వ్యక్తిత్వ వికాసం, జీవన పాఠాలు, స్వీయానుభవాల పరిపక్వత-9
హైదరాబాద్
న్యూసైన్స్ కళాశాలలో చేరిక, హైదరాబాద్ నగర
తొలి అనుభవాలు
వనం
జ్వాలా నరసింహారావు
నారాయణగూడా
న్యూసైన్స్ కళాశాలను జులై 17, 1956 న, నూతన విద్యా సమితి యాజమాన్యం కింద, మేధావి ఆచార్య సి
సుదర్శన్, జిఎస్ మెల్కోటే సంయుక్త ఆలోచనతో స్థాపించడం
జరిగింది. న్యూసైన్స్ కాలేజీలో అత్యంత నైపుణ్యం కల మేధావులైన
విద్యావేత్తలెందరో పని చేసేవారు. 1982 సంవత్సరంలో కళాశాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు
జరుపుకున్న సందర్భంలో, యాజమాన్య బాధ్యతలను, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ విద్యాభవన్ చేపట్టింది. నారాయణగూడలోని కళాశాల భవనానికి అదనంగా అమీర్ పేటలో మరో బ్రాంచ్ కూడా
స్థాపించింది యాజమాన్యం దరిమిలా. ప్రిన్సిపాల్ సుదర్శన్
గారితో ఆనాడు మొదలైన నా పరిచయం ఆ చివరి రోజుల వరకూ కొనసాగింది. నేను రాజ భవన్ లో పని చేస్తున్నప్పుడు, ఆ పరిచయం
కాస్త బలపడింది కూడా.
ఒడిషా
రాష్ట్రంలోని బరంపురంలో జన్మించిన డాక్టర్ జిఎస్ మెల్కోటే సుప్రసిద్ధ స్వాతంత్ర్య
సమరయోధులు, వైద్యులు, పరిపాలనా దక్షులు. తొలితరం
తెలంగాణ నాయకులు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్ఎంఎస్ పరీక్షలో యూనివర్సిటీ ఫస్ట్
రాంక్ సంపాదించి, బంగారు పతకం అందుకున్నాడు. 1916లో స్వదేశీ
ఉద్యమంలో, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. కరాచీ కాంగ్రెస్ లో హైదరాబాదు
ప్రతినిధిగా, హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ సభ్యులై క్విట్ ఇండియా ఉద్యమంలో
పాల్గొన్నాడు. 1947, ఆగస్టు 15 న భారతదేశ స్వాతంత్ర్యం
సందర్భంగా జాతీయ పతాకాన్ని హైదరాబాదులో ఎగురవేయదానికి ప్రయత్నించినప్పుడు నిజాం
ప్రభుత్వం నిర్బంధించింది. పోలీసు చర్య అనంతరం విడుదలయ్యాడు.
స్వతంత్ర
భారతదేశంలో, హైదరాబాద్ ముషీరాబాదు నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికై, 1952 నుండి 1956 వరకు సభ్యుడిగా వున్నారు. ప్రజా పనుల శాఖ, ఆర్థికశాఖల
మంత్రిగా పనిచేశారు. 1957లో రాయచూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారిగా
పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. 1962 నుండి 1977 వరకు హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
నుండి ఎన్నికయ్యాడు. ఇతని భార్య విమలాబాయి కూడా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నది.
వీరి మాతృభాష కన్నడం అయినా, ఆంధ్రదేశానికి చేసిన సేవ గణనీయం. దేశీయ వైద్య
విధానాన్ని, యోగాసనాల ప్రభావాన్ని జోడించి ఉత్తమ వైద్యులుగా
ఖ్యాతిపొందాడు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, హైదరాబాదు
అధ్యక్షులుగా పనిచేశాడు. ఇతను పతంజలి యోగ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించాడు.
వీరి
కుమారుడు 80+ సంవత్సరాల వయసున్న గోపాల్ మెల్కోటే నేను న్యూసైన్స్ కళాశాలలో
చదువుతున్నప్పుడు నాకంటే సీనియర్. అప్పటి పరిచయం ఇప్పటికీ (ఆయన అమెరికాలో
ఉన్నప్పటికీ) కొనసాగుతూనే వున్నది. నేను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్
రావు గారికి ప్రధాన పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్నప్పుడు, గోపాల్ మేల్కోట్ సెప్టెంబర్ 26, 2015న క్యాంపు
కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు.
తెలంగాణ సాధించడంతో పాటు, తెలంగాణ అభివృద్ధికి కృషి
చేస్తున్నారని సిఎం ను గోపాల్ మేల్కోట్ అభినందించారు. ఎంపీగా, తెలంగాణ నాయకుడిగా స్వర్గీయ జిఎస్ మేల్కోట్ చేసిన సేవలను ఇద్దరూ
గుర్తుచేసుకున్నారు. గోపాల్ మేల్కోట్ వెంట అమెరికాకు చెందిన అప్లయిడ్ మెటీరియల్స్
చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీ ఓంకారం నలమాసు కూడా సిఎం ను కలిశారు.
నారాయణగూడా
న్యూసైన్స్ కళాశాల వ్యవస్థాపక ప్రిన్సిపాల్ సి సుదర్శన్ ఒక వ్యక్తికాదు, ఒక వ్యవస్థ. అంచెలంచెలుగా, వినమ్రతతో ఎదుగుతూ, అహర్నిశలూ ఆవిష్కరణల కోసం కృషి చేశాడు. తనలోని అశేష ప్రతిభావంతమైన
విద్యా-విజ్ఞానపరమైన విత్తనాలను వెదజల్లుతూ, ఎంతోమంది
గొప్పవారిని సృష్టించాడు. నిబద్ధతకు, నిరాడంబరతకు,
నిస్వార్దానికి నిలువెత్తు నిదర్శనం సుదర్శన్ గారు. తాను నిర్దేశించుకున్న లక్ష్యం
నెరవేరేదాకా ముందుకు సాగడమే తప్ప వెనుదిరిగి చూడనిథీశాలి. మహనీయు. మహోన్నతమైన
వ్యక్తి. ఆ లక్ష్యంలో ప్రధాన భాగమే ఉన్నతోన్నతమైన జ్ఞాన వృక్షంగా రూపాంతరం చెందిన
నేటి భవన్స్ న్యూ సైన్స్ కాలేజ్, ఒకప్పటి నారాయణగూడా న్యూసైన్స్ కళాశాల.
సి
సుదర్శన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొంది, రసాయన శాస్త్రంలో లెక్చరర్‌గా వృత్తిని ప్రారంభించి, భవన్స్ న్యూ సైన్స్ కళాశాల స్థాపనకు బాధ్యత వహించారు, వ్యవస్థాపక ప్రిన్సిపాల్ గా చాలా సంవత్సరాలు పనిచేశారు. భారతీయ సంస్కృతికి
చెందిన అత్యున్నత ఆదర్శాలను పాటిస్తూ, అనేకానేక మంది ఉపాధ్యాయ
నిపుణులను తీర్చిదిద్దారు. వారిని అనునిత్యం ప్రోత్సహిస్తూ,
ఉమ్మడి కృషి వల్ల న్యూ సైన్స్ కళాశాలను, మేము చదువుకుంటున్న రోజుల్లో, జంట నగరాల్లో అత్యుత్తమ కళాశాలలో ప్రధమ స్థానానికి తీసుకెళ్లారు.
ప్రీ-యూనివర్శిటీ కోర్సుల నుండి పోస్ట్-గ్రాడ్యుయేట్ కోర్సులవరకు ప్రవేశపెట్టారు.
కళాశాలకే కాకుండా దేశవ్యాప్తంగా ప్రేరణగా నిలిచిన సుదర్శన్ గారి అరుదైన
వ్యక్తిత్వం విలువకట్టలేనిది.
మొత్తం మీద, ద్వారక
సార్ పుణ్యమా అంటూ, 1964 జూన్
నెలలో న్యూ సైన్స్ కాలేజీలో బిఎస్సీ డిగ్రీ రెండో సంవత్సరంలో చేరాను. అప్పటికే
ఫస్ట్ ఇయర్ లో చేరిన వారి సంఖ్య 150 దాటింది.
నా రోల్ నంబర్ ‘150 X’ గా కేటాయించారు. కాలేజీలో చేరడం పూర్తయిన
తరువాత వుండడానికి గది వెతుక్కోవడం (నెలసరి అద్దె పది రూపాయల లోపే) చేసిన మొదటి
పని. నాన్న గారు నెలకు పంపించే వంద రూపాయలు, ఫీజులకు, నెలంతా ఖర్చులకు పోను, ఇంకా
మిగిలేవి.
అప్పట్లో నారాయణ
గుడాలోని ‘యాక్స్’ టైలర్ దగ్గర కాని, ‘పారగాన్’ టైలర్ దగ్గర కాని పాంట్, షర్ట్ కుట్టించుకునేవాడిని. అప్పట్లో కుట్టు కూలీ ఐదారు రూపాయల కంటే
మించకపోయేది. ఇప్పటి లాగా అప్పట్లో ‘రెడీ మేడ్’ దుస్తులు
ఎక్కువగా లభించకపోయేవి. ఎక్కువగా ‘టెరిలీన్, వులెన్’
దుస్తులు లభించేవి. కాటన్ తక్కువే. మొదట్లో ‘బాటం వెడల్పు’ గా వుండే పాంట్లు, ఆ
తరువాత ‘గొట్టం’ పాంట్లు, అవి పోయి ‘బెల్ బాటం’ పాట్లు కుట్టించుకునే
వాళ్లం. పాంటు కింద భాగంలో మడతతో కొన్నాళ్లు, మడత లేకుండా
కొన్నాళ్లు ఫాషన్‌గా వుండేది. బట్టలు ఎక్కువగా ‘ఎఫ్ డి ఖాన్ బట్టల దుకాణం’ లో కొనే
వాళ్లం.
విద్యా నగర్
లో వున్నంత కాలం ఇడ్లీలు, భోజనం చెలమయ్య హోటెల్ లో తినేవాడిని. విద్యా
నగర్ నుంచి కాలేజీకి వెళ్లడానికి ‘3-డి’ బస్సు ఎక్కి,
నారాయణ గుడాలో దిగి, నడుచుకుంటూ, విఠల్ వాడీ మీదుగా వెళ్లేవాడిని. ఒక్కో సారి ‘చారనా’
బాడుగ ఇచ్చి ‘చార్మీనార్ చౌ రాస్తా’ (ఇప్పటి ఆర్టిసి క్రాస్
రోడ్స్) వరకు రిక్షాలో వచ్చి, అక్కడ
నుంచి ‘7-సి’ బస్సెక్కి, వైఎంసిఏ దగ్గర
దిగి నడుచుకుంటూ వెళ్లేవాడిని కాలేజీకి. చార్మీనార్ చౌ
రాస్తా సమీపంలో చార్మీనార్ సిగరెట్ (వజీర్ సుల్తాన్ టొబాకో
కంపెనీ) కర్మాగారం, గోలకొండ సిగరెట్ (నీలం రంగు పాకెట్ లో వచ్చే) కర్మాగారం అక్కడే
వుండేవి.
చార్మీనార్ చౌ
రాస్తా నుంచి విద్యానగర్‍కు వెళ్లడానికి సిటీ బస్సులు లేవు. చార్మీనార్ చౌ రాస్తా,
ఆర్టిసి క్రాస్ రోడ్స్ నుంచి (ఇప్పుడున్న) టాంక్
బండ్‍ను కలిపే రోడ్డు అప్పట్లో లేదు. ఇప్పుడు టాంక్ బండ్‍ను
కలిపే స్థలంలో కొంచెం అటు-ఇటుగా ఒక ‘కల్లు కాంపౌండ్’ వుండేది.
ఇందిరా పార్క్ అసలే లేదు. ధర్నా చౌక్ కూడా
లేదు. ఇందిరా పార్క్ దగ్గర నుంచి టాంక్ బండ్ పక్కగా
ప్రస్తుతం వున్న ‘ఫ్లయిఓవర్’ కూడా లేదప్పుడు. ఆ రోజుల్లో
హైదరాబాద్‌లో కనీసం పాతిక-ముప్పై వేల రిక్షాలన్నా వుండేవి. మీటర్ టాక్సీలుండేవి
కాని, బేరం కుదుర్చుకోని ఎక్కించు కోవడం తప్ప మీటర్ ఎప్పుడూ
వేయక పోయేవారు. ఆటోలు కూడా వుండేవి కాని అంత పాపులర్ కాదు. ఆటోలలో ఇద్దరు
పాసింజర్లకే పర్మిషన్. టాక్సీలకు కిలోమీటర్‌కు పావలా చార్జ్.
సిటీ
బస్సుల్లో ప్రయాణం ఇప్పటి లాగా కష్టంగా వుండేది కాదు. హాయిగా ప్రయాణం చేసే వాళ్లం.
‘ఆగే బడో’ అనుకుంటూ కండక్టర్ సున్నితంగా చెపుతుంటే ప్రయాణీకులు క్రమశిక్షణతో
దొరికిన సీట్లలో కూచోవడమో,
లేదా, ఒక క్రమ పద్ధతిన నిలబడడమో చేసేవారు.
సింగిల్ బస్సులు, ట్రైలర్ బస్సులు, డబుల్
డెక్కర్ బస్సులు వుండేవి. కండక్టర్ చేతిలో టికెట్ ఇచ్చే మిషన్ వుండేది. బర్రున
తిప్పి ఒక చిన్న టికెట్ ఇచ్చేవాడు. టికెట్ ఖరీదు పైసల్లోనో, అణా-బేడలలోనో
వుండేది. కనీస చార్జ్ ‘అణా-ఆరు నయాపైసలు’ వున్నట్లు
గుర్తు.
ఇంతకీ
ఈ ‘అణా’ ఏంటనే ప్రశ్న రావచ్చు. నేను హైదరాబాద్ వచ్చిన కొత్త రోజుల్లో కొన్నాళ్ల
వరకు-బహుశా ఒక ఆర్నెల్ల వరకనుకుంటా, ఇంకా అణా-బేడలు
చలామణిలోనే వుండేవి. అందుకే ఇక్కడ కొంత మన నాణాల గురించి ప్రస్తావిస్తే
బాగుంటుందేమో! ఆగస్ట్ 15, 1947 భారత
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజుల్లో అమల్లో వున్న కరెన్సీ నాణాలు ‘దశాంశ’ తరహా
నాణాలు కావు. రూపాయను పదహారు ‘అణా’ లుగా, ఎనిమిది ‘బేడ’ లుగా,
నాలుగు ‘పావలా’ లుగా, రెండు ‘అర్థ రూపాయ’ లుగా
విభజించి చలామణిలో వుంచారు. ఒక ‘అణా’ కు నాలుగు పైసలు, లేదా,
రూపాయకు 64 పైసలు.
1957 లో ‘డెసిమల్’ పద్ధతిలోకి
చలామణిని మార్చింది ప్రభుత్వం. అయితే 1964
(నేను హైదరాబాద్ వచ్చిన కొత్త రోజుల) వరకు, నాన్-డెసిమల్
(అణా, బేడ, పావలా...), అలాగే డెసిమల్ పద్ధతులు రెండింటినీ వాడకంలో వుంచారు. అణా గుండ్రంగా, బేడ నాలుగు పలకలుగా, పచ్చ రంగులో వుండేవి. ఆ
తరువాత నాన్-డెసిమల్ నాణాల వాడకం ఉపసంహరించింది ప్రభుత్వం.
ఇప్పుడు మనం పైసలుగా వ్యవహరిస్తున్న నాణాలను 1957-1964 మధ్య కాలంలో ‘నయా పైసలు’గా పిలిచేవారు. 1, 2, 5, 10, 20, 25, 50 (నయా)
పైసల నాణాలు చలామణిలో వుండేవి.
విద్యా నగర్ నుండి
మకాం హిమాయత్ నగర్ పదకొండో వీధిలో ఒక ఇంట్లో (3-6-700) ముందు భాగంలో గదిలోకి
మారాను. మా పిన్ని కొడుకు కల్మల చెర్వు రమణారావు హైదరాబాద్ న్యూ సైన్స్ కాలేజీలోనే
డిగ్రీలో చేరడానికి రావడంతో ఇద్దరం కలిసి చెరి ఐదు రూపాయలు అద్దె ఇచ్చి అక్కడ
వున్నాం. డిగ్రీ రెండో సంవత్సరం లాంగ్వేజెస్ పరీక్షలు పూర్తైన తరువాత శెలవులకు
వెళ్తూ గది ఖాళీ చేశాం. పరీక్షల్లో నేను థర్డ్ క్లాస్‍లో
పాసయ్యాను. శెలవుల తరువాత మళ్లీ హైదరాబాద్ వచ్చి గది
వెతుక్కుంటున్నప్పుడు నేలకొండపల్లి వాస్తవ్యుడైన కంకిపాటి జగన్మోహన్ రావు కుమారుడు
సీతారాంరావు మాతో కలిసి వుంటానన్నాడు. ఆయన ఆ సంవత్సరం మా
కాలేజీలోనే పియుసి లో చేరాడు. ముగ్గురం కలిసి, లింగం పల్లి (వైఎంసిఏ సమీపంలో) రెడ్డి మహిళా కాలేజీ పక్క సందులో, రిటైర్డ్ డిఎస్పి
విశ్వనాధరావు ఇంట్లో ‘గారేజ్’ వుంటే పదిహేను రూపాయలకు అద్దెకు తీసుకున్నాం.
ముగ్గురం తలా ఐదు రూపాయలు భరించేవాళ్లం. కాలేజీకి
నడుచుకుంటూ పోయే వాళ్లం.
కాలేజీకి
వెళ్లే దారిలో వైఎంసిఏ కి ఎదురుగా ‘ఇంద్ర భవన్’ ఇరానీ రెస్టారెంటులోనో, కాకపోతే, కాలేజీ
ఎదురు గుండా (ఇప్పటికీ వుంది) ‘సెంటర్
కెఫే’కి పోయే వాళ్లం. 5 పైసలకు
ఒక సమోసా, లేదా, ఒక బిస్కట్ కొనుక్కుని
తిని, ‘ఇరానీ చాయ్’ (బహుశా) 15 పైసలిచ్చి తాగే వాళ్లం. ఒక్కోసారి ‘పౌనా’ తాగే
వాళ్లం. అప్పట్లో ‘పానీ పురి’ ఖరీదు కూడా 5 పైసలే. మిర్చి
బజ్జీ కూడా 5 పైసలకే
దొరికేది. అలానే సాయంత్రాలు చిక్కడపల్లి వెళ్లి ‘సాయిబాబా
మిఠాయి భండార్’లో ‘గులాబ్ జామ్, కలకంద’ తిని, అద్భుతమైన రుచితో వుండే ‘హైదరాబాద్ మౌజ్’ కలుపుకుని పాలు-పౌనా తాగే వాళ్లం. పావలాకు అర డజన్ మౌజ్-అరటి పళ్లు దొరికేవప్పుడు. చిక్కడపల్లి రోడ్డు మీద
వున్న మరో హోటెల్ ‘గుల్షన్ కెఫే’ కి కూడా వెళ్తుండేవాళ్లం.
గుల్షన్ కెఫే
సమీపంలో ‘రూబీ ఆర్ట్ స్టూడియో’ వుండేది. మామయ్య ఇంటి సందులోకి వెళ్లే ముందర, ‘ప్రజా
ఫార్మసీ మెడికల్’ షాప్, దానికి ఎదురుగా ‘మహావీర్ మెడికల్
షాప్’ వుండేవి. మామయ్య ఇంటికి పోయే సందులోనే ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు జి
వెంకటస్వామి ఇల్లుండేది. ఆయనను తరచుగా చూస్తుండేవాళ్లం. శెలవుల్లో హిమాయత్ నగర్‌లో
వున్న ‘గాయత్రీ భవన్’ కు కాని, నారాయణ గుడాలో వున్న తాజ్
మహల్ కు కాని టిఫిన్ తినడానికి వెళ్లే వాళ్లం. ఇక భోజనం
ఎప్పుడూ నారాయణ గుడా తాజ్ మహల్ హోటల్లోనే.
అప్పట్లో తాజ్
మహల్ లో 36 రూపాయలిస్తే
60 భోజనం
కూపన్లు ఇచ్చేవారు. తడవకు 18 రూపాయలిచ్చి 30 కూపన్లు కొనుక్కునే వాళ్లం.
కూపన్ పుస్తకంలో ‘అతిధులకు’ అదనంగా రెండు టికెట్లుండేవి. నెలకు అలా నలుగురు గెస్టులను ఉచితంగా భోజనానికి తీసుకెళ్లగలిగే వాళ్లం.
ఇక భోజనంలో ‘అన్ లిమిటెడ్’ పూరీలు ఇచ్చేవారు. సైజు
చిన్నగా వుండేవి. వూరగాయ పచ్చళ్లతో సహా తీరు-తీరు రుచులతో భోజనం, పరిశుభ్రంగా పెట్టేవారు హోటెల్
వారు. నేను స్టూడెంటుగా వున్నంతకాలం ఒక్క తాజ్ మహల్ హోటెల్
లోనే భోజనం చేశాను. క్రమేపీ రేట్ పెరుక్కుంటూ పోయింది.
ఇప్పుడు 36 రూపాయలకు
సింగిల్ ఇడ్లీ కూడా రాదు.
నిజాం
మీర్ ఉస్మాన్ అలీఖాన్ చివరి రోజుల గురించి, స్వామీ రామానంద
తీర్థ క్రియాశీల రాజకీయాలకు దూరంగా వుండడం గురించీ, రాజకీయాలమీద
ఆసక్తి నాలో పెరుగుతున్న నేపధ్యంలో, నేను గమనించిన అంశాలు, అలాగే, నా కాలేజీకి సంబంధించిన మరిన్ని విషయాల
గురించి మున్ముందు.


No comments:
Post a Comment