Sunday, May 7, 2023

నిర్వచనాలకు అతీతం, నిగూఢం విష్ణువు నామాలు- నిష్కామత్వం ధర్మాలలో ఉత్తమ ధర్మం .... ఆస్వాదన-119 : వనం జ్వాలా నరసింహారావు

 నిర్వచనాలకు అతీతం, నిగూఢం విష్ణువు నామాలు-

నిష్కామత్వం ధర్మాలలో ఉత్తమ ధర్మం

ఆస్వాదన-119

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (08-05-2023)

నిర్వచనాలకు లొంగని గూఢములైన విష్ణువు నామాల గురించి పూర్వం అర్జునుడు అడుగగా విష్ణువు తన నామాలను నిర్వచించి, నారాయణాది నామాల వ్యుత్పత్తులను చెప్పాడు. అర్జునుడు, తాను నరుడు-నారాయణుడు అనే నిత్యపురుషులమని, లోకహితం కోరి భూలోకంలో జన్మించామని అంటూ అతి నిగూఢమైన తన నామధేయాల అర్థాలను విశదపరుస్తానని చెప్పాడు. నారములు అంటే నీళ్లని, ఆయనం అంటే నివాసమని, తనకు నారములు  ఆయనం కాబట్టి ప్రజలంతా తనను నారాయణుడు అంటాడని అన్నాడు. తాను జగత్తులన్నింటా వుంటానని, అన్ని జగత్తులూ తనలోనే వుంటాయని, అందువల్ల తనను వాసుదేవుడని అంటారని చెప్పాడు. రోదసీకుహరంలో తానే పిక్కటిల్లి వుంటానని, మిగతా జగత్తంతా ఆక్రమించి ఉన్నవాడిని తానేననీ, ఆ కారణాన తనకు విష్ణువు అన్న పేరు ప్రసిద్ధికెక్కిందని అన్నాడు.

దమం అనే ఉత్తమ లక్షణం వున్న సజ్జనులు తనను ధ్యానిస్తూ వుంటారని, ఊర్ధ్వలోకం, భూలోకం తన ఉదరంలోనే వుంటాయని, ఆ రెండు కారణాలవల్ల తనకు దామోదరుడు అన్న పేరొచ్చిందని విష్ణువు చెప్పాడు అర్జునుడికి. పృశ్ని అన్న పేరున్న అన్నం, జలం, అమృతం, వేదం తన గర్భం కాబట్టి తనను పృశ్నిగర్భుడు అని పిలుస్తారన్నాడు. ఇంకా ఇలా అన్నాడు:

‘సూర్య కిరణాలు, చంద్ర కిరణాలు, అగ్నిజ్వాలలు నాకు కేశవసమూహం కాబట్టి నన్ను కేశవ నామంతో స్తుతిస్తారు. సూర్య-చంద్ర రూపాలలో నేను ఎల్లవేళలా ప్రపంచానికి మేలు చేయడం వల్ల నాకు కొన్ని నామదేయాలు ఏర్పడ్డాయి. నన్ను వరదుడు, లోకభావనుడు, ఈశ్వరుడు, హృషీకేశుడు అని అంటారు. యాగాలలో భాగాలు ఆహరిస్తాను కాబట్టి నన్ను హరి అని అంటారు. గోవిందుడు అని, శిపివిష్టుడు అని, కృష్ణుడు అని, సత్యుడు అని, అజుడు అని, అధోక్షజుడు అని నాకు పేర్లు ఏర్పడ్డాయి. నేను ఎప్పుడూ సత్త్వగుణాన్ని వదలను కాబట్టి సాత్త్వతుడు అంటారు. అలాగే చ్యుతం లేనివాడిని కాబట్టి అచ్యుతుడు అని, జీవుల శరీరానికి ధారకం కాబట్టి త్రిధాతువు అని పిలుస్తారు. నన్ను ఘృతార్చి అని, వృషుడు అని, అనాది, అనంతుడు, అమధ్యుడు, శుచిశ్రవుడు, ఏకశృంగుడు, విరించి, కపిలుడు అని కూడా అంటారు. హిరణ్యగర్భుడు అని, ధర్మజుడు అని కూడా పిలుస్తారు’.         

‘గంధమాదన పర్వతంమీద నేను (విష్ణువు) తపస్సు చేస్తున్నప్పుడు దక్షప్రజాపతి యాగం చేస్తున్నాడు. ఆ యాగానికి శివుడు కోపించాడు. దానికి యజ్ఞం భయంతో హడలిపోయి నా వక్షః స్థలాన్ని ఆశ్రయించింది. ఆ కారణంవలన నా రోమాలు ముంజగడ్డివలె మారాయి. అందువల్ల నాకు ముంజకేశుడు అన్న పేరొచ్చింది. యజ్ఞాన్ని వెన్నంటి వస్తున్న శివుడు నాతో కలియబడ్డాడు. శివుడు గొడ్డలి రూపంలోని బాణాన్ని ప్రయోగించాడు. నేనొక బాణాన్ని పరశురూపంలో ప్రయోగించగా శివుడు దాని అంచును ఖండించాడు. అందువలన ఖండపరశువు అనే పేరు నాకు సిద్ధించింది’.

శివకేశవుల మధ్య ఏర్పడిన ఆ యుద్ధంలో ఎవరు గెలిచారో చెప్పమని అర్జునుడు అడిగాడు. శ్రీకృష్ణు డిట్లా చెప్పాడు. శివకేశవుల యుద్ధం భయంకరమై లోకాలకు సంక్షోభం కలిగించింది. బ్రహ్మాది దేవతలు రణరంగానికి వచ్చి వారిరువురిని స్తుతించి, శివకేశవ అభేదాన్ని స్మరించారు. వేదవేద్యమూ, అద్వంద్వమూ, నిర్గుణమూ, అమూర్తమూ అయిన మూలతత్వం ఒకటే అయినా, లోకం కొరకని రెండు రూపాలు ధరించి శివకేశవు లనబడుతున్నారు కాని, నిజానికి శివకేశవులకు భేదం లేదని బ్రహ్మాదులు కీర్తించారు. శివకేశవులు తమ మైత్రి చిహ్నాలను ధరించారు. శ్రీవత్సం త్రిశూలానికి ప్రతీక. శివుడి కంఠం పై నీలిమ విష్ణువుచేతి ముద్ర. ఈశానుడూ, అభవుడూ, అమృతుడూ అయిన శివరూపాలుకూడా ఆరాధ్యాలే. హరిహరాత్మకుడైన కృష్ణుడు రక్షించాడు కాబట్టి కురుసంగ్రామంలో అర్జునుడికి విజయం లభించింది. కృష్ణుడుగా విష్ణువు నొగలెక్కి రక్షించాడు. అగ్రభాగంలో శూలపాణిగా రుద్రుడు సంచరిస్తూ అర్జునుడికంటే ముందే శత్రువులను సంహరించాడు.

ఆ తరువాత ధర్మరాజు భీష్మ పితామహుడిని రకరకాల ప్రశ్నలడిగాడు. అన్నిటికీ ఓపిగ్గా జవాబు చెప్పాడు భీష్ముడు. విష్ణువు హయగ్రీవ రూపం ఎందుకు ధరించాడని అడగ్గా ఇలా చెప్పాడు. ‘ప్రళయకాలంలో విష్ణువు యోగనిద్రలో మునిగి, జగత్తులను మరలా సృష్టించాలని సంకల్పించాడు. వెంటనే అహంకారం ఆవిర్భవించింది. దానికి బ్రహ్మ అనే పేరు ఏర్పడింది. బ్రహ్మ నాలుగు వేదాలను సృష్టించాడు. విష్ణువునుండి వెలువడిన త్రిగుణాలలో సత్త్వగుణంలో బ్రహ్మ ఉండిపోయాడు. రజస్తమోగుణాల నుండి మధు కైటభు లనే రాక్షసులు పుట్టారు. వారు నాలుగు వేదాలనూ అపహరించుకొనిపోయి కట్టగా కట్టి పాతాళంలో పారవేశారు. వేద రక్షణకై బ్రహ్మదేవుడు విష్ణువును స్తుతించాడు. ఆయన హయగ్రీవ రూపంతో వేదాన్వేషణం చేసి పాతాళంనుండి వేదాలను ఉద్ధరించి బ్రహ్మకు అందించాడు. మధుకైటభులు విష్ణువు పై దండెత్తారు. ఆతడు ఆ వేదకంటకులను సంహరించాడు. విష్ణుమూర్తి తత్త్వం బహువిచిత్రంగా ఉంటుంది. గుణవంతుడూ, గుణరహితుడూ, గుణ స్రష్ట, గుణహర్తా, గుణనిబద్దుడూ, గుణవిముక్తుడూ, అన్నీ ఆయనే. వేదాలూ, యజ్ఞాలూ, సకల పుణ్యకార్యాలూ, పంచభూతాలూ, అన్నీ నారాయణ స్వరూపాలే’ అని అన్నాడు భీష్ముడు.

మరో సందేహానికి సమాధానం ఇస్తూ, హరి అన్నా క్షేత్రజ్ఞుడన్నా ఒకడేనని, విష్ణువు చతుర్వ్యూహాలలో దర్శనమిస్తాడని, విష్ణువు ప్రథమ వ్యూహం వాసుదేవావతారమని, ద్వితీయవ్యూహం సంకర్షణుడని, తృతీయవ్యూహం ప్రద్యుమ్నుడని, చతుర్థవ్యూహం అనిరుద్ధుడని, విష్ణువు ఇంద్రియాలకు గోచరం కాడని, అద్వితీయమైన భక్తివలననే అతడు సాధ్యుడని, భక్తి కుదరాలంటే తపస్సూ, ఇంద్రియ నిగ్రహం ఉండాలని చెప్పాడు.

పరాశరపుత్రడైన వేదవ్యాసుడికి నారాయణ పుత్రు డనే ప్రఖ్యాతి ఎట్లా ఏర్పడిందని ప్రశ్నించాడు ధర్మరాజు. సమాధానంగా భీష్ముడు ఇలా చెప్పాడు. ‘ఆదికాలంలో శ్రీమన్నారాయణుడు ప్రజా సృష్టిచేయటం కొరకు నాభికమలంనుండి బ్రహ్మను సృష్టించాడు. ఆయన సకల భూతాలనూ సృష్టించాడు. బ్రహ్మముఖంనుండి వేదాలు ప్రసరించాయి. ఆ వేదాలకు మేలు చేయటం కొరకు అపాంతరతముడనే పేరుగల ఒక మహాజ్ఞానిని పుత్రుడిగా పొందాడు. అతడిని ఏకాగ్రతతో వేదాలను అధ్యయనం చేయుమనీ, వాటిని అందంగా విభజించమనీ ఆజ్ఞాపించాడు. అపాంతరతముడాపని చేశాడు. దానికి విష్ణువు సంతోషించి అతడిని తనకు పుత్రుడవై మన్వంతరాలన్నింటిలోనూ అత్యధికంగా ప్రకాశించమని అన్నాడు. అపాంతరతముడికి మరికొన్ని జన్మలు లభిస్తాయని, తన కథలూ, ముల్లోకాలలో ఆచరించవలసిన విధులు, అఖిల ధర్మాలూ మనస్సులో దర్శించి త్రికాలజ్ఞుడిగా మహర్షులలోకెల్లా ఉత్తముడుగా విరాజిల్లమని,  భవిష్యత్కాలంలో అతడు పరాశరుడికి పుత్రుడుగా పుట్టి ప్రకాశిస్తాడని చెప్పాడు.

ఇంకా ఇలా అన్నాడు శ్రీమన్నారాయణుడు: ‘నీ వలన జన్మించిన వారే కురుసామ్రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఆ రాజులు పరస్పర రోషాలతో యుద్ధానికి దిగుతారు. వంశ వినాశనం ఔతుంది. కాలదోషంవలన వేదాలు సంకీర్ణమౌతాయి. వాటిని నీ బుద్ధి వైభవంతో మరల నాలుగుగా విభజిస్తావు. దేవతలకూ, ఋషులకూ ఆనందం కలిగిస్తావు. ధర్మసందేహాలన్నీ నీ వాక్కులతో తీరుతాయి. నిన్ను అఖిల సంశయవిచ్ఛేదకు డనీ, పుణ్మాత్ము డనీ, లోకహితవాణి అని ప్రజలు కీర్తిస్తారు. నీవు విరాగివి కాలేవు. కాని, ఒక విరాగి నీకు కుమారుడుగా జన్మిస్తాడు. శాస్త్రాలనూ, ఆగమాలనూ, అనుసరించే బుద్ధితోపాటు నీ అంతరంగంలో సాంఖ్యయోగాలు కూడా వికసిస్తాయి' అని చెప్పి నారాయణుడు అంతర్ధానుడైనాడు. అట్లా పరాశరపుత్రుడు ఆదినుండి నారాయణపుత్రుడే అని భీష్ముడు అన్నాడు.

రాజనీతి మొదలుకొని అన్ని ధర్మాలూ చెప్పావు తాతా అంటూ, వీటిలో ఏది ఉత్తమ ధర్మమో వివరించమని వేడుకున్నాడు ధర్మరాజు భీష్ముడిని. జవాబుగా భీష్ముడు ఇలా అన్నాడు.

‘ధర్మశాస్త్రాలలో చెప్పేవన్నీ పనికివచ్చేవే. ఒక్కటి కూడా పనికిరానిది లేదు. ఎవరికి నచ్చిన ధర్మశాస్త్రాన్ని వారు అనుసరిస్తారు. అదే వారి కోరికలు పండటానికి దోహదం చేస్తుంది. తమకు తగిన ధర్మాలను అనుసరించే వారిని లోకంలో ఎంతమందిని మనం చూడటం లేదు? త్రిలోక సంచారి అయిన నారదుడిని ఒకసారి ఇంద్రుడు “నారదా! నీవు తిరిగిన చోటులలో ఏదైనా అద్భుతం చూచావా?” అని అడుగగా మహాపద్మనగరంలో వసించే భృగుడనే విప్రుడి కథ చెప్పాడు. ఈ పుణ్యోపాఖ్యాన సారంవలన తెలియదగిన అంశాలు గురించి వివరిస్తాను.

‘బ్రహ్మచర్యం ద్వారా కొందరూ, గృహస్థధర్మాచరణం ద్వారా కొందరూ, తపస్సుతో కొందరూ, నిష్కర్మత్వంతో కొందరూ, యజ్ఞాలద్వారా కొందరూ, దానధర్మాల ద్వారా కొందరూ ఆత్మదర్శనం పొందుతూ ఉంటారు. తల్లిదండ్రులను సేవించి కొందరూ, భక్తితో కొందరూ, సచ్ఛీలంతో కొందరూ, శాంతస్వభావంతో కొందరూ, ఇంద్రియ నిగ్రహంతో కొందరూ, సత్యవాక్య నియమంతో కొందరూ, అహింసావ్రతంతో కొందరూ, ఇట్లా ప్రజలు వేరే వేరే మార్గాలలో ముక్తి పదం పొందుతారు. గురువుపట్ల భక్తి శిష్యులకు వ్రతం. వేదతత్పరత బ్రాహ్మణులకు వ్రతం. లోకరక్షణ రాజులకు వ్రతం. న్యాయంగా ధనం సంపాదించటం వైశ్యులకు వ్రతం. పై మూడు వర్గాలవారినీ సేవించటం శూద్రులకు వ్రతం. రాజాజ్ఞను శిరసావహించటం భటులకు వ్రతం. సర్వాశ్రమాలవారికీ ఉపకారం అందించే గృహస్థాశ్రమం మీద ప్రేమ అందరికీ వ్రతం. వైరాగ్యబుద్ధి యోగికి వ్రతం. పాతివ్రత్యం భార్యకు వ్రతం’.

‘మౌనంవలన జ్ఞానమూ, దానంవలన అభ్యుదయమూ, ఆశలు తీర్చినందువలన నరకాలు, తప్పిపోయిన సుఖమూ లభిస్తాయని పెద్దలు చెప్పుతారు. క్రోధం కారణంగానే కార్తవీర్యార్జునుడు పరశురాముడి చేతిలో మరణించాడు. క్రోధం కారణంగానే దశకంఠుడు దశరథరాముడి చేతిలో సమసిపోయాడు. ఇంకా చాలా మంది కోపంవలన దెబ్బతినినవారు ఉన్నారు. కాబట్టి కోపాన్ని వదలుకొనటం ఎవరికైనా ఎప్పటికైనా మేలు. అద్భుతాల కన్నింటికీ నిలయం సూర్యుడే. అతడినుండే సకల ప్రాణికోటీ జన్మిస్తున్నదంటే ఇంతకంటే ఆశ్చర్యం ఏమి ఉంటుంది? వాలఖిల్యాది ఋషులూ, సిద్ధులూ, దేవతలూ, అందరూ సూర్యుడి కిరణాలలోనే - చెట్టు కొమ్మమీద పిట్ట లున్నట్లు - నివసిస్తూ ఉంటారు. ఇది అద్భుతం కాదా!’

‘సూర్యగోళం నుండి వెలువడే వాయువు గోళం మధ్యలో ఉండే దట్టమైన కాంతితో కలిసి వర్షం కురుస్తుంది. ప్రపంచంలో ఎక్కడయినా ఇట్లాంటి అద్భుతాలు ఉన్నాయా? సూర్యుడే వర్షాలు కురిపిస్తాడు. మళ్ళీ అతడే తన కిరణాలతో నీటినంతటినీ వెనుకకు లాగి కొంటాడు. సూర్యుడివలననే విత్తనాలు భూమిలో మొలకెత్తుతున్నాయి. పరాత్పరుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలంలోనే ప్రకాశిస్తుంటాడు. ఇంతకంటే ఆశ్చర్య మేముంది? ఉంఛవృత్తి ఉత్తమోత్తమ వ్రతం. ఉంఛవృత్తితో జీవించేవాడూ, నిశ్చలమైన మనస్సు కలవాడూ, నిష్ఠతో కూడిన నియమాలు కలవాడూ, కందమూలఫలోదక మారుతాలు మాత్రమే ఆహారంగా స్వీకరించేవాడూ, నిరాకాంక్షుడూ, సర్వభూతహితం కోరేవాడూ, మునీశ్వరుడూ అయిన మహానుభావుడు పరమాత్మతో అద్వైత సిద్ధి పొందుతాడు. ఇది అత్యద్భుతం. సర్వసమతా దృష్టి తత్త్వదర్శనం. సమస్త భూతాలపట్ల సమదృష్టి, ఆదృష్టితో కూడిన నిష్కామత్వం ధర్మాలలో కెల్ల ఉత్తమ ధర్మం. నిరతిశయానందానికి అది నిలయం’ అని అన్నాడు భీష్ముడు.

భీష్ముడి ఉపదేశం పొందిన ధర్మరాజు అనుభూతి అద్భుతం.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, షష్టాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

No comments:

Post a Comment