Sunday, May 21, 2023

సత్కర్మ వల్ల కలిగే ఫలాలను, గరుత్మంతుడి మహాత్మ్యాన్ని వివరించిన భీష్ముడు .... ఆస్వాదన-121 : వనం జ్వాలా నరసింహారావు

 సత్కర్మ వల్ల కలిగే ఫలాలను,

గరుత్మంతుడి మహాత్మ్యాన్ని వివరించిన భీష్ముడు

ఆస్వాదన-121

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (22-05-2023)

‘మనిషి చేతిలో ఏమున్నదనీ, అంతా దైవానిదేననీ కొంతమంది అంటున్నారు కదా? అలాంటప్పుడు దైవం,  పౌరుషం ఈ రెండింటిలో ఏది గొప్పదని’ ధర్మరాజు భీష్ముడిని ప్రశ్నించాడు. పూర్వం ఇలాంటి ప్రశ్ననే వసిష్ఠుడు బ్రహ్మదేవుడిని అడిగాడని, ఆయన సమాధానంగా చెప్పిన మాటలను ధర్మరాజుకు చెప్తానని అంటూ భీష్ముడు ఈ విధంగా అన్నాడు.

‘పౌరుషం చేను, దైవం బీజం. ఈ రెండింటిని కలిపే ప్రయత్నం చేస్తే మానవుడు చక్కటి ఫలాన్ని పొందుతాడు. మనిషి ఏపనీ చేయకుండా కూర్చుంటే దైవం మాత్రం ఏం చేస్తుంది? మనుషులు పనులు చేస్తే ఆయా ఫలాలను దైవం ఇస్తుంది. దైవం సహకరించకపోతే పౌరుషం ఫలం పొందలేదు.  విత్తు తోడ్పాటు లేకుండా నెల బీడుపడ్డట్లు అవుతుంది తప్ప ఫలాన్ని ఇస్తుందా? మేలు చేస్తే రెండు లోకాలలో మేలే. కీడు చేస్తే కీడే. మనిషి ప్రయత్నానికి అనుకూలించే స్వభావం కల దైవం పని ఏదైతే అదే ఫలితాన్ని ఇస్తుంది. అగ్ని కొంచెమైనా గాలితో పెరిగి ప్రకాశించినట్లు మంచిపనులు చేయటంవలన దైవానుకూల్యం పెరుగుతుంది. నేయి తగ్గిపోతే దీపకాంతి తగ్గినట్లే మనిషి చేసే కర్మలలో పవిత్రత లోపిస్తే దైవానుకూలత కూడా లోపిస్తుంది. పరశురాముడు మొదలైన మహాత్ములు కూడా కర్మల ప్రభావానికి లోనుకాక తప్పలేదు. కాబట్టి కర్మ, దైవం తక్కువ కావు. ఒక పని ఫలవంతం కావడానికి దైవ పౌరుషాలు రెండూ వుండి తీరాలి. కాబట్టి ఆ రెంటిలో ఎక్కువ-తక్కువలు లేవు. రెండూ సమానమే’. 

భీష్ముడి పలుకులకు సంతోషించిన ధర్మరాజు, సత్కర్మవలన కలిగే ఫలాలు ఎట్లా ఉంటాయని అడిగాడు. సమాధానంగా భీష్ముడు, అలసిపోయిన బాటసారికి అన్నం పెట్టడం కంటే గొప్ప ధర్మం లేదని, దానివల్ల వచ్చే ఫలితాన్ని ఎంచడానికి వీల్లేదని, మంచివారికి దానం చేస్తే ఆయా ఫలితాలు వస్తాయని, వేదం పఠిస్తే సౌఖ్యం, దానికి అర్థం గ్రహిస్తే సుగతి కలుగుతాయని చెప్పాడు. సత్కర్మలకూ, దుష్కర్మలకూ తగిన సమయాలలో వాటికి తగిన ఫలితాలు కలుగుతాయని, లోకానురక్తులకు పాప పుణ్య కర్మలు దుఃఖాన్ని కలిగిస్తాయని, విరక్తులకు ఆ ఫలాలు కలుగవని చెప్పాడు.  

తమ జీవితాలకు ఆధారమైన యజమాని పట్ల ఆశ్రితులు ఎట్లా నడచుకోవాలని ఆ తరువాత ప్రశ్నించాడు ధర్మరాజు. తనను వీడిపోకుండా కాపాడిన యజమాని ఆశ్రితులు రక్షిస్తారని అంటూ భీష్ముడు ఉదాహరణగా ఒక కథ వినిపించాడు. కాశీ దేశంలో ఒక వేటగాడు విషబాణాన్ని ఒక లేడిపై ప్రయోగించగా అది గురితప్పి ఒక ఫలవృక్షాన్ని తాకింది. దాని ప్రభావం వలన చెట్టు ఎండిపోయింది. ఆ చెట్టు తొర్రలో నివసిస్తున్న చిలుక ఎండిపోయిన చెట్టును వీడిపోకుండా ఆ చెట్టు తొర్రలోనే ఉండసాగింది. ఇంద్రుడు మరొక ఫలవృక్షాన్ని ఆశ్రయించుమని దానికి సలహా ఇచ్చాడు. కాని, చిలుక 'చెట్టు పండినపుడు ఉండటం, ఎండినపుడు విడిపోవటం కృతఘ్నత కదా’ అని సమాధానం చెప్పింది. ఇంద్రుడు సంతోషించి చిలుకను వరం కోరుకొనుమన్నాడు. వెంటనే చిలుక 'స్వామి! ఈ చెట్టుకు పూర్వవైభవాన్ని అనుగ్రహించుము' అని కోరింది. ఆ విధంగా ఆశ్రితురాలివలన ఆ చెట్టుకు మేలు జరిగింది. ఇది ఆశ్రిత లక్షణం అని చెప్పాడు భీష్ముడు.

అలాంటప్పుడు, యజమానులు ఆశ్రితులలో ఎవరిని ఎట్లా ఆదరించాలని అడిగాడు ధర్మరాజు.  జవాబుగా భీష్ముడు ఇలా అన్నాడు: ‘రాజు బ్రాహ్మణుడిని గౌరవించి, కొడుకులాగా కాపాడాలి. గురువులాగా గౌరవించాలి. అగ్నిలాగా పూజించాలి. బ్రాహ్మణజాతికి అవమానం చేస్తే పూర్వం చేసిన పుణ్యం నశిస్తుందని ఋగ్వేదం చెప్పింది. అతడిని అవమానిస్తే ఆపద కలుగుతుంది. బ్రాహ్మణులకు చేసే దానం, జపం, హోమం మొదలైనవి వైదిక కర్మలకంటే ఎక్కువని యజుర్వేదం చెప్పింది. ఒక నెల బ్రాహ్మణుడిని పూజిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని సామవేదం చెప్పింది. బ్రాహ్మణుడిని చూసి ఆదరించకుండా వుంటే అంతకంటే ఎక్కువ ఆపద లేదని అధర్వణవేదం చెప్పింది. వ్యాసమహర్షి శల్యుడితో జ్ఞానాలలో ఉత్తమ జ్ఞానమేది అనే అంశాన్ని వివరిస్తూ యజ్ఞమూర్తి విష్ణువు, అతడిని తెలియటమే ఉత్తమ జ్ఞానం అని అన్నాడు. ఆ విష్ణువే శ్రీకృష్ణుడు. ఆశ్రితుడైన శ్రీ కృష్ణుడే ఆశ్రయించదగిన పరమజ్ఞానమని తెలియటం ఉత్తమ జ్ఞానం. అదియే బ్రాహ్మణత్వ సిద్ధికి ఫలం అని చెప్పాడు’.

మహాత్ముడైన గరుత్మంతుడి కథనువినాలని వుందని, దానిని చెప్పుమని తాత భీష్ముడిని ప్రార్థించాడు ధర్మరాజు. భీష్ముడు చెప్పటం ప్రారంభించాడు ఇలా: ‘కశ్యప ప్రజాపతికి కద్రువ, వినత అనేవారు ఇద్దరు భార్యలు. భర్త వలన కద్రువ వేయిమందినీ, వినత ఇద్దరినీ కొడుకులుగా వరాలు పొందారు. తరువాత కద్రువకు వేయి, వినతకు రెండు గుడ్లు కలిగితే వారు వాటిని కుండలలో పెట్టి కాపాడుతున్నారు. 500 సంవత్సరాలు గడచిన తరువాత కద్రువ పెట్టిన గ్రుడ్లనుండి వేయి పాములు పుట్టాయి. వినత గ్రుడ్లు పగలనేలేదు. ఆమె అసూయతో ఒక గ్రుడ్డును పగులగొట్టింది. అందులోనుండి అవయవాలు సరిగ్గా ఏర్పడకుండా, సగం శరీరం గల అరుణుడు పుట్టి, తల్లి తొందరపాటుకు కోపించి, ఆమె కద్రువకు దాసి అయ్యేటట్లు శపించాడు. శాపానికి తల్లి బాధపడుతుంటే కొడుకు చింతించి, తన శాపం సృష్టికర్త సంకల్పం వల్ల వచ్చిందని, భయపడవద్దని ధైర్యం చెప్పాడు.  

‘ఆ తరువాత 500 సంవత్సరాలకు రెండవ అండం నుండి మహా బలవంతుడు, రెక్కలు కలవాడిన గరుత్మంతుడు జన్మించాడు. అతడు పుట్టి, తల్లికి దాస్యవిముక్తి చేస్తాడని అంతకు ముందే పుట్టిన అరుణుడు అనుగ్రహించాడు. గరుత్మంతుడు మహాబలశాలిగా పుట్టి స్వేచ్చగా అంతరిక్షంలో తిరుగుతూ బ్రహ్మ సూచించిన ఆహారాన్ని గ్రహిస్తూ ఉన్నాడు. గరుత్మంతుడు పుట్టినదాకా తల్లిని కాపాడుకుంటూ వున్న అరుణుడు ఆ తరువాత సూర్యుడిని సేవించటానికి వెళ్ళాడు. ఒకనాడు కద్రువ, వినతలు విహారార్థం సముద్రతీరానికి పోయి అక్కడ ఉచ్చైశ్రవాన్ని (ఇంద్రుడి గుర్రాన్ని) చూశారు. ధవళకాంతులతో వెలుగొందుతున్న ఆ ఇంద్రాశ్వాన్ని చూచి వినత ఆశ్చర్యాన్ని ప్రదర్శించింది. కద్రువ ఆ గుర్రం తోక నల్లగా ఉన్నది కదా! అని అన్నది. వినత దానికి అంగీకరించలేదు.  తోక నల్లగా ఉంటే వినత కద్రువకు దాస్యం చేసేటట్లు పందెం వేసికొన్నారు’.

‘ఆనాడు పతిసేనకు సమయం కావటంతో ఇంటికి వెళ్ళి, మరునాడు ఉదయ వచ్చి సత్యాసత్యాలు నిరూపించుకొనాలని నిశ్చయించుకొన్నారు. ఆ రాత్రి కద్రువ కుటిలబుద్ధితో కొడుకులతో కుతంత్రం చేసింది. కొడుకులను తోకకు వ్రేలాడి అది నల్లగా తోచేట్లు చేయండని అడిగింది. చాలామంది అది అన్యాయమని భావించి తల్లి ఆనతిని తిరస్కరించారు. వారిని జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో హతులయ్యేట్లు కద్రువ నిర్దాక్షిణ్యంగా శపించింది. ఆ శాపానికి భయపడిన కొందరు నాగులు తల్లి మాటను పాటించి ఉచ్చైశ్రవ వాలానికి నల్లగా వ్రేలాడి నిలిచారు. వినత కద్రువకు దాసిగా ఉండవలసి వచ్చింది. సవతిని హీనంగా చూస్తూ దాస్య వృత్తిని చేయించుకొనేది కద్రువ. వినత గరుత్మంతుడివలన తనకు దాస్య విముక్తి కలుగుతుందని ఆశతో కాలం గడపసాగింది’.

‘ఒకనాడు నారదుడివలన ప్రబోధితుడై గరుత్మంతుడు మాతృదాస్యాన్ని తొలగించటానికి పూనుకొని కద్రువ వద్దకు వచ్చి వేడుకొన్నాడు. అమృతాన్ని తెచ్చి మాతృదాస్య విముక్తి చేసికొమ్మని కద్రువ గరుత్మంతుడిని ఆజ్ఞాపించింది. అమృతాన్ని తెస్తానని శపథం చేసి గరుత్మంతుడు వెంటనే కశ్యప ప్రజాపతి వద్దకు వెళ్ళి ఉపాయాన్ని కోరుకొన్నాడు. ఇంద్రుడు అమృతాన్ని భద్రంగా రక్షిస్తుంటాడని, జలం మధ్య అగ్ని మండుతూ ఉండగా తీవ్రమైన ఆయుధాలతో భయంకర రాక్షసులు రక్షిస్తుండగా ఇనుప వలలో అమృతం సురక్షితంగా ఉంటుందని, దానిని సాధించటం దేవతలకైనా సాధ్యం కాదని, దానిని సాధించాలంటే గరుత్మంతుడు ఏంచేయాల్నో చెప్పాడు కశ్యప ప్రజాపతి.

‘తూర్పు సముద్రం చెంత ఉండే మహా పర్వతం మీద రెండు మహా గజ కచ్చపాలున్నాయి. ఆ రెండూ పూర్వకాలంలో మధుకైటభులు. పరస్పరం ఘర్షణపడుతుంటాయి. ఆ సందర్భంలో ఆ రెండింటినీ పట్టి భక్షిస్తే కలిగే బలంవలన గరుత్మంతుడు అమృతాన్ని హరించగలడని కశ్యపుడు సూచించాడు. గరుత్మంతుడు తన వాడి గోళ్ళతో ఆ గజ కచ్చపాలను పట్టి ఆకాశానికి ఎగిరి, ఐదు యోజనాల పొడవున ఉన్న ఒక మహావృక్షశాఖ మీద వాలాడు. ఆ బరువుకు ఆ కొమ్మ విరిగింది. ఆ కొమ్మ మీద మహామునులు తపస్సు చేసుకుంటున్నారు. అందువలన ఆ కొమ్మ కిందపడకుండా ముక్కుతో పట్టుకొని గరుత్మంతుడు ఎగిరాడు. మునులు ఆ మహాత్ముడి మహిమను చూచి కొమ్మనుండి దిగిపోయారు. ఆ కొమ్మను దురాచారాలతో అపవిత్రమైన కులింద దేశ సముద్ర ప్రాంతంతో వదలుమని ఆకాశవాణి చెప్పింది.

‘గరుత్మంతు డాపని చేసి, ఒక మహాగిరి శిఖరం మీద విశాల ప్రాంతంలో గజకచ్ఛపాలను భక్షించి మహాబలోపేతుడై అమృతమున్న స్థానానికి చేరాడు. దాని చుట్టూ మండుతున్న అగ్నిని దాటడానికి ఉపాయం కొరకు బ్రహ్మను ఆశ్రయించాడు. కొండంత వెన్నను అగ్నిపై ఉంచుమని పితామహుడు ఉపాయం చెప్పాడు. సప్రయత్నంగా వెన్నను సంపాదించి అగ్నిపై ఉంచి దాని ఉద్దృతి తగ్గటంతో అమృతభాండంపై లంఘించాడు. ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించినా అది విఫలమైపోవటంతో అతడు విముఖుడయ్యాడు. గరుత్మంతుడు అమృతాన్ని తెచ్చి కద్రువ ముందు పెట్టి తల్లి దాస్యానికి విముక్తి కలిగించాడు. అమృతం తేవటమే నియమం కాబట్టి తెచ్చి కద్రువకు చూపించి, మరల ఆ అమృతాన్ని ఇంద్రుడికి అప్పగించి గరుత్మంతుడు దేవతల మన్ననలను పొందాడు. పాములపై పగ సాధించాడు’.

ఇలా గరుత్మంతుడి కథ వినిపించిన భీష్ముడు, ఆయన్ను అంతా ప్రశంసించారని, ఇంద్రుడు గరుత్మంతుడిని సాక్షాత్ విష్ణువుగా కీర్తించి, భవిష్యత్కాలంలో యదువంశంలో శ్రీకృష్ణుడుగా అవతరించి లోకకల్యాణం నిర్వహిస్తాడని ప్రకటించాడని చెప్పి, ఆయన కథ విన్న ధర్మరాజుతో ఆ కథ ముక్తికి సోపానమని, గొప్ప ఆనందాన్ని కలిగిస్తుందని అన్నాడు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఆనుశాసనిక పర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ) 

No comments:

Post a Comment