వ్యక్తిత్వ వికాసం, జీవన పాఠాలు, స్వీయానుభవాల పరిపక్వత-10
1964-66
మధ్యకాలంలో హైదరాబాద్ అనుభవాలు: నిజాం, రామానందతీర్థ
వనం
జ్వాలా నరసింహారావు
హైదరాబాద్
న్యూసైన్స్ కళాశాల విద్యార్థిగా ఎప్పటికీ మరువలేని అనుభవం, కాలేజీలో నా సహాధ్యాయిగా కాకపోయినప్పటికీ, స్థానిక
వివేకవర్ధని కాలేజీలో బిఎ (ఎకనామిక్స్, పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) చదువుతుండే స్నేహితుడు నరసింహ మూర్తి, నేను కలిసి
ప్రతిరోజు సాయంత్రం క్రమం తప్పకుండా, కాలేజీ నుంచి వచ్చిన
తరువాత సాయంత్రం నాలుగు-ఐదు గంటల ప్రాంతంలో నారాయణగుడా తాజ్
మహల్ హోటెల్ ముందు కలిసే వాళ్లం. నరసింహమూర్తి వాళ్లన్నయ్య
కృష్ణమూర్తి గారు మామయ్యతో పాటు సచివాలయంలో పని చేస్తుండేవాడు. వాళ్ల మధ్య స్నేహం దాదాపు సమవయస్కులమైన మమ్మల్ని కూడా దగ్గరికి చేర్చింది.
ఇద్దరం
కబుర్లు చెప్పుకుంటూ, ఒక ప్లేట్ ‘ముర్కు’ తిని, ‘వన్
బై టు’ కప్పు కాఫీ తాగి (బహుశా అంతా కలిపి అర్థ రూపాయ కన్నా
తక్కువ బిల్లు అయ్యేదేమో!) బయట పడే వాళ్లం. తాజ్ మహల్ హోటెల్ లో పనిచేసే కామత్ అనే అతను మాకు మంచి స్నేహితుడయ్యాడు.
కూపన్ మరిచి పోయి వచ్చినా, డబ్బులు టైంకు ఇవ్వలేక పోయినా,
భోజనం విషయంలో కాని, టిఫిన్ విషయంలో కాని, ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. కాఫీ-టీలు ఫ్రీ గా తాగిన రోజులు కూడా ఎన్నో
వున్నాయి. మాతో పాటు ఒక్కోసారి రూమ్మేట్ కల్మల చెర్వు రమణ, ఉస్మానియా
‘బి-హాస్టల్’ లో వుంటూ ఎంఎ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్న
స్వర్గీయ వనం రంగారావు (నర్సింగరావు తమ్ముడు) కూడా వుండేవారు.
తాజ్
మహల్ నుంచి బయటికొచ్చి, కాసేపు నారాయణ గుడా బ్రిడ్జ్ పక్కనున్న (అప్పట్లో)
పార్క్ లో కూచుని కబుర్లు చెప్పుకునే వాళ్లం. ఒక్కోసారి
హిమాయత్ నగర్ మీదుగా, పీపుల్స్ హై స్కూల్ పక్కనుంచి
నడుచుకుంటూ, చిక్కడపల్లి దాకా పోయి, నరసింహమూర్తిని
వదిలేసి, నేను తాజ్ మహల్ హోటెల్ కు పోయి భోజనం చేసి రూమ్ కు
వెళ్లే వాడిని. మధ్య-మధ్య నారాయణ గుడా నుంచి నడుచుకుంటూ
వైఎంసిఏ మీదుగా, బడీ చావడీ, సుల్తాన్
బజార్, కోఠి తిరిగి వచ్చే వాళ్లం. తిరుగు ప్రయాణం, ఒక వేళ అలిసిపోతే, బస్సులో చేసే వాళ్లం.
హిమాయత్
నగర్, అశోక్ నగర్ మధ్య ఇప్పుడున్న ‘బ్రిడ్జ్’ అప్పుడు
లేదు. వర్షాకాలంలో మోకాలు లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లేవాళ్లం. అశోక్ నగర్ లో
ఇప్పుడు బ్రహ్మాండంగా వెలిగిపోతున్న ‘హనుమాన్’ గుడి అప్పుడు లేదు. కేవలం ఒక
విగ్రహం మాత్రం రోడ్డు మధ్యలో-కొంచెం పక్కగా వుండేది. నేను,
మూర్తి, ఒకరు చూడకుండా మరొకరు ఆ విగ్రహానికి
దండం పెట్టుకుని కదిలే వాళ్లం. పీపుల్స్ హైస్కూల్ దాటిన తరువాత మలుపు తిరిగి
చిక్కడపల్లి వైపు పోతుంటే, ఇప్పుడు సిటీ సెంట్రల్ లైబ్రరీ
భవనం వున్న చోట ఒక కల్లు కాంపౌండ్ వుండేది. దాని ముందర నుంచి చీకటి పడిన తరువాత
వెళ్లాలంటే కొంచెం భయమేసేది కూడా. ఇక మా కబుర్లలో వర్తమాన రాజకీయాలు ఎక్కువగా
వుంటుండేవి.
కేరళ
నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని ఇందిరా గాంధి ఎలా పడగొట్టింది, కెన్నెడీని ఎందుకు, ఎలా చంపారు, మావో సేటుంగ్ వ్యవహారం, ఇలా, జాతీయ-అంతర్జాతీయ
రంగానికి చెందిన కబుర్లుండేవి. మూర్తికి, నాకు మధ్య స్నేహం
ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. పోలీసు స్పెషల్ బ్రాంచ్ లో సీనియర్ అధికారిగా పనిచేసి
పదవీ విరమణ చేసాడు మూర్తి. అప్పట్లో హైదరాబాద్ లో ఒక సారి అఖిల భారత కాంగ్రెస్
కమిటీకి సంబంధించిన ఒక బహిరంగ సభ ఫతే మైదాన్ స్టేడియంలో జరిగినట్లు, ఆ సభలో నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి ‘టోపీ’ని సవరించుకోగానే రాబోయే
రోజుల్లో, ఏదో ఒక రాజకీయ మార్పు వుంటుందని పరిశీలకులు
వ్యాఖ్యానించినట్లు గుర్తు. మా ఇద్దరిమధ్య జరిగిన రాజకీయాల చర్చ పర్యవసానమే
దరిమిలా నా రాజకీయాసక్తి.
హైదరాబాద్‌లో
ఆ రోజుల్లో ఇప్పుడున్నన్ని సినిమా టాకీసులు లేవు. వున్నవాటిలో ఎయిర్ కండిషన్
థియేటర్లు కాని, ఎయిర్ కూల్డ్ థియేటర్లు కాని దాదాపు లేనట్లే.
ఆబిడ్స్ లో వున్న ‘జమ్రూద్’ టాకీసు ఒక్కటే జనరేటర్ బాక్-అప్ వున్న ఎయిర్ కండిషన్
థియేటర్. అలానే వి వి. కాలేజీ పక్కనున్న ‘నవరంగ్’ థియేటర్ ఒకే ఒక్క ఎయిర్ కూల్డ్
థియేటర్. ఇవి కాకుండా నారాయణ గుడాలో ‘దీపక్ మహల్’, హిమాయత్
నగర్ లో ‘లిబర్టీ’, సికిందరాబాద్ లో ‘పారడైజ్, తివోలీ’ థియేటర్లుండేవి. సికిందరాబాద్ లో ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలు
చూపించేవారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఇప్పుడున్న థియేటర్లు ఏవీ అప్పుడు లేవు.
ముషీరాబాద్‌లో "రహమత్ మహల్" టాకీసుండేది.
నారాయణ
గుడా దీపక్ మహల్ పక్కన ‘రాజ్ కమల్’ బార్ అండ్ రెస్టారెంట్ వుండేది. బహుశా అందులో
మద్యపానం అలవాటు చేసుకోని వారు అరుదుగా వుంటారేమో! నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది.
డిగ్రీ పరీక్షల్లో, చివరిగా, మాడరన్ ఫిజిక్స్
పేపర్ (వాస్తవానికి హాజరవడమే కాని మొదటి సారి నేను రాయలేదు) అయిపోయిన తరువాత,
మధ్యాహ్నం పూట, మొట్ట మొదటి సారిగా, రాజ్ కమల్ బార్‌కు వెళ్లి, ‘గోల్డెన్ ఈగిల్’ బీర్
తాగాను. నేను తాగలేనని వనం రంగారావు ఛాలెంజ్ చేయడంతో ఆ పని చేయాల్సి వచ్చింది.
అప్పట్లో బీర్ బాటిల్ ధర కేవలం మూడు రూపాయలే! 1966 లో అలా మొదలైన ఆ అలవాటుకు
షష్టిపూర్తి సెలబ్రేషన్స్ చేసుకోవచ్చేమో! అప్పుడు మూడు రూపాయల ధర మాత్రమే వున్న
బీర్ బాటిల్ ఇప్పుడు రెండువందలు దాటి పోయింది. అలాగే లెక్క లేనన్ని బ్రాండ్లు
వచ్చాయి. టిన్ బీర్లు కూడా వచ్చాయి.
ఇదిలా
వుండగా ఆరోజుల్లో పేర్కొనాల్సిన ఇద్దరు వ్యక్తులు ఒకరు ఏడవ, చివరి నిజాం నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, మరొకరు
స్వామీ రామానంద తీర్థ. 1964–66 కాలం నాటికి భారత ప్రజాస్వామిక వ్యవస్థ సంస్థాగతంగా
స్థిరపడే దశలో ఉంది. నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చివరి సంవత్సరాలు సాగుతున్నాయి.
హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనమైన తర్వాత ఆయనది నామమాత్రపు రాజశ్రేయస్సు
మాత్రమే. నిజాం గతంలో ఒక శక్తిమంతమైన రాజుగా, అత్యంత
ధనికుడిగా, దేశంలోని అతిపెద్ద దేశీ సంస్థానాన్ని
పాలించినవాడు,
ప్రజాస్వామిక
భారత ప్రభుత్వం ఆయనను గౌరవంతో, పరిమిత అవకాశాలతో వ్యవహరించడం
ముఖ్యమైన లక్షణం. ఈ సమన్వయమే దేశపు బహుళతా చైతన్యానికి నిదర్శనం. జవహర్‌లాల్
నెహ్రూ మరణానంతరం, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీలు, నిజాం పట్ల ఒక నిబద్ధతతో కూడిన
గౌరవం పాటించింది. ఆయనకు ‘రాజప్రముఖుడు’ హోదా తొలగించినా, చారిత్రక
పరంగా దేశానికి చేసిన సేవలు గుర్తిస్తూ, ప్రభుత్వం ఆయనకు
ప్రతి ఏడాది ‘ప్రివిపర్స్’ రూపంలో ఆర్థిక సాయం కొనసాగించడమే కాక, ఆయన నివాసం, భద్రతకు గౌరవప్రదమైన వాతావరణం
కల్పించబడింది.
ఒక
పాత సామ్రాజ్య అధిపతిగా మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ సుస్థిర జీవితం సాగిస్తున్న కాలం
అదే. ప్రముఖ సాంస్కృతిక కార్యక్రమాలలో ఆయనకు ఆహ్వానం లభించేది. కొన్ని సాంస్కృతిక
కార్యక్రమాలకు హాజరయ్యేవారు గానీ, రాజకీయంగా అసక్తి కనపరచలేదు.
ప్రభుత్వ పెద్దలు కొన్నిసార్లు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలుసుకునేవారు. ఇది
ప్రజాస్వామిక వ్యవస్థకు, పాత రాజ్య సమాజానికి మధ్య స్వీకార
మార్గాన్ని సూచిస్తుంది. చివరకు, ఉస్మాన్ అలీ ఖాన్ తన
ప్రభావాన్ని కోల్పోయి, నిశ్శబ్ద పాలకుడిగా మారిపోయారు. ఆయన
జీవించినంత కాలం, ఆయన జీవితం పునఃప్రభలేకుండా, పాత గొప్పదనాన్ని తలుచుకుంటూ గడిచింది.
ఇక
స్వామీ రామానంద తీర్థ విషయానికి వస్తే, ఆయనే నిజంగా 1960ల
మధ్య కాలంలో తెలంగాణ ప్రజల ఆశల ప్రతీక. 1950 లలో కామ్రేడ్‌లతో పరోక్షంగా కలసి
నిజాం నిరంకుశత, ఫ్యూడల్ విధానాల్ని ఎదుర్కొన్న వీరుడు.
అయితే 1964–66 నాటికి ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి దాదాపు విరమించుకున్నారు.
ముఖ్యంగా, తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక న్యాయం జరిగేలా
చూస్తున్నామంటూ, కాంగ్రెస్ లోపలే చైతన్యాన్ని కలిగించే పని
కొనసాగించేవారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఆశయాలతో ఉద్యమం కొదవైన సమయంలో,
ఆయన ఓ మేధావి, ప్రజల అభిమతాన్ని సూచించే
గొంతుగా మిగిలారు. రామానందతీర్థ యువ రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచారు.
గాంధీయవాది, నిజాయితీకి ప్రతీకగా ఆయనకు సమాజంలో గౌరవం
ఉండేది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్థాపించిన ఆయన మెమోరియల్ ట్రస్ట్ లో నేను
సభ్యుడిని.
హైదరాబాద్
నగరంలోని ముస్లింలలో, ముఖ్యంగా వృద్ధ తరగతిలో నిజాం పట్ల మమకారం ఉండేది.
‘పాత రోజులే మంచివి’ అన్న భావన కొందరిలో ఉండేది. నిజాం కాలంలో ఉపాధి, విశ్వవిద్యాలయ అభివృద్ధి (ఉస్మానియా యూనివర్శిటీ), నీటి
ప్రాజెక్టులు వంటి అభివృద్ధి చరిత్ర వారిని ఆకట్టుకునే అంశాలు. హిందువులలోనూ
కొన్ని వర్గాల్లో ఆయన గౌరవించబడేవాడు. ముఖ్యంగా, విద్యార్థులు
చదువుకోగలిగేలా ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మాన్ జనరల్
ఆసుపత్రి వంటి సంస్థలు స్థాపించడం వల్ల కొందరికి ఆయనపై గౌరవం బాగా ఉండేది. కానీ
మరోవైపు, కమ్యూనల్ జ్ఞాపకాలతో గుండెల్లో మరకల్ని మోస్తున్న
వారు కూడా ఉన్నారు. ఫ్యూడల్ వేదింపులు ఇంకా కొన్ని కుటుంబాల స్మృతుల్లో
నిలిచివుండేవి.
తెలంగాణ
రచయితలు, చరిత్రకారులు, సాంస్కృతిక
వేత్తలు నిజాం గురించి ఒక సంక్లిష్ట భావన కలిగి ఉండేవారు. ఒకవైపు ఆయన సంస్కృతీ
పరమైన విలువలకు, వాస్తు కళలకు, విద్యాభివృద్ధికి
చేసిన కృషిని ప్రశంసించేవారు. మరోవైపు ప్రజాస్వామికత దిశగా ఎదగలేని వ్యక్తిగా
విమర్శించేవారు. ఉస్మాన్ అలీ ఖాన్ 1965లో తన మనుమడు ముకర్రమ్ జాహ్‌ను వారసుడిగా
ప్రకటించినప్పుడు, అది ఒక కుటుంబ విషయంగా చూచినప్పటికీ,
హైదరాబాద్‌లో పలు వర్గాల నుంచి ఆసక్తికరమైన స్పందన వచ్చింది. అది
రాచరికం పోయినా, చరిత్రపైన ఉన్న భావన వదలిపెట్టలేని
వాస్తవాన్ని సూచిస్తుంది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరణం తర్వాత, అతని కుమారుడు ముకర్రం జా 967లో హైదరాబాద్‌కు ఎనిమిదవ నిజాం అయ్యాడు.
అయితే, ప్రస్తుతం నిజాం బిరుదును మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
మునిమనవడికి సంక్రమించింది.
ఇక
స్వామీ రామానంద తీర్థ రాజకీయంగా క్రియాశీలంగా లేకపోయినా, అప్పటి ప్రభుత్వానికి ఒక మానసిక దార్శనిక మార్గదర్శకుడిగా మిగిలాడు. నిజాం
కాలంలోని న్యాయవ్యతిరేకతకు ఎదిరించిన వ్యక్తిగా గౌరవించబడిన ఆయన, ప్రజాస్వామిక వ్యవస్థలో నైతిక విలువలకు ప్రతినిధిగా కనిపించేవాడు. నిజాం
పట్ల వ్యతిరేకత చూపినా, వ్యక్తిగతంగా అతనిని చిన్నచూపు
చూడలేదనే భావనలు ఉన్నాయి. ఆయన ఒక సత్యనిష్ఠుడు, శాంతియుత
మార్గాలపై నమ్మకమున్న నాయకుడిగా సమాజంలోని అన్ని వర్గాలకూ ఆమోదయోగ్యుడయ్యాడు.
ఈ
మొత్తం పరిస్థితి ఒక విశిష్టతను ప్రతిబింబిస్తుంది. సమన్వయాన్ని సూచిస్తుంది. అదే, చరిత్రను తృణీకరించకుండా, ప్రజాస్వామ్యాన్ని
ముందుకు నడిపించే సహనవృత్తి. భారత ప్రజాస్వామ్యం ఎలా పాత వర్గ సమాజాల్ని వెనక్కు
నెట్టకుండా, వాటిని గౌరవంగా చరిత్రలో నిలిపిందో ఈ సందర్భాలు
బలంగా ప్రతిబింబిస్తాయి. హైదరాబాద్ నగరం ఒక వైపు మౌలిక ప్రజాస్వామిక ఉద్యమాల
గడ్డగా, మరోవైపు నిజాం కాలపు రాచరిక సంస్కృతికి జ్ఞాపక
చిహ్నంగా నిలబడింది. ఇది భారత ప్రజాస్వామికతకు, కలిసిమెలిసి
జీవించే సామర్థ్యానికి ఒక సూక్ష్మ ప్రతిబింబంగా చెప్పుకోవచ్చు.
1960ల
మధ్యన విద్యార్థులుగా మేం ఉన్న రోజులవి. అప్పటికి స్వాతంత్ర్యాన్ని పొందిన తర్వాత
దేశం ప్రజాస్వామికత బాటలో నడుస్తూ, పాత రాచరికపు
జీవనశైలిని మరచిపోతున్న దశలో ఉంది. అయినా ఆ కాలంలో కొందరి వ్యక్తిత్వాలు, ఒకవైపు చారిత్రక రాజసందర్భాల్లోకి వెళ్ళిపోతూ, మరోవైపు
మానసికంగా ప్రభావం చూపించేలా నిలిచాయి. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ చరిత్ర,
చేపట్టిన నిర్మాణాలు, విద్యా సంస్థలు, రాజధానిగా హైదరాబాద్‌కి అందించిన మూల్యాలు, ఇవన్నీ ఓ
అంతర్భావ గౌరవాన్ని కలిగించేవి. రాజ్యానికి దూరమయ్యాక కూడా ప్రజల మదిలో
మిగిలిపోయిన ప్రతీక.
ఇక
స్వామీ రామానంద తీర్థ, ఆయన త్యాగబుద్ధి, ప్రజాస్వామిక
నిబద్ధత, నిజాం పరిపాలనలో వ్యవస్థాపిత అన్యాయాలకు
వ్యతిరేకంగా తిరగబడ్డ యోధత్వం, ఇవన్నీ మాకెప్పుడూ
విద్యార్థిగా మానసికంగా మార్గదర్శకాలుగా నిలిచాయి. నీతితో నిలిచే నాయకుడిగా,
రాజకీయం అంటే సేవల మాలగా మలిచే విధంగా, ఆయన
వ్యక్తిత్వం మాలో అంతర్మధన కలిగించేది.
వీరిద్దరూ
చరిత్రను మోస్తున్న భిన్న రూపాలు. విధ్యార్తులమైన మేము వారిని విమర్శాత్మక గమనంలో
చూడలేదు. చూడలేకపోయాం కూడా. ఎందుకంటే, మా ఎదుగుదల సమయంలో
వారు ఒక కొలమానంలా, చరిత్రను అర్థం చేసుకునే సూచికల్లా,
గౌరవాన్ని ఎలా వహించాలో నేర్పిన ఓ మౌన పాఠంలా ఉన్నారు. వారు
చెప్పిందే కాక, వారు మిగిల్చిన భావం మాకు అప్పట్లో
స్ఫూర్తిదాయకం.
ఇవన్నీ
నాలో రాజకీయాలపట్ల ఆసక్తి పెరగడానికి, ప్రత్యక్షంగా, పరోక్షంగా దోహదపడ్డాయనాలి.


నారాయణ గూడ అనకుండా గుడా గుడా అని వ్రాశారు ఏమిటి ?
ReplyDeleteఒక వైపు నిజాం నిరంకుశ పాలన అరాచకాలు అంటూ మరోవైపు అతను దేశానికి సేవలు చేశాడు అనడం ఏమిటి? పవర్ కారిడార్ లకు భక్తి ని ప్రదర్శిస్తూ స్వామి కార్యం స్వకార్యం చేసుకోవడం ఒక కళ.
ధన్యవాదాలు సార్
ReplyDelete