Monday, July 14, 2025

తెలంగాణ విద్వత్సభ, ఉద్దండ జ్యోతిష్ పండితుల, సిద్ధాంతుల విద్వద్గోష్టి ..... రాబోయే శ్రీ పరాభవనామ సంవత్సర పండుగల తేదీల నిర్ణయం : ఒక సమీక్ష: వనం జ్వాలా నరసింహారావు

 తెలంగాణ విద్వత్సభ, ఉద్దండ జ్యోతిష్ పండితుల, సిద్ధాంతుల విద్వద్గోష్టి

రాబోయే శ్రీ పరాభవనామ సంవత్సర పండుగల తేదీల నిర్ణయం

ఒక సమీక్ష: వనం జ్వాలా నరసింహారావు

          ఆదివారం (జులై నెల, 13,2025) సాయింత్రం హైదరాబాద్ నగరం నడిబొడ్డునున్న బేగంపేట పుష్పగిరి జగద్గురు శంకారాచార్య మహాసంస్థానంలో, పీఠాదిపతి శ్రీశ్రీశ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతీస్వామివారి దివ్య సమక్షంలో, ఉదయాస్తమానం వరకూ సుమారు 10 గంటలపాటు నిర్వహించిన, నవమ వార్షిక విద్వత్సమ్మేళనం, చివరి అంకంలో ఒక అద్యద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఆ సందర్భంగా ప్రతిసంవత్సరం ఆ సభలకు వెళ్లినవిధంగానే, ఈసారీ పోయినందున, ఆ ఘట్టాన్ని వీక్షించే అదృష్టం నాకు కలిగింది. ఈ సమావేశాల వేదికకు తెలంగాణ వైతాళికులు, వేదం, శాస్త్ర విద్వన్మణి స్వర్గీయ శాస్త్రుల విశ్వనాధశాస్త్రిగారి పేరు పెట్టారు. శ్రీ పరాభవనామ సంవత్సర పండుగల తేదీల నిర్ణయానికి ఈ సభ జరిగింది.

యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి అధ్యక్షుడిగా, గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి కార్యదర్శిగా ఏర్పాటైన తెలంగాణ విద్వత్సభ, గత 9 సంవత్సరాలుగా, మరుమాముల వెంకట రమణశర్మ (దర్శనమ్ శర్మ) నిర్వహణ, దర్శకత్వంలో, ఆయనే కర్తా, కర్మా, క్రియగా, నిర్వహించబడుతున్న ఈ విద్వత్సమ్మేళనాలు, అంతకు ముందులాగా కాకుండా, వివాదాలకు  అతీతంగా ఏకగ్రీవంగా, చర్చోపచర్చల అనంతరం, రాబోయే సంవత్సరానికి పండుగ తేదీలు నిర్ణయించి, ప్రభుత్వానికి (ముఖ్యమంత్రికి, లేదా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి) సమర్పించడం, వాటిని ప్రభుత్వం యధాతథంగా అంగీకరించడం ఆనవాయితీగా వస్తున్నది. ఆదివారం జరిగిన విద్వత్ సమ్మేళనంలో ఎప్పటిలాగే, తెలంగాణాకు చెందిన ప్రముఖ పంచాంగకర్తలు, సిద్ధాంతులు, జ్యోతిష్యపండితులు, వేదశాస్త్ర నిష్ణాతులు, పురోహితులు, అర్చకులు పాల్గొన్నారు. సమ్మేళనానికి శ్రీమాన్ సంపత్కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి అధ్యక్షత వహించారు.

సభలో, దివ్యజ్ఞాన సిద్ధాంతి, దర్శనం వెంకటరమణ శర్మ, తూండ్ల కమలాకరశర్మ సిద్ధాంతి, శాస్త్రుల వేంకటేశ్వరశర్మ, గాడి చర్ల నాగేశ్వరశర్మ సిద్ధాంతి, సాగి కమలాకరశర్మ, సంధ్యాలక్ష్మి, శంకరమంచి రామకృష్ణశర్మ,  లక్ష్మీ నృసింహాచార్యులు, సత్యనారాయణశర్మ, జోషి శ్రీకాంత్ శర్మ, బోరభట్ల సిద్ధాంతి, బ్రహ్మభట్ల శ్రీనాథ్ శర్మ, మోత్కూరి రామేశ్వరశర్మ, వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ, మరుమాముల రామచంద్రశర్మ, తదితరులున్నారు. నాకూ, పూర్వ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారికి ముగింపుకు ముందు గంటన్నర సమయం పాల్గొనే అవకాశంతో పాటు, విద్యాశంకర భారతీస్వామివారి అనుగ్రహభాషణం వినే అదృష్టం కలిగింది.

శ్రీ పరాభవనామ సంవత్సరానికిగాను అన్ని పండుగల తేదీల నిర్ణయం పూర్తిగా, ఏకగ్రీవంగా, సుదీర్ఘ సమీక్ష అనంతరం నిర్ణయమయ్యాక, విజయదశమి పండుగ తేదీ నిర్ణయించడానికి పండిత చర్చ ఆసక్తికరంగా సాగింది. దీని వివరానికి పోయే ముందర కొన్ని విషయాలు తెలుసుకుంటే, అసలీ తేదీల నిర్ణయం నేపధ్యం అర్థం చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము, కల్పము, నిరుక్తము. అనే ఆరింటిని షట్ శాస్త్రాలు అంటారు. వీటిలో ఎన్ని ఎక్కువగా అధ్యయనం చేస్తే, అలాచేసినవారిని అంత గొప్ప పండితుడు అని అనవచ్చు.

సూర్య, చంద్రుల సాక్షిగా జ్యోతిశ్శాస్త్రం, ఇతర శాస్త్రాల కన్నా వివాదం లేకుండా సఫలమైంది. అలాంటి సనాతన జ్యోతశ్శాస్త్రాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత సమాజం మీద వుంది. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో వున్న అనుభవజ్ఞులైన సిద్ధాంతులను, పంచాంగకర్తలను, జ్యోతిష పండితులను ఒకే వేదికపైకి తీసుకురావలన్న ఆలోచనతోనే దర్శనమ్ నిరవధికంగా కృషి చేయడం బ్రాహ్మణ సమాజం చేసుకున్న అదృష్టం అనాలి.

జ్యోతిశ్శాస్త్రంలో ప్రధానమైన రెండు భాగాలలో ఒకటైన గణితభాగాన్ని ‘సిద్ధాంతం’ అంటారు.  వేదకాలం నుండి నేటివరకు జ్యోతిశ్శాస్త్రం కాలానుగుణమైను మార్పులతో, సమన్వయ సాధనతో,  ధర్మపరిరక్షణకై వర్ధిల్లుతుంన్నది. సమాజానికి అనుక్షణం జ్యోతిశ్శాస్త్రం మార్గదర్శనం కూడా చేస్తున్నది. పంచాంగం లేకుండా నిత్యజీవితం కొనసాగించలేమనేది వందశాతం వాస్తవం. ధర్మాచరణకు పంచాంగం అత్యంతావశ్యకమైందనీ, తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంగాలతో కాలాధీనులైన కర్మ సాధకులకు పంచాంగం ప్రసిద్ది చెందిందనీ సిద్ధాంత నిపుణులు అంటారు.

నిత్య జీవితంలో పండుగులు భక్తి శ్రద్ధలతో ఆచరించడం అనాదిగా వస్తున్న ఆచారం. దశాబ్దం క్రితం పంచంగాలలో పండుగలపై విభేదాలు రావడం, సమాజాన్ని ఇబ్బందులకు గురి చేయుట జరిగింది. తెలంగాణ రాష్ట్ర జ్యోతిష్య మహాసభలద్వారా వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించిందనాలి. రాష్ట్రంలోని సిద్ధాంతులందరూ ఒక వేదికపై  నిర్ణయాలు తీసుకున్నందున భవిష్యత్తు పండుగల్లో విభేదాలు వచ్చే అవకాశాలు లేకపోవడమే దీనికి కారణం. అందుకే, సిద్ధాంతులందరితో ‘విద్వత్సభ’ జరిగింది.

ఈ సందర్భంగా ఆదివారం జరిగిన విద్వత్సమ్మేళనంలో, ప్రముఖంగా, ఇతర అగ్రశ్రేణి సిద్దాంతులతో పాటు జ్యోతిష్య, పాండిత్య, పంచాంగ సంబంధిత అంశాలలో అద్భుతంగా తన అభిప్రాయాలు చెప్పిన తూండ్ల కమలాకరశర్మ సిద్ధాంతి, పండగల నిర్ణయంలో ధర్మశాస్త్ర ప్రమాణాలు గురించి దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రికలో రాసిన వ్యాసంలోని విషయాలు చాలా ఆసక్తికరంగా వున్నాయి. స్థూలంగా ఆ విషయాలు కొన్ని సందర్భోచితంగా ప్రస్తావించడం విద్వత్సమ్మేళనాల నిర్వహణ నేపధ్యంలో ముఖ్యం అనాలి.

ధర్మాచరణకు మూలమైన వేదంలో చెప్పిన యజ్ఞయాగాది క్రతువులను నియమితకాలంలోనే ఆచరించాలి. అటువంటి కాలనిర్ణయ సాధనకు ఆధారభూతమైన, వేదాంగాలలో ప్రధానమైన  ‘జ్యోతిశ్శాస్త్రము’ పండుగల నిర్ణయంలో ప్రధానమైనది. సిద్ధాంతభాగమైన కాలగణన ద్వారా ప్రధానంగా సంవత్సర, అయన, ఋతు, మాస, పక్ష, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాది విషయాలు పంచాంగాల ద్వారా తెలియచేయడం విశేషం. కాలగణన ద్వారా గణించిన పంచాంగాల ఆధారంగానే నిత్య, నైమిత్తిక, కామ్యకర్మలను, పర్వదిన నిర్ణయాలను, ఇతర ప్రామాణిక సంస్కారాలను, శ్రౌత, స్మార్త యజ్ఞయాగాది క్రతువుల కాలనిర్ణయం చేస్తూ ఉంటారు విద్వత్ పండితులు. వీటిలో ఒకరోజుకు చెందిన ముఖ్యకాల, వ్యాప్తి ప్రాముఖ్యత కలిగిన పండుగలు, పర్వదినాల నిర్ణయాన్ని  విద్వత్సభలు చేపట్టాయి.

అసలొచ్చిన చిక్కల్లా, ఈ ముఖ్యకాలవ్యాప్తి విషయంలోనే సందేహాలు, చర్చోపచర్చలు వస్తుంటాయి. ముఖ్యకాలం ఒక్కో పండుగకు ఒక్కో విధంగా ఉండడమే దీనికి కారణం. ఉదాహరణకు ఉగాదికి సూర్యోదయవ్యాప్తి, శ్రీరామనవమి, గణేశ చతుర్థులకు మధ్యాహ్నవ్యాప్తిని, మాసశివరాత్రికి ప్రదోషవ్యాప్తినీ, మహాశివరాత్రి కృష్ణాష్టమిలకు అర్ధరాత్రివ్యాప్తి ఇలా వేర్వేరుగా చెప్పడం జరిగింది. అలాగే, పండుగ రోజులను నిర్ణయించే క్రమంలో ‘షట్పక్ష విధానం’ పేర్కొనడం జరిగింది. ముఖ్యకాలవ్యాప్తి ముందురోజే కలిగివుండడం, లేదా తరువాతి రోజు వుండడం సందర్భాలలో ఏవిధమైన సందేహానికీ తావులేదు. ఏ రోజు ముఖ్యకాలవ్యాప్తి వుంటే ఆ రోజునే పండుగగా నిర్ణయిస్తారు.

ఇలా కాకుండా, ముఖ్యకాలవ్యాప్తి రెండు రోజులూ ఉండడం, లేదా రెండు రోజులూ ఉండకపోవడం సంభవించినప్పుడు, తత్సంబంధిత పండుగను ఎలా నిర్ణయించాలో కూడా ధర్మశాస్త్ర గ్రంథాలలో చెప్పినప్పటికీ, కొన్ని పండుగలకు ఒకవిధంగాను, మరి కొన్ని పండుగలకు మరొక విధంగాను వుండడం విశేషం. ఉదాహరణకు ‘సంకష్టహర చతుర్థి’ నిర్ణయంలో రెండు రోజులూ చంద్రోదయకాలవ్యాప్తి ఉన్నా, రెండు రోజులూ చంద్రోదయ కాలవ్యాప్తి లేకపోయినా, రెండవ రోజునే సంకష్టహర చతుర్థి ఆచరించాలనీ, అలాగే, మాసశివరాత్రి సందర్భంలో రెండు రోజులూ ప్రదోషవ్యాప్తి వున్నా, లేకపోయినా, మొదటిరోజునే పాటించాలి అని శాస్త్రం చెప్పడం విశేషం.

తిథి రెండురోజుల్లోనూ ముఖ్యకాలంలో కొంతభాగం మాత్రమే వ్యాప్తి కలిగివుండడం, లేదా, రెండురోజులు సమానంగాను,  లేక ఒకరోజు ఎక్కువ, మరొకరోజు తక్కువగా తిథి వ్యాప్తి వున్న సందర్భంలో ఆయా తిథులకు కలిగిన ఇతరయోగాలు, నక్షత్రయోగాలు, పూర్వవిద్ద, పరవిద్ద (ఇతర తిథుల సంయోగాల ఆధారంగా) పండుగలను నిర్ణయించాలి. కొన్ని తిథులకు పూర్వతిథి యోగం ప్రశస్తమైతే కొన్ని తిథులకు తరువాత తిథి యోగం ప్రశస్తమని ధర్మశాస్త్ర గ్రంథాలలో వున్నది. వాటి ఆధారంగానే నిర్ణయించాలి. విజయదశమి విషయంలో శ్రవణానక్షత్ర యోగము ప్రశస్తమని చెప్పబడినది. వీటిని సూక్ష్మంగా పరిశీలించి పర్వదిన నిర్ణయం చేయాలి. పంచాంగాల ద్వారా ధర్మ కార్యాచరణకు నియమబద్ధమైన కాలాన్ని తెలుసుకుని పండుగలను ఆచరిస్తే, భగవదనుగ్రహాన్ని పొందడానికి  వీలుకలుగుతుందని ధర్మశాస్త్రం చెప్తున్నది. ఇంత అద్భుతమైన నేపధ్యంలో వచ్చే ఏడాది దసరా తేదీ నిర్ణయం ఆసక్తికరంగా జరిగింది.

కాకపొతే మిగిలిన పండుగల తేదీలన్నీ ధర్మశాస్త్రంలో చెప్పిన విధంగా కూలంకషంగా, సిద్ధాంతులు ప్రామాణికాలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఉమ్మడి అభిప్రాయానికి రావడం పెద్ద కష్టం కాలేదు. గంటల తరబడి చర్చలు మాత్రం జరిగాయి. రాబోయే శ్రీ పరాభవ నామసంవత్సరంలో, 2026 ఆంగ్ల సంవత్సరంలో జరుపుకునే కొన్ని పండుగలు: నూతన సంవత్సరాది మార్చ్ 19, వ్యాసపౌర్ణవమి మేనెల 1, గురు పౌర్ణవమి జులై 29, వరలక్ష్మీవ్రతం ఆగస్ట్ 21, వినాయకచవితి సెప్టెంబర్ 14, మహాలయామావాస్య అక్టోబర్ 10, దుర్గాష్టమి అక్టోబర్ 18, దీపావళి నవంబర్ 8, నాగులచవితి నవంబర్ 13; అలాగే 2027 సంవత్సరంలో భోగి-సంక్రాంతి జనవరి 14-15, రథసప్తమి ఫిబ్రవరి 13, తదితర పండుగలున్నాయి.  

విజయదశమి పండుగ తేదీ నిర్ణయించడానికి పండిత చర్చ జరిగినప్పుడు ఒకవైపు అధ్యక్షుడు సంపత్కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి, మరోవైపు కమలాకరశర్మ సిద్ధాంతి, శాస్త్రోబద్ధంగా తమతమ వాదనలు వినిపించిన విధానం ఇతర సిద్దాంతులందరితోపాటు మాకు ఆసక్తి కలిగించింది. ఇరువురూ తమతమ వాదనకు అనుగుణంగా పలు శాస్త్రీయమైన ఆధారాలు చూపించారు. సంపత్కుమార కృష్ణమాచార్య తన అభిప్రాయానికి అనుకూలంగా మాట్లాడుతూ, శ్రీ పరాభవనామ సంవత్సరానికిగాను ఆశ్వయుజ శుద్ధ నవమీ మంగళవారంనాడు (అక్టోబర్ 20, 2026) నవమీ ఘడియలు, విఘడియలు, శ్రవణా నక్షత్ర ఘడియలు, విఘడియలు వున్నందున ఆ రోజు విజయదశమి కావడాకి కుదరదన్నారు.

బుధవారంనాడు (అక్టోబర్ 21, 2026) దశమీ ఘడియలు, విఘడియలు, ధనిష్టానక్షత్రం ఘడియలున్నందున ఆ రోజుననే విజయదశమి (దసరా పండుగ) జరుపుకోవడం శ్రేష్టమని, భావ్యమని అన్నారు. ఇంకా ఇలా అన్నారు: తిథుల వృద్ధిని అనుసరించి, రెండు దశమీ తిథులు సంభవించినప్పుడు, మహానవమీనాడు పూజాది కార్యక్రమాలు నిర్వహించి, శేష దశమీ రోజున (అక్టోబర్ 21, 2026) విజయదశమి జరపుకోవాలన్నారు. చాలా ప్రమాణాలను ఆయన ఉటంకించారు ఆసక్తికరంగా. వింటున్నంతసేపు ఆయన చెప్పినదే వాస్తవం అనేలా తన వాదనను సోదాహరణగా వినిపించారు.

కమలాకరశర్మ సిద్ధాంతిగారు కూడా దసరా పండుగ మంగళవారంనాడు (అక్టోబర్ 20,2026) ఎందుకు జరపాలో చక్కగా వివరించారు. ఆశ్వీయుజ శుక్ల దశమి శ్రవణానక్షత్రంతో కలిసివస్తే అది విజయదశమి అనబడునన్నారు. ప్రమాణాలను అనుసరించి, బుధవారంనాడు (అక్టోబర్ 21, 2026) రోజున దశమికి ముఖ్య గౌణకాలవ్యాప్తి లేనందున, మంగళవారం వున్నందున, అలాగే ముఖ్య కాలంలో శ్రవణాయోగం కలిగినందున, మంగళవారంనాడు (అక్టోబర్ 20, 2026) నాడు మాత్రమే విజయదశమి జరుపుకోవాలన్నారు. ‘ధర్మప్రవృత్తి’ అనే అనేకానేక ధర్మ సందేహాలకు సంబంధించిన పుస్తకంలోని ప్రామాణికాన్ని కొందరు పేర్కొన్నారు.

వాదప్రతివాదాల అనంతరం జరిగిన ముగింపు సభలో  విద్యాశంకర భారతీస్వామివారు తమ అనుగ్రహ భాషణంలో పలు ప్రామాణికాలను పేర్కొంటూ మంగళవారంనాడు (అక్టోబర్ 20, 2026) నాడు విజయదశమి-దసారా పండుగ జరుపుకోవడం సరైనదని తన అభిప్రాయంగా, సిద్ధాంతులు అందరూ అంగీకరిస్తే (ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని నవ్వుల మధ్య అంటూ) అదే నిర్ణయంగా పేర్కొన్నారు. అనుగ్రహ భాషణ అనంతరం సత్కార కార్యక్రమం, శాలువాలు కప్పడం, సర్టిఫికేట్లు ఇవ్వడం స్వామివారి ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది.

బహుశా ఆధునిక విజ్ఞానానికి అనుగుణంగా జ్యోతిశ్యాస్త్రానికి ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటైతే బాగుంటుందేమో! అనాదిగా వస్తున్న శాస్త్రీయ పరిణితి జ్యోతిష్యం. ఆధునిక కాలంలో అందరికీ జ్యోతిశ్శాస్త్రంపై విశ్వాసం పెరిగింది. గణితం చేయడానికి ప్రస్తుతం శ్రమ లేకుండా, కంప్యూటర్ వుపయోగించుకోవచ్చేమో కాని ఫల నిర్ణయానికి మాత్రం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితుల అవసరం చాలా వుంది.

శాస్త్రాన్ని అభ్యసించడం ఒక ఎత్తైతే, అనుభవాన్ని సంపాదించడం మరొక ఎత్తు. శాస్త్రజ్ఞానంలో కూడా అనుభవజ్ఞానం చాలా ముఖ్యం. అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులు ఈ కాలంలో లభించడం చాలాకష్టం.  వేదానికి ధర్మం మూలమైతే, ధర్మానికి జ్యోతిశ్శాస్త్రమే మూలం. జ్యోతిశ్శాస్త్రం ద్వారా ధర్మబుద్ధి కలుగుతుంది. సమాజంలో, ధర్మపరిరక్షణలో జ్యోతిష్యుల పాత్ర అత్యంత కీలకమైంది.  ధర్మాచరణలోని జ్యోతిష్యులనే సమాజం గౌరవిస్తుంది.  ధర్మపరిరక్షణ అంటే ధర్మాన్ని ఆచరించడమే.

‘సర్వేజనా స్సుఖినోభవంతు’ అని అనడం కాదు, ఆచరణలో చూపించాలి.   బ్రాహ్మాణోత్తములంతా సర్వ సమాజ శ్రేయస్సును కోరుతారు. అట్టి బ్రాహ్మాణోత్తములలో పంచాంగ కర్తలైన సిద్ధాంతులు, సమాజ శ్రేయస్సుతో పాటు బ్రాహ్మణోత్తములకు మార్గదర్శిగా వుంటారు. సమాజంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న సిద్ధాంతులను కాపాడుకోవాల్సిన బాధ్యత, బ్రాహ్మాణోత్తములందరితో పాటు సమాజానికీ, ప్రభుత్వానికీ వుంది. పరోక్షపాత్రలో వున్న సిద్ధాంతులను గుర్తించడం మంచిది. ఈ సభలద్వారా కొంత చైతన్యం కలిగించే ప్రయత్నం చేసిన నిర్వాహకులను (ముఖ్యంగా దర్శనమ్ శర్మ) మనస్పూర్తిగా అభినందించాలి. విద్వత్ మహాసభ అభిప్రాయ వివరాలను, ప్రామాణికాలను గ్రంథ రూపంలో తీసుకువస్తే భవిష్యత్ సమాజానికి ఉపయోగ పడ్తుంది.

ఈ ‘విద్వత్సభ’ అంతా శాస్త్ర పరంపర, అనుభవ సంపద, ధర్మపథ గమనం పరస్పర సమన్వయానికి ఒక అద్భుత మేల్కొలుపు. తర్కం, ప్రమాణం, సంయమనం, సంభాషణ, గౌరవం, ఇవన్నీ కలిసి శాస్త్ర ధర్మానికి సేవ చేసిన అనిర్వచనీయ దృశ్యం ఇది. ఆధ్యాత్మిక, సాంప్రదాయ, సామాజిక పునర్నిర్మాణానికి ఇది ఒక ఆధారశిల అవుతుంది. పండితుల చర్చల్లో స్పష్టంగా ప్రతిబింబించిన నిశ్చల ధర్మనిష్ఠ, మధుర భాషణ పద్ధతి, పరస్పర గౌరవ భావం, ఇవన్నీ ఈ కాలంలో అత్యంత అరుదైనవే. శాస్త్రోక్తతను నిబద్ధంగా రక్షిస్తూ, ఆధునికతతో సమన్వయాన్ని సూచిస్తూ, సమాజానికి పంచాంగ పథం, జ్యోతిష్యం ద్వారా ఒక కరదీపిక లాంటి మార్గాన్ని ఈ సభ చక్కగా చూపించింది.

ఇలాంటి సమావేశాలు జరగడం మన సంస్కృతి శక్తిని, భవిష్యత్ పథాన్నీ నిర్ధేశిస్తాయి. యుగయుగాలుగా నిలిచే ధర్మబీజాలు ఇక్కడ నాటబడుతున్నాయనే భావన ఈ సభ చివర్లో అందరిలోనూ విపరీతంగా ప్రతిధ్వనించాయి. జ్యోతిశ్శాస్త్రం అనేది పంచాంగపు గణనల్లోనూ, పండుగల నిర్ణయాల్లోనూ మాత్రమే కాదు; ఆచరణలో ధర్మాన్ని ప్రసాదించడంలోనూ ఒక జీవన పద్ధతిగా నిలుస్తున్నదన్న తత్వజ్ఞానం ఈ విద్వత్సభలో ప్రతిఫలించింది. ఇటువంటి సభల ద్వారా సనాతనశాస్త్రాల పునరుజ్జీవనాన్ని ముందుకు నడిపించే ప్రయత్నంలో, మనం అందరూ భాగస్వాములమవ్వాలి. ధర్మాన్ని ధర్మబద్ధంగా పాటించాలంటే, ధర్మనిర్ధారణ చేసే విధానాలపై గౌరవం కలిగించగలిగిన ఈ సభ, ఒక చారిత్రక ఘట్టంగా గుర్తుండిపోతుంది.

దర్శనమ్ శర్మకు మరోమారు అభినందనలు.

No comments:

Post a Comment