Thursday, July 3, 2025

వ్యక్తిత్వ వికాసం, జీవన పాఠాలు, స్వీయానుభవాల పరిపక్వత-4 .... చదువులకు, రాజకీయ చైతన్యానికి, పర్యాయపదం ఖమ్మం మా ఎస్సార్ అండ్ బీజిఎన్ఆర్ కళాశాల : వనం జ్వాలా నరసింహారావు

 వ్యక్తిత్వ వికాసం, జీవన పాఠాలు, స్వీయానుభవాల పరిపక్వత-4

చదువులకు, రాజకీయ చైతన్యానికి, పర్యాయపదం

ఖమ్మం మా ఎస్సార్ అండ్ బీజిఎన్ఆర్ కళాశాల

వనం జ్వాలా నరసింహారావు

ఖమ్మం పట్టణంలో మొట్ట మొదటి ప్రయివేట్ కళాశాలగా ఎస్సార్ అండ్ బీజిఎన్ఆర్ కళాశాలను స్థాపించారు. నిజాం సంస్థానం నుంచి విముక్తి పొంది, భారత దేశంలో విలీనమైన హైదరాబాద్ రాష్ట్రంలో, ఒకప్పుడు, ఒక్క హైదరాబాద్‌లో తప్ప ఇంకెక్కడా కళాశాలలు లేవు. దరిమిలా, వరంగల్ జిల్లాలో వున్న ఖమ్మం ప్రాంతాన్ని వేరు చేసి, 1956 లో ఖమ్మం జిల్లాగా ఏర్పాటు చేసింది  ప్రభుత్వం. అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు, ప్రతి జిల్లాలో కనీసం ఒక్క కళాశాలన్నా వుండాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పటి ఖమ్మం జిల్లా కలెక్టర్ జీ వీ భట్, ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా, ఖమ్మానికి చెందిన కొందరు ప్రముఖులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు.

స్వర్గీయులు బొమ్మకంటి సత్యనారాయణరావు, సర్వదేవభట్ల నరసింహమూర్తి, పర్సా శ్రీనివాసరావు, కవుటూరి కృష్ణమూర్తి, రావులపాటి జానకి రామారావులతో ఏర్పాటైన ఆ కమిటీ, నిధుల సేకరణ మొదలెట్టారు. ఒకానొక సందర్భంలో, భద్రాచల రామాలయానికి చెందిన ఒక ఆభరణాన్ని వేలం వేసి, అలా సేకరించిన పైకంతో కళాశాల నెలకొల్పాలని భావించారట. అది తెలుసుకున్న, స్వర్గీయ శ్రీ రామ భక్త గెంటాల నారాయణరావు (జగ్గయ్య పేట వాసి) గారనే లోకోపకార గుణం గల మహానుభావుడు, లక్ష రూపాయలు విరాళంగా ఇస్తానని కలెక్టర్‌ను కలిసి చెప్పడం, ఆయన ఇచ్చిన మూలధనంతో కళాశాల రూపుదిద్దుకోవడం జరిగింది. తొలుత గుట్టలబాజార్ దాటిన తరువాత గ్రెయిన్ మార్కెట్ ప్రాంతంలో నెలకొల్పారు కళాశాలను.

ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్న తర్వాత కూడా, కళాశాల పేరు శ్రీ రామ భక్త గెంటాల నారాయణరావు పేరు కొనసాగిస్తూ వచ్చారు. దరిమిలా కళాశాలకు ఇల్లెందు రోడ్డులో నూతన భవనాలను నిర్మించి అక్కడకు మార్చారు. ఒక దశాబ్దంనర క్రితం గెంటాల నారాయణరావు గారి విగ్రహాన్ని కళాశాల పూర్వ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కాలేజీ ఆవరణలో ఆవిష్కరించారు. గెంటాల నారాయణరావు గారి సమీప బంధువు భాను మూర్తి విగ్రహావిష్కరణకు చొరవ తీసుకోవడమే కాకుండా ద్రవ్య సహాయం కూడా చేశారు. ఆ కార్యక్రమానికి హాజరైనవారిలో నేను కూడా ఉన్నందుకు ఎప్పుడూ గర్వంగా, సంతోషంగా వుంటుంది.

కాలేజీ విద్యార్థిగా (1962-63 బాచ్) పి.యు.సి క్లాస్ విద్యార్థులలో నేనే వయసులో చిన్నవాడిననుకుంటా. కాలేజీ మైదానం పక్కనున్న షెడ్డుల్లో మా క్లాస్ జరిగేది. ఇంగ్లీష్, తెలుగు, జనరల్ స్టడీస్ అన్ని గ్రూపులకు అంటే-ఎంపీసీ, బై పీసీ (జీవ శాస్త్రం, భౌతిక-రసాయన శాస్త్రాలు), కామర్స్ (ఎకనామిక్స్, కామర్స్, అకౌంటింగ్), సివిక్స్ (చరిత్ర, భూగోళం, సాంఘికం)-కలిపి చెప్పేవారు. భౌతిక, రసాయన శాస్త్రాల క్లాసులు ఎం.పీ.సీ, బై పీసీ గ్రూపులకు కలిపి తీసుకునేవారు. లెక్కల క్లాస్ ప్రత్యేకంగా ఎంపీసీ గ్రూపుకు మాత్రమే వుండేది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ ప్రోజ్, పోయెట్రీ, గ్రామర్ విభాగాలుగా వుండేవి.

పీయూసీ లో చేరిన తరువాత చదువు మీద కంటే ఇతర విషయాల మీద ఆసక్తి పెరగ సాగింది. కళాశాల రాజకీయాలపై, కమ్యూనిస్ట్ రాజకీయాలపై ఆసక్తి కలగడంతో పాటు, క్రికెట్ ఆటపై మోజు పెరగ సాగింది. ఆ రెండింటి ప్రభావం చదువుపై తీవ్రంగా పడింది. వాటి మీద ఆసక్తి కలగడానికి ప్రధాన కారణం బాబాయి నర్సింగరావు. కళాశాల రాజకీయాలు స్థానిక కమ్మ హాస్టల్ కేంద్రంగా సాగుతుండేవి. కమ్మ హాస్టల్ లో నివసించే విద్యార్థులలో మెజారిటీ ఎవరి పక్షాన వుంటే వారికే కాలేజీ ఎన్నికలలో ఘన విజయం లభించేది. అందువల్ల కళాశాలలు వేసవి శెలవుల తరువాత ప్రారంభం కాగానే, రెండు గ్రూపుల వాళ్లు, హాస్టల్ పైన పట్టు సాధించేందుకు ముందస్తుగా ప్రయత్నాలు చేసేవారు.

          మా ఇంట్లో మూడు పోర్షన్లుండేవి. ఒక దాంట్లో (మధ్య పోర్షన్) ఆ రోజుల్లో కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పని చేస్తున్న కె వై ఎల్. నరసింహారావు గారు, మరో దాంట్లో (దక్షిణ వైపు) ఆర్థిక శాస్త్రంలో లెక్చరర్ గా పని చేస్తున్న జగన్మోహన్ రావు అద్దెకుండేవారు. ఉత్తరం వైపున్న పోర్షన్ మా కింద వుండేది. అమ్మానాన్నలు మా వూళ్లో ఎక్కువగా వుండేవారు.

రాజకీయాలన్నీ అక్కడి నుంచే నడిచేవి. నేను పి.యు.సి లో చేరిన సంవత్సరం (1962-1963) జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ మద్దతుతో విద్యార్థి సంఘానికి పోటీ చేసిన వాళ్లలో సామినేని రాధాకృష్ణమూర్తి (అధ్యక్షుడు), ఖాదర్ అలీ (కార్యదర్శి), భార్గవ (కల్చరల్ కార్యదర్శి) పేర్లు గుర్తున్నాయి. ఆ ఏడాది అధ్యక్ష పదవికి కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన టి. రామయ్య గెలిచినప్పటికీ, కార్యదర్శితో సహా అధిక భాగం సీట్లను కమ్యూనిస్ట్ పార్టీ బలపర్చిన గ్రూప్ గెలుచుకుంది. ఎన్నికలు ముగిసిన వారం, పది రోజుల పాటు చాలా టెన్షన్ గా వుండేది. కొట్లాటలు జరిగేవి. ఎన్నికలలో చురుగ్గా పాగొన్న విద్యార్థులు, నాయకులు పారిపోటాలూ, దాక్కోవటాలూ, వుండేవి. దరిమిలా అంతా సర్దుకు పోయేది.

పీయూసీ లో చదువు పాడు కావడానికి ముఖ్య కారణం క్రికెట్ ఆట. కాలేజీలో చేరడంతోనే క్రికెట్ ఆడడం మొదలెట్టాను. ‘మామిళ్లగూడెం క్రికెట్ క్లబ్’ ఆధ్వర్యంలో మా బజారులోని ఒక ఖాళీ స్థలంలో ఆడడంతో పాటు, కాలేజీ మైదానంలో కళాశాల జట్టుకు ఆడడం కూడా చేసేవాడిని. క్రికెట్ ఆటలో, ప్రావీణ్యం వున్న లెక్చరర్లు వైద్య, జడ్డి, వరదరాజన్ లాంటి వాళ్ల మద్దతు కూడా బాగా లభించేది. విద్యార్థులతో సమానంగా వాళ్లు కూడా ఆటలో పాల్గొనేవారు.

మా ఇంట్లో కూచుని క్యారం బోర్డు ఆడడమో, ఉదయం, సాయంత్రం క్రికెట్ ఆడడమో నిత్య కృత్యమై పోయింది. తీరిక దొరికినప్పుడు ఇంట్లో గదిలో కూడా, ఆ కాస్త స్థలంలో క్రికెట్ ఆడుతుంటే పక్క పోర్షన్ లో వుండే ఇంగ్లీష్ లెక్చరర్ కెవైఎల్ నరసింహారావు గారు తరచుగ మందలించేవారు. పీయూసీ చదువుతున్నప్పుడు, హెచ్ఎస్సీ చివరి రోజుల్లో కొనుక్కున్న సైకిల్ మీద ప్రతిరోజూ కాలేజీకి వెళ్లే వాళ్లం. ఆ రోజుల్లో లెక్చరర్లు కూడా సైకిల్ మీదనే కాలేజీకి వెళ్తుండేవారు. కొందరైతే నడిచే వెళ్లేవారు.

పీయుసీ తరువాత బీఎస్సీ లో చేరాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్లను ఏం చేస్తున్నావని అడుగుతే ఫలానా డిగ్రీ, ఫలానా ఇయర్ అని సమాధానం ఇవ్వక పోయే వాళ్లు. ‘ఫస్ట్ ఇయర్...రెస్ట్ ఇయర్’ అని క్లుప్తంగా చెప్పే వాళ్లు. దానికి కారణం డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పబ్లిక్ పరీక్షలు లేకపోవడమే. చదివినా, చదవక పోయినా రెండో సంవత్సరానికి ప్రమోట్ అయ్యే వాళ్లు. సెకండ్ ఇయర్లో లాంగ్వేజెస్ (ఇంగ్లీష్, తెలుగు), జనరల్ స్టడీస్ లో పరీక్షలుండేవి. మొత్తం ఆరు పేపర్లుండేవి. థర్డ్ ఇయర్లో ఆప్షనల్ సబ్జెక్టులలో (ఎం.పీ.సీ గ్రూప్) పరీక్షలుండేవి. భౌతిక శాస్త్రంలో మాడరన్ ఫిజిక్స్ లో నాలుగు పేపర్లతో సహా మొత్తం పది పేపర్లుండేవి. పరీక్ష, పరీక్షకు మధ్య ఇప్పటి లాగా దినం విడిచి దినమో, మధ్య మధ్య శెలవులో వుండక పోయేది. సోమవారం పరీక్ష మొదలవుతే మధ్యలో వచ్చే ఒక్క ఆదివారం మినహా వరుస వెంట పది రోజులు పరీక్షలు జరిగేవి. మూడు సంవత్సరాలు చదివింది గుర్తుంచుకుని రాయాల్సి వచ్చేది. అదే విధంగా లాంగ్వేజెస్ పేపర్లు రెండేళ్లు చెప్పింది గుర్తుంచుకుని రాయాలి.

డిగ్రీలో ఎప్పటిలాగే చదువు, క్రికెట్, రాజకీయాలు కొనసాగాయి. చదువు తక్కువ, మిగతావి ఎక్కువ. డిగ్రీ మొదటి సంవత్సరం మాత్రమే నేను ఖమ్మంలో చదివాను. మరుసటి ఏడాది హైదరాబాద్ వెళ్లిపోయాను. డిగ్రీలో ఇంగ్లీష్ పాఠ్యాంశాలను కెవైఎల్. నరసింహారావు గారు, వరదరాజన్ గారు, జడ్డి గారు, సత్యనాధం గారు బోధించేవారు. తెలుగు ఎం. హనుమంతరావు గారు. యడవల్లి ఆదినారాయణ గారు చెప్పేవారు. నాకు గుర్తున్నంతవరకు ‘ఆంధ్ర మహాభారతోపన్యాసాలు’ సబ్జెక్ట్ గా వుండేది తెలుగులో. బమ్మెర పోతన నాటకం ‘హాలికుడు కూడా వుండేది.

జనరల్ స్టడీస్ సబ్జెక్టును జగన్మోహన్ రావు, వై వి రెడ్డి, సుబ్రహ్మణ్యం గార్లు చెప్పేవారు. భౌతిక శాస్త్రం ఎమ్మెస్ ఆచారి గారు, ఎ విస్సన్న పంతులుగారు బోధించేవారు. లెక్కలు కె కోదండరాం రావు గారు, రసాయన శాస్త్రాన్ని జి వి నరసింహారావు (ఆర్గానిక్) గారు, ఆదిశేషా రెడ్డి (ఇన్ ఆర్గానిక్) గారు చెప్పేవారు. ప్రాక్టికల్స్ క్లాసులకు చక్రపాణి గారు, ఆంజనేయులు గారు డిగ్రీలో కూడా వుండేవారు.

నా క్లాస్ మేట్స్ పేర్లు కొన్ని మాత్రమే గుర్తున్నాయి. అప్పట్లో ‘రౌడీ శంకర్’ గా పేరు పొందిన ఎన్ శంకర్ రావు, మా ఇంటి ఎదురుగా వుండే మోటమర్రి వెంకట రామారావు, ఎస్ రాజేశ్వర రావు, సిహెచ్ విజయ రామ శర్మ, ఎస్ఎంఎన్ రాయ్, కళాధర్, నాగేశ్వర రావు, రోజా-పుష్ప అనే అక్క చెల్లెళ్లు, దేవి, చంద్రలేఖ నా క్లాస్ మేట్స్. శంకర్ రావు దరిమిలా మునిసిపల్ వార్డ్ మెంబర్ గా పని చేశాడు. వెంకట రామారావు హెడ్ మాస్టర్ గా పదవీ విరమణ చేశాడు. రాజేశ్వర రావు, రాయ్, శర్మ బాంక్ అధికారులుగా రిటైర్ అయ్యారు. కళాధర్ ఏ జి ఆఫీస్ లో పని చేసి రిటైర్ అయ్యాడు. చంద్రలేఖ ఆదిశేషా రెడ్డి గారిని వివాహమాడింది. శర్మ, రాయ్, రాజేశ్వర రావు, నాగేశ్వర రావు క్రికెట్ ఆటగాళ్లుగా మంచి పేరు తెచ్చుకున్నారు కూడా.

మాతో పాటు మామిళ్లగూడెంలోనే వుంటుండే మా సమీప బంధువు వనం రంగారావు కూడా కాలేజీలో బిఎ లో చేరి క్రికెట్ ఆటగాడుగా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకున్నాడు. దరిమిలా రాష్ట్ర స్థాయి క్రీడాకారుడుగా ఎదిగాడు. అతడు టెన్నీస్ ఆటగాడు కూడా. మా నాన్నగారు నాకు మంచి భవిష్యత్త్ వుండాలన్న ఆలోచన ఫలితంగా 1964 లో హైదరాబాద్ చేరుకున్న నేను, నాటి నుంచి నేటి వరకు, గత అరవై సంవత్సరాలుగా, ఈ నగరంతో అనుబంధం పెట్టుకున్నాను. ఆ నాడు వచ్చిన నేను, ఇక్కడే స్థిరపడి పోతానని అప్పట్లో భావించలేదు.

ఏదేమైనా, నాటి ఖమ్మం ఎస్ఆర్అండ్ బిజిఎన్ఆర్ కళాశాల చదువులే వేరు. ఆ రోజులు మళ్లీ, మళ్లీ రావు. రానేరావు. 

No comments:

Post a Comment