వ్యక్తిత్వ వికాసం, జీవన పాఠాలు, స్వీయానుభవాల పరిపక్వత-5
వనం
నర్సింగ్ రావు ఎస్సార్
అండ్ బీజిఎన్ఆర్ కళాశాల విద్యార్ధి రాజకీయాల కింగ్ మేకర్
వనం
జ్వాలా నరసింహారావు
ఖమ్మం ఎస్సార్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో పీయూసీ
చదువుతున్నప్పుడు, కళాశాల రాజకీయాలపై, కమ్యూనిస్ట్ రాజకీయాలపై ఆసక్తి
కలగడంతో పాటు, క్రికెట్ ఆటపై మోజు పెరగ సాగింది. ఆ రెండింటి
ప్రభావం చదువుపై తీవ్రంగా పడింది. వాటి మీద ఆసక్తి కలగడానికి ప్రధాన కారణం బాబాయి
నర్సింగరావు. ప్రస్తుతం 80 సంవత్సరాల
వయసులో వయసు మీదపడుతున్నప్పుడు కలిగే ఆరోగ్య సమస్యలు మినహాయించి, ఆదరణలో, ఆలోచనల్లో ఐదారు దశాబ్దాల క్రితం ఎలా
వుండేవాడో ఇప్పుడూ అలానే వున్న బాబాయ్ ని, అంతకు మించి స్నేహితుడు వనం నర్సింగ్ రావు.
ఆయనను చూడడానికి, చూసి కొంత
సమయం గడపడానికి, ఆయన హైదరాబాద్
కు వచ్చి కొడుకు కళ్యాణ దగ్గర కానీ, కూతురు అర్చన, శారద దగ్గర కానీ వున్నప్పుడు మా శ్రీమతితో కలిసి
వెళ్లడం అలవాటైపోయింది ఇప్పటికీ. వెళ్లినప్పుడల్లా బాబాయ్ భార్య (పిన్ని) నాకు
పీయూసీలో సహాధ్యాయి, అందరూ ప్రేమగా ‘మాతాజీ’ అని
పిల్చుకునే హేమనళినితో సహా, కుమారుడు
కళ్యాణ్, కోడలు శ్యామల, కూతుళ్లు శారద, వందన, అర్చన, మనుమడు, మనుమరాళ్లు అందరిమధ్య సరదాసరదాగా సమయం గడపడం
జరిగేది.
సహజంగా బంధుమిత్రుల మధ్యన వున్నప్పుడు
‘మితభాషి’గా వుండే నర్సింగ్ రావు, బాహ్య ప్రపంచానికి, విద్యార్ధి దశ నుండే ‘సహ
విద్యార్థులకు,’ ఆ తరువాత, ప్రత్యక్ష రాజకీయాలలో అతి పిన్న వయసులోనే చురుకైన పాత్ర
వహిస్తూ తోటి ‘కాడర్’కు, తనదైన శైలిలో
స్ఫూర్తినిచ్చిన వ్యక్తిగా చిరపరిచితుడు. సభలు, సమావేశాలలో
మంచి వక్త. కలిసినప్పుడల్లా, ‘లీజర్’ కొంచెం ఎక్కువ మోతాదులో లభించినప్పుడల్లా,
నర్సింగ్ రావు ‘మౌనాన్ని, పోనీ, మితంగా
మాట్లాడే ఆయన అలవాటును’ భంగం చేయాలని
కోరిక కలిగేది. అలాంటి సమయాలలో తెలిసిన, తెలియని,
తెలిసీ-తెలియని విషయాలను చర్చించుకుంటూ ‘సహజమైన అలవాటు’ మధ్య సమయాన్ని గడపడం ఆసక్తికరంగా వుండేది. విద్యార్ధి
దశనుండి రాజకీయాలలోకి రావాలన్న అభిలాష కలగడం, మాతాజీతో
ప్రేమ వివాహం నేపధ్యంలాంటి విషయాలు కూడా ఆసక్తికరమైనవే.
అవి ఖమ్మంలో
‘ఎస్ ఆర్ అండ్ బీజీఎన్ ఆర్ ఆర్ట్స్ కళాశాల’
రూపుదిద్దుకుంటున్న ప్రారంభ సంవత్సరాలు. ఖమ్మం పట్టణంలో మొట్ట మొదటి
ప్రయివేట్ కళాశాలగా దీనిని స్థాపించడం జరిగింది. నిజాం
సంస్థానం నుంచి విముక్తి పొంది, భారత దేశంలో విలీనమైన
హైదరాబాద్ రాష్ట్రంలో, ఒకప్పుడు ఒక్క హైదరాబాద్‌లో తప్ప
ఇంకెక్కడా కళాశాలలు లేవు. వరంగల్ జిల్లాలో వున్న ఖమ్మం
ప్రాంతాన్ని 1956 లో ఖమ్మం జిల్లాగా ఏర్పాటు చేసింది అప్పటి ప్రభుత్వం.
నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు, ప్రతి జిల్లాలో ఒక కళాశాల వుండాలన్న నిర్ణయం నేపధ్యంలో, స్వర్గీయ శ్రీ రామ
భక్త గెంటాల నారాయణరావు అనే మహానుభావుడు ఇచ్చిన లక్ష రూపాయల విరాళంతో, అదే మూలధనంగా, కళాశాల ఏర్పాటుచేయడం జరిగింది. అప్పట్లో గుట్టలబాజార్
దాటిన తరువాత గ్రెయిన్ మార్కెట్ ప్రాంతంలో నెలకొల్పారు కళాశాలను.
నర్సింగ్ రావుకు కానీ, నాకు కానీ సరిగ్గా
గుర్తు లేదుకాని, గుర్తున్నంతవరకు
ఆయనది బహుశా రెండో-మూడో బాచ్ కావచ్చు.
పీయూసీలో (బహుశా) 1959 సంవత్సరంలో విద్యార్థిగా చేరగానే, హయ్యర్ సెకండరీ విద్యార్థి దశలో ‘అకడమిక్’ గా
‘బ్రిలియంట్’ విద్యార్థిగా
పేరు తెచ్చుకున్న నర్సింగ్ రావుకు, చదువుతో పాటు,
దానికంటే మిన్నగా కళాశాల విద్యార్ధి రాజకీయాలమీద, అదీ ‘కమ్యూనిస్ట్ పార్టీ అభిమాని
విద్యార్థిగా’ ఆసక్తి
కలిగింది. అలా కలగడానికి సముచిత కారణం నర్సింగ్ రావు లాంటి ఎందరినో విద్యార్ధి
దశలోనే కమ్యూనిస్ట్ పార్టీ భావజాలం వైపు ఆకర్షితులుగా చేసిన నాటి విద్యార్థి
మేథావి, స్వర్గీయ ‘కామ్రేడ్ కర్నాటి
రామ్మోహన్ రావు.’
అప్పట్లో, బహుశా
ఆతరువాతి కాలంలో కనీసం ఒక దశాబ్ద కాలంపాటు, ఖమ్మం కళాశాల
విద్యార్ధి రాజకీయాలు, కళాశాల
విద్యార్ధి సంఘం ఎన్నికలు, రాష్ట్ర
రాజకీయాలకు, సాధారణ
ఎన్నికలకు ప్రతిరూపంగా, ఒక్కోసారి వాటిని తలదన్నేవిగా వుండేవి. ఆ కళాశాలలో
చదువుకున్నవారు ఎందరో ప్రముఖ రాజకీయ నాయకులయ్యారు. ఖమ్మం జిల్లా రాజకీయాలలో ఆ
రోజుల్లో పట్టున్న రెండు ప్రధాన రాజకీయ పార్టీలైన ‘కమ్యూనిస్ట్’ ‘కాంగ్రెస్’ నాయకుల
ప్రత్యక్ష, పరోక్ష మద్దతు, జోక్యం, ‘ఆర్ధిక, మానవ
వనరులు సమకూర్చడం’ ఎన్నికల ముందు, తరువాత జరిగే అవకాశమున్న కొట్లాటలలో తోడ్పడడం, ఇత్యాదులు బహిరంగ రహస్యం.
కళాశాలలో సీనియర్ విద్యార్థిగా చదువుకుంటున్న ‘కర్నాటి రామ్మోహన్ రావు’ పరిచయంతో నర్సింగ్ రావు దృష్టి, అభిలాష, కమ్యూనిస్ట్ పార్టీవైపు మళ్ళింది. అలా
ఆయన కమ్యూనిస్ట్ భావజాలంవైపు ఆకర్షితుడయ్యాడు. సరిగ్గా నర్సింగ్ రావుకు గుర్తు
లేదుకానీ, పీయూసీ
చదువుతున్నప్పుడే విద్యార్థి సంఘం ఎన్నికలలో ఆయన పోటీ చేసి గెలిచాడు. పదవి ఏమిటో
జ్ఞాపకం లేదు. తరువాత, తరువాత ఖమ్మం కళాశాల రాజకీయాలలో పోటీ
చేయకపోయినా, నర్సింగరావు ది క్రియాశీలక పాత్రే కాకుండా ‘కింగ్
మేకర్’ పాత్ర కూడా. ఆయనకు తోడు, జూనియర్ విద్యార్థిగా చదువుతున్న సమీప బంధువు, స్నేహితుడు, (రాష్ట్ర
అటవీశాఖలో ఉద్యోగం చేస్తూ ఆకస్మికంగా చనిపోయిన) కొండపల్లి శ్రీ భార్గవ కూడా కాలేజీ
రాజకీయాలలో చురుకైన పాత్ర వహించేవాడు. దాదాపు ప్రతి ఏడూ పోటీ చేసే వాడు. ఏనాడూ,
ఏపార్టీ పక్షాన పోటీ చేసినా ఓటమి ఎరుగడు.
ఇంతకు
ముందే చెప్పినట్లు, ఆ రోజుల్లో ఖమ్మం కాలేజీ ఎన్నికల రాజకీయాలు, శాసన సభ, లోక్ సభ ఎన్నికల రాజకీయాలను మరిపించే విధంగా వుండేవి. గెలిచిన
అభ్యర్థులు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి స్థాయిలో
వున్న భావన కలిగేది. కాలేజీలోని రెండు ప్రధాన గ్రూపులకు, జిల్లాకు
చెందిన రెండు ప్రధాన రాజకీయ పార్టీల అండ దండలుండేవి. ఒకటి గ్రూపులు ఇంకా లేని కాంగ్రెస్
పార్టీ కాగా, మరొకటి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ. ఇంకా
అప్పటికి కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో చీలిపోలేదు. కాంగ్రెస్ పార్టీలో
గ్రూపులు లేవు. నర్సింగరావు కమ్యూనిస్ట్ పార్టీ బలపర్చిన గ్రూప్ పక్షాన నాయకత్వం
వహించేవాడు. నాలుగు ఏళ్ల క్రితం విజయవాడలో చనిపోయిన ప్రముఖ అడ్వకేట్ కర్నాటి
రామ్మోహన్ రావు కమ్యూనిస్ట్ భావాల ప్రభావం అప్పట్లో నర్సింగ్ రావుతో సహా, చాలా మంది విద్యార్థుల మీద వుండేది.
కళాశాల
రాజకీయాల గురించి నేను నర్సింగ్ రావు కలిసినప్పుడల్లా చర్చ చేసుకునే వాళ్లం,
అప్పట్లో స్థానిక కమ్మ హాస్టల్ కేంద్రంగా అవి సాగుతుండేవని, కమ్మ హాస్టల్ లో నివసించే విద్యార్థులలో మెజారిటీ ఎవరి పక్షాన వుంటే
వారికే కాలేజీ ఎన్నికలలో ఘన విజయం లభించేది. అందువల్ల కళాశాలలు వేసవి శెలవుల
తరువాత ప్రారంభం కాగానే, రెండు గ్రూపుల వాళ్లు, హాస్టల్ పైన పట్టు సాధించేందుకు ముందస్తుగా ప్రయత్నాలు చేసేవారు. నేను
పీయుసీలో చేరిన తరువాత ఖమ్మం కళాశాల కమ్యూనిస్ట్ రాజకీయాలకు (1962-1964) మరో
కేంద్రం మామిళ్లగూడెం లోని మా ఇల్లు. ప్రతి కోర్సుకూ ప్రవేశ పరీక్షల పధ్ధతి రావడంతో, పోటీ బాగా నెలకొని విద్యార్థులు పూర్తికాలం చదువులకే పరిమితమై, విద్యార్ధి దశనుండి రాజకీయాలకు ఎదగడం తగ్గసాగిన వర్తమాన కాలంలో,
విద్యార్ధి దశనుండి రాజకీయాలకు ఎదిగేవారు అరుదే అనాలని, మేము
చర్చించుకుంటూ వుండేది.
ప్రధానంగా నర్సింగ్ రావు బీఎస్సీ ఫైనల్
ఇయర్లో వున్నప్పుటి విద్యార్ధి సంఘం ఎన్నికలు జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడు, నాటి కళాశాల రాజకీయాలన్నీ మా ఇంటి నుండే ఎలా నడిచేవో పదేపదే మాకు గుర్తుకు
వచ్చేవి. నేను అప్పుడు పియుసి విద్యార్థిగా వుండేవాడిని. ఆ సంవత్సరం (1962-1963) జరిగిన
ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ మద్దతుతో విద్యార్థి సంఘానికి పోటీ చేసిన వాళ్లలో ప్రస్తుతం
84 ఏళ్ల వయసున్న సామినేని రాధాకృష్ణమూర్తి (అధ్యక్షుడు), ఖాదర్ అలీ (కార్యదర్శి), భార్గవ (కల్చరల్
కార్యదర్శి) పేర్లు గుర్తున్నాయి.
ఆ
ఏడాది అధ్యక్ష పదవికి కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన టి రామయ్య గెలిచినప్పటికీ, కార్యదర్శితో సహా అధికభాగం సీట్లను కమ్యూనిస్ట్ పార్టీ బలపర్చిన గ్రూప్
గెలుచుకుంది. ఎన్నికలు ముగిసిన వారం, పది రోజుల పాటు చాలా టెన్షన్ ఫీలైన విషయం, అరకొర కొట్లాటలు జరిగిన సంగతి, ఎన్నికలలో చురుగ్గా పాల్గొన్న
విద్యార్థులు, నాయకులు పారిపోటాలూ, దాక్కోవటాలూ, దరిమిలా అంతా సర్దుకు పోవడం, మరుసటి సంవత్సరం
ఎన్నికలు వచ్చేదాకా కలిసి మెలిసి వుండడం లాంటి విషయాలను మననం చేసుకునే వాళ్లం.
ప్రతి విషయం గుర్తు చేసుకుంటున్నప్పుడు ఆనందం, సంతోషం,
గర్వం, నర్సింగ్ రావు ముఖంలో ప్రస్ఫుటంగా కనిపించేది.
నర్సింగ్
రావు బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఏడాది, అప్పట్లో ‘కళాశాల
బ్యూటీగా’ అనుకునే (హేమనళిని) మాతాజీ పీయుసీ విద్యార్థిగా వుండేది. నేనూ, ఆమె క్లాస్ మేట్స్. ఆ ఏడాది జరిగిన కళాశాల ఎన్నికల
సందర్భంగా తాను బలపరచిన సామినేని రాధాకృష్ణమూర్తి (అధ్యక్షుడుగా)కి ప్రచారం
చేస్తూ, ఆయనతో కలిసి నర్సింగ్ రావు తనను ఓటు వేయమని అడగడానికి రావడం జరిగిందని
చెప్పింది. బహుశా ఆ కలయికే ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’
కావచ్చని మాతాజీ అనేది. బీఎస్సీ చదువు పూర్తైన తరువాత నర్సింగ్ రావు తండ్రి
చనిపోయిన దరిమిలా 1962 సంవత్సరంలో వివాహం జరిగి, స్వగ్రామం కమలాపురంలో వుండాల్సిన
అవసరం ఏర్పడింది.
చుట్టుపక్కల
గ్రామాలలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రాబల్యం గణనీయంగా వున్నందున, సమీప గ్రామం బాణాపురంలోని గండ్లూరి కిషన్ రావు
ప్రభావం ఆయన మీద పడింది. ఫలితంగా ఆయన ప్రోత్సాహంతో,
ప్రోద్భలంతో పంచాయితీ ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి, ఎన్నికలలో
ఆరు దశాబ్దాల క్రితమే పోటీచేసి, ఏకగ్రీవంగా
కమలాపురం గ్రామ సర్పంచ్ గా ఎన్నికై, ఐదు
(5) పర్యాయాలు సర్పంచ్ గా కొనసాగి, పాలేరు చక్కర
కర్మాగారం చైర్మన్ గా కూడా కాబినెట్ హోదాలో ఎన్నికయ్యాననీ నర్సింగ్ రావును
కదిలిస్తే జ్ఞాపకం చేసుకునేవాడు.
బాబాయ్, స్నేహితుడు, హితుడు,
సన్నిహితుడు, వనం నర్సింగ్ రావు ప్రభావమే నన్ను కళాశాల, తదుపరి గ్రామ రాజకీయాలలోకి
ఆసక్తి కలిగించి, గత ఐదారు దశాబ్దాల కాలంలో, కమ్యూనిస్ట్, కాంగ్రెస్,
టీడీపీ, బీఆర్ఎస్, బీజేపీ రాజకీయ నాయకులతో, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధాలు కలిగేలా చేసింది. ఆ సంబంధ బాంధవ్యాలే గవర్నర్, ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసేదాకా సహాయపడింది. మున్ముందు ఖమ్మం రాజకీయాలు.
No comments:
Post a Comment