు దారి తీస్తున్నది.
హైదరాబాద్ లో నిర్మించిన బ్రాహ్మణ సదన్ బ్రాహ్మణ సమాజోధ్ధరణ
వేదికగా ఉపయోగపడుతుంది. వేరే ప్రాంతాల నుంచి పీఠాధిపతులు, పండితులు
వచ్చినా అక్కడ బస చేసే వీలు కలగడంతో పాటు, ఆచార, సంప్రదాయాల పరిరక్షణకు వీలు కలుగుతుంది. ధర్మ సంరక్షణకు, బ్రాహ్మణ సంక్షేమానికి ఇంతకంటె ఇంకేం కావాలి? అనాదిగా
ధర్మాన్ని, అర్య సంస్కృతిని, నాగరకతను,
సంప్రదాయాలను సంరక్షించుకుంటూ వస్తున్న బ్రాహ్మణులకు, వాటిని
భవిష్యత్ లో కూడా కొనసాగించడానికి ప్రభుత్వ పరంగా చేయూత లభించనున్నది కదా! అందుకే
తెలంగాణ బ్రాహ్మణుల సంక్షేమ పథకం దేశానికే ఆదర్శం, దిక్సూచి!!!
(వ్యాస రచయిత తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వైస్ చైర్మన్)