రామచంద్రుని కల్యాణం ..... ‘ప్రవరోపాఖ్యానం’, భద్రాచలంలో మారని తీరు
వనం
జ్వాలా నరసింహారావు
దర్శనమ్
ఆధ్యాత్మిక వార్తామాస పత్రిక ( మే నెల, 2023)
‘వామాంకస్థిత జానకి’, లక్ష్మణ
సహిత శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చే, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో,
కళ్యాణ మండపం మీద, మార్చ్ 30 వ తేదీన, శ్రీరామ నవమినాడు, శ్రీసీతారామచంద్ర కల్యాణం
వైభవంగా జరిగింది. ఈ శ్రీ సీతారాముల కళ్యాణానికి యావత్ దేశం నలుమూలల నుండి పెద్ద
సంఖ్యలో భక్తులు ఎప్పటిలాగే హాజరయ్యారు. భద్రాద్రి రామయ్య కల్యాణంలో, తానీషా కాలం
నుండి మొదలైన ముత్యాల తల్రంబాలు, పట్టు వస్త్రాలను ప్రభుత్వ పరంగా తెచ్చే
సాంప్రదాయం, దేవస్థానం దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లిన తరువాత
కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్పించడం కొనసాగుతున్నది. అయితే, కొంతకాలంగా అశేష జనవాహిని మధ్య, ఆహుతులైన అధికార, అనధికార దిగ్గజాల సమక్షంలో, భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణం చూద్దామని
ఆశించి వచ్చినవారిని మభ్యపెట్టుతూ, ఒకవైపు ఆసాంతం
శ్రీరామచంద్రుడు, సీతాదేవి అంటూనే,
అర్చక మహాశయులు, మధ్య మధ్యలో శ్రీరామచంద్రుడి స్థానంలో ‘రామనారాయణుడు’ని, సీతాదేవి స్థానంలో సీతామహాలక్ష్మిని పేర్కొంటూ, క్షత్రియుడిని
బ్రాహ్మణుడిగా మారుస్తూ, ప్రవర చెప్పడానికి కారణం ఏమిటి?
కళ్యాణ మండప ప్రవేశం కాగానే, మండపం మీద వేంచేపు
చేస్తున్నది ‘సీతారామచంద్ర కళ్యాణ మూర్తులు’ అనీ, ‘భద్రాద్రిరామం బజేహం బజేహం’ అనీ, ‘కళ్యాణరామంభజే’’
అనీ, మొదట్లో స్పష్టంగా చెప్పారు అర్చక మహాశయులు. సంకల్పం
చెప్తూ: శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా, ప్రవర్తమానస్య, అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే,
శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే,
జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, గంగా గోదావర్యోర్మద్యదేశే, దండకారణ్యే ‘భద్రాచల శ్రీరామ క్షేత్రే’
అస్మిన్ తిరుకళ్యాణ మండపే భగవత్ భాగవతాచార్య సభా సన్నిదౌ.... శోభకృత్ నామ సంవత్సరే,
ఉత్తరాయణే, వసంతఋతౌ, చైత్ర మాసే, శుక్లపక్షే, ‘శ్రీరామనవమ్యా’ .... ‘పునర్వసూ
నక్షత్రే’...... ‘భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినా’
...... తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే ...... శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య ‘శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర
స్వామినా’ ...... నవాహ్నిక
ద్వజారోహణ తిరుకళ్యాణ మహోత్సవ ఖేకర్మణీ
అహ్నిక తృతీయ దివసే.. ‘శ్రీసీతారామ తిరుకళ్యాణ మహోత్సవం’ కరిష్యే, అని శ్రీరాముడిని, సీతను స్పష్టంగా మరీ మరీ పేర్కొన్నారు అర్చక
మహాశయులు. బాగుంది.
పుణ్యహ వాచన కార్యక్రమంలో కూడా ‘భద్రాచల శ్రీ సీతా
లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినా’ అనీ, కళ్యాణం ప్రారంభం చేస్తూ ‘శ్రీరామచంద్ర
స్వామినే నమః’ అనీ, ‘శ్రీమద్ అఖిలాండకోటి
బ్రహ్మాండనాయకస్య శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినాః
తిరుకళ్యాణ మహోత్సవ’ అనీ చెప్పారు. ఇక ఆ తరువాత రాగం, పల్లవి, తాళం మారింది. అర్చక స్వాముల మనోగతం స్పష్టంగా వెల్లడైంది. వింతపోకడలు
పోవడం ఆరంభం అయింది!!! ఇంతవరకూ అర్చకులకు భద్రాద్రి క్షేత్రంలో కనిపించిన శ్రీరామచంద్రమూర్తి
స్వామి, సీతాదేవి అమ్మవారు కన్యావరణం మొదలెట్టగానే, ఒకింత అదృశ్యమైపోయి, అక్కడి నుండి రామనారాయణుడు,
సీతామహాలక్ష్మి దర్శనం ఇవ్వడం ఆరంభం
అయింది. వారి ప్రవరలు, గోత్రాలు, చెప్పారు.
వింతగొలిపే ఆ కథా కమామీషు ఏమిటో తెలుసుకుందాం.
లక్ష్మికి జరిగే కళ్యాణం, కణ్యావరణం, అని మొదలైంది. “బృవంతే,
అనంత వేధాద్యాయినే, అచ్యుత పరబ్రహ్మనే, ఆదినారాయణాయా, నిరాకార సాకారా, పరవ్యూహా విభావంతర్యామ్య, యజ్ఞ్వతార పంచార్షేయ ప్రవరాన్విత,
అచ్యుత గోత్రోద్భావయా, పరబ్రహ్మ శర్మణ నప్త్రే, ..... వ్యూహనారాయణ శర్మణ పౌత్రాయా,
.... విభవ వాసుదేవ శర్మణ పుత్రాయా, అనంతవేధాధ్యాయినే, అచ్యుత పరబ్రహ్మనీ, ఆది నారాయణయా, నిరాకార సాకారా పరవ్యూహా విభావంతర్యామ్య యజ్ఞ్నావతార
పంచార్షేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భావయా....భద్రాచల ‘శ్రీరామనారాయణ
స్వామినే’ వరాయా”, అని రామనారాయణ స్వామిని శ్రీరామచంద్రుడి స్థానంలోకి
తెచ్చారు!!! క్షత్రియుడైన శ్రీరాముడు ‘అచ్యుత గోత్రం’ తో బ్రాహ్మణుడిగా రామనారాయణుడిగా క్షణంలో మారిపోయాడు?
అదేవిధంగా సీతాదేవి స్థానంలో సీతామహాలక్ష్మిని తెచ్చి, ప్రవర
మార్చారు. సౌభాగ్య గోత్రం ఇచ్చేశారు? “చతుర్వేధాధ్యాయినీ, సౌభాగ్య విశ్వంభరీ, నిరాకార సాకారా, చతుర్వీశ్వర త్రయార్షేయ ప్రవరాన్విత
సౌభాగ్య గోత్రోద్భవాయ, విశ్వంభర శర్మనో నప్త్రీ, ..... రత్నాకర శర్మణ పౌత్రీ, ..... క్షీరార్న శర్మణ పుత్రీ, చతుర్వేధాధ్యాయినీ, సౌభాగ్య విశ్వంభరీ, నిరాకార సాకారా చతుర్వీశ్వర త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా, ‘శ్రీ
సీతామహాలక్ష్మీ’ నామ్మీ, హిమాం కన్యాం, వృణీధ్వం,
వృణీమహే, ధాస్యామి” అన్నారు. అంటే, సీతామహాలక్ష్మిని రామనారాయణుడికి
ఇచ్చి కన్యాదానం చేసేస్తున్నారు. ఇది భక్త రామదాసు కాలం నుండి పరంపరగా వస్తున్న
ఆచారం కాదే!!!
కాసేపటికే మళ్లీ తీరు మారింది. యజ్ఞోపవీత ధారణం, వరపూజ, మధుపర్కం,
స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించడం జరిగింది. అప్పుడు కూడా, ‘చాలామంది
భక్తులు రామచంద్ర స్వామికి వస్త్రాలు సమర్పిస్తున్నారు, అనే అన్నారు
కాని రామనారాయణ ప్రస్తావన రాలేదు. తదనంతరం, లోకాచార
క్రమంలో గవోత్సర్జన కార్యక్రమాన్నీ అర్చక
స్వాములు నిర్వహించారు. అంతే, మళ్లీ
మంత్రం వేసినట్లు రామనారాయణ ప్రస్తావన ఆగిపోయింది. శ్రీమద్ అఖిలాండకోటి
బ్రహ్మాండనాయకస్య ‘శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినా’
తిరుకళ్యాణ మహోత్సవ ఖే కర్మణీ, కన్యాదాన సమయే,
మహ సంకల్ప పఠనం కరిష్యే, అంటూ దాన్ని పఠిస్తామని సంకల్పించారు.
ఆ తరువాత, ఆశ్చర్యంగా శ్రీరామచంద్ర, సీతాదేవి అంటూనే గోత్రాలను మాత్రం అచ్యుత, సౌభాగ్య అని చెప్పారు. ‘లక్ష్మీం
క్షీరాబ్ధి తనయాం పాణినీ జనకాత్మాజ దాస్యామీ, లోకనాథయా, అరవిందాలయయా, ఇమాం అనేనా, కన్యాదానేనా, భగవాన్ సర్వాత్మకహ శ్రీరామచంద్రహా, సుప్రీతహా,
సుప్రసన్నహా, వరదహా భవతు, అచ్యుత గోత్రోద్భయా సాక్షాత్ శ్రీమన్నారాయణ
స్వరూపాయా, శ్రీరామచంద్ర స్వామినే వరాయా, సౌభౌగ్య
గోత్రోద్భావాం, సాక్షాత్ లక్ష్మీ స్వరూప శ్రీ సీతాదేవి నామ్నీమ్, ఇమాం కన్యామ్ ప్రధోస్యామీ, ప్రధాస్యామీ...’ అన్నారు. విళంభి సంవత్సరంలో
రాములవారు అవతరించానారని, ఈ సంవత్సరం (శోభకృతు) లో సీతమ్మ
వారు అవతరించినారని, అందుకే ఈ సంవత్సరం విశేషమని, గోత్రాలు
మార్చి చెప్తున్న అదే అర్చకులు అనడం అంటే, అక్కడ
జరుగుతున్నది సీతారాముల కల్యాణం అనేకదా? మరీ రామనారాయణుడు
ఎక్కడి నుండి అవతరించాడు?
చివరగా, కళ్యాణ కార్యక్రమంలో మాంగళ్యపూజను అర్చకులు
నిర్వహించారు. సాధారణంగా మంగళ సూత్రంలో పుట్టింటి పతకం ఒకటి, అత్తింటి పతకం ఒకటి,
మొత్తం రెండు పతకములు చూస్తామని, ఇక్కడ మూడు పతకాలతో సీతమ్మతల్లికి
మాంగళ్యాన్ని ధరింపచేస్తారని, ఆ మూడవ పతకం రామదాసుగారిదని, మాంగళ్యదారణ రామచంద్రప్రభువు శ్రీకరణముల మీదుగా
జరుగుతుందని, అంటూ, మాంగళ్యాలను
అర్చకస్వాములు ఆహుతులకు చూపించి, మాంగళ్యధారణ మూహుర్తోస్తూ, సుమూహుర్తోస్తూ...అంటూ
సీతమ్మతల్లికి ధరింపచేసారు. అంటే మళ్లీ సీతారాములు ప్రత్యక్షమయ్యారు అన్నమాట!!! మాంగల్య
ధారణలో రామనారాయణుడుని మరచిపోయారు.
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి వారి అనుగ్రహ భాషణంలో కూడా అనేక
పర్యాయాలు సీతారామచంద్ర మహారాజ్ అనీ, రాజారామచంద్ర మహారాజ్ అనీ,
శ్రీ రామచంద్ర ప్రభువు, సీతమ్మవారి కళ్యాణమహోత్సవ కార్యక్రమం
అనీ, రామదాసుగారు రామచంద్రుడ్ని ఇక్కడికి తీసుకొచ్చినారనీ, రామచంద్రుడు ఈ లోకంలోకి అర్చా
మూర్తిగా వచ్చాడనీ, అన్నారేకాని ఎక్కడా రామనారాయణ ప్రస్తావన తేలేదు.
ఇటీవలి కాలంలో, భద్రాచలంలో జరుగుతున్న శ్రీ సీతారామ
కళ్యాణోత్సవంలో అనూచానంగా చెప్పుకు వస్తున్న శ్రీరాముడి దశరథ ఆరంభ ప్రవరను,
సీతాదేవి ప్రవరను మార్చివేయడం పలువురిని ఆశ్చర్యపరుస్తున్నది,
ఆందోళనకు గురిచేస్తున్నది. అలాగే రామచంద్రమూర్తి పేరు మార్చి రామనారాయణ అని,
ప్రవరను మార్చి సీతారాములను లక్ష్మీనారాయణులుగా కల్యాణం జరిపించడం
విడ్డూరంగా కనిపిస్తున్నది. యావత్ దేశంలోని అన్ని రామాలయాలలో శ్రీ సీతారామ కల్యాణంలో
శ్రీరాముడి ప్రవర చదివేటప్పుడు వసిష్టస గోత్రులైన అజ, రఘు,
దశరథులను, సీతాదేవి ప్రవర చెప్పేటప్పుడు గౌతమస
గోత్రులైన నిమి, విదేహ, జనకరాజులను
చెప్పి కన్యాదానం జరిపిస్తారు. భద్రాచలంలో మాత్రం, ఒకవైపు
సీతారాముల కల్యాణం అంటూనే, మరోవైపు ప్రవర చెప్పేటప్పుడు రామనారాయణ,
సీతామహాలక్ష్మి అని చెప్పడం పరస్పర విరుద్ధం. భద్రాద్రిలో ఇటీవలి
కాలంలో, శ్రీ సీతారామ కల్యాణం జరగడం లేదని, లక్ష్మీనారాయణ కల్యాణం జరుగుతున్నదని, ఇది లోక
విరుద్ధమని, భక్తులను మోసం చేయడమేనని పలువురు
ప్రశ్నిస్తున్నారు. గోత్ర ప్రవరాలే కల్యాణానికి ప్రధానమని వారి వాదన.
శ్రీరాముడి జననం అయిన చైత్ర శుద్ధ నవమి నాడు భద్రాచలంలో
కల్యాణం జరుగుతున్నదని అంటే, ఆ జరిగేది శ్రీరాముడికే కదా! అంటే దశరథ
సుతుడికే కదా? అదీ సీతాదేవితోనే కదా? అలాంటప్పుడు,
దశరథుడుది, జనకుడిది గోత్రాలు, ప్రవర చెప్పడం న్యాయం కదా? మార్చాల్సిన అవసరం ఏమిటి?
శ్రీరాముడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడే, విష్ణుమూర్తి అవతారమే.
కాకపొతే, సీతాదేవి భర్త ఎవరని అడిగితే ఆబాలగోపాలం
ముక్తకంఠంతో శ్రీరాముడు అంటుంది కాని రామనారాయణుడు అని జవాబు రాదు కదా? మరో అసంబద్ధం ఏమిటంటే, క్షత్రియులైన సీతారాములను
పూజారులు బ్రాహ్మణులుగా మార్చి వేశారు. కళ్యాణ వేదిక మీద వున్న అర్చక మహాశయులంతా ఉద్దండ
పండితులు, సర్వం తెలిసిన బ్రాహ్మణోత్తములు, సకల శాస్త్రాలను అధ్యయనం చేసిన మహా మహానుభావులు. వేదవేదాంగ పారంగతులు. మరెందుకు
ఈ తప్పిదం జరగాలి? దీనికెవరు భాద్యులు?
దీన్ని ఎవరు సరిదిద్దాలి? ఒక పండిత చర్చ పెట్టి భద్రాచలంలో
వున్నది ‘రామనారాయణుడు’ అని తేల్చి ఆలయం పేరు మార్చవచ్చు కదా? ఒకవైపు ‘శ్రీ సీతారామ కళ్యాణోత్సవం’ అంటూ,
‘రామనారాయణ కల్యాణం చేయవచ్చా?
శ్రీరాముడు పుట్టక ముందు విష్ణువు. అవతారం అయిపోయాక తిరిగి
శ్రీ మహావిష్ణువు అయ్యాడు. మధ్యలో సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రుడే! రామావతారం
పూర్ణావతారమే. ఆ అవతారంలో ఆయన శ్రీరాముడే కాని రామనారాయణుడు కాదు. కానే కాదు!!! శ్రీరాముడు
లేని రామాయణాన్ని ఎలా వూహించలేమో అలాగే శ్రీరాముడు లేని భద్రాచల క్షేత్రాన్ని
వూహించలేం. భద్రాచలంలో వున్నది ఏ దేవాలయం అని అడుగుతే, ఆసేతు
హిమాచలం, చిన్న పిల్లవాడితో సహా, అక్షర-నిరక్షరాస్యులు
అందరూ, రామాలయం అనే జవాబిస్తారు. అక్కడ వున్నది రామనారాయణుడి
గుడి అని ఒక్కడంటే ఒక్కడు కూడా చెప్పడు.
ReplyDeleteదీనికి జవాబంటూ ఇవ్వ గలిగితే మా శ్యామలీయం మాష్టారు, కష్టేఫలిశర్మ గార్లే ఇవ్వాలె.
2 ఈ టపా రాసేరు కాబట్టి వచ్చే సంవత్సరం సరి చేస్తారని ఆశిస్తామా ?
3 కోర్టు కేసు వేసేద్దాం. అథమ పక్షం లో ఓ సెంచురీ కొట్టొచ్చు తీర్పు రావడానికి. :)
Thank You
Delete