Saturday, May 20, 2023

‘బండమీది చందుపట్ల’ దేవులపల్లి వంశవృక్షం ఆవిష్కరణ : వనం జ్వాలా నరసింహారావు

 బండమీది చందుపట్ల దేవులపల్లి వంశవృక్షం ఆవిష్కరణ

వనం జ్వాలా నరసింహారావు

గత ఆదివారం (మే నెల 14, 2023) సాయంత్రం నాంపల్లి ఎగ్జ్బిషన్ మైదానంలోని గాంధీ సెంటినరీ హాల్ లో, ‘చందుపట్ల దేవులపల్లి బంధువర్గం వారంతా (ఇతర దేవులపల్లి వారు కూడా వున్నారేమో!) సమావేశమై, 85 సంవత్సరాల వయసులో ‘దేవులపల్లి వంశ వృక్షం పేరుతో దేవులపల్లి వెంకట కిషన్ రావు గారు రాసిన ఏబై పేజీల అద్భుతమైన పుస్తకాన్ని ఆనందోత్సవాల మధ్య ఘనంగా ఆవిష్కరించుకున్నారు. కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు, దేవులపల్లి రాఘవేందర్ రావు జీవిత చరిత్ర పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది.

సభావేదిక మీద, కింద హాలులో దాదాపు అంతా కిషన్ రావుగారి దూరపు, దగ్గర బంధు గణమే. ముఖ్య అతిధిగా, 30-35 సంవత్సరాల క్రితం అదనపు ఎస్పీగా పదవీ విరమణ చేసిన 94 సంవత్సరాల కె చంద్ర ప్రకాష్ రావు గారు, ఇతర అతిథులుగా అక్కినేపల్లి పురుషోత్తమ్ రావు గారు, దేవులపల్లి విద్యాసాగర్ రావు గారు, దేవులపల్లి ప్రభాకర్ రావుగారు (తేజోప్రభ మాసపత్రిక సంపాదకుడు), నేను, తదితరులు కొందరు వేదికమీద వున్నాం. అందరం దాదాపు 70 సంవత్సరాల వయసు దాటినా వారమే!

పుస్తకానికి ఆప్తవాక్యం రాసిన, అదే విషయాలను సూచనప్రాయంగా సభలో చెప్పిన తేజోప్రభ మాసపత్రిక సంపాదకుడు, దేవులపల్లి ప్రభాకర్ రావుగారు, దేవులపల్లి వంశం మహా వృక్షంలా, శాఖోపశాఖలుగా, ఉభయ తెలుగు రాష్ట్రాలలో విస్తరించి వున్న విషయం, గోత్రాలలో వ్యత్యాసం వున్న విషయం, ఆ ఇంటి పేరుతో వున్న కొందరు ప్రముఖుల (ఉదాహరణకు ప్రముఖ సాహితీవేత్త రామానుజ రావు గారు, జెన్కో-ట్రాన్స్కో సిఎండి ప్రభాకర్ రావు గారు) ప్రస్తావన, పుస్తక రచయిత పరిచయం, తదితర సంబంధిత అంశాలను చక్కగా పేర్కొన్నారు.

తన ముందుమాటలో రచయిత దేవులపల్లి వెంకట కిషన్ రావు గారు, దేవులపల్లి అనగానే గుర్తుకొచ్చే ప్రముఖ వ్యక్తి కృష్ణ శాస్త్రి గారని, ఆ తరువాత రామానుజ రావుగారని, కామ్రేడ్ వెంకటేశ్వర్ రావుగారని, అలా చెప్పుకుంటూ పోతే పాతికమందికి పైగా ప్రముఖులు గుర్తుకు వస్తారని రాశారు. ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అంతర్ రాష్ట్ర మీడియా సలహాదారు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ పేరునూ ప్రస్తావించారు. దేవులపల్లి కుటుంబాలలో నియోగులు, ఇతరులు కూడా వున్నారని రాశారు. వారి వంశం మూలపురుషుడు కొండమరాజుగారి గురించి వివరించారు. తాను పుస్తకం రాయడానికి ప్రేరణ లభించిన విధానం, తోడ్పడిన వ్యక్తులు, వారందించిన సహకారం కృతజ్ఞతాపూర్వకంగా పేర్కొన్నారు వెంకట కిషన్ రావు గారు. మిగిలిన పేజీలన్నీ వంశవృక్షానికి చెందిన వివారాలు పొందుపరచడం జరిగింది.

ఇక నేను సభకు వెళ్లడానికి ఒక చిన్న కారణం లేకపోలేదు. నాకు ఆత్మీయులు, సన్నిహితులు, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కుసుంబ సీతారాంరావు గారు ఒకనాడు ఫోన్ చేసి, తనను ఆ సభకు ముఖ్య అతిథిగా ఆహ్వానించారని, వెళ్లడం కుదరడం లేదని, తనకు బదులుగా నన్ను వెళ్లమని, నేను ఒప్పుకుంటే సాదరంగా సంబంధిత వ్యక్తులు ఆహ్వానిస్తారని అన్నారు. నాకు ముఖ్య అతిథిగా ఎక్కడికీ పోయే అలవాటు లేదని చెప్పి సభకు హాజరై నాలుగు మాటలు చెప్పి వస్తానని అన్నాను. ఫోన్ పెట్టిన వెంటనే, కాసేపట్లో, కార్యక్రమ నిర్వాహకుల్లో ప్రధానమైన వ్యక్తి, రచయిత వెంకట కిషన్ రావుగారి మేనబావమరిది, వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం నుండి పదవీ విరమణ చేసిన ఆచార్య అక్కినేపల్లి రఘురాం రావుగారు, ఫోన్ చేసి ఆహ్వానించారు. ఆచార్య కుసుంబ సీతారాంరావుగారికి చెప్పిన మాటే చెప్పి, ఒక అతిథిగా వస్తానని చెప్పి, అన్నప్రకారం వెళ్లి, మూడు మాటలు చెప్పి రావడం నా అదృష్టం.

   దేవులపల్లి వెంకట కిషన్ రావుగారు పడ్డ శ్రమ చూసిన తరువాత, ఆయనకు పాదాభివందనం చేసి,  (ఆంధ్ర)వాల్మీకిరామాయణం బాలకాండలోని సీతాకళ్యాణఘట్టం గుర్తుకు తెచ్చుకున్నాను. అలాగే సూర్యాపేట, ఖమ్మం రహదారిలోని చందుపట్ల గ్రామం గుర్తుకొచ్చింది. నేను ఆ విషయాలే ప్రధానాంశాలుగా మాట్లాడాను.  

శ్రీరాముడు శివుడి ధనుస్సు విరిచిన దరిమిలా, జనకుడి ఆహ్వానం మేరకు దశరథుడు సీతాకల్యాణం పూర్వరంగంలో మిథిలకు చేరుకుంటాడు. ఆ తరువాత, కార్యక్రమంలో భాగంగా ఇక్ష్వాకువంశానికి కులగురువైన వశిష్టుడు జనకుడికి సూర్యవంశ క్రమాన్ని సుదీర్ఘంగా వివరిస్తాడు. అవ్యక్తసంభవుడు, నిత్యుడు, అవ్యయుడైన చతుర్ముఖ బ్రహ్మకు మరీచి జన్మించడం, మరీచికి కశ్యపుడు, ఆయనకు వివస్వంతుడు, ఆయనకు మనువు, ఆయనకు ఇక్ష్వాకుడు.....అలా...అలా..... ఆభాగుడు, అతడికి అజుడు, అతడికి దశరథుడు, ఆ దశరథుడి కుమారులే శ్రీరామ లక్ష్మణులని, ఇలా వీరి వంశం ఆదినుండి పరిశుద్ధమైందని వశిష్టుడు వివరించాడు.         

         ఇక్ష్వాకు వంశ క్రమం వివరించిన వశిష్ఠుడితో జనక మహారాజు తనవంశక్రమాన్ని వినిపించాడు. ఆయన వంశానికి పూర్వుడు నిమి అని, అతడి కొడుకు మిథి మొదటి జనకుడని, ఆయనే మిథిలా పురాన్ని కట్టించాడని, ఆయనే ఆ పేరే తమ వంశంలో జనకుడు అని రాసాగిందని, అది వంశనామమే అయిందని, మిథి కొడుకు కుదావసువని, అలా...అలా.. చెప్పుకుంటూ పోయి, మహారోముడు, ఆయనకు స్వర్ణరోముడు, ఆయనకు హ్రస్వరోముడు జన్మించారని, ఆయనకు పుట్టిన ఇద్దరు కుమారులలో తాను పెద్దవాడినని. తన తమ్ముడు కుశధ్వజుడని చెప్పాడు.  

అలనాడు ఇలా చెప్పడం వెనుక అర్థం వుంది. వివాహ విషయంలో పది తరాల వంశం వారిని తెలుసుకోవాలని శాస్త్రం చెపుతున్నదట. అధమ పక్షం మూడు తరాల వంశ జ్ఞానం ప్రధానంగా తెలుసుకోవాలి.

ఈ నేపధ్యంలో దేవులపల్లి వెంకట కిషన్ రావు గారు వృద్ధాప్యంలో ఎంతో శ్రమపడి వారి వంశ వృక్షం రాయడమంటే అలనాటి వశిష్టుడు లాంటి కులగురువులు చేసిన విధంగా వంశక్రమం వివరించడమే!!! ఇక ఈ సమాచారాన్ని దేవులపల్లి వంశీయులు ఎలా ఉపయోగించుకుంటారనేది వారి, వారి అభిరుచుల పైనే ఆధారపడి వుంటుంది. (ఆచార్య అక్కినేపల్లి రఘురాం రావుగారికి కృతజ్ఞతలతో)

No comments:

Post a Comment