Monday, May 29, 2023

అవధాన కళను రక్షించుకోవాలి! ..... వనం జ్వాలా నరసింహారావు

అవధాన కళను రక్షించుకోవాలి!

వనం జ్వాలా నరసింహారావు

సాక్షిదినపత్రిక (29-052023)

         అనుకోకుండా అవకాశం, అదృష్టం లభించడం అంటే ఇదేనేమో!

దర్శనమ్ శర్మ గారి సోదరుడు, చిరకాల మిత్రుడు, మరుమాముల దత్తాత్రేయ శర్మ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఏర్పాటైన, ‘అవధాన విద్యా వికాస పరిషత్’ ఆధ్వర్యంలో పద్మారావునగర్ శ్రీ శివానంద ఆశ్రమంలో ఈ నెల (మే) 14 న నిర్వహించిన రెండవ అవధాన శిక్షణా శిబిరం విజయోత్సవ సభలో పాల్గొనడం ఒక అదృష్టం. సభాధ్యక్షులుగా జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్య అతిథిగా పంచ సహస్రావధాని, తిరుమల తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్ట్ మాజీ సంచాలకులు డాక్టర్ మేడసాని మోహన్, గౌరవ అతిథిలుగా డాక్టర్ బులుసు అపర్ణ, ఆముదాల మురళి, డాక్టర్ రాంభట్ల పార్వతీశ్వర శర్మ, తాతా సందీప్ శర్మ, బంకుమళ్ల రమేశ్ శర్మ, కళ్ళే గిరిప్రసాద్ శర్మ, ఆహుతులను ఆహ్వానించి సభకు పరిచయం చేసిన డాక్టర్ బి ఓంప్రకాష్, వ్యవస్థాపక అధ్యక్షులు మరుమాముల దత్తాత్రేయ శర్మ తదితరులు వేదికను అలరించారు. నా అదృష్టం కొద్ది, అనుకోని ఆత్మీయ అతిథిగా నేను కూడా వేదికమీద వున్నాను. నా స్నేహితుడు భండారు శ్రీనివాసరావును వేదికమీదకు సాదరంగా ఆహ్వానించినా, ఆయన సున్నితంగా తిరస్కరించారు.

అమోఘమైన మేడసానివారి ఉపన్యాసం ముందర మాట్లాడిన నేను, చివర్లో, నా రెండు పుస్తకాలను (‘శ్రీమద్రామాయణం ‘ఆంధ్ర వాల్మీకం’ వచనం, ఆంధ్రవాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు) వారి అనుమతితో అందచేసే అవకాశం లభించడమే అనుకోని అదృష్టం, అవకాశం. సభలో మాట్లాడిన వక్తలందరూ అవధాన ప్రక్రియ తెలుగు భాషకే గర్వకారణమని, తెలుగుభాషలో వున్న ఈ అద్భుత ప్రక్రియ ప్రపంచంలో మరేభాషలో లేదని, ఇది ఒక మనోవైజ్ఞానిక ధారణతో కూడుకున్న తెలుగుజాతి తరగని ఆస్తి అని అన్నారు. ముఖ్య అతిథి డాక్టర్ మేడసాని మోహన్ చివరగా అరగంటకుపైగా చేసిన ఉపన్యాసంలో తన తొలిపలుకుల్లోనే నా ప్రస్తావన తేవడం మరో అదృష్టం. సత్కారాలు, సన్మానాలు అంటే అంతగా ఇష్టపడని తనకు, వనం జ్వాలా నరసింహారావు అనువక్తగా రాసిన శ్రీమద్రామాయణం ‘ఆంధ్ర వాల్మీకం’ వచనం, దానికి అదనంగా మరో పుస్తకం ‘ఆంధ్రవాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు’ తనకు ఇవ్వడమే ఈ రోజున తనకు జరిగిన గొప్ప సత్కారమని అన్నారు. ఆయన ఉపన్యాసం ఆసాంతం నొక్కి వక్కాణించిన ఏకైక పదం,అవధానంలో ఏకాగ్రత.

 మేడసాని మోహన్ గారు తన ఉపన్యాసంలో కొంత మేరకు తన జీవనయానాన్ని కూడా ఆవిష్కరించారని అనాలి. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తాను చిన్నతనంలో సుదీర్ఘకాలం కడుపునొప్పితో బాధ పడ్డానని, ఎన్ని మందులు వాడినా ఉపశమన వైద్యమే కాని శాశ్వత నివారణ కాలేదని, ఆ సమయంలో భగవదనుగ్రహం వల్ల, స్నేహితుల సలహా మేరకు తిరుపతి-మద్రాసు రహదారిలో వున్న ఒక అవధూత ఆశ్రమానికి అయిష్టంగానే తన తండ్రి తీసుకెళ్ళాడని, ఆయన ఒక పరమౌషధం ఇచ్చారని అన్నారు. ఆ అవదూతగారు నెలలో కేవలం ఒక్క అమావాస్యనాడే దర్శనం ఇచ్చేవారని, ఎవరితో మాట్లాడరని, చెప్పదల్చుకున్నది ఒక పలకమీద రాస్తే శిష్యులు అది చదివి, ఆయన సూచన మేరకు, అవధూతగారి దగ్గరికి వచ్చినవారికి అవసరమైన వివిధ పరిష్కారాలు చెప్తారని అన్నారు మేడసానిగారు. తనకు ఒక ఔషధం ఇచ్చి, దాన్ని ఆవుపాలలో కలుపుకొని 150 దినాలు వదలకుండా తాగాలని, కడుపునొప్పి శాశ్వతంగా తగ్గిపోతుందని అవధూత చెప్పారట. ఒకవేళ పది-పదిహేను రోజుల్లో మెరుగైనా, ఆపకుండా ఖచ్చితంగా చికిత్స కొనసాగించాలని కూడా చెప్పారు. మేడసాని మోహన్ గారు అవధూత చెప్పినట్లే, అది చేదుగా ఉన్నప్పటికీ, తనతల్లి ప్రోద్బలంతో 150 దినాలు తాగానని, ఇక ఆ తరువాత తనలో ఎదో మార్పు రావడం ప్రారంభమైందని అన్నారు.

ఆ తరువాత అవధూత సూచన మేరకు తన తల్లితండ్రులు కూడా పూర్తి శాఖాహారులుగా మారారని, తనను అవధూత వుండే ఆశ్రమం సమీపంలో పాశాలలో ఆయన సలహా మేరకు చేర్పించారని అన్నారు మేడసాని మోహన్. తనకు దేవీ దర్శనం, అనుగ్రహం కలిగిందని, ఫలితంగా తొమ్మిదవ తరగతిలోనే పద్యం రాయడం ఆరంభించానని అన్నారు. తన గురువుగారు తన పద్యాలలోని చంధస్సు తప్పొప్పులు సరిచేసేవారని, ఆయన ఒకసారి శివుడిమీద పద్యం చెప్పమంటే చెప్పానని, ఆ పద్యం వినిపించారు. పదవతరగతి చదువుతున్నప్పుడే అవధానం చేయడం మొదలు పెట్టానని, భగవదనుగ్రహం వల్ల అది నిరంతరాయంగా కొనసాగిందని, ఇప్పటికి ఖండాంతరాలలో చేసిన 300 కు పైగా చేసినవి కలుపుకొని, మొత్తం 1200 పైగా అవధానాలు చేశానని, విదేశాలలో అవధానం చేసిన మొట్టమొదటి వ్యక్తిని తానేనని అన్నారు. ఆయనగారి అవధానాలలో, అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు, ద్విసహస్రావదానాలు, పంచసహస్రావధానాలు ఉన్నాయన్నారు. తాను చేసిన ఆయా అవధానాలలో సందర్భోచితంగా ఆశువుగా పూరించిన పద్యాలను ఉదహరించారు. తన మొదటి అవధానం దివాకర్ల వెంకటావధాని సమక్షంలో జరిగినప్పుడు తనకు భయం వేసిందని, కాని తన ప్రారంభ పద్యాన్ని వినగానే ఆయన తనను అభినందించిన తీరు ఎప్పటికీ జ్ఞాపకం వుంటుందని అన్నారు.

ఒకప్పటికి, ఇప్పటికే అవధానాల తీరుతెన్నులలో, పృచ్చకుల నుండి ఎదుర్కుంటున్న ప్రశ్నల సవాళ్ల విధానంలో చాలా మార్పులు వచ్చాయని, తెలుగుభాషలో ఇంగ్లీష్, ఉర్దూ, సంస్కృతం, ఆ మాటకొస్తే కొన్ని సందర్భాలలో మరెన్నో పరాయి భాషల పదాలు చందోబద్ధంగా వాడాల్సిన అవసరం, ఆగత్యం, ఏర్పడిందని అన్నారు. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు చెప్తూ, అవధాని చేసే అపురూపమైన సాహితీ విన్యాసంలో కాలానుగునంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా నేటి తరం అవధాని కూడా ఏకాగ్రతతో మారాల్సి వస్తున్నదని అన్నారు. పాతరోజుల్లో సమస్యాపూరణం, దత్తపది, వర్ణన, ఆశువు, నిషిద్ధాక్షరి, వివర్గాక్షరి, నిర్దిష్టాక్షరి లాంటి అవధాన ప్రక్రియలో పాల్గొనే పృచ్చకులు ప్రశ్న సంధించే విధానంలో ఇప్పుడు మార్పులు వచ్చాయన్నారు. నలుగురు సినిమా నటీమణుల పేర్లు చెప్పి సరస్వతీ స్తోత్రం చేయమనో; నాలుగు ఆంగ్లపదాలు ఇచ్చి విష్ణుమూర్తిని వర్ణించమనో; పాకిస్తాన్, అప్ఫ్గానిస్తాన్, ఖజకిస్తాన్ లాంటి ఉర్దూ పదాలు ఇచ్చి వెంకటేశ్వర స్వామిని స్తుతించమనో; ఇలా ఏమేమో అడుగుతున్నారని వారి ప్రశ్నలకు అనుగుణంగా సమస్యాపూరణ చేయాల్సి వస్తున్నదని అన్నారు. ఒక్కో సందర్భానికి చెందిన ఒక్కో పద్యాన్ని తాను సందర్భోచితంగా పూరించిన విధానాన్ని, ఆ పద్యాల్ని చదివి వినిపించారు. అలా ఆయన ఉపన్యాసం ఆసాంతం ఆసక్తిగా, ఎన్నో విషయాలు నేర్చుకునే విధంగా కొనసాగింది. ఏదేమైనా ‘ఏకాగ్రత వుంటే అన్ని సమస్యలూ తొలగిపోతాయని, అదిలేని నాడు అవధానం కష్టమని ఆయన స్పష్టం చేశారు.

ఇక్కడ ఒక్క మాట చెప్పుకోవాలి. ఛందస్సును విరివిగా ప్రచారంలోకి తీసుకొచ్చిన ప్రక్రియల్లో మొదటిగా పేర్కొనాల్సింది అవధానం. కాగితం మీద కలం పెట్టి, ఆలోచిస్తూ, ఛందోబద్ధమైన కవిత్వం చెప్పేవారు కొందరైతే, అలవోకగా, ఆశువుగా, శ్రోతలను ఆకట్టుకుంటూ అవధానం చేస్తూ ఛందోబద్ధమైన పద్యాలను ధారణ చేసేవారు మరి కొందరు. అవధానం చేయాలంటే పూర్వజన్మ సుకృతం వుండాలి. సరస్వతి నాలుకమీద నిలవాలి. అలా అవధానాలు చేయగలవారు అతికొద్దిమందే వుంటారు. కాలక్రమేణా మార్పులు వస్తున్నాయి. అమెరికాకు చెందిన ఆదిత్య అతి పిన్న వయస్సులోనే, స్వయంగా, సొంతంగా ఆన్ లైన్లో శిక్షణ పొంది ద్విభాషావధానం అద్వితీయంగా చేయడమే కాకుండా రికార్డ్ సమయంలో అష్టావధానం చేయగలిగారు. అలా ఎందరో ఇటీవల కాలంలో అవధానాలు చేస్తున్నారు. అయితే ఇంకా, ఇంకా ఎంతో మంది కొత్తవారు చేయాలి. చేస్తున్నవారిలో పరిపక్వత రావాలి.  

సాహిత్యంలో ఒక విశిష్ట ప్రక్రియైన అవధానం కవి యొక్క ఆశుకవిత్వ గరిమకు, సాహితీ పటిమకు, ధారణా శక్తికి, పాండితీ ప్రకర్షకు అత్యున్నత పరీక్ష. పద్యాలన్నిటినీ ధారణ చేసి అదే క్రమంలో ఏక ధాటిగా చివరలో వాటిని అప్పగించడం మామూలు విషయం కాదు. ఈ యావత్ ప్రక్రియ కొందరికి అభ్యాసం ద్వారా కూడా సిద్ధిస్తుంది. నేర్చుకుంటే రానిదేదీ లేదు. అయితే, నేర్పేవారు వుండాలి. కాలం గడిసిపోతున్న కొద్దీ అవధానాలు చేసేవారు తగ్గిపోతున్నారు. ఆస్వాదించేవారూ తగ్గిపోతున్నారు. వేల యేండ్ల చరిత్ర గల ఈ ఛందశ్శాస్త్రం, అవధాన ప్రక్రియ అంతరించి పోకూడదని పూనుకున్నారు మరుమాముల దత్తాత్రేయ శర్మ. మరుమాముల సోదరులు ఇద్దరూ ఆధ్యాత్మికంగా, సాహితీ పరంగా ఎనలేని కృషి చేయడం మామూలు విషయం కాదు. అంతరించి పోతున్న ఈ విద్యకు పునరుత్తేజం కలిగించడానికి ఒక ఉచిత బృహత్తర శిక్షణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు స్వయంగా అవధానైన మరుమాముల దత్తాత్రేయ శర్మ. ఆయన నెలకొల్పిన అవధాన విద్యా వికాస పరిషత్ రెండు శిక్షణా శిబిరాలను నిర్వహించింది.

మరుమాముల నిర్వహించిన శిక్షణా శిబిరాలకు హాజరైన వారిలో పదేళ్ల అమ్మాయి నుండి, ఎంబీబీఎస్ చదువుతున్న వారు, వయసు మీరినవారు, సుదూరం నుండి వచ్చినవారు వున్నారు. విజయోత్సవ సభలో అవధాన బోధనను విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థులకు, శిక్షణలో భాగంగా అవధానం చేసిన కొందరికి, యోగ్యతాపత్రం ఇవ్వడం జరిగింది. అవధానం, పద్యవిద్య, చంధస్సు సార్వజనీనం కావాలి. పద్యం సాధారణ మానవుడినీ కదిలించాలి. ఈ అవధాన పరంపర నిర్విరామంగా, ఆచంద్రతారార్కం కొనసాగాలి. అవధాన పండుగలు నిర్వహించుకునే రోజులు మళ్లీ-మళ్లీ రావాలి. దీనికి మరుమాముల దత్తాత్రేయ శర్మగారి లాంటి వారు నడుం బిగించినందుకు ఆయన్ను మనసారా అభినందించాలి. ఆయన కృషిలో విజయం చేకూరాలి. ఆయన దగ్గర శిక్షణ పొందిన ప్రతిఒక్కరు అవధానాన్ని చేయగల స్థాయికి ఎదగడమే మరుమాముల వారికి గురుదక్షిణ.  

1 comment:

  1. బహు చక్కని వ్యాసం. ధన్యవాదాలు ఆర్యా!

    ReplyDelete