అద్భుతం రావులపాటి పుస్తకం ‘జ్ఞాపకాల పేటిక’ స్వ’గతం’
వనం
జ్వాలా నరసింహారావు
ఏదైనా పూర్తిగా తెలిసిన-పూర్తిగా తెలియని, లేదా, పూర్తిగా
చదివిన-పూర్తిగా చదవని విషయాలకన్నా, తెలిసీ-తెలియని, లేదా, చదివీ-చదవని విషయాలు
గ్రంథస్తం చేసిన పుస్తకం చదువుతుంటే పాఠకుడికి
కలిగే అనుభూతి ఆ పుస్తకం చదివినవారికే మాత్రమే స్వంతం అనాలి. సరిగ్గా అలాంటి
పుస్తకమే, ‘ప్రసిద్ధ రచయిత’, పదవీ విరమణ చేసిన ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)
అధికారి, ఎన్నో వైవిధ్యభరితమైన పుస్తకాలను తెలుగు పాఠకులకు, గత ఐదారు దశాబ్దాలకు పైగా అందచేస్తున్న
రావులపాటి సీతారాంరావు సరికొత్త ‘జ్ఞాపకాల పేటిక’ స్వ’గతం’. రచయిత పుస్తకాన్ని పంపిన వెంటనే వదలకుండా
చదివింప చేసిన ఒక మంచి పుస్తకం. బహుశా ఈ పుస్తకాన్ని ఆసాంతం చదివిన ప్రతిఒక్కరికి
కలిగే అనుభూతి ఇలాంటిదే అనవచ్చేమో!
జీన్ పాల్ సార్త్రే మాటల్లో చెప్పాలంటే, రచయిత
తను రాసిన పుస్తకాన్ని పాఠకుడితో
చదివించగలగాలి. అలా జరగకపోతే అది చదవని పుస్తకంగానే మిగిలిపోతుంది. ‘An unread
book is nothing but a handful of soiled paper’
అంటాడు జీన్
పాల్ సార్త్రే. ‘జ్ఞాపకాల పేటిక’’ స్వ’గతం’ అందుకే ఒక చక్కటి, అందరూ
ఆపకుండా చదివే ఆసక్తికరమైన పుస్తకం.
ఒక రచయిత తెలియడం కన్నా, ఆ రచయితతో
బాగా పరిచయం కన్నా, రాసిన రచనలు
చదవడం కన్నా, మిన్న, ఆ రచయిత రాసిన కొన్ని పుస్తకాలలోని అంశాలు పుస్తక రూపేణా
రాకముందే వివిధ పత్రికలలో ప్రచురణ అయినప్పుడు చదివే అవకాశం కలగడం. అంతకన్నా మిన్న,
పుస్తకంలోని కొన్ని అంశాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో
రచయితతో ప్రచురణకు ముందే చర్చించే అవకాశం కలగడం. రచయిత రావులపాటి సీతారాంరావు
బంధుత్వ రీత్యా, చదువుకునే
రోజుల్లో నాలుగైదు సంవత్సరాలు సీనియర్ అయినప్పటికీ దగ్గరిగా పరిచయం వున్నరీత్యా, కొంతకాలం ఒకే సంస్థలో నాకు సీనియర్ సహోద్యోగిగా
పనిచేసిన రీత్యా, వారు రాసిన
సరికొత్త ‘జ్ఞాపకాల పేటిక’’ స్వ’గతం’ చదువుతుంటే అనేక విషయాలలో మమేకమై పోతున్న భావన
కలిగింది. చాలా విషయాలు నడుస్తున్న చరిత్ర (Contemporary History) కావడంతో, వాటిలో పేర్కొన్న వ్యక్తులతో కొంత
పరిచయం వుండడం వల్లా, అన్నీ
తెలిసినట్లే వున్నా, రచయిత తనదైన రచనా శైలితో పాఠకుడి హృదయానికి అడ్డుకునేట్లు గొప్పగా తెలియచేసిన
పధ్ధతి బహుశా రావులపాటి లాంటి చాలా కొద్దిమంది రచయితలకే సాధ్యమనాలి.
చదివీ, చదవని విషయాలు
అనడానికి కారణం లేకపోలేదు. స్వ’గతం’ పుస్తకంలో వున్న 30 వ్యాసాలలో చాలా వాటిని
పత్రికలలో చదవడంతో పాటు, చదవనివి కూడా
ఇంకొన్ని వున్నాయి. అలాగే మొత్తం పుస్తకానికే తలమానికమైన 31 వ (వ్యాసం?) ‘మా నాన్నే మాకు రోల్ మోడల్’ అనే అంశంలోని కొన్ని విషయాలు సహితం తెలిసినవైతే, తెలియనివి కూడా చాలా వున్నాయి. దానికి కారణం
రచయిత నాన్నగారు స్వర్గీయ రావులపాటి సత్యనారాయణరావు గారు సుమారు ఆరు దశాబ్దాల క్రితమే
లబ్దప్రతిష్టులైన రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా ఎన్నో విషయాలలో చాలా మందిని
ప్రభావితులను చేసిన ఒక మహామనీషి కావడం. వారిని నేను చాలా దగ్గర నుండి, నా చిన్నతనం నుండీ ఎరిగినవాడిని. మా నాన్నగారు
స్వర్గీయ వనం శ్రీనివాసరావు గారికి ఆత్మీయుడు. తండ్రి గారిని గురించి రాస్తూ, రచయిత, ఆయన్ను వివిధ పార్శ్వాలలో గమనించిన విషయం, ఆయన గంభీరత, గ్రామ
వ్యవహారాలను చక్కదిద్దిన శైలి, గ్రామంలో
ఆయనకున్న ప్రత్యేక స్థానం, బయటకు
వెళ్ళడానికి ఆయన అనుమతి కొరకు ఎదురు చూడడం, ఆయన పాలేరు
సమితి అధ్యక్షుడు కావడం, గ్రామ కక్షలు, ఆయన పట్టుదల, అన్నిటికీ మించి ఆయన ఆప్యాయత లాంటివి చదువుతుంటే
అందులో కొన్ని తెలిసిన భావన.
ఇతర 30 వ్యాసాల గురించి రాయాల్సిన ఆసక్తికరమైన విషయాలు చాలా వున్నాయి.
అందులో కొన్ని మాత్రమే ఇక్కడ. సుప్రసిద్ధ గ్రంథకర్త,
విశ్లేషకులు, విహారిగారు
వారి శుభాకాంక్షలతో పుస్తకాన్ని, రచయితను
పరిచయం చేస్తూ రాసిన తొలిపలుకుల్లోనే రచయితను ‘సాహితీలోకం ఆదరాభిమానాల్ని
పొందిన ప్రసిద్ధ రచయిత’ గా పేర్కొన్నారు. నిజానికి ఆయన చాలా గొప్పగా
చెప్పారు. ‘జ్ఞాపకాల పేటిక’’ స్వ’గతం’ లోని ఒక్కొక్క వ్యాసం చదువుతుంటే, రచయిత మీద విహారిగారు పేర్కొన్న ఆదరాభిమానాలు
మరింత పెరుగుతాయనడంలో సందేహంలేదు.
కొన్ని ఉదాహరణలు చెప్పుకోవాలంటే: ‘స్వామికి అందరూ సమానులే’ వ్యాసంలో రచయిత పేర్కొన్న ఆర్కే లక్ష్మణ్, కేరళ ముఖ్యమంత్రి కరుణాకరన్, ప్రసిద్ధ హిందీ నటుడు రాజ్ కపూర్, గాయని సుబ్బలక్ష్మి, నటి హేమ మాలిని,
ప్రధాని ఇందిరాగాంధి దర్శనాల ప్రస్తావన, దర్శనంతో వారు తన్మయత్వం చెందడం పేర్కొంటూ, ‘సామాన్యులూ, అసామాన్యులూ, స్వామివారి దర్శనం కోసం బారులుతీరి
ఎగబడేవారె’ అని చేసిన
వ్యాఖ్య అద్భుతం. అంతకంటే ఆసక్తికరమైన ‘స్వామి పరీక్షిస్తారు! తస్మాత్
జాగ్రత్త!’ వ్యాసంలోని రచయిత స్వానుభవం, మరో సారి వెనుకా, ముందు రాసిన వ్యాసాలను చదివేట్లు చేస్తుంది.
ప్రత్యేకంగా దర్శన భాగ్యం తనకు ప్రసాదిస్తారా అని ఆభిజాత్యంతో మనసులో చిలిపిగా అనుకున్నందుకు
ఆ తరువాత తనకు చిలిపి వాత పెట్టినట్లయింది అని రచయిత చెప్పడం చాలా చక్కగా వుంది.
అలాగే తిరుమల స్వామివారికి సంబంధించిన మరో ఐదారు ఆసక్తికరమైన వ్యాసాలున్నాయి.
1983 జనవరి నెలలో
ఎన్టీఆర్, ఇందిరాగాంధీల
మీటింగుల ప్రస్తావనకు సంబంధించిన వ్యాసంలో, తిరుపతి అడిషనల్
ఎస్పీగా రచయిత సమయోచితంగా నిర్వహించిన పాత్ర గురించి, దరిమిలా ‘థాంక్యూ బ్రదర్’ అని ఎన్టీఆర్,
‘థాంక్యూ ఆఫీసర్’ అని
ఇందిరాగాంధీ అనడం గురించి చక్కగా రాశారు. అలాగే, అదేవ్యాసంలో 1994 లో మరోమారు
ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాగానే రచయిత అభిరుచికి అనుగుణంగా ఆయనకు, ‘చాలెంజింగ్
పోలీస్ జాబ్ ఇస్తున్నానని’ సీఎం చెప్పడం
ఆసక్తికరంగా రాశారు రచయిత. రావులపాటి గారు రాసినట్లు ‘ఎత్తుకు ఎదిగినవారి ఆలోచనలలో
సామీప్యత వుంటుంది! ఆ ఎత్తుకు సామాన్యులు ఎదగాలి!’. ‘సామాన్య సిఎం అసామాన్య
చతురత’ వ్యాసంలో
అలనాటి ఉమ్మడి అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంజయ్య, సీఎం అయిన వెంటనే, అప్పటి తన
పీఆర్వో భండారు పర్వతాలరావు రాసిన ఒక ప్రకటన మీద సంతకం చేసిన తరువాత, ‘ఎక్కడో ఒకచోట ఇందిరాగాంధీకి థాంక్స్ అని
వచ్చేట్లు చూడమని, ఆమేకదా మనకు ఈ ఉద్యోగం ఇచ్చిందని’ అనడం
గురించి రాశారు రచయిత. కృతజ్ఞత అంటే ఏమిటో, ఎలాచెప్పాలో
అనే ఈ ఆసక్తికరమైన విషయం మనలో చాలా మంది తప్పక తెలుసుకోవాలి!. ముఖ్యంగా నేటి యువత.
‘విలువలు మారాయోచ్!’ వ్యాసంలో ఒకప్పటి రాజనీయనాయకులు
కొన్ని విభేదాలు పక్కనపెట్టి సహాయం చేసే నైజం గురించి, విలువలు పాటించడం గురించి, ఒక స్వవిషయం గురించి మంత్రి మూర్తి రాజు ఒక
పౌరుడిలాగా పోలీసు అధికారైన రచయిత ఇంటికి రావడం, పిటీషన్ ఇవ్వడం గురించి రాయడంతో
పాటు, వ్యాసం
చివర్లో ‘నేను ఉద్యోగంలో చేరినప్పుడు విలువలు వేరు! ఉద్యోగం మధ్యలో చూసిన విలువలు
వేరు!’ అని వ్యాఖ్యానించడం అద్భుతం. ‘వెంగళరావుగారితో నేను!’ అనే
వ్యాసంలో ఆయన పార్టీలకు, గ్రూపులకు
అతీతంగా వ్యవహరించిన తీరు ప్రస్తావిస్తూ, రచయిత, తన
తండ్రిగారు సమితి అద్యక్షుడిగా వెంగళరావు గ్రూపుకు వ్యతిరేకంగా గెలిచినప్పటికీ, గ్రామంలోని వారింటికి భోజనానికి వచ్చి, వెళ్తూ, మీటింగులో
వ్యతిరేకంగా మాట్లాడబోతున్నానని చెప్పడం రాశారు. ‘వ్యక్తిగత గౌరవాలూ, స్నేహాలూ, వదులుకోకుండా
రాజకీయ జీవితాలను గడవడం ఆ రోజుల్లో కొట్టొచ్చినట్లు కనబడుతుండేది’ అని చక్కగా
వ్యాఖ్యానించారు రచయిత.
మర్రి చెన్నారెడ్డి గారి మనస్తత్వాన్ని చక్కగా ఎరిగున్న వ్యక్తిలాగా, రెండవసారి
సీఎం గా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సభ సజావుగా జరగకపోవడానికి సంబంధిత పోలీస్
అధికారిగా బాధ్యత వహిస్తూ, ‘బ్రహ్మాండంగా
చేశారుగదా అరేంజ్మెంట్స్’ అని ఆయన ఎకసెక్కంగా అడిగితే, అవును అనకుండా, ‘లేదు సార్! ఆ అరేంజ్మెంట్స్ చేసిన నేనే
సిగ్గుపడుతున్నాను’ అని
జవాబివ్వడం, వెంటనే ఆయన
కోపం చల్లారడం, చక్కగా రాశారు రచయిత. చంద్రబాబునాయుడు గురించి చేసిన వ్యాఖ్య కూడా
చక్కగా, ఆయనకు సరిపోయేలా వుంది. ‘ఇన్నేళ్ల తరువాత కూడా చంద్రబాబు రాజకీయాలలో
క్రియాశీలకంగా వుండడానికి కారణం పట్టువదలని విక్రమార్కుడిలాగా పనిచేస్తూ వుండడమే.
రాజకీయాలలో అదృష్టంతో పాటు కార్యదక్షత వుంటేనే విజయం సాధ్యపడుతుంది’ అంటారు. మంత్రులుగా రోశయ్య, సమరసింహారెడ్డిల ప్రస్తావన తెస్తూ ఒక వ్యాసంలో, ఆరోజుల్లో మంత్రుల నిరాడంబరత, ఆత్మీయత తెలియచేసే సందర్భం గురించి చక్కగా
రాశారు రచయిత.
ఇలా రాసుకుంటూ పోతే అన్నీ ఆసక్తికరమైన విషయాలే. ఇక మిగిలినవి
పుస్తకంలో చదివి ఆస్వాదించాల్సిందే! ఏఎన్ఆర్, భానుమతి, కె విశ్వనాథ్,
సిరివెన్నెల, కారా మాస్టారు, విజయరామారావు, గోటేటి, గవర్నర్ నరసింహన్,
పొత్తూరి, జయలలిత, పీవీ, భారతీ తీర్థ
స్వామి, సద్గురు
శివానంద మూర్తి, విశ్వంజీ,
కుర్తాళం పీఠాదిపతి, పుట్టపర్తి
బాబాల ప్రస్తావన వున్న వ్యాసాలూ అద్భుతం.
చివరగా, నాకు బాగా
నచ్చిన వ్యాసం ‘నేను జ్ఞాపకం ఉంచుకునే ఖమ్మం జిల్లా ప్రముఖులు!’
గురించి రెండు మాటలు. జమలాపురం, బొమ్మకంటి, జలగం, శీలం....తెలిసిన, అంతో-ఇంతో పరిచయం వున్న వ్యక్తులే. ఈ వ్యాసంలో
ప్రస్తావించిన వీబీ రాజు మహా మేధావి. ఆయన హిమాయత్ నగర్-అశోక నగర్ మధ్యలో ఒక ఇంట్లో
వున్నప్పుడు తరచుగా కలిసేవాడిని. ఇక బూర్గుల రామకృష్ణారావు తాను డిస్మిస్ చేసిన
కేరళ ముఖ్యమంత్రి నంబూద్రిపాద్ ను పొగడడం, రాజకీయాలలో ‘A wheel within a
wheel’ అనే అర్థవంతమైన విషయాన్ని చెప్పడం ఈ వ్యాసంలో
రచయిత చక్కగా ప్రస్తావించారు. అలాగే ఆ వ్యాసం చివర్లో, ‘ఖమ్మం జిల్లా నాయకులు ఏ పార్టీవారైనా ఒకరితో
ఒకరు సన్నిహితంగా వుండే విధానం నాకు నచ్చేది! ఆ రోజుల్లో పాటించిన రాజకీయ
నీతీ-ఆరాజకీయ నాయకులూ-మళ్లీ ఈ రోజుల్లో వుంటే బాగు!’ అన్న రచయిత అభిప్రాయంతో
పూర్తిగా ఏకీభవిస్తాను.
‘సాహితీ ప్రపంచాన్ని కాలేజీ రోజుల్లోనే మాలాంటివారికి ఎరుకపరిచిన శ్రీ
మామునూరు నర్సింహారావుకు ఈ జ్ఞాపకాల పేటిక ప్రేమతో సమర్పణ’ అని రచయితా రావులపాటి రాయడం ఒక మహా వ్యక్తిని,
మేధావిని, అద్భుతంగా గౌరవించడమే. కాలేజీ రోజుల్లో పలువురు మాలాంటి ఆయన జూనియర్లతో
సహా మామునూరు గారిని తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదేమో!
ఇంగ్లీష్ లో చెప్పాలంటే ‘A Must Read Book’ by all.
No comments:
Post a Comment