వ్యక్తిత్వ వికాసం, జీవన పాఠాలు, స్వీయానుభవాల పరిపక్వత-11
న్యూసైన్స్
కళాశాల బీఎస్సీ క్లాసులో , క్రికెట్ మైదానంలో ఆహ్లాదానుభవాలు
వనం
జ్వాలా నరసింహారావు
న్యూ సైన్స్
కాలేజీలో బీ ఎస్సీ (ఎంపీసీ) క్లాస్‍లో 150 మందికి
పైగా నా సహాధ్యాయులుండే వారు. సందడిగా, సరదాగా, గలగలా పారే సెలయేరులా, అప్పట్లోని మా పాలేరు
ఉపనదిలాగా వుండేది మా క్లాస్. బయటేమో నిత్యం ఒక నిర్మాణం
జరుగుతుండేది మా కాలేజీ ఆవరణలో. కాలేజీకి వున్న మంచి
పేరువల్ల, విద్యార్థుల తాకిడి బాగా వుండేది. అంతమందిని చేర్చుకోవాలంటే, అధికసంఖ్యలో క్లాస్ రూమ్‌లు
కావాలి. అందుకే, ఎప్పుడూ, భవనాన్ని పెంచడం జరుగుతుండేది. ఆవరణ తక్కువైనందున
విస్తరణ ఒక్కో అంతస్తు (అపార్ట్మెంట్లలాగా) జరిగేది.
ఒక విద్యార్థి, పేరు
గుర్తుకు రావడం లేదిప్పుడు, (బహుశా మునీర్ కావచ్చు) తన దగ్గర
ఎప్పుడూ, ఒక ‘టిక్-టిక్’ ధ్వని చేసే టాయ్ వుంచుకునే వాడు. ఆ రోజుల్లోనే ‘దేవాంతకుడు’ అనే
సినిమాలో హీరో అలాంటి దాన్ని ఉపయోగించేవాడు. ఎవరూ చూడకుండా
దాంతో ధ్వని చేయడం అతడికో హాబీ. ‘సీటింగ్ అరేంజ్ మెంట్’
అని రాసి వుంటే, అందులోంచి ‘ఎస్’ అక్షరం తొలగించి, దాన్ని ‘ఈటింగ్’ అని చేసేవాడు. మరి
కొందరి క్లాస్ మేట్స్ పేర్లు కూడా గుర్తుకొస్తున్నాయి.
ఖమ్మంలో నాతో
పాటు పియుసి చదువుకున్న బాలమౌళి (ఇప్పుడో పేరున్న ఛార్టెడ్ అకౌంటెంట్)
న్యూసైన్స్ కాలేజీలో కూడా క్లాస్ మేట్ అయ్యాడు. రాంప్రసాద్ (ఆయన భార్య గీత, ఆ
తరువాతి కాలంలో నాకు స్నేహితురాలైంది) మరొక క్లాస్ మేట్.
ఒక ప్రయివేట్ కంపెనీలో పని చేసి రిటైరై బెంగుళూరులో వున్నప్పుడు
మరణించాడు. అలానే, రంగ రామానుజం, కుల్
కర్ణి (అతివాద-తీవ్ర వాద భావాల
విద్యార్థి, మేథావి), జ్యోతి ప్రసాద్, ఎర్రంరాజు,
మల్లికార్జున్, బాబ్జి, సుబ్బారావు
(సీనియర్ సైంటిఫిక్ అధికారిగా పదవీ విరమణ చేశాడు), విఎస్పి శాస్త్రి, మల్లాడి వెంకట సుబ్బయ్య, కపాడియా, త్యాగరాజన్, టిఆర్ శ్రీనివాసన్
(ప్రస్తుతం షికాగోలో స్థిరపడ్డాడు), ప్రేంచంద్
(అమెరికాలో స్థిరపడ్డాడు), విద్యాసాగర్, తదితరులు కూడా నాకు
క్లాస్ మేట్సే.
నిజాం
కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం పూర్తి చేసిన వల్లూరి శ్రీ రాం అనే విద్యార్ధిని, ప్రిన్సిపాల్
సుదర్శన్ నచ్చచెప్పి ఫైనల్ ఇయర్ లో మా క్లాస్ లో చేర్పించాడు. అతడికి సెకండ్ ఇయర్ లాంగ్వేజెస్ లో యూనివర్సిటీ ఫస్ట్ రావడంతో, ఫైనల్లో కూడ రాంక్ వచ్చే అవకాశాలున్నాయని భావించిన సుదర్శన్ గారు అలా
చేశారు. ఆయన గెస్ నిజమైంది. డిగ్రీలో
అతడికే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. క్రెడిట్ న్యూ సైన్స్
కాలేజీకి దక్కింది.
శ్రీ రాం పక్క
నంబరైన నేను కనీసం పాసు కూడా కాలేదు! అసలు పరీక్షలే పూర్తిగా రాయలేదు!
ఇంటర్ నెట్‌లో చూసి, శ్రీ రాం అమెరికాలో పని
చేస్తున్నట్లు తెలుసుకుని, చొరవతీసుకుని కాంటాక్ట్ చేశాను. తన కూతురు వివాహానికి
ఒక దశాబ్దంన్నర క్రితం హైదరాబాద్ వచ్చినప్పుడు కలిశాం. మా కాలేజీ అనుభవాలను పంచుకున్నాం.
అలాగే కువైట్లో పనిచేస్తున్న కపాడియా వచ్చినప్పుడు విద్యాసాగర్ చొరవతో మేమంతా
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో కలుసుకున్నాం. దరిమిలా విద్యాసాగర్ (నాకు బంధువు కూడా)
చనిపోయాడు.
లెక్చరర్ల
విషయానికొస్తే, బహుశా, అంత నైపుణ్యం కల అధ్యాపకులు, మరే కాలేజీలోను వుండరంటే అతిశయోక్తి
కాదేమో! తెలుగు బోధించడానికి మంజు శ్రీ (డాక్టర్ అక్కిరాజు రమాపతి రావు), అరిపిరాల
విశ్వం, వుండేవారు. మాకు తెలుగు పాఠ్యపుస్తకంగా ‘ఆంధ్ర మహాభారతోపన్యాసాలు,’ నాన్-డిటేల్‍గా ‘పురుషోత్తముడు,’ నాటకంగా ‘హాలికుడు’ వుండేవి. ఆంధ్ర
మహాభారతోపన్యాసాలలో, ధర్మరాజు రాజసూయయాగం చేస్తున్న
సందర్భంలో ఆయనను ఆక్షేపిస్తూ శిశుపాలుడు అన్న మాటలు ‘అవనీ
నాధులనేకు లుండఁగ విశిష్టారాధ్యు లార్యుల్ మహీదివిజుల్ పూజ్యులు పల్వురుండఁగ
ధరిత్రీనాథ! గాంగేయుదుర్వ్యవసాయంబునఁ
గృష్ణు గష్టచరితున్ వార్ష్ణేయు బూజించి నీ యవివేకం బెఱిఁగించితిందఱకు దాశార్హుండు
పూజార్హుఁడే’ గుర్తున్నాయి.
పద్యభాగం
పుస్తకంపేరు గుర్తుకు రావడంలేదు కాని, ‘గంగావతరణం’ పాఠం మాత్రం జ్ఞాపకం వున్నది. అందులోని
ఒక పద్యం, ‘ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి
శీతాద్రి, సుశ్లోకంబైన
హిమాద్రినుండి భువి, భూలోకమునందుండి
యస్తోకాంభోధి, పయోధినుండి
పవనాంధోలోకమున్ చేరె గంగా కూలంకష, పెక్కుభంగులు
వివేక భ్రష్ట సంపాతముల్’, ఇలా కొంచెం, కొంచెం గుర్తుకొస్తోంది. అరిపిరాల
విశ్వం గారి తమ్ముడు రామ్మోహన రావు కూడా నా క్లాస్ మేట్.
ఇంగ్లీష్
లెక్చరర్లుగా షమీం మేడం, వివి చారి, వై
ఆర్ అయ్యంగార్,
కుమారి శ్యామల గారుండేవారు. వాచకంగా ఇఎఫ్ డాడ్
సంపాదకీయంలోని వ్యాసాల సంకలనం వుండేది. ఎజి గార్డినర్ రాసిన
వ్యాసం ఒకటుంది. ఇఎం ఫార్స్టర్ రాసిన ‘పాసేజ్ టు ఇండియా’ నాన్-డిటేల్ గా వుండేది. ఫార్స్టర్ ఆ పుస్తకాన్ని 1924
లో భారత దేశంలో ఆంగ్లేయుల పాలన, 1920 నాటి
స్వాతంత్ర్య పోరాటం నేపధ్యంలో రాశారు. ప్రపంచంలోని వంద
అత్యుత్తమైన ఇంగ్లీష్ లిటరేచర్ పుస్తకాలలో ఒకటిగా పాసేజ్ టు ఇండియాను ‘మాడరన్
లైబ్రరీ’ ఎంపిక చేసింది. 1923-2005
మధ్య కాలంలో వచ్చిన అత్యుత్తమైన వంద ఇంగ్లీష్ నవలలో ఒకటిగా ఈ
పుస్తకాన్ని ‘టైం మాగజైన్’ ఎంపిక చేసింది. నవల మొత్తం కేవలం
నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతుంది. డాక్టర్ అజీజ్, ఆయన బ్రిటీష్ స్నేహితుడు సిరిల్
ఫీల్డింగ్, శ్రీమతి మూర్, కుమారి అడెలా క్వెస్టెడ్.
ఇంగ్లీష్
పోయెట్రీలో జార్జ్ హెర్బర్ట్ రాసిన Virtue
(సద్గుణం, సత్ ప్రవర్తన) లో
చక్కటి నీతి వుంది. ప్రపంచం మొత్తం కాలగర్భంలో కలిసి పోయినా
మనిషి సత్ ప్రవర్తన, సద్గుణం
అజరామరంగా వుంటుందని దాని భావన (Only a
sweet and virtuous soul, Like seasoned timber, never gives; But though the
whole world turn to coal. Then chiefly lives). మరో పోయెం 1608-1674 మధ్య కాలంలో జీవించిన ‘జాన్
మిల్టన్’ రాసిన ‘పారడైజ్ లాస్ట్.’ ఆయనే రాసిన మరో
పోయెం ‘ఆన్ హిజ్ బ్లయిండ్ నెస్.’ ఇంకో పోయెం ‘విలియం వర్డ్స్ వర్త్’ రాసిన ‘సాలిటరీ
రీపర్’ (Alone she cuts and
binds the grain, And sings a melancholy strain..). జనరల్
ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ను నాందేడ్కర్, సుబ్రహ్మణ్యం
చెప్పేవారు.
చాలా ఇంటరెస్టింగ్ గా వుండేదా క్లాస్.
ఆప్షనల్
సబ్జెక్టులైన లెక్కలు,
భౌతిక, రసాయన శాస్త్రాలు చెప్పే లెక్చరర్లు
ఆయా విషయాలను అత్యంత ఆసక్తికరంగా బోధించే వారు. లెక్కల సబ్జెక్టులో ఫైనల్ ఇయర్
పరీక్షల్లో బీజగణితం, రేఖాగణితం, త్రికోణమితి (మూడు) పేపర్లు
రాయాలి. రేఖాగణితం పుస్తకం ‘మాణిక్య వాచికం పిళ్లే’ రాసినదాన్ని ఉపయోగించే వాళ్లం.
బీజగణితాన్ని షఫీ ఉల్ హక్, రేఖాగణితాన్ని భాస్కర రావు,
త్రికోణమితిని డాక్టర్ కుప్పుస్వామి బోధించేవారు. మొదటినుంచి లెక్కల
సబ్జెక్ట్ అంటే నాకు చాలా ఇష్టం. పరీక్ష రాసిన ప్రతి సారీ ఆ ఒక్క సబ్జెక్ట్ మంచి
మార్కులతో పాసయ్యేవాడిని. మిగతావి (భౌతిక, రసాయన శాస్త్రాలు)
రాయడానికే ధైర్యం లేకపోయేది. భౌతిక శాస్త్రాన్ని హరి లక్ష్మీపతి, ప్రభాకర్ బోధించేవారు. భౌతిక శాస్త్రంలో మాడరన్ ఫిజిక్స్ అనే నాలుగో పేపర్
కూడా వుండేది.
డిమాన్
స్ట్రేటర్‌గా పివివి ఎస్ మూర్తి మాతో ప్రయోగశాలలో ప్రాక్టికల్స్ చేయించేవారు.
వెలాసిటీ ఆఫ్ సౌండ్,
వర్నియర్ కాలిపర్స్, స్క్రూగేజ్, ఫిజికల్ బాలెన్స్ లతో చేసిన ప్రయోగాలింకా గుర్తున్నాయి. రసాయన శాస్త్రం
ప్రయోగాలను రఘురాంగారు చేయించేవారు. వాల్యూమెట్రిక్ అనాలసిస్, పిప్పెట్, బ్యూరెట్ట్ ఉపయోగించడం, కాపర్ సల్ఫేట్
స్ఫటికాలు తయారు చేయడం సరదాగా వుండేది. రసాయన శాస్త్రం థియరీలో ఆర్గానిక్, ఇన్-ఆర్గానిక్, ఫిజికల్ అనే ఆ మూడింటిని ముగ్గురు
లెక్చరర్లు బోధించేవారు.
ఆర్గానిక్
సబ్జెక్టు చెప్పే వై సూర్యనారాయణ మూర్తి బోర్డు మీద వేసిన బెంజిన్ రింగ్ ఇప్పటికీ
కళ్లలో మెదులుతుంది. ఇన్-ఆర్గానిక్ సబ్జెక్ట్ ప్రిన్సిపాల్ సుదర్శన్ గారు చెప్పేవారు. ఫిజికల్
కెమిస్ట్రీని కూడా వై సూర్యనారాయణ మూర్తి గారు చెప్పినట్లు గుర్తు. సర్కార్ అండ్
రక్షిత్ రాసిన ఆర్గానిక్ కెమిస్ట్రీ పుస్తకాన్ని, బాల్ అండ్
తులి రాసిన ఇన్-ఆర్గానిక్ కెమిస్ట్రీ పుస్తకాన్ని చదివే
వాళ్లం. లైబ్రరీకి అడపదడప పోయే వాళ్లం. లైబ్రేరియన్‍గా పుల్లయ్య పని చేసేవాడు.
తరువాత రోజుల్లో (1973-1974) ఉస్మానియా యూనివర్సిటీలో నేను లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ
చేసేటప్పుడు,
అతడు నాతోపాటు చదివాడు. 80 సంవత్సరాల వయసుదాటిన పుల్లయ్య, స్వయం
కృషితో అత్యున్నత స్థాయికి చేరుకున్న పుల్లయ్య, ఇప్పటికీ
చాలాచాలా యాక్టివ్ గా, అధ్యాపకుల సంఘానికి జాతీయ స్థాయి
నాయకుడిగా వున్నాడు. క్రమం తప్పకుండా మేమిద్దరం కనెక్ట్ అవుతాం.
కాలేజీ
చదువుతో పాటు క్రికెట్ ఆట ప్రాక్టీసుకు నిత్యం పోవడం కూడా అలవాటు చేసుకున్నాను.
బర్కత్ పూరా సమీపంలోని యువతీ మండలి మైదానంలో (ఇప్పుడు మైదానం కనిపించడంలేదు) క్రికెట్
ప్రాక్టీసుకు వెళ్లేవాడిని. ‘జాలీ రోవర్స్ క్రికెట్ క్లబ్’ ఆ రోజుల్లో
హైదరాబాద్ ‘బి-లీగ్’ మాచ్‍లు ఆడుతుండేది. నేను ఆ క్లబ్ పక్షాన ఆడేవాడిని. అంతగా
ఆటలో రాణించక పోయినా ప్రాక్టీసు మానక పోయేవాడిని. నేను ప్రాక్టీసు చేస్తున్న
రోజుల్లో అదేమైదానంలో ఆడిన పెద్ద క్రికెట్ క్రీడాకారుల్లో అబ్దుల్ హాయ్, సాయినాథ్, ప్లహ్లాద్,
పవన్ వున్నారు. దరిమిలా వాళ్లంతా రంజీ ట్రోఫీ స్థాయి వరకు ఎదిగారు. అప్పుడప్పుడూ
వచ్చి, ఆడిపోతుండే వారిలో అబ్బాస్ అలీ బేగ్, కలీముల్ హక్, బహుశా ఆవీద్ అలీ కూడా వున్నారు.
ఇటీవలే వీరిలో కొందరిని కలిశాను.
2015
అక్టోబర్ 10న, 1964-66 కాలంలో నాకు నేరుగా
లేదా పరోక్షంగా పరిచయం ఉన్న కొంతమంది క్రికెటర్లను కలవాలనే ఉద్దేశంతో మేము ఫతే
మైదాన్ క్లబ్‌లో భోజనంతో కూడిన చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ
సమావేశానికి స్పీడ్ బౌలర్ గోవింద్‌రాజ్ కూడా హాజరయ్యారు. ఆయనకు ఆ కాలంలో ఎంఎల్
జైసింహా, అబ్బాస్ అలీ బేగ్, కృష్ణమూర్తి,
జయంతిలాల్ లతోపాటు 15 మంది సభ్యులతో కూడిన భారత
జట్టులో చోటు లభించినా, దురదృష్టవశాత్తు తుది పదకొండు మంది
ఆటగాళ్లలో స్థానం దక్కలేదు. అప్పటి ఆ విషయాలను, కారణాలను
ఆసక్తికరంగా వివరించాడు గోవిందరాజ్.
మాజీ టెస్ట్
క్రికెటర్ ఎంవీ నరసింహారావు, నౌషిర్ మెహతా, అబ్దుల్
హై, మహేశ్వర్ సింగ్, ప్రహ్లాద్,
కె సాయిబాబా, సర్వేష్ కుమార్ కూడా హాజరయ్యారు. జ్యోతిప్రసాద్,
సాయినాథ్, విజయ్ పాల్, మహేందర్
కుమార్, అబ్దుల్ అజీమ్ లాంటివారు రావాలని భావించామని, కానీ
వారి అప్పటి ఇతరపనుల కారణాన హాజరుకాలేకపోయామని ఫో చేసి చెప్పారు. ఇంతమంది క్రికెట్
అభిమానులను ఒకచోట చేర్చిన ఘనత సీనియర్ జర్నలిస్టు ఎంఎస్ శంకర్‌కు చెందుతుంది. ఆయనే
మంచి క్రికెట్ అభిమాని, ఆటగాడు కూడా.
ఈ సమావేశంలో
పాల్గొన్నవారు తమ చక్కని క్రికెట్ అనుభవాలను పంచుకున్నారు. అబ్దుల్ హై, మహేశ్వర్
సింగ్, సాయిబాబా, సర్వేష్ కుమార్ రాష్ట్ర జట్టుకు ఆడే
స్థాయికి చేరడం పట్ల సంతృప్తిగా కనిపించారు. యాదృచ్ఛికంగా, ప్రహ్లాద్
అనే క్రికెటర్ నా సమకాలీనుడే. నేను 1964–66 మధ్య కాలంలో న్యూ
సైన్స్ కాలేజ్‌లో బీఎస్సీ చదువుతుండగా, ఆయన సైఫాబాద్ సైన్స్
కాలేజ్‌లో డిగ్రీ చదివాడు. మేమిద్దరం కలసి ఆంధ్ర యువతి మండలి మైదానంలో క్రికెట్ ప్రాక్టీస్
కూడా చేశాం. దాదాపు నలభై ఏళ్ల తర్వాత ప్రహ్లాద్ ను కలవడం ఆనందాన్నిచ్చింది. రెండు
గంటలన్నరలపాటు జరిగిన ఈ సమ్మేళనం మాకు ఎంతో ఆనందాన్నిచ్చింది.
నేను
హైదరాబాద్‌లో ఆడడంతో,
శెలవులకు ఖమ్మం వెళ్లినప్పుడు అదో రకమైన గౌరవం లభించేది. మామిళ్లగూడెం
క్రికెట్ క్లబ్ పక్షాన టోర్నమెంటులకు వెళ్లే జట్టులో నేనుండే వాడిని. వనం రంగారావు,
నర్సింగరావు, శేషగిరి, మూర్తి,
దిలీప్, శంకర్, దివాకర్,
ప్లహ్లాద్, కళాధర్, రాధాకృష్ణలతో
ఆడాను. మామిళ్ళగూడెం క్రికెట్ క్లబ్ కు, ఖమ్మం కాలేజీ క్రికెట్ టీంకు ఆడిన కొందరం
హైదరాబాద్ బోట్స్ క్లబ్ లో 9 సంవత్సరాల క్రితం కలిశాం. వనం నర్సింగ్ రావు, విజయ రామ్ శర్మ, దివాకర్,
భరద్వాజ్, నాగభూషణం, వనం రంగారావులతో
పాటు అప్పటి రాష్ట్ర కాబినెట్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆ భోజన సమావేశానికి
హాజరయ్యారు.
డిగ్రీ
ఫైనల్ ఇయర్ పరీక్షలు మార్చ్-ఏప్రిల్ 1966 లో జరిగాయి. లెక్కల పేపర్ రాసిన
తరువాత మంచి మార్కులు రావని భావించి, మిగతా పేపర్‌లకు
కేవలం హాజరవడం (పరీక్ష పేపర్లు తెచ్చుకోవడానికి) తప్ప రాయలేదు. ఫలితాలు
ఊహించినట్లే ఫెయిలయ్యాను. లెక్కల సబ్జెక్టులో పాసయ్యాను. సప్లిమెంటరీ పరీక్షలు
రాయలేదు. చిక్కడపల్లిలో ఇల్లు అద్దెకు తీసుకుని రమణ, నేను అజీజ్
అనే స్నేహితుడు వుండేవాళ్లం. నేను ఎక్కువగా మావూళ్లోనే వుంటూ, గ్రామ రాజకీయాలలో యాక్టివ్ గా వుండేవాడిని. ఆ విషయాలు మున్ముందు.
ఇక్కడ
అన్నింటికన్నా ఎల్విఎస్ఆర్ శర్మ అనే నా బాల్యస్నేహితుడైన ఒక ముఖ్యమైన వ్యక్తి
విషయం తెలియచేయాలి. వాడు నాకు, భండారు శ్రీనివాసరావుకు హెచ్ ఎస్ సి వరకు, ఆ తరువాత నాకు పియుసిలో క్లాస్ మేట్. తల్లీ, తండ్రి
చిన్నతనంలోనే చనిపోడంతో, ‘నా’ అనేవారెవరూ లేని స్నేహితుడు.
ఖమ్మంలో చిన్నప్పుడు వరసకు మేనత్తగారింట్లో వుండి చదువుకునేవాడు. మామయ్యగారితో
తనను వేదిస్తున్నందుకు గొడవపడి, మొదట్లో కొంతకాలం తాత్కాలికంగా హెచ్ ఎస్ సిలో
వున్నప్పుడు, ఆ తరువాత పియుసిలో చేరాక శాశ్వతంగా వాళ్లింటి
నుంచి బయటకొచ్చాడు. వారాలు చేసుకుని ఖమ్మంలో పియుసి పూర్తి చేశాడు. బహుశా
పాసవ్వలేదనుకుంటా. ఆ తరువాత విజయవాడకు చేరాడు. కొన్నాళ్లు మద్రాస్‌లో వుండేవాడు. పిన్నవయసులోనే
ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు, తమిళం
అనర్గళంగా మాట్లాడేవాడు.
విజయవాడ, మద్రాస్ లలో చేసిన ఉద్యోగాలేవీ నచ్చలేదు. నేను హైదరాబాద్‌లో
చిక్కడపల్లిలోని ఇంట్లో రమణ, రంగారావులతో వుంటున్నప్పుడు,
తనకేదన్నా ఉద్యోగం ఇప్పించమని, హైదరాబాద్
వస్తానని ఉత్తరం రాశాడు. సరే, రమ్మన్నాను. తాజ్ మహల్ హోటల్లో లెక్కల పద్దురాసే
ఉద్యోగాన్ని మిత్రుడు కామత్ ఇప్పించాడు. అది వాడికి నచ్చలేదు. మేం తెప్పించుకునే
కారేజీ భోజనంలోనే వాడు కూడా సర్దుకుపోయేవాడు. పెద్దగా అవసరాలు వాడికేమీ లేనందున
చేతిలో పైకం అవసరం అంతగా లేకుండేది. ఏదన్నా వుంటే,
నిర్మొహమాటంగా అడిగి తీసుకునేవాడు. నాదగ్గర లేకపోతే, అడిగినప్పుడు ఇవ్వలేకపోతే
నిష్టూరాలు ఆడే వ్యక్తికాదు శర్మ.
చివరకు
‘తద్దినం బ్రాహ్మణుడి’ అవతారం ఎత్తాడు. స్నానంచేసి, గోడకున్న
సున్నాన్ని ‘విభూతి’లాగా పెట్టుకుని, చేతికందిన పూజల
పుస్తకాన్ని పట్టుకుని, చిక్కడపల్లి స్వరాజ్ హోటెల్ దగ్గరున్న బ్రాహ్మణుల ‘అడ్డ’కు
పోయి ఉదయాన్నే కూర్చుండేవాడు. అక్కడికి ‘బ్రాహ్మణీకం’ అవసరాలున్నవారు వచ్చేవారు. వాళ్ల
అవసరాలకు అనుగుణంగా, వీడు ‘భోక్త’ గానో, ‘తద్దినం పెట్టించే బ్రాహ్మణుడు’ గానో, వ్రతాలు
చేయించే ‘పూజారి’గానో మారేవాడు. తద్వారా, ఆపూటకు భోజనం,
కొంత ‘సంభావన’ గిట్టేది. సంభావనతో రాత్రి భోజనం కానిచ్చేవాడు. ఏపనీ
దొరకని నాడు మాతోనే భోజనం. అలా కొన్నాళ్లు చేసి, మళ్లీ
మద్రాస్ వెళ్లి పోయాడు.
కొన్నాళ్లు
గయ దగ్గర ఆయుర్వేద కంపెనీలో పని చేశాడు. అక్కడ నుంచి చక్కటి ఉత్తరం రాశాడు. అందులోని
అక్షరం, అక్షరం మున్ముందు రాస్తాను. పెళ్లి చేసుకుని విజయవాడలో స్థిరపడి పోయాడు. కొన్నాళ్లు
మద్యం దుకాణాలలో పని చేసేవాడు. ఆ తరువాత సత్యనారాయణపురంలోని తన ఇంటి నుండే చిన్న ఇడ్లీల
హోటెల్ ప్రారంభించాడు. 15 సంవత్సరాల క్రితం హఠాత్తుగా చని పోయాడు.
విద్యార్జనకు
పటిష్ఠ పునాది వేసిన రోజులు మాత్రమే కాదు అవి. నాలో వ్యక్తిత్వ వికాసానికి, సామాజిక స్పర్శకు, రాజకీయాల పట్ల పెరుగుతున్న ఆసక్తికి
పటిష్టమైన బీజం పడిన రోజులు. న్యూసైన్స్ కాలేజీలో గడిపిన విద్యార్ధి జీవితం,
యువతీ మండలి మైదానంలో నా అభిమాన క్రికెట్ ఆట ఆడుతూ చెమట చిందించిన
క్షణాలు, విద్యార్థి స్నేహితులతో గడిపిన సంతోష సందర్భాలు, భవిష్యత్తులో నా జీవితానికి బలం చేకూర్చాయి. పాఠాలు నేర్చుకోవడం మాత్రమే
కాదు, పరాజయాన్ని అంగీకరించడం, ఆ
పరాజయాల నుండే విజయాలకు బాటలు వేసుకోవడం, పునరుజ్జీవనం పట్ల నాదైన
శైలిలో నమ్మకం పెంచుకోవడం అప్పుడు నేర్చుకున్నాను.
విద్యార్థిగా
రాసిన పరీక్షలు కంటే, జీవితం పెట్టిన పరీక్షలే ఎక్కువ నేర్పాయి. బీఎస్సీ ఫైనల్
ఇయర్ పరీక్షలలో లెక్కల పేపర్ ఒక్కటే రాసిన సందర్భంలో, మిగిలినవేవీ
రాయ(లే)క పోవడాన్ని అప్పట్లో పరాభవంగా భావించినా, అంతర్మథనం దరిమిలా, నాలో రాజకీయాలు, సమాజం, ప్రజల
సమస్యలపట్ల అవగాహన కలగడానికి, లైబ్రేరియన్ స్థాయినుండి గవర్నర్, ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసే అవకాశం కలగడానికి దోహదపడింది. నా స్నేహితులలో
ప్రపంచం చుట్టినవారు, శాస్త్రవేత్తలైనవారెందరో, జీవితయాత్రను నిశబ్దంగా సాగిస్తున్నారు. అప్పటి అనుబంధాలు, చిరునవ్వులు, కలసి నడిచిన క్షణాలు జీవితాన్ని
సార్ధకంగా మార్చాయి. ప్రతి వ్యక్తి, ప్రతి సంఘటన, ప్రతి గది, జీవిత పాఠశాలలో ఓ గురువు, గురుకులం అయ్యాయి.
వెనుకంజలను
చూసుకుంటూ ముందుకు నడవడమే నా ఈ జ్ఞాపకాల గొప్పతనం. ఇవి నా గతాన్ని గుర్తుచేయడమే కాదు, నా ఎదుగుదలకు పునాది కూడా. ఈ అనుభవాలను పంచుకోవడం, నిజానికి,
నన్ను నాలోనే మరోసారి చూసుకోవడం. ఇదే వ్యక్తిత్వ వికాసం. జీవన పాఠం.
స్వీయానుభవాల పరిపక్వతలలో భాగం.


No comments:
Post a Comment