Monday, May 15, 2023

గృహస్థులకు అతిథిపూజ గొప్ప ధర్మమని, బ్రాహ్మణత్వం కడు దుర్లభమని చెప్పిన భీష్ముడు ..... ఆస్వాదన-120 : వనం జ్వాలా నరసింహారావు

గృహస్థులకు అతిథిపూజ గొప్ప ధర్మమని,

బ్రాహ్మణత్వం కడు దుర్లభమని చెప్పిన భీష్ముడు

ఆస్వాదన-120

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (15-05-2023)

భీష్ముడు వివరిస్తున్న వివిధ ధర్మాలను శ్రద్ధగా వింటున్న ధర్మరాజు, ‘పితామహా! మునులు కూడా గౌరవించే పుణ్యమూర్తివి నీవు. ఎన్నో నీతులను, ధర్మాలను దయతో నాకు బోధించావు. అయినా నాకు శాంతి కలగలేదు. పట్టుదలతో చుట్టాలను పక్కాలను చంపుకొన్నాను. నీ పై కోపంతో క్రూరకర్మ చేసి నిన్ను పడగొట్టాను. ఈ రెండూ నా మనస్సును తీవ్రంగా బాధిస్తున్నాయి. లోభి అయిన దుర్యోధనుడు రాజ్యం పంచుకొని అనుభవించటానికి అంగీకరించలేదు. నేను కూడా కోపం మాని అతడిని రాజ్యం అనుభవించనీయలేదు. మా ఇద్దరివలన ఇంతటి కీడు పుట్టింది. ఏ విధంగా కూడా నాకు పశ్చాత్తాపం తప్పటంలేదు’ అని అన్నాడు.

ఆ మాటలకు భీష్ముడు, చంపటానికి మనుజుడు కర్త కాడని, దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం చెప్పుతాను వినుమని అంటూ, గౌతమి అనే పేరుగల బ్రాహ్మణ వనిత ఉండేదని, ఆమె కథ వివరించాడీ విధంగా.  ‘గౌతమి శాంత స్వభావురాలు. ఆమె కొడుకు విధివశాన పాము కరిచి చనిపోయాడు. ఆమె దుఃఖిస్తూ ఉండగా, ఒక కిరాతుడు పామును తాడుతో కట్టి తెచ్చి దాని తలను నరకబోయాడు. గౌతమి అతడిని వారించింది. విధి వశాన పాము కరిచిందని, దీనికి అల్పులు బాధపడతారని, పామును చంపితే బిడ్డ బ్రతుకుతాడా అని అతడిని వారించింది. ఇంకా ఇలా అన్నదామె. ఆపదలు పూర్వజన్మ కర్మానుసారంగా వస్తాయని, కనుక అధములైన వారు తల్లడిల్లి సంసార సముద్రంలో మునుగిపోతున్నారని, ధర్మవేత్తలైన ఉత్తములు మాత్రం అలా కాకుండా శాంతి పొంది సంసార సాగరాన్ని దాటిపోతున్నారని, కాబట్టి విధి ఆజ్ఞతో కరిచిన పామును వదలమని గౌతమి అన్నది.   

‘అర్జునకుడు అనే ఆ బోయవాడిని అతడి పేరుకు తగినట్లు ప్రవర్తించుమని అన్నది గౌతమి. శత్రువునైనా తనచేత చిక్కినప్పుడు చంపటం న్యాయం కాదన్నది. కిరాతుడు ఆమె మాటలను అంగీకరించలేదు. మనుష్యులకు బాధ కలిగించే జంతువులను చంపటం పాపం కాదని వాదించాడు. ఆ మాటలు విన్న పాము తాను మృత్యుదేవత పంపగా వచ్చిన సాధనమే కాని స్వయంగా కర్తను కానని వాదించింది. అంతలో మృత్యువు అక్కడికి వచ్చి తనను యముడు పంపగా వచ్చాననీ, బాలుడి చావుకు తాను కారణం కాననీ పేర్కొన్నది. వారిద్దరూ పాపానికి వశమైన మనస్సుతో వ్యవహరించారు కాబట్టి బాలుడి మరణానికి వారే బాధ్యులని వాదించాడు బోయవాడు’.

‘అంతలో యమధర్మరాజు అక్కడికి వచ్చి బోయవాడితో తానూ, పామూ, మృత్యువూ ఈ బాలుడి చావుకు కారణాలు కామని, అతడి కర్మయే దానికి కారణమని, జీవుడు తన కర్మఫలాన్ని తప్పించుకొనలేడని, వాడి కర్మే పూనుకొని వాడికా చావును తెచ్చిపెట్టిందని, కాబట్టి పామును వదలి పెట్టమని అన్నాడు. జీవుడు తాను చేసిన కర్మవలనే పుట్టుక-చావు పొందుతున్నాడని, అదే సుఖదుఃఖాలకు కారణమౌతున్నదని, తాను చేసిన కర్మను తప్పుకొని పోవడం శివుడికి కూడా సాధ్యం కాదని, ఇలా పిల్లలు చనిపోవడానికి వారి-వారి పాపకర్మే కారణం అని అన్నాడు యమధర్మరాజు. కిరాతుడికి జ్ఞానోదయమై పామును వదలి పెట్టాడు’.

         ఈ కథ చెప్పిన భీష్ముడు, ధర్మరాజును దుఃఖాన్ని వదలిపెట్టమని, యుద్ధంలో బంధువులు మరణించటానికి కారణం వారి కర్మలే తప్ప ఆయన కాని, దుర్యోధనుడు కాని కాదని, ఈ సత్యం తెలిసికొని శాంతిని పొందుమని బోధించాడు. ధర్మరాజు తన తరువాత ప్రశ్నగా, ‘గృహస్థాశ్రమంలో ఉండి కూడా మృత్యుభయం పోగొట్టుకొనవచ్చునా?’ అని పితామహుడిని అడిగాడు.

ధర్మానికి స్థిరంగా నిలబడగలిగితే గృహస్థుడు ముక్తిని పొందగలడని, దీనికి ఒక కథ చెప్పుతానని, ఇలా అన్నాడు భీష్ముడు. ‘పూర్వం మనువంశంలో దుర్యోధనుడు అనే అందమైన రాజు ఉండేవాడు. అతడి సౌందర్యాన్ని చూచి నర్మదానది మోహించి స్త్రీ రూపం తాల్చి వివాహమాడింది. వారిరువురికీ సుదర్శన అనే సుందరాంగి పుట్టింది.  ఆ రాజు ఆ కన్యను అగ్నిదేవుడి సేవకు నియోగించాడు. అగ్నిదేవుడు ఆ కన్య సౌందర్యానికి ముగ్ధుడై ఆమెను కోరాడు. ఆమె పెద్దలనడిగి తనను వివాహమాడమని చెప్పింది. దుర్యోధనుడు ఒక మహాయజ్ఞం చేస్తూ బ్రాహ్మణులకు దానాలిచ్చే సందర్భంలో అగ్ని బ్రాహ్మణ వేషంతో వచ్చి, సుదర్శనను తనకు దానం చేయమని రాజును అర్థించాడు. తన కిచ్చి వివాహం చేయుమని రాజును కోరగా వేరే కులంవాడైన పేద బ్రాహ్మణుడికి కన్యనివ్వటానికి దుర్యోధనుడు తొలుత ఇష్టపడలేదు’.

‘రాజు నిర్ణయానికి అగ్ని కోపించి యజ్ఞంలో తన తేజస్సును ఉపసంహరించుకొన్నాడు. ఋత్విక్కులు దానికి భయపడి మంత్రాలను పఠించటం మొదలు పెట్టారు. అగ్ని తన మనసులోని మాటను వారికి చెప్పాడు. మనసు మార్చుకున్న దుర్యోధనుడు సంతోషించి సుదర్శనను అగ్నిదేవుడి కిచ్చి వివాహం చేశాడు. అగ్ని సంతోషించి మరల తన తేజస్సును ప్రకాశింపజేసి యజ్ఞాన్ని సఫలం చేశాడు. వారిరువురికి సుదర్శనుడు అనే కొడుకు పుట్టాడు. అతడు పెద్దవాడై రాజ్యభారాన్ని వహించి నిర్వహించాడు. అతడికి ఓఘవంతుడు అనే కొడుకు పుట్టాడు. అతడికి ఓఘరథుడు అనే కొడుకు, ఓఘవతి అనే కూతురు పుట్టారు. ఓఘవతిని సుదర్శనుడి కిచ్చి (తాత మనుమరాలిని పెండ్లి చేసుకునే ఆచారం వుండేదప్పుడు) పెండ్లి చేశాడు. అతడు గృహస్థాశ్రమాన్ని పాటిస్తూ మృత్యువును జయించాలని నిశ్చయించాడు. ఓఘవతితో కలిసి కురుక్షేత్రంలో ఒక ఆశ్రమం కట్టుకొని నివసించాడు. అతిథిపూజను నిత్యవ్రతంగా స్వీకరించాడు’.

‘అతిథులు ఎవరి ఇంట్లో తమ కోరికలన్నీ తీర్చుకోగలుగుతారో ఆ యజమానుడూ, యజమానురాలూ కృతార్థులౌతారని ఆ దంపతులు విశ్వసించారు. అతిథి యజమానురాలిని కోరినా జుగుప్సపడకుండా అతడిని సంతోషపెట్టాలని నిశ్చయించారు. ఒకనాడు సుదర్శనుడు సమిధల కొరకు అడవికి పోగా ధర్మదేవత బ్రాహ్మణ రూపంలో అతిథిగా వచ్చి ఆమెను కోరాడు. గృహస్థధర్మాలు అతడికి తెలియజెప్పినా అతడు ఆమెను వాంఛించాడు. భర్త నియమాన్ని మనస్సులో భావించి ఆమె అంగీకరించింది. అతిథి ఆమెను చాటుకు తీసుకొని వెళ్ళాడు. అంతలో సుదర్శనుడు వచ్చి భార్యను పిలిచాడు. ఆమె పలుకలేదు. ఆమె తనను సేవిస్తున్నదని అతిథి పలికాడు. త్రికరణశుద్ధిగా ఆమె చర్యకు సుదర్శనుడు హర్షించాడు. అప్పుడు ధర్మదేవత సంతోషించి, తన తేజోమయ రూపాన్ని ప్రదర్శించి అతడిని ప్రశంసించాడు. అతడి వ్రతాన్ని పరీక్షించడానికి వచ్చానని, ప్రతిజ్ఞకు లోపం జరిగితే చంపటానికి మృత్యువు వెన్నంటే ఉన్నదనీ, దానిని సుదర్శనుడు జయించాడనీ ధర్మదేవత ప్రకటించాడు. ఆ భార్యాభర్తలకు బొందితో స్వర్గాన్ని ప్రసాదించాడు’.

ఓఘవతి తన మనస్సులోని సగభాగంతో పుణ్యనదిగా ప్రవహిస్తుందనీ మిగిలిన సగంతో భర్తను సేవిస్తుందని ధర్మదేవత అనుగ్రహించాడని చెప్పిన భీష్ముడు, ‘ధర్మరాజా! గృహస్థులకు అతిథిపూజకంటే గొప్ప ధర్మం లేదని ఈ కథా సారాంశం అని అన్నాడు. ఇది సమస్త పాపాలను పోగొట్టి కావాల్సిన కోరికలను తీరుస్తుందని,  మృత్యువును జయించవచ్చునని కూడా చెప్పాడు.   

‘బ్రాహ్మణేతరులైన, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల వారికి గుణ కర్మలతో బ్రాహ్మణత్వం సిద్ధిస్తుందా?’ అని ధర్మరాజు భీష్ముడిని ప్రశ్నించాడు. సమాధానంగా భీష్ముడు ఇలా అన్నాడు. ‘బ్రాహ్మణత్వం కడు దుర్లభం. ఎన్నో జన్మల ఫలం. ఈ సంగతి “ఇంద్ర మతంగ సంవాదం” అనే ఇతిహాసంవలన సృష్టమౌతుంది. మతంగుడనే బ్రాహ్మణ బాలుడు తండ్రి పంపున ఒక యజ్ఞానికి పోతూ దారిలో ఒక గాడిద పిల్లను కర్రతో కొట్టాడు. అది బాధతో తల్లిగాడిదతో చెప్పింది. ఆ తల్లిగాడిద ఆ బాలుడిని “చండాలుడా!” అని తిట్టింది. ఆ తిట్టుకు కారణ మడిగి తెలిసికొని తన తల్లికి ఒక మంగలివలన పుట్టినట్లు గ్రహించి, ఆ సంగతి తండ్రికి చెప్పి, తపస్సుచేత బ్రాహ్మణత్వాన్ని పొందుతానని చెప్పి ఇంద్రుడిని గురించి తపస్సు చేయ మొదలు పెట్టాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై బ్రాహ్మణత్వం ఇతర జాతులకు లభించేది కాదని చెప్పినా వినక మతంగుడు ఘోర తపస్సు చేయసాగాడు. ఎంత తపస్సు చేసినా శరీరం శుష్కించిందే కాని బ్రాహ్మణత్వం సిద్దించలేదు”.

భీష్ముడి పలుకులు విన్న ధర్మరాజు, ఇతరులకు ఈ విధంగా బ్రాహ్మణత్వం పొందరానిదైతే, బ్రాహ్మణత్వం ఇతర వర్గాలవారికి లభ్యం కానిదే అయితే, విశ్వామిత్రు డెట్లా బ్రాహ్మణత్వాన్ని పొందగలిగాడని ప్రశ్నించాడు పితామహుడిని. ఇలా అడిగిన ధర్మరాజుకు భీష్ముడు ఈవిధంగా సమాధానం చెప్పాడు.

‘జాహ్నవీదేవి తండ్రైన జహ్నుడి కులంలో గాధి జన్మించాడు. అతడి కూతురు సత్యవతి. ఆమెను భృగుకులంలో పుట్టిన ఋచీకుడు తనకు భార్యగా ఇమ్మని గాధిని కోరాడు. అతడికి ఇష్టం లేక ఒక చెవి నల్లగా ఉన్న వేయి తెల్లని గుర్రాలను శుల్కంగా అడిగాడు. ఋచీకుడు వరుణుడిని యాచించాడు. అతడు కరుణించి ఆతడు ఎక్కడ కోరితే అక్కడ అటువంటి గుర్రాలు పుట్టగల వని వరమిచ్చాడు. అతడు గంగానది ఉత్తరతీరంలో నియమంతో సంకల్పించగా నేలనుండి వేయి గుర్రాలు పుట్టాయి. ఆ స్థలానికి అశ్వతీర్థమనే పేరు కలిగింది. ఋచీకుడు ఆ గుర్రాలను గాధికి శుల్కంగా సమర్పించాడు. గాధి సత్యవతి నిచ్చి అతడికి వెంటనే పెండ్లి చేశాడు. ఋచీకుడు సంతానం కావాలనుకొని భావించి బ్రాహ్మణత్వం గల కొడుకు నిచ్చే ఒక చరువును (హవ్యం) కల్పించాడు’.

‘బ్రాహ్మణ కుమారుడి నిచ్చే చరువును తన భార్యను, క్షత్రియత్వంగల కొడుకు నిచ్చే చరువును ఆమె తల్లిని తీసికొని ఋతుకాలంలో భార్యను మేడిచెట్టును, అత్తను రావిచెట్టును కౌగలించుకొనేటట్లు నిర్దేశించాడు. కాని, దైవవశాత్తు తల్లీ కూతుళ్లు వాటిని వ్యత్యాసంగా చేసి గర్భాలు దాల్చారు. దానిని గ్రహించిన ఋచీకుడు భార్యకు ఆ సంగతి తెలియచెప్పాడు. సత్యవతి దుఃఖించి తనకు బ్రాహ్మణత్వం గల కొడుకు కలిగేటట్లు వరమిమ్మని కోరింది. ఋచీకుడు దయామయుడై ఆమెకు బ్రాహ్మణుడు పుట్టుతాడనీ, అతడి కొడుకు రాజలక్షణాలు కలిగి ఉంటాడనీ వరమిచ్చాడు. దానివలన సత్యవతికి జమదగ్ని బ్రాహ్మణ తేజస్సుతో పుట్టాడు. అతడికి పరశురాముడు క్షత్రియ తేజస్సుతో కలిగాడు. గాధి భార్యకు విశ్వామిత్రుడు పుట్టాడు. చరుతరుగుణాల తారుమారువలన అతడిలో బ్రాహ్మణత్వ స్ఫురణ, తపశ్శక్తి ఎక్కువగా కలిగాయి’.

అలా అయితే వీతహవ్యుడనే రాజు బ్రాహ్మణత్వాన్ని పొందాడని వింటామని, అదెలా జరిగిందో చెప్పమని అడిగాడు ధర్మరాజు. భీష్ముడు ఇలా సమాధానం చెప్పాడు ధర్మరాజుకు.  

‘మను వంశజుడైన హైహయుడికి (ఇతడికే వీతశమ్యుడనే మరొక పేరుండేది) పదిమంది భార్యలవలన వందమంది వీరపుత్రులు పుట్టారు. వారందరు కలిసి కాశీరాజైన హర్యశ్వుడిని యుద్ధంలో చంపారు. ఆ తరువాత అతడి కొడుకు సుదేవుడినీ చంపారు. అతడి కొడుకు దివోదాసు పై కూడా దాడి చేసి ఓడించారు. అతడు భరద్వాజ మహర్షిని ఆశ్రయించి హైహయులనుండి తన వంశ రక్షణాన్ని కోరాడు. ఆ మహర్షి యజ్ఞంనుండి ప్రతర్దనుడు అనే (శత్రు సంహారైన) పుత్రుడిని సృష్టించి రాజుకు ఇచ్చాడు. అతడు ఆ నూరుగురు హైహయులను చంపి వీతహవ్యుడి మీదకు పోయాడు. అతడు భయపడి భృగుమహర్షిని ఆశ్రయించాడు. అతడు తన ఆశ్రమంలోని శిష్యులలో ఆ రాజును దాచాడు. ప్రతర్దనుడు భృగుమహర్షి వద్దకు వెళ్లి, వీతహవ్యుడిని తనకు వశం చేయుమని కోరాడు. అప్పుడు భృగుమహర్షి తన ఆశ్రమంలో అందరూ బ్రాహ్మణులే ఉన్నారని పలికాడు. ఆ మహర్షి మాటవలన వీతహవ్యుడు బ్రాహ్మణుడయ్యాడు. ప్రతర్దనుడు సంతోషించి వెళ్ళిపోయాడు. వీతహవ్యుడు అనేకమంది బ్రాహ్మణ పుత్రులను కన్నాడు. ఆ వంశానికి అతడే మూలపురుషు డయ్యాడు’.

ఇది చెప్పిన భీష్ముడు ధర్మరాజును ఇంకా ఏమి అడగాలనుకొంటున్నావని ప్రశ్నించాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఆనుశాసనిక పర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

No comments:

Post a Comment