Monday, May 29, 2023

లక్ష్మీ నివాస స్థానాలను, విష్ణు భక్తిని, విష్ణువు బోధించిన తత్త్వాన్ని వివరించిన భీష్ముడు ..... ఆస్వాదన-122 : వనం జ్వాలా నరసింహారావు

లక్ష్మీ నివాస స్థానాలను, విష్ణు భక్తిని,

విష్ణువు బోధించిన తత్త్వాన్ని వివరించిన భీష్ముడు

 ఆస్వాదన-122

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (29-05-2023)

ముక్తికి సోపానమని భావించతగ్గ గరుత్మంతుడి కథ భీష్ముడి ద్వారా విన్న ధర్మరాజు అమితమైన ఆనందాన్ని పొంది, తన తరువాత ప్రశ్నగా, ‘లక్ష్మి ఎలాంటి వారిలో వుంటుందని, ఎక్కడెక్కడ నివసిస్తుందో తెలపమని అడిగాడు పితామహుడిని. సమాధానంగా భీష్ముడు లక్ష్మి అంటే కేవలం ధనం మాత్రమే కాదని, శుచీ-శుభ్రతా, సరళత, అందం అనీ అంటూ ఇంకా ఇలా వివరించాడు. ‘ఒకసారి లక్ష్మీదేవి రుక్మిణీదేవితో తన నివాస స్థానాలను గురించి ఇట్లా చెప్పింది. నిత్యసత్యులు, శౌచనిరతులు, గురుభక్తులు, అప్రమత్తులు, దక్షులు, నిర్మలమతులు, సత్కర్మపరులు, విజ్ఞానం, తపం, దానం, బ్రహ్మచర్యం, శమం మొదలైన గుణాలు కలవారున్న ప్రదేశాలు లక్ష్మీ నివాసస్థానాలు. క్రూరులు, నాస్తికులు, కృతఘ్నులు, దుష్టబుద్ధుల పాలిట లక్ష్మి ఉండదు. గృహనీతి గల స్త్రీలయందు లక్ష్మి ఉంటుంది. పతి వ్యతిరేకులు, కఠిన చిత్తలు, అధిక నిద్రాసక్తలు అయిన స్త్రీలయందు లక్ష్మి ఉండదు. సరస్సులలో, పూల తోటలలో లక్ష్మి నివసిస్తుంది’.

‘స్త్రీ పురుషుల రతిలో ఎవరికి ఎక్కువ సుఖ ముంటుందని అడిగాడు ఆ తరువాత ధర్మరాజు. జవాబుగా భీష్ముడు భంగాస్వనుడు అనే రాజుకథ చెప్పాడు. ‘భంగాస్వనుడు ఇంద్రుడికి ఇష్టం లేని యజ్ఞం చేసి నూరుగురు కొడుకులను పొందాడు. అతడు ఒకసారి వేటకు వెళ్ళినపుడు ఇంద్రుడి మాయవల్ల ఒక కొలనులో దిగి నీరు త్రాగి స్త్రీగా మారిపోయాడు. ఆశ్చర్యంతో అతడు నగరానికి తిరిగి వచ్చి, మంత్రులకు, బంధువులకు జరిగింది తెలియచెప్పి, కొడుకులకు రాజ్యం కట్టబెట్టి, అడవికి వెళ్ళి మునులతో కలిసి నివసించాడు’. (భారతంలో శిఖండి కథతో సహా ఒకతి-రెండు పర్యాయాలు లింగ పరిణామం గురించి చెప్పడం జరిగింది. ఇది సాధ్యమేనని, శాస్త్రీయంగా సత్యమేనని, ఇటీవల పరిశోధనలు నిరూపించాయి. ప్రతి స్త్రీ పురుషులలో తల్లి అంశ సగం, తండ్రి అంశ సగం వుంటుంది కాబట్టి ఇది సత్యమే, శాస్త్రీయమే అని విశ్లేషించారు డాక్టర్ తుమ్మపూడి కోటీశ్వరరావు గారు).  

భీష్ముడు చెప్పడం కొనసాగిస్తూ ఇలా అన్నాడు. ‘స్త్రీ రూపంలో ఉన్న అతడిని ఒక ముని ప్రేమించి వరుసగా ఆమెద్వారా నూరుగురు కొడుకులను పొందాడు. రాజు ఆ కొడుకులను కూడా పూర్వ పుత్రులతో, చేర్చి, రాజ్యసుఖాలను కలిగించాడు. ఇంద్రుడు ఆ శుభ పరిణామాలకు అసూయపడి రాకుమారుల నడుమ కలతలు రేపి, వారిని యుద్ధంలో చనిపోయేటట్లు చేశాడు. స్త్రీ రూపంలో ఉన్న ఆ రాజు రోదించాడు. ఇంద్రుడు కరుణించి కొందరు కొడుకులను బ్రతికిస్తానన్నాడు. స్త్రీ రూపంలో ఉన్న ఆ రాజు తాను స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కొడుకులను బ్రతికించుమని కోరాడు. ఇంద్రుడు దానికి కారణమడిగాడు. తల్లికి బిడ్డల మీద ప్రేమ ఎక్కువ అని అతడు సమాధానం చెప్పాడు. ఇంద్రుడు సంతోషించి అతడికి పోయిన మగతనాన్ని కూడా ఇస్తానన్నాడు. అప్పుడు ఆ రాజు తనను స్త్రీగానే ఉండనిమ్మని ఇంద్రుడిని కోరాడు. దానికి ఇంద్రుడు ఆశ్చర్యపడి కారణం అడుగగా “రతిలో పురుషులకంటే స్త్రీలకు సుఖమెక్కువ కాబట్టి నేను స్త్రీగానే ఉండి సుఖించాలని కోరుకొంటున్నాను” అని అన్నాడు’.

ఈ విధంగా భంగాస్వనుడు కథ చెప్పిన భీష్ముడు, దాని తాత్పర్యాన్ని అర్థం చేసుకొమ్మని ధర్మరాజుతో అన్నాడు. ఆ మాటలకు సంతోషించిన ధర్మరాజు, ‘సంసార చక్రంలో పడి తిరుగకుండా ముక్తిని కలిగించే విష్ణుభక్తిని బోధించుమని’ ప్రార్థించాడు తాతగారిని. శాశ్వత సుఖం పేరే మోక్షమని, అదే నిర్వాణమని, పురుషాతీతంగా ప్రకృతి ఉంటుందని, దానిని నిర్దేశించడానికి కాని, ఇది అని చెప్పడానికి కాని, తర్కించడానికి కాని వీలుపడదని, అదే సంసార చక్రమని, దానిని త్రోసివేయటమే మోక్షమని భీష్ముడన్నాడు. ఆకృతికంటే వేరైనా ప్రకృతులన్నీ సంసార మార్గానికి అనుకూలంగా తోస్తూ వుంటాయని, అలా తోస్తూ వుండగా సంసార నిర్మూలనానికి కారణమైనది ఆకృతి స్ఫురణ మాత్రమే అని, అది కూడా కామంతో కప్పబడుతుందని అంటూ, కామక్రోధాలను జయించి మనస్సును సత్వగుణ భరితం చేసికొమ్మని, అదే వైష్ణవ ధర్మమని, దానిని అనుసరించి సంసార భయాన్ని జయించమని ధర్మరాజుకు చెప్పాడు.

‘ఆధ్యాత్మికం, అధిదైవం, అధిభూతం అనే మూడు తత్వాలకు ఆధారమై, వాటిలో తానూ జీవిస్తూ కర్తా, భర్తా, హర్తా అయిన భగవంతుడిని గురించి చెప్పుమని అడిగాడు ధర్మరాజు. భీష్ముడు ఆ ప్రశ్నకు సమాదానంగా ఇలా అన్నాడు. ‘సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, వసిష్ఠుడు, శంకరుడు ఈ ఆరుగురు బ్రహ్మకు కొడుకులు. ఆ తరువాత మరీచి, భృగుడు, అంగిరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అనే వారు పుట్టారు. సనత్సుజాతుడు నారదుడికి చెప్పిన తత్త్వసారం నీ ప్రశ్నకు సమాధానం ఇస్తుంది’.

‘అవ్యక్తమైన విష్ణువు తన స్వరూపంతో తానుంటాడు. అతడు పదివేల యుగాలు నిద్రపోయి లేచి బ్రహ్మను సృష్టించి దాని కతడిని భర్తగా నియమించాడు. అతడు అహంకారాన్ని పొంది పంచభూతాలనూ, గుణాలనూ సృష్టించాడు. వాటన్నిటిలో అహంకారం వ్యాపించి ఉంటుంది. అవన్నీ అవ్యక్త సముద్రంలో మునిగి తేలుతూ ఉంటాయి. ఈ సమస్త సృష్టి స్థితి లయాలకు ప్రభువై విష్ణుమూర్తి శుభాశుభాలను కల్పిస్తూ ఈ సంసార చక్రాన్ని తిప్పుతూ వినోదిస్తూ ఉంటాడు. ఆధ్యాత్మమంటే అనుభవించే జీవుడు. తాను ద్రష్ట చూచేవాడు. ఆధిభూతమంటే ద్రష్ట, అనుభవించే పరార్థ సృష్టిలోని గుణం దృశ్యం. ఆధిదేవత అంటే దృక్కు. చూచే శక్తి తేజస్సు. ఈ కెరటాలు వ్యక్తమయ్యే దానిని సృష్టి అంటారు. పంచభూతాలే దేవతలు. వాటి గుణాలే అధిభూతం’.

‘ఇవన్నీ విష్ణువన్న మహాసముద్రంలో పుట్టి, అణగారిపోయే అలల్లాంటివి. ఆయనకంటే పైన మరొక సత్యం లేదు. ఆయనే అన్నిటికీ ప్రభువు. అవ్యక్తం అంటే మూల ప్రకృతి. దానిలోకి పురుషుడు ప్రవేశిస్తే అది చైతన్యవంతమై సృష్టికార్యాన్ని నిర్వహిస్తుంది. విష్ణువు సమస్త సృష్టికి ఆధారం. ఆయన శివుడి అనుమతితో సమస్త బ్రహ్మాండాలు సృష్టించడం, లయించడం చేస్తూ వుంటాడు. ఇరవై నాలుగు తత్త్వాలకు మూలమైన తత్త్వం 25 వది. అది విష్ణువన్న పేరున వున్న పురుషుడు అనే పెరుకలది. అది పురాణ, వేదం, ఉపనిషత్తుల వల్ల ఎరుగనైనది. కాలానికి అంతకుడు, అద్వయుడు, అసంగుడు అతడే. అతడి పేరు విష్ణువు. 

‘నియమంతో అగ్నులను తమలో ఆవహింపజేసికొని మహాత్ములు పరమాత్ముడిని ఎట్లాంటి వాడినిగా భావిస్తారు’ అని ప్రశ్నించాడు ధర్మరాజు అ ఆతరువాత. సమాధానంగా భీష్ముడు, ఒకప్పుడు హిమాలయం మీద మునులు, సిద్ధులు కూర్చుని ఆధ్యాత్మిక చర్చ చేస్తున్నప్పుడు, అక్కడకు గరుత్మంతుడు వచ్చాడని, అప్పుడాయనకు నమస్కరించి వారంతా ఆయన్ను విష్ణువు గురించి పూర్తిగా చెప్పమని అడిగారని అంటూ ఇలా చెప్పాడు. అప్పుడాయన తనకు విష్ణువు బోధించిన తత్త్వాన్ని వారికీ విధంగా తెలియపర్చాడు. 

‘నా స్వరూపం దేవతలకూ తెలియదు. సమస్తం నాలో పుట్టి, జీవించి, మరణించినా నేనా సంసార చక్రంలో బంధితుడను కాను. కాని, వాటికి లోబడి అన్నింటిలోనూ ఉంటాను. నా తత్త్వం జడులు కానివారూ, అహింసా ప్రవృత్తి కలవారూ, కామం లేనివారూ, అహంకారం లేనివారూ, దానంగా దేనినీ స్వీకరించనివారూ, కోపం లేనివారూ, స్వచ్ఛమైన జ్ఞానం కలవారూ, నిత్యతృప్తులూ, శాంతి, భక్తి కలవారూ, నిష్ఠ కలవారూ, తమలో అగ్నిని సన్నిహితం చేసికొంటే నన్ను పొందగలరు. రజస్తమస్సులతో మలినం కాని కేవల సత్యగుణాన్నే స్థిరంగా చేసికొన్న జ్ఞానంతో నన్ను ధ్యానించటమే ముక్తి మార్గం. నానా విధాలైన సంకల్పాలు, యజ్ఞాలు, విడిచి పెట్టి ఆత్మలో అగ్నిని ప్రతిష్ఠించుకొని విరక్తుడై విష్ణువులో మనస్సును లయం చేసినవాడు ముక్తిని పొందుతాడు'.

భీష్ముడు ఆవిధంగా విష్ణు రూప, జ్ఞాన పద్ధతులను కథారూపంలో ధర్మరాజుకు వివరించాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఆనుశాసనిక పర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

 

No comments:

Post a Comment