Monday, May 1, 2023

సర్వాశ్రమాలవారు కొలిచే దైవమైన విష్ణువును, పరమాత్మను ఆశ్రయిస్తేనే విముక్తి ..... ఆస్వాదన-118 : వనం జ్వాలా నరసింహారావు

 సర్వాశ్రమాలవారు కొలిచే దైవమైన విష్ణువును,

పరమాత్మను ఆశ్రయిస్తేనే విముక్తి

ఆస్వాదన-118

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (01-05-2023)

ఉత్తమోత్తమమైన ఇతిహాసంగా భావించబడుతున్న శుక మహర్షి జన్మ వృత్తాంతాన్ని, ఆయన సిద్ధుడైన నేపధ్యాన్ని, ఫలశ్రుతిని విన్న ధర్మరాజు తన తరువాత సందేహంగా నాలుగు ఆశ్రమాలలోనూ ఉండేవాళ్ళు కొలిచే దైవం ఏదని భీష్ముడిని అడిగాడు. ధర్మరాజు ప్రశ్నకు బదులుగా భీష్ముడు తనకు తన తండ్రి శంతనుడు వివరించిన ‘నారద నారాయణ సంవాదం’ సారాంశాన్ని చెప్పసాగాడు. అది వింటే ధర్మరాజు సందేహం తీరుతుందన్నాడు. దాని సారాంశం ఇలా సాగుతుంది.

‘సర్వాశ్రమాలవారు కొలిచే దైవం విష్ణువు. బదరికాశ్రమంలో నివసిస్తున్న నరనారాయణులలో నారాయణ ముని వద్దకు వెళ్లి నారదుడు నారాయణ మూల రూపాన్ని గురించి తెలిసికొన దలచాడు. ఆ తత్త్వాన్ని దర్శించదలచాడు. నారాయణుడు నారదుడిని అనుగ్రహించి ఏకాగ్రచిత్తుడిగా చేసి గగనమార్గంలో మేరు పర్వతంమీద క్షీరసముద్రపు ఉత్తర తీరంలో ఉన్న శ్వేతద్వీపంలో నిరాహారులై, జితేంద్రియులై, చెమట పట్టనివారై, పరిమళయుతమైన ధవళదేహాలతో ఉన్న పురుషుల వద్దకు చేర్చాడు. ఆ శ్వేత ద్వీపానికి వెళ్లి ఆకాశవాణి చెప్పినట్లుగా వున్న మానవులను చూశాడు. అలాంటి విశిష్టమైన శరీరరూపాలు ఏ లోకాలలోనూ ఏ జాతులవారికీ వుండవు. ఆ శ్వేత శరీరులు మనస్సులో ధ్యాన తత్పరులై వున్నారు. అప్పుడు ఒకానొక దివ్య కాంతిమయ స్వరూపం ఆ శ్వేతవర్ణుల ఎదుట ప్రత్యక్షమయ్యేసరికి ఆ నరులంతా సామూహికంగా భక్తితో నిండిన నమస్కారాలు చేశారు. జయజయ ధ్వానాలు చేశారు. ఆ శ్వేత శరీరులైన దివ్యపురుషులను సందర్శించడమంటే విష్ణుమూర్తిని దర్శించినట్లే. తదేక దీక్షతో అనేక సంవత్సరాలు తపస్సు చేస్తే, అప్పటికి కాని విష్ణుమూర్తి దర్శనం లభిస్తుంది’.

‘నారదుడి మనస్సులో శ్వేతద్వీపం, శ్వేతశరీరులైన దివ్యపురుషులు రూపుగట్టారు. వెంటనే బయల్దేరి ఆ ద్వీపం చేరుకున్నాడు. ఆ మహాత్ములను దర్శించాడు. నమస్కరించాడు. వారంతా నారదుడిని ఆత్మీయంగా గౌరవించారు. నారదుడు వారికి చేరువలోనే తానుకూడా తపస్సుకు పూనుకొన్నాడు. విష్ణునామలను ఉచ్చరించడం మొదలుపెట్టాడు. అవి నిగూఢమైన దివ్యనామాలు. అతడికి విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ఆయన తెలుపూ, నలుపూ, పసుపూ, ఎరుపూ, గోరోచనమూ, ఆకుపచ్చ రంగులలో ఉన్నాడు. సహస్ర శిరస్సులూ, సహస్రబాహువులూ, సహస్ర పాదాలూ ఉన్నాయి. హోమవేదిక, కమండలువూ, సుక్కూ, స్రువమూ, అగ్నీ వీటన్నిటినీ ధరించి ఉన్నాడు. ఓం కారాన్ని ఉచ్చరిస్తున్నాడు. గాయత్రీ మంత్రాన్ని జపిస్తున్నాడు. ఇట్లా అత్యద్భుతమైన దివ్యరూపంతో స్వామి ప్రత్యక్షమయ్యాడు. నారదుడి కన్నులకు కనిపించాడు. స్వామికి మునీంద్రుడు నమస్కరించాడు. స్వామి అతడిని అనుగ్రహించి ఇట్లా నారాయణతత్వాన్ని వివరించాడు. దాని సారాంశం ఇది:’.

‘క్షేత్రజ్ఞుడూ, జీవుడూ, వాసుదేవుడూ, సంకర్షణుడూ, అందరూ ఒక్కటే. అంతా విష్ణుమూర్తే. వాసుదేవుడే మనస్సు, అదే ప్రద్యుమ్నం. అహంకారమే సంకర్షణుడు. అదే అనిరుద్ధం. ఇరవైనాలుగు తత్వాలకూ ప్రభువైన ఇరవై అయిదవ తత్త్వం పరమాత్మే. అందుకే ఆయనను పంచవింశకుడు అంటారు. పరమపురుషుదు ఆయనే. ఆయన కన్నా పరమైనది మరొకటి లేదు. ఏకాగ్రచిత్తులైన యోగీశ్వరులు ఎవరిని దర్శించి నిత్యానందస్థితిని పొందుతారో ఆ పరమాత్మగా, ఆ వాసుదేవుడిగా, ఆ నిష్కలుడిగా, ఆ సాటిలేనివాడిగా ఆయనను తెలిసికొనటం ఆత్మహితం'.

'ఈ సృష్టిలోని సకల ప్రాణికోటిలో అంతర్గతంగా ఉన్న ధాతుశక్తి పరమాత్ముడి కన్న భిన్నమైనది కాదు. ఆయన లోనే ఉన్నది. అది ఆయన మొత్తం. జీవశక్తి అనేది సర్వత్ర పరివ్యాప్తం కాకపోతే చేష్టలూ, చైతన్యాలూ ఉండవు. జీవుడు వేరు, శరీరం వేరు. ఈ వాస్తవాన్ని గ్రహించటం అత్యవసరం. ఎవడైనా జీవుడిని చూశానని అంటే అదంతా మాయ. ఆ మాయావిలాసానికి సృష్టికర్త పరమాత్మే. జీవుడు పరమాత్మ కంటే భిన్నుడు కాడు. ఆయన లోనే కలిసి ఉంటాడు. ఈ సత్యాన్ని గ్రహించటం అవసరం. భక్తి మయమైన సాధనతో ఎవడు పరమాత్మను ఆశ్రయిస్తాడో వాడికి ఆయన విముక్తిని అనుగ్రహిస్తాడు. ఆదిత్యులూ, మరుత్తులూ, వసువులూ, రుద్రులూ మొదలైన దేవగణాలూ, బ్రహ్మదేవుడూ, చతుర్వేదాలూ ఆయాగౌరవాలను పొందటం పరమాత్మ వలననే. బ్రహ్మదేవుడిని ఆయనే సృష్టించాడు. ప్రపంచభారాన్ని అప్పగించాడు. పరమాత్మ నివృత్తి మార్గం చేపట్టాడు. ఏకాంతంగా గడుపుతాడు. మధ్యస్థుడుగా ఉంటూ బ్రహ్మాదులకు అవసరాన్ని బట్టి దివ్యమూ, భవ్యమూ అయిన సహాయం చేస్తుంటాడు’.

‘కొన్ని కొన్ని సమయాలలో లోకహితం కొరకు పరమాత్మ జన్మకర్మలను పూనుతూ ఉంటాడు. వరాహరూపం తాల్చి హిరణ్యాక్షుడిని, నరసింహ రూపం ధరించి హిరణ్యకశిపుడినీ, భృగువంశంలో పరశురాముడుగా పుట్టి క్షత్రియ లోకాన్నంతటినీ, దశరథరాముడిగా జన్మించి రావణుడిని సంహరిస్తాడు. యాదవకులంలో కృష్ణుడిగా పుట్టి అర్జునుడి సహాయంతో భూభారాన్ని తొలగిస్తాడు. పూర్వం నరనారాయణులనే పేర్లతో రెండు రూపాలతో, ఋషిత్వంతో వెలసి జగద్రక్షణాన్ని చేస్తున్నాడు. ఈ మూర్తులే తరువాత లీలామానుషరూపాలతో తమ కార్యాలను నిర్వహిస్తుండగా కంసుడు, కాలయవనుడు, మురుడు, నరకుడు, బాణుడు మొదలైన కంటకులను రూపుమాపుతాడు. అందులో బాణాసురుడిని రక్షిస్తానని పూనుకొని శివుడు కుమారస్వామితో కలిసి అడ్డగించగా ఆ మహాత్ముడిని జయించటానికి బాణుడిని అవమానించాడు. ఇంతకు ముందు మత్స్య కూర్మభావాలను పొంది దేవగణాలకు మేలు చేశాడు. ఇంకా ధర్మరక్షణం కొరకు ఏయే పనులు చేయాలో వాటిని తప్పక నిర్వహిస్తాడు. ఆయన కర్తవ్యాలు పూర్తి కాగానే పరమాత్మ తన మూల ప్రకృతిని మరల పొందుతాడు’.

‘విష్ణు సందేశాన్ని విన్న నారదుడు బదరికాశ్రమానికి వెళ్ళి, నరనారాయణులకీ వృత్తాంతం తెలిపి, మిగిలిన మహర్షులందరికీ నారాయణోపదేశాన్ని కర్ణరసాయనంగా అందించాడు. అదే వేదసారం, యోగాసారం, సాంఖ్యసారం. ఆ తరువాత బ్రహ్మ లోకంలో దీని ప్రచారం చేశాడు. ఆ తరువాత నారదుడు బ్రహ్మలోకానికి వెళ్లి అక్కడ కూడా ఆ ఉపదేశామృతాన్ని ప్రకటించాడు. అది బ్రహ్మకు తెలియదని కాదు కాని, ఆ సభకు వచ్చిన సిద్ధసాధ్యాదులకొరకు ఆయన ఆ విధంగా చేశాడు. విష్ణుమూర్తి అందించిన ఆ ఉపదేశామృతం క్రమక్రమంగా, కర్ణాకర్ణిగా లోకమంతా వ్యాపించింది’.  

‘వ్యాసుడు పై ఉపాఖ్యానాన్ని భక్తితో జపిస్తూ ఆకాశమార్గాన ప్రయాణం చేసి క్షీరసముద్రానికి వెళ్తాడు. నిత్యం విష్ణుమూర్తిని దర్శించాలని, ఉత్తమ పూజలు ఆచరించాలనే కుతూహలం వ్యాసుడి మనస్సులో ఎప్పుడూ పల్లవిస్తూ వుంటుంది. వ్యాసుడు మేరుపర్వతం మీద నివసిస్తూ తన శిష్యులకు నాలుగు వేదాలు, పంచమ వేదమైన మహాభారతం దయతో నేర్పాడు. భూతభవిష్యద్వర్తమానాలలో ప్రపంచ ప్రవర్తనను తెలుసుకొనగలిగిన దివ్యదృష్టిని పొందాలని కోరి వ్యాసుడు క్షీర సముద్ర తీరంలో తపస్సు చేశాడు’.

‘నారాయణుడి దయవలన ఆ మహర్షికి దివ్యజ్ఞానం, దివ్యదృష్టి సిద్ధించాయి. విష్ణు దేవుడి దివ్య వాక్కులవలన బ్రహ్మదేవుడు ముజ్జగాలకూ గురువనీ, ఆయన నిర్దేశించిన కర్తవ్యం వేద ప్రతిపాదితమే అనీ, విష్ణువూ అందులోనే చరిస్తాడనీ, వేదవిహితమైన యజ్ఞం కర్తవ్యమనీ, అందులో విష్ణువునకు భాగం కల్పించాలనీ, స్పష్టమయింది. బ్రహ్మదేవుడి ఆజ్ఞప్రకారం వైష్ణవ మనే యజ్ఞం దేవతలూ, మునులూ చేశారు. అందులో విష్ణువునకు భాగం కలిగించారు. విష్ణువు సంతోషించి వారిని కృతార్థులను చేశాడు. విష్ణువు హయగ్రీవ రూపం దాల్చి బ్రహ్మను అనుగ్రహించి అతడిని యజ్ఞాల కన్నిటికీ సృష్టికర్తగా, గురువుగా, అధికారిగా చేశాడు. అతడి కర్తవ్యభారాన్ని హయగ్రీవుడు గ్రహించాడు. అజ, విశ్వరూప, అమర, అమరాధినాథ, ఆద్య, వేదవేద్య, ఆత్మవేద్య, ఈశాన, అవ్యయ, తపఃఫలాత్మ అనే విశేషణాలు ఆయా లక్షణాలను బట్టి విష్ణుమూర్తికి ఏర్పడ్డాయి. అట్టి విష్ణుమూర్తిని సేవించటం అందరి కర్తవ్యం. వ్యాస ప్రోక్తమైన ఈ వృత్తాంతం వింటే సర్వ శుభాలూ, సుఖాలూ కలుగుతాయి’.

వ్యాసుడు చెప్పిన ఈ పవిత్రకథ విన్నా, చదివినా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వరుసగా, వేదవేత్తలుగాను, విజయశాలులుగాను, అధికలాభాలు పొందేవారిగాను, సుఖాలు పొందేవారిగాను అవుతారు. కన్యకు మంచి వరుడు దొరుకుతాడు. గర్భిణీస్త్రీకి గుణవంతుడైన కొడుకు పుట్తాడు. స్త్రీకి సుఖ ప్రసవం అవుతుంది. గొడ్రాలు సంతానవతవుతుంది. అంతా పావనమైనది ఈ కథ అని దీని ఫలశ్రుతి.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, షష్టాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment