వ్యక్తిత్వ వికాసం, జీవన పాఠాలు, స్వీయానుభవాల పరిపక్వత-8
హైదరాబాద్
నగరంలో కళాశాల చదువు, జీవనయానం
ఆరంభం
వనం
జ్వాలా నరసింహారావు
ఖమ్మంలో
బిఎస్సీ డిగ్రీ మొదటి ఏడాది చదువు పూర్తి చేసుకుని, మిగతా
రెండేళ్లు హైదరాబాద్ లో చదవాలన్న ఉద్దేశంతో 1964 సంవత్సరంలో హైదరాబాద్ కు
వచ్చాను. నేను-మా
నాన్న గారు, హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ సచివాలయంలో
ఉద్యోగం చేస్తూ, చిక్కడపల్లిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం
పక్క సందులో నివాసముంటున్న మేనమామ కంకిపాటి సత్యనారాయణ రావు గారిని కలిశాం. సత్యనారాయణ
రావు మామయ్య హైదరాబాద్‌లోనే డిగ్రీ చదివి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో
టాప్ రాంకర్‍గా (యూనివర్సిటీ ఫస్ట్) పాసైన
నేపధ్యం వున్నది.
మంచి
స్టయిలిష్‍గా, ఎల్లప్పుడూ టిప్-టాప్‌గా
వుండేవారు. సచివాలయంలో ఎల్డీసి గా చేరి, మైనింగ్ శాఖ సహాయ
కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. నీతికి-నిజాయితీకి మారు పేరు. లక్షలాది రూపాయలు లంచంగా
పొందగలిగే అవకాశమున్న గనుల శాఖలో ఉద్యోగం చేసినప్పటికీ పైసా అక్రమ సంపాదన చేయని మహోన్నతమైన
వ్యక్తిత్త్వం ఆయనది. కేవలం తన ‘జీతం సంపాదన’ తోనే పిల్లలను
చదివించి, గొప్పవారిని చేసిన నిబద్ధతగల వ్యక్తి ఆయన. పిల్లలు డాక్టర్ గా, ఇంజనీర్ గా, లాయర్ గా పైకొచ్చారు.
నేను
హైదరాబాద్ వచ్చినప్పుడు, 1964-66 మధ్య కాలంలో అప్పటి రాజకీయాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు వాటిలో అభిరుచి వున్న నాకు
స్పష్టంగా గుర్తున్నాయి. అప్పటికి నా వయసు 16 సంవత్సరాల లోపే. 1962 ఎన్నికల అనంతరం,
నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య కాంగ్రెస్
శాసనసభాపక్ష నేతగా పోటీలో నిలిచినప్పటికీ, సంజీవరెడ్డి
ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి వీలుగా సంజీవయ్యను పోటీనుండి తప్పుకోవాలని
అధిష్టానం ఆదేశించింది. మరోమారు నీలం సిఎం
అయ్యారు.
నీలం
సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా అది రెండో టర్మ్. అప్పటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ
బలంగా ఉన్నప్పటికీ, శాంతి, అభివృద్ధి పరంగా సవాళ్ల
సమయం. ఐదేళ్ళ తరువాత డాక్టర్ మర్రి చెన్నారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవడం
జరిగింది. సంజీవరెడ్డి ఈసారి గతానికన్నా చాకచక్యంగా మంత్రివర్గం ఏర్పాటు చేసిన
పేరు వచ్చినప్పటికీ, అల్లూరి సత్యనారాయణ రాజుకి
స్థానమీయలేదు. సంజీవయ్యను చేరమంటే ఆయన అంగీకరించలేదు. సంజీవయ్య అఖిల భారత
కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.
నీలం
సంజీవరెడ్డికి వ్యతిరేకంగా పార్టీలోని కొందరు నేతలు అసంతృప్తిగా ఉండడం మొదలైంది.
ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరగడం లేదన్న అభిప్రాయం బలపడింది. కర్నూలు
జిల్లాలో బస్సు రూట్లను జాతీయం చేసినందుకు బస్సు యజమానులు సుప్రీంకోర్టును
ఆశ్రయించి, కేసు గెలుచుకున్నారు. ముఖ్యమంత్రి వ్యతిరేకులైన
పిడతల రంగారెడ్డి, విజయభాస్కరరెడ్డి అనుయాయులకు ఇబ్బంది కలిగించడానికి నీలం అలా
చేశారని అప్పట్లో విమర్శ వుండేది. వారి ఫిర్యాదులను సుప్రీంకోర్టు 1964 ఫిబ్రవరి
23న అంగీకరించింది. తప్పు తనమీద వేసుకొని సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
చేశారు. 1964 మే 27న ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ మరణించారు. లాల్ బహాదూర్
శాస్త్రి ప్రధానమంత్రి అయ్యారు.
సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపధ్యంలో 1964 లో సిఎం పదవికి
రాజీనామా చేసిన సంజీవరెడ్డి, అధిష్టానం సూచనమేరకు సీఎల్పీ నాయకుడిగా కొనసాగుతూ, తనకు
అనుకూలుడైన బ్రహ్మానందరెడ్డిని ముఖ్యమంత్రిగా ‘నామినేట్’
చేయించగలిగాడు. సీఎల్పీ నాయకుడిగా
ఎన్నిక కాకుండానే, ముఖ్యమంత్రి కావడం మొదటిసారి, బహుశా చివరిసారి కూడా కావచు. నెహ్రూ
మరణానంతరం, లాల్ బహదూర్ మంత్రివర్గంలో సభ్యుడైన తరువాత, సీఎల్పీ నాయకత్వానికి సంజీవరెడ్డి రాజీనామా
చేయడం, ఆయన స్థానంలో బ్రహ్మానందరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అంతా అధిష్టానం చలవే, అనుగ్రహమే! బ్రహ్మానందరెడ్డి తలపై
టోపీని అటూ ఇటూ మార్చితే అమోఘ మైన రాజకీయ ఎత్తు వేసినట్టే అనే పేరు ఉండేది ఆ
రోజుల్లో. ఒక పర్యాయం ఎల్బీ స్టేడియంలో అలా ఆయన చేసిన కొన్ని గంటలలోనే పలు రాజకీయ
మార్పులు చోటు చేసుకున్నాయి.
బ్రహ్మానందరెడ్డి
మంత్రివర్గంలో సంజీవరెడ్డి మినహా ఆయన మంత్రివర్గ సభ్యులంతా మంత్రులుగా చేరారు.
మొదట్లో శాఖల మార్చుకూడా చేయలేదు. నాలుగైదు నెలల తర్వాత సంజీవరెడ్డి అనుమతిలేకుండా
తోట రామస్వామి, చెంచు రామానాయుడు, తానేటి
వీరరాఘవులను మంత్రివర్గంలో చేర్చుకున్నాడు. సంజీవరెడ్డి అఖిలభారత స్థాయి
నాయకుడైనప్పటికీ, రాష్ట్రరాజకీయాలమీద మమకారం పోలేదు. అదొక
బలహీనత అనాలి. ఫలితంగా ఏసీ సుబ్బారెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ఒక గ్రూపు ఆవిర్భవించింది.
దీనికి స్నేహితులు అతన్ని వివిధ కారణాల వల్ల ప్రోత్సహించారు. ఏసీ సుబ్బారెడ్డిని
మంత్రివర్గంలో తీసుకోవడమే కాకుండా, ఆయనకు నెల్లూరు జిల్లా ప్రత్యర్థి
చెంచు రామానాయుడును కూడా మంత్రివర్గంలో చేర్చుకున్నారు.
ఆగ్రహించిన
ఏసీ సుబ్బారెడ్డి ముఠారాజకీయాలకు మరింత పదును పెట్టారు. అసమ్మతి, సమ్మతి గ్రూపులుగా మంత్రివర్గం నిలువునా చీలింది. ఈ ముఠా చీలికలు
జిల్లాలోని నాయకత్వాన్ని కూడా ప్రభావితం చేశాయి. తెలంగాణా ప్రాంతంలో ఒకరంటే మరొకరికి
పడని రాజకీయ నాయకులు పక్షాలు మార్చారు. సంజీవరెడ్డి వ్యతిరేకైన చెన్నారెడ్డి,
బ్రహ్మానందరెడ్డి వర్గంలో చేరడంతో, నూకల రామచంద్రారెడ్డి సంజీవరెడ్డి
వర్గంలో చేరాడు. 1966 జనవరిలో ప్రధాని లాల్ బహాదుర్ శాస్తి ఆకస్మిక మరణంతో, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీకి
కొత్త నాయకుని ఎన్నిక అవసరమైనది. బ్రహ్మానందరెడ్డి, సంజీవరెడ్డిని
సంప్రదించకుండానే ఇందిరాగాంధీని బలపరిచారు. 1966 జనవరి 19వ తేదీన జరిగిన పార్లమెంటరీ
పార్టీ నాయకత్వ పోటీలో ఇందిరాగాంధీ మురార్జీ దేశాయ్‌ని ఓడించి ప్రధానమంత్రి
అయ్యారు.
ప్రధానమంత్రి
ఎన్నిక లాంటి ముఖ్య విషయంలో ముఖ్యమంత్రి కాసు సంప్రదించకపోవడంతో తన ప్రాముఖ్యత తగ్గుతున్నదేమో అన్న అనుమానం కలిగింది
సంజీవరెడ్డికి. బ్రహ్మానందరెడ్డిని అదుపులో పెట్టే ఆలోచనలు మొదలైనాయి. రాజకీయాలలో
శాశ్వత మిత్రత్వం, శాశ్వత శత్రుత్వం లేదనేది ఋజువు పరుస్తూ,
సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డిల మిత్రత్వం అచిరకాలంలోనే
వైరంగా మారింది. 1965లో అణచివేతల మధ్య తెలంగాణలో
అసంతృప్తి పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణ వారికి తక్కువ అవకాశాలు, అభివృద్ధిలో తీవ్ర వ్యత్యాసం వంటి అంశాలు
తెలంగాణవారిలో అసంతృప్తికి దారితీశాయి. మొత్తం మీద 1964 నుంచి 1966 మధ్య ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరిగాయి. ముఖ్యంగా తెలంగాణ
ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర ఆందోళనల పునాదులు వేయబడిన కాలం ఇది. తెలంగాణలో ఉన్న
అసంతృప్తి మరింత పెరిగింది. మర్రి చెన్నారెడ్డి లాంటి నాయకుల సలహాలు అధిష్టానం
వినే పరిస్థితిలో లేని సమయం అది.
ఈ
నేపథ్యంలోని భావోద్వేగమే తరువాతి కాలంలో ‘జై తెలంగాణ’ ఉద్యమానికి ప్రేరణగా
మారింది. కాసు బ్రహ్మానందరెడ్డి తన క్యాబినెట్‌ను పునర్నిర్మించి, తెలంగాణకు చెందిన నేతలకు స్థానం ఇచ్చినా, అది
ప్రాతినిధ్య పరంగా మాత్రమేనని భావించి ప్రజలలో అసంతృప్తి కొనసాగింది. ఈ రెండు
సంవత్సరాలు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజల భావోద్వేగాలకు
రాజకీయ అవకాశాల పునాది వేయబడిన కాలంగా పేర్కొనాలి. జాగృతమైన ప్రాంతీయతా భావన,
ఉద్యోగాల్లో అసమానత, పాలనలో ప్రాతినిధ్యం
తక్కువతనంపై చర్చలు మొదలైన కాలమిది. ఈ కాలంలో విత్తనంగా నాటిన జై తెలంగాణ భావన,
వచ్చే దశాబ్దంలో ఉద్యమంగా వికసించడం ఈ దశలోనే మూలంగా ఉంది. అవన్నీ
నాలో రాజకీయాసక్తికి కారణ భూతాలే. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలింది.
ఈ
రాజకీయ నేపధ్యంలో నేను హైదరాబాద్ చేరుకున్నాను. అప్పట్లో (ఇప్పట్లో కూడా) మామయ్య
కుటుంబం, చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్క సందులో, మాకు వరసకు బంధువైన
గూడూరు వారింట్లో ఒక పోర్షన్‌లో అద్దెకుండేది. పక్క పోర్షన్‌లో
మా విమలమ్మ అత్తయ్య సొంత అన్నగారు (ఆయన ఎజి కార్యాలయంలో
ఉద్యోగం చేసేవారు) వెంకట్ రామారావు గారు అద్దెకుండేవారు.
దరిమిలా ఆ ఇంటిని ఆయన కొనుక్కున్నారు. ఇంటి
ఎదురుగా వున్న 150 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని మామయ్య
కొనుక్కుని, అందులో చిన్న రెండస్తుల ఇల్లు నిర్మించుకున్నారు.
ఇప్పటికీ స్వర్గీయ మామయ్య, ఉమ్మడి కుటుంబం ఆ
ఇంటిలోనే నివసిస్తున్నారు. నేను హైదరాబాద్ వచ్చిన
తొలిరోజుల్లో మామయ్యకు నలుగురు (డాక్టర్ విజయ్ రాధాకిషన్, నాగన్న,
జయ, పద్మ) పిల్లలుండేవారు. తరువాత మరో నలుగురు (లాయర్ శీను, ఎన్నారై గోపి,
జానకి, ఇంజనీర్ తులసి-చిట్టి) పుట్టారు.
స్వర్గీయ కంకిపాటి సత్యనారాయణ రావు మామయ్య
ఇంటికి, 87 సంవత్సరాల వయసున్న మా విమలత్తయ్యను (మా ఆవిడకు పిన్నిగారు) చూడడానికి
నేను, మా ఆవిడ కలిసి అడపాదడప వెళ్తుంటాను.
వెళ్లినప్పుడల్లా చాలాసేపు కబుర్లు చెప్పుకుంటాం. వయసుతో వచ్చిన ఆరోగ్య సమస్యలు
వున్నప్పటికీ ఆప్యాయంగా మమ్మల్ని పలకరించి, సరదాగా మాట్లాడుతుంది.
మా అత్తయ్య విమలమ్మ, మామయ్యకు అన్ని విధాల తగిన సహధర్మచారిణి. తింటే ఆమె చేసిన, ఆప్యాయంగా వడ్డించే వంటే తినాలి. అంత రుచిగా, ఎప్పటికీ
గుర్తుంచుకునేలా వుంటుంది. భోజనంలో వేసిన ‘మీగడ పెరుగు’ ఇంకా గుర్తుంది నాకు.
మామయ్య
కుటుంబం, పొరుగున వుండే మా అత్తయ్య సోదరుడి కుటుంబం ఎంత
కలిమిడిగా వుండేవారంటే, ఇరు కుటుంబాలకూ కలిపి ఒకే వంట
ఇల్లుండేది. ఒక నెలంతా ఒకరి పోర్షన్‌లోని కిచెన్‌లో వండితే మరుసటి నెల మరొకరి
పోర్షన్‌లో ఆ పని జరిగేది. అందరూ ఒకే చోట భోజనం చేసేవారు. ఖర్చు చెరిసగం
పంచుకునేవారు. ఎవరింటికి బంధువులొచ్చినా, వారిని, ఇరువురూ తమ బంధువులాగానే చూసుకునేవారు. నాకు గుర్తున్నంతవరకు కనీసం పాతిక,
ముప్పై సంవత్సరాలన్నా అలా కలిసి మెలిసి భోజనాలు చేశారు. ఆప్యాయతలకు,
అనురాగానికి పర్యాయపదాలు, మామయ్య, అత్తయ్య, ఆమె అన్నగారు, వదినగారు.
హైదరాబాద్
వచ్చిన మొదట్లో, బీఎస్సీ చదువుతున్నప్పుడు, చాలా రోజులు మామయ్య
ఇంట్లోనే రుచికరమైన భోజనం చేసేవాడిని. వాళ్ల ఇంట్లో (ఇల్లు చాలా చిన్నదైనప్పటికీ)
ఎన్నో రాత్రులు అక్కడే పడుకునేవాడిని. వారి మేడమీద ఆరుబయట ప్రదేశంలో చల్లటి గాలి
వీస్తుంటే హాయిగా నిద్రపట్టేది. బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో లైబ్రేరియన్
గా ఉద్యోగం వచ్చిన పారంభంలో నేను ఉదయాన్నే లేచి ఉద్యోగానికి వెళ్లడానికి వీలుగా
పొద్దున్నే లేచి నాకొరకు వంట చేసి, ఆప్యాయంగా వడ్డించి, మధ్యాహ్నం తినడానికి లంచ్ బాక్స్ ఇచ్చి పంపించేది మా విమలత్తయ్య. అత్తయ్య
ఆప్యాయత అనురాగాలు వెలకట్టలేనివి.
మా
విమలమ్మ అత్తయ్యతో గడిపినప్పుడల్లా, పాత విషయాలు ఎన్నో
గుర్తుచేసుకునేవారం. మామయ్య, అత్తయ్య ఎప్పుడూ మా ఆవిడను ‘నా పెద్ద కూతురు’ అని సంబోధించడం ఎంతో సంతోషాన్నిచ్చేది. కలిసినప్పుడల్లా అత్తయ్య
పేరుపేరునా మా ఇరువురికి తెలసిన బంధుమిత్రులు అందరినీ గురించి, వారి క్షేమ సమాచారం
గురించి అడిగి తెలుసుకునేది. మా పిల్లలను గురించి, మనుమలు, మనుమరాళ్ళ గురించి ప్రత్యేకంగా అడిగేది. బుంటితో వీడియో కాల్ చేయమని
అడిగి మాట్లాడేది. ఇటీవల కలిసినప్పుడు నేను రాసిన ‘సజీవ వాహిని సనాతన ధర్మం’ పుస్తకాన్ని ఇవ్వగానే పేజీలు తిరగేసింది.
శుభాకాంక్షలు తెలియచేసింది. మా అత్తయ్యను కంటికి రెప్పలాగా చూసుకుంటూ, ఏరకమైన ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడుతున్న, కుమారుడు శీను, కోడలు అనురాధ, వారి ఇద్దరు కూతుళ్లు శరణ్య, సమన్వితలను ఎంతగా
అభినందించినప్పటికీ అది తక్కువేమో బహుశా. ఇటేవలే మా మనమరాలి వివాహ ఆహ్వాన శుభలేఖ
ఇచ్చివచ్చింది బుంటి-ప్రేమ.
1964 జూన్ నెలలో నేను, నాన్న గారు కలిసి హైదరాబాద్ చేరుకున్నాం. ఖమ్మంలో
మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూడా బస్ స్టాండ్ చేరుకునే
సరికి సాయంత్రం ఏడు దాటింది. అప్పట్లో ఎక్స్ ప్రెస్ బస్సు కాదది. ఫాస్ట్ పాసింజర్
లాంటిది. కండక్టర్ తనకు ఇష్టమొచ్చిన చోట బస్సును ఆపేవాడు. చిక్కడపల్లి వెళ్లడానికి
గౌలిగూడా నుంచి రిక్షా కుదుర్చుకున్నాం. రిక్షా వాడిని మొదలు ‘చల్తే క్యా’ అని
అడగాలి. అంతా హింది-ఉర్దు కలిసిన భాష. ‘కహా జానా సాబ్’ అని వాడు అడగడం, మేం
చిక్కడపల్లి ‘దేవల్ కి బాజు గల్లీ’ అని చెప్పడం, అంగీకరించిన
రిక్షా వాడు ‘బారానా’ (75 పైసలకు సమానం) కిరాయి అడుగుతే, మేం ‘ఛె ఆనా’ (వాడడిగిన దాంట్లో సగం) ఇస్తామనడం, చివరకు
‘ఆఠానా’ కు కుదరడం జరిగిపోయింది.
మామయ్యకు
డిగ్రీలో లెక్కల సబ్జెక్ట్ బోధించిన స్వర్గీయ డీవీ ద్వారక గారు ఉస్మానియా
యూనివర్సిటీలో గణితశాస్త్ర అధ్యాపకుడిగా పని చేస్తున్నారప్పుడు. మామయ్య ఇంటి పక్క వీధిలో వుండేవారాయన. న్యూ సైన్స్
కాలేజీలో సీటు ఇప్పించమని ద్వారకా గారిని అడగ్గానే, మా
అభ్యర్థన మేరకు మర్నాడు నన్ను కాలేజీకి తీసుకెళ్లి ప్రిన్సిపాల్ సి సుదర్శన్
గారికి పరిచయం చేశారు. సీటు కావాలని కోరారు. ఆయన వెంటనే
సీటివ్వడానికి అంగీకరించారు. అలా బీఎస్పీ (ఎం.పీ.సీ) రెండో సంవత్సరంలో 1964 జూన్ లో న్యూ సైన్స్ కళాశాలలో
చేరాను. న్యూసైన్స్ కళాశాలలో చదువుతున్నప్పుడే రాష్ట్ర, దేశ రాజకీయాసక్తి పెరిగింది.


No comments:
Post a Comment