Sunday, July 20, 2025

వ్యక్తిత్వ వికాసం, జీవన పాఠాలు, స్వీయానుభవాల పరిపక్వత-12 ఎల్విఎస్ఆర్ శర్మ కత్రి సరాయ్ ఆయుర్వేదాశ్రమం నుండి రాసిన ఉత్తరం .... ఇద్దరు కుమారులు అంజిబాబు, రమేష్ ల ఉన్నత స్థానం : వనం జ్వాలా నరసింహారావు

 వ్యక్తిత్వ వికాసం, జీవన పాఠాలు, స్వీయానుభవాల పరిపక్వత-12

ఎల్విఎస్ఆర్ శర్మ కత్రి సరాయ్ ఆయుర్వేదాశ్రమం నుండి రాసిన ఉత్తరం

ఇద్దరు కుమారులు అంజిబాబు, రమేష్ ల ఉన్నత స్థానం   

వనం జ్వాలా నరసింహారావు

బాల్యస్నేహితుడు ఎల్విఎస్ఆర్ శర్మ ఉద్యోగాన్వేషణలో హైదరాబాద్ కు రావడం, చిక్కడపల్లి మా అద్దె ఇంట్లో వుండడం, చివరకు హైదరాబాద్ నచ్చక వెళ్లిపోయి, పెళ్లి చేసుకుని విజయవాడలో స్థిరపడి పోయాడు. అంతకు పూర్వం కొన్నాళ్లు (బీహార్) గయ దగ్గర ఒక ఆయుర్వేద కంపెనీలో పని చేశాడు. అక్కడ నుంచి నా జీవితాతంతం భద్రంగా దాచిపెట్టుకునే రీతిలో చక్కటి ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలోని అక్షరం, అక్షరం పొల్లుపోకుండా ఇక్కడ రాయడానికి కారణం, ఆ రోజుల్లో ఆప్యాయతలు, అనురాగాలు, చిన్ననాటి సంగతులు గుర్తుంచుకునే పధ్ధతి, ఇలా ఎన్నో చాలామంది తెలుసుకోవాలన్న ఉద్దేశమే. దీనికి ముందు నాకు, వాడికి, మరొక మాక్లాస్మేట్ జూపూడి హనుమత్ ప్రసాద్ కు మధ్యన వున్న సంబంధం, స్నేహం గురించి రాస్తాను.

మామిళ్ళగూడెంలోని మా ఇంటికి అతి సమీపంలో, రికాబ్ బజార్ స్కూల్ కు ఆవలి వైపున, రంగుభట్ల యజ్ఞనారాయణ గారింట్లో, ప్రసాద్ చిన్నతనంలో, వాడి కుటుంబం అద్దెకుండేవారు. వాడి నాన్నగారు జూపూడి నరసింహారావుగారు కాలేజీ చదువులు ఫార్మల్ గా చదువుకొకపోయినప్పటికీ, వ్యాపార రంగంలో అద్భుతంగా రాణించిన బ్రాహ్మణుడు. పెట్రోల్, కిరోసిన్, ఎరువుల వ్యాపారాలుండేవి. ఖమ్మంలో ధనవంతులుగా పేరున్న కొద్దిమందిలో ప్రసాద్ కుటుంబం కూడా ఒకటి. ‘యాజమాన్యంలో కార్మికుల భాగస్వామ్యం’ అని గొప్పగా ఆధునిక యుగంలో చెప్పడానికి ఎంతో పూర్వమే తన వ్యాపారాలలో, తనదగ్గర పనిచేసిన వారందరికీ వాటా ఇచ్చే సాంప్రదాయం నెలకొల్పారు. వారి నెలసరి వ్యయానికి సరిపోయేంత మేరకే జీతంలాగా ఇచ్చి, మిగతాది వారి పేరుమీద భద్రంగా బాంకులో డిపాజిట్ చేసి, వారి ఇతర రకాల కుటుంబ (పెళ్లిళ్లు, ఇల్లు కొనుక్కోవడం, ఆరోగ్యపరమైన లాంటి) అవసరాలకు, చివరకు పదవీవిరమణ అనంతరం అక్కరకు వచ్చేలా ఇచ్చేవారు.  

జూపూడి ప్రసాద్ తరువాతి కాలంలో నాకు తోడల్లుడైనాడు. వాడి తల్లిదండ్రులు, ఒక్కడే కొడుకైనందున అతి గారాబంగా పెంచుకునే వారు. బయటకెక్కడికీ పోనిచ్చేవారు కాదు. ఒక్క మాఇంటికి మాత్రం రానిచ్చేవారు. అలానే వారింటికి రానిచ్చే వాడి స్నేహితుడిని నేనొక్కడినే! పాఠశాల ‘ఇంటర్వెల్’ సమయంలో, ఆ పది నిమిషాలు గడపడానికైనా, మధ్యాహ్నం లంచ్ టైమప్పుడైనా, ఒక్కోసారి మాఇంటికి వాడో, లేదా, వాడింటికి నేనో వెళ్లే వాళ్లం. మాఇద్దరికీ మంచి స్నేహితుడు శర్మ. వాడికి తనవారు అన్న వారెవరూ లేరు. స్వగ్రామమైన ‘వేంట్రప్రగడ’ (కృష్ణాజిల్లా) లో ఒక బామ్మ వుండేది. ఖమ్మంలో (వరుసకు) వాడి మేనత్తగారింట్లో వుండి చదువుకునే వాడు.

బహుశా వాడు పదవ తరగతిలో వున్నప్పుడనుకుంటా, వాడి మామయ్యతో వచ్చిన తగాదా (వాడు సిగరెట్ తాగుతున్నాడని అసత్య ఆరోపణ చేసినందున అని నాకు జ్ఞాపకం) కారణంగా, ఇంటి నుంచి బయటకొచ్చాడు. ఆ సమయంలో మా అమ్మ, ప్రసాద్ అమ్మ వాడిని మాతో పాటే, సొంతపిల్లల్లాగానే వుండి చదువుకొమ్మన్నారు. కొంతకాలం అలానే వున్నాడు. బామ్మ ప్రోద్బలంతో, రాజీ కుదిరించిన దరిమిలా, వాడు అత్తయ్య-మామయ్యలతో వుండడానికి సమాధానపడి, హెచ్ఎస్సీ పూర్తయ్యేంతవరకు వాళ్లింట్లోనే వుండి చదువుకున్నాడు. పియుసి కాలేజీ చదువుకు వచ్చేసరికి ఆ ఇల్లు వదిలి ‘వారాలు’ చేసుకుంటూ చదువుకున్నాడు. అలావద్దని, మాతోపాటే వుండమని మా అమ్మ, ప్రసాద్ అమ్మ నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినలేదు. ఏ రోజునైనా ‘వారం’ దొరకకపోతే మా ఇంట్లో కాని, ప్రసాద్ ఇంట్లో కాని భోజనం చేసేవాడు.

కొన్ని దశాబ్దాల క్రితం బాగా చదువుకుంటూ పేదరికం వలన చదువు మానేయాల్సిన పరిస్థితులలో ఆ విద్యార్థిని ప్రోత్సహించడానికి కొన్ని కుటుంబాలు ముందుకు వచ్చి వారంలో ఒక్కోరోజున ఒకరు తమ ఇంట్లో, తమ పిల్లలతోపాటు ఆ విద్యార్థి  ఉచితభోజనానికి ఏర్పాటుచేసి, ఆదుకొనే సాంప్రదాయానికే ‘వారాలు చేసుకోవడం అన్న పేరు వచ్చింది. వారాలు చేసుకోవడమంటే ఒక్కొక్కవారం-ఇక్కడ వారం అంటే ఒక రోజు, అది ఆదివారం నుంచి శని వారం దాకా ఏదయినా ఒకరోజు-ఒక్కొక్కదాత ఇంట్లో భోజనం చేయడం.  అలా చదువుకునే విద్యార్థిని వారాలబ్బాయ్ అనేవారు. వారాలబ్బాయ్ అనే సినిమాకూడా వచ్చింది. మా చిన్నతనంలో ఈ వారాల భోజన సర్వసాధారణం. సత్సంప్రదాయం. ఇప్పుడు అంతగా పాటిస్తున్నట్లు లేదు.

నిరుపేద కుటుంబంలో పుట్టిన సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్రరాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి, టంగుటూరి ప్రకాశంపంతులు, వారాలు చేసుకుంటూ చదువుకుని, తదనంతరం ఉన్నత విద్యను అభ్యసించాడని అంటారు. ప్రకాశంపంతులు పదకొండోయేట తండ్రి మరణించడంతో, పిల్లలను తీసుకుని తల్లి ఒంగోలు చేరింది. ఒంగోలులో ఆమె భోజనశాల నడపవలసి వచ్చింది. ఆ రోజుల్లో ఇలాంటి వృత్తి చేసే వారిని సమాజంలో చాలా తేలికగా చూసేవారు. పూటకూళ్ళ వ్యాపారం చేసే తల్లి సంపాదన చాలక, ప్రకాశం ధనికుల ఇళ్ళల్లో వారాలకు కుదిరాడు. ప్రకాశంపంతులు లాగానే వారాలు చేసి ఉన్నతస్థాయికి చేరుకున్నవారెందరో?

ఎల్విఎస్ఆర్ శర్మ, నేను, తరువాతి కాలంలో వృత్తిరీత్యా-ఉద్యోగంరీత్యా వేర్వేరు జాగాలలో వున్నప్పటికీ మధ్య-మధ్య కలవడమో, ఉత్తరాలు రాసుకోవడమో తప్పక చేసేవాళ్లం. వాడు పియుసి తరువాత చదువు మానేశాడు. బెజవాడ వెళ్లి కొన్నాళ్లు, మద్రాస్ వెళ్ళి కొన్నాళ్లు ఉద్యోగంలో చేరాడు. నేను హైదరాబాద్ లో చదువుకుంటున్నప్పుడు (1964-1966) అక్కడ కొచ్చి మాతో పాటే వుండేవాడు. మా నాన్నగారు నాకు పంపించే పైకంతోనే ఇద్దరం సర్దుబాటు చేసుకునే వాళ్లం. సరిపోకపోతే, వాడు చిల్లర-మల్లర ఉద్యోగాలు చేసేవాడు. తరువాత మళ్ళీ విజయవాడ వెళ్ళి పెళ్లి చేసుకుని, ఒక హోటెల్ నడుపుకుంటూ స్థిరపడిపోయాడు. 15 సంవత్సరాల క్రితం చనిపోయాడు పాపం!

బీహార్ రాష్ట్రం గయ సమీపంలో కత్రి సరాయ్ లోని నాథ్ ఆయుర్వేదాశ్రమంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు 22-1-1996 తేదీతో నాకు రాసిన ఒక ఉత్తరాన్ని ఇంకా పదిలంగా బధ్రపరుచుకున్నాను. అందులో మా స్నేహితులకు సంబంధించిన పేరాలతో సహా మిగతా అంశాలను వాడి మాటల్లోనే యధాతధంగా ఇక్కడ రాస్తున్నాను. ఒక నాడు అనుకోకుండా ‘అన్వేషణ’ అనే వారపత్రిక చూడడం జరిగింది. అందులో మాఇద్దరికీ బాల్యస్నేహితుడు భండారు శ్రీనివాసరావు (హెచ్ఎస్సీ వరకు క్లాస్మేట్స్) రాసిన ఒక వ్యాసం చదివాడు. వెంటనే స్పందిస్తూ, ఒక ఉత్తరం రాశాడు. అందులోని విషయాలు చాలావరకు మా ముగ్గురికీ, ఆ మాటకొస్తే, మా సమకాలీన విద్యార్థులు అందరికీ వర్తించేవిగా వున్నాయి. వివరాల్లోకి పొతే:

‘నేను కొన్నాళ్లుగా ఇక్కడ గయ దగ్గర ఒక ఆయుర్వేదాశ్రమంలో (కంపెనీ) ఉద్యోగం చేస్తున్న సంగతి నీవెరిగినదే కదా. నీవు నన్ను గుర్తు చేసుకుంటూ ఉంటావో లేదో గాని, నేను నిన్ను, మన స్నేహితులందర్నీ ఏదో ఒకసందర్భంలో తలుస్తూనే ఉంటాను. 10 రోజుల క్రితం 9-01-96 అన్వేషణ అనే వారపత్రిక తిరగవేస్తుండగా, పేజీ 45 లో, శ్రీ భండారు శ్రీనివాసరావు వ్రాసిన ఒక వ్యాసం ప్రచురితమయింది నా కంట పడింది. క్రింద రచయిత పేరు చూసి వ్యాసం పూర్తిగా చదివాను. అలా మన చిన్ననాటి జ్ఞాపకాలు, పాత రిక్కా బజారు హైస్కూల్, మామిళ్లగూడెం మన ఇల్లు, పక్క మురికి కాలువ, మనం భోజనం చేసే మైసూర్ కేఫ్, ‘భోజనం తయార్ బోర్డు, “చలిగా ఉన్నది, చలి చలి వేస్తున్నది” అని కవిత రాసిన మీ స్నేహితుడు, మన నర్సింగరావు గారు, భండారు శ్రీనివాసరావు గారు, బాలమౌళి, నోములవారు, గుర్రంవారు, బూర్లెవారు, దోసపాటివారు, మొదలైన మన బాల్యస్నేహితులు గుర్తుకొచ్చాయి.’

‘పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించబడుతున్నది కాబట్టి, మీ ఇంటి ఎదురుగా ఉండే పోలియో స్నేహితుడు మన క్లాసే కాని  పేరు గుర్తు లేదు, సయీద్ రహ్మాన్, అబ్దుర్ రెహ్మాన్, షుకూర్, వారి స్నేహితులు, “గొట్టం పాపయ్య, పానుగంటి పిచ్చయ్య” అంటూ వుండే శ్రీ కొండలరావు సారు, మనకి మాత్రమే విడమర్చి చెప్పి మిగతా వాళ్లను కసురుకునే వెంకట్రాంరెడ్డి సారు, “వనజ భవుండు నిన్నొసట” అంటూ చెప్పే తెలుగు సారు అయ్యదేవర రామచంద్రరావు, బాగా కొట్టి చెప్పే సర్వశ్రీ చిన్ని రామారావు, వీరభద్రం (సైన్స్), అవధాని, రసూల్ మొదలైన వారు, డ్రామాలు వేయించే సత్యం, సీతారామయ్య మాస్టార్లు, కాలేజీకి వెళ్లేటప్పుడు నీవు సైకిలు తొక్కడం, నేను కూర్చోవడం, గుట్టల బజారు చడావ్ దగ్గర దిగడం, సైకిల్ తోయడం, లిటరేచర్ పేకాట ఆడడం, Self Service Day గుర్తుకు వచ్చాయి.’

‘అలాగే, మన స్కూల్ ఒంటికన్ను చప్రాసి, పక్కనే జిలేబి అమ్మే హిందీ తాత, జూపూడి ప్రసాద్, ఏమ్వీ కేహెచ్ ప్రసాద్, ఇట్లా అందరూ జ్ఞాపకం వస్తూ ఎన్నో విషయాలు మదిలో మెలిగాయి. గయోపాఖ్యానం, దేవుని లాలూచీ, అనే స్కూల్ డ్రామాలు గుర్తుకొచ్చాయి. చిక్కడపల్లిలో నీ రూమ్మేట్స్ అయిన స్వర్గీయ వనం రంగారావు గారు (ఎంఎ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్), రమణ (కల్మలచెర్వు), అజీజ్, తాజ్ మహల్ హోటెల్ ట్రేసర్ ఉద్యోగం, Buy and Cry Pant, నా పురోహితుడి (తద్దినం బ్రాహ్మణుడి) అవతారం, ఖమ్మంలోని సుందర్, ప్రభాత్, నవాబ్ మొదలైన సినిమా హాళ్లు,  జాన్వీరా, నవాబ్, చీనా, ధర్మ, లాంటి పెద్ద వయసున్న మన క్లాస్ స్నేహితులు, ఖమ్మం నుండి హైదరాబాద్ వెళ్లేటప్పుడు బస్సులో నీకు వినిపించిన హరికధా కాలక్షేపం, మొదలైనవి మనసులో మెదిలాయి.’

‘ఇలా వ్రాస్తూ పోతూ ఉంటే అంతం ఉండదు. ఈ సారి హైదరాబాద్ వచ్చినప్పుడు మన చిన్ననాటి సంగతులు అన్నీ ఏకరవు పెట్టి ముచ్చటించాలని ఉన్నది. మా అమ్మాయి వాళ్లు కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మొన్న ఈ మధ్య ఒకసారి మా అమ్మాయిని గురించి హైదరాబాద్ వచ్చాను. కాని నీ ఫోన్ నెంబరుకి ఫోన్ చేసినా ఫోన్ మారిందా ఏమో నెంబరు పలక లేదు. సమయం లేనందున కలవలేకపోయాను.’

‘ఇలా ఈ పత్రిక తిరగేస్తూ శ్రీ భండారు శ్రీనివాసరావు గారి వ్యాసం చదువుతూంటే, వారిని గురించిన జ్ఞాపకాలు కూడా వచ్చాయి. ఆకాశవాణిలో వింతలు-విశేషాలు (జీవనస్రవంతి) అనే వారి వార్తలు లోగడ ప్రసారమవుతూ ఉండేవి. తర్వాత ఆయన రష్యా వెళ్లినట్లుగా నీవు చెప్పావు. ఇలాంటివే మరెన్నో వ్యాసాలు, ప్రజలకి, ఈనాటి యువతకి పనికి వచ్చేట్లుగా వ్రాయాలని శ్రీ భండారు వారిని మరీ మరీ కోరుతున్నాను. ఈ విషయాలలో వారితో వ్యక్తిగతంగా ఒకసారి Discuss చేయాలని అనుకుంటున్నాను.’

‘మన భారతదేశం ఒక పుణ్యభూమి. ఎంతో మంది మేధావులకు, మహానుభావులకు జన్మనిచ్చిన మాతృ భూమి. మన వేదాలు, పురాణాలు, మన సాంఘిక ఆచార వ్యవహారాలు, మొదలైనవన్నీ మన ఉనికి, మనుగడలకై ఎంతో ఉపయోగపడేవిగా నిర్ణయించబడి, ఆచరించబడుతున్నవి. ఈ ఆచారాలన్నీ మన శీతోష్ణ స్థితి, Environment పై ఆధారపడి ఉన్నాయి. వాటిని వదిలేసి, పాశ్చాత్య నాగరికతలో ఈనాటి భారతీయుడు కొట్టుమిట్టాడుతున్నాడు. ఆరోగ్య దృష్ట్యా, తోలు చెప్పులు, నూలు దుస్తులు, తాజా ఆహారం, సాత్విక మితాహారం తీసుకోవాల్సి వుండగా Plastic చెప్పులు, బూట్లు, Synthetic దుస్తులు, ఫ్రిజ్ లో నిలవ వుంచిన Tinned Foods తీసుకుంటున్నారు. Christianity లో లాగా మన మతానికి ఒక క్రమశిక్షణ లేదు.’

‘మన తాత, ముత్తాతలు శివుడు, విష్ణువులను, మనం వెంకటేశ్వరుడు మొదలైన వారిని దేవుడిలాగా పూజించాం. ఈ నాటివారు బాబాలను, జిల్లెడమూడి అమ్మలను, తాంత్రిక స్వాములను, ఇలా వెలిసిన వూరికొక దేవదూతలను పూజిస్తున్నారు. వేలకువేలు ఖర్చుచేసి దేవుడికి కళ్యాణం చేయిస్తాంకాని మన పొరుగువాడు ఆకలితో అలమటిస్తూ ఉంటే చూస్తూఉంటాం. మన చరిత్రలోని మంచిని తీసుకోం. ధర్మరాజు అబద్ధం చెప్పలేదా?, కృష్ణుడు మాయ చేసి యుద్ధంలో పాండవులను గెలిపించలేదా? అని విమర్శిస్తూ ఉంటాం. ఉన్న గుళ్లు చాలన్నట్లు ప్రతి రోజూ, ప్రతి వూళ్లో గుడి కట్టడానికి చందాలు వసూలు చేస్తుంటారు. ప్రజలు నడిచే రోడ్లను ఆక్రమించి చిన్న, చిన్న గుళ్లను కట్టారు. అంతేగాని, మదర్ థెరిస్సాలాగా బీదవారికంటూ మన వాళ్లు నడిపే Poor Homes ఏమీ లేవు.’

‘ఒకడు నిజాయితీగా వ్యాపారం చేస్తూ తృప్తిగా జీవిస్తుంటే, పక్కవాడు ఏదో మతలబులు చేసి, బాగా సంపాదిస్తూ మేడలు, కార్లు కొంటుంటే, మొదటి వాడిని శుంఠ, చేతకానివాడి కింద లెక్క కడతారు. రెండవ వాడిని తెలివి తేటలు కలవాడంటారు. అందరూ వాడినే గౌరవిస్తారు. మన ప్రభుత్వం కూడా Reservations కల్పించి ప్రజలకు మంచే చేస్తున్నప్పటికీ, కనీసం విద్య, వైద్య, సాంకేతిక, ఇంజనీరింగ్ రంగాల్లోనైనా Merit ఉన్నవాళ్లకు (Irrespective of the Caste) అవకాశాలు ఇవ్వకుండా, మార్కుల రాయితీలు ప్రకటించి నందువల్ల, ఈనాటి స్కూలు మాస్టార్లు “శ్రీ రఘురామ చారు తులసీ దళ ధామ” అంటే, “శ్రీరాములవారు తులసి ఆకులతో చారుకాచి” అని చెప్పేవారిగా మారిపోతున్నారు. అదే మన రోజుల్లో, మన చదువులు తీసుకుంటే, మన చిన్నతనంలో మనం చదువుకున్న మన పాఠం, మను చరిత్రలోని పద్యం ఇంకా నాకు గుర్తున్నది.’

‘ఆ పద్యాన్ని నేను ఏమాత్రం చదవలేదు. కంఠస్థం అంతకన్నా చేయలేదు. లెక్చర్ విని, మాస్టారు విడమర్చి చదవగా విని గుర్తు పెట్టుకున్నాను. వాటిలో కొన్ని: ‘అచటి విప్రులు మెచ్చరఖిల విద్యా ప్రౌఢి, ముదిమది తప్పిన మొదటి వేల్పు.....అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ’; ధర్మరాజు రాజసూయ యాగం సందర్భంలో నన్నయగారి భారతంలోది, ‘చనపేడికి తారక్రియయును......కృష్ణు పూజించుటిలన్’; ఏనుగు లక్ష్మణకవి సుభాషితం, ‘ఆకాశంబున నుండి, శంభుని శిరంబందుండి.....వివేక భ్రష్ట సంపాతముల్’; ‘జలమున నగ్ని, చాత్రమున జండ మయూఖుని.....మూర్ఖుని మూర్ఖత మాన్పవచ్చునే’; ‘అవనీనాధులనేకులుండగ విశిష్టారాధ్యుల్. ఆర్యుల్ పూజ్యులు పల్వురుండగ....దాశార్హుండు పూజార్హుండే’; ‘ఈతనికి ధనమిత్తురేని అభీష్టములైన కార్యముల్....అనర్హుడర్హుడని అత్యుతునచ్యుత చేయపాడియేధర్మవు ధర్మ నందనా’.

Eighth Class English లో ‘Her arms across her breast she laid she was fairer than words can say; Waste Not Want Not Proverb లో శ్రీ గెంటాల రంగారావుగారు చెప్పిన మాటలు ‘Economy does not mean stringency. One must enjoy life according to his status and earnings. If he goes beyond it, he may be called Spend Thrift’ కూడా జ్ఞాపకం వున్నాయి చాలావరకు. పై విషయాలన్నీ నీకు Bore కలిగించవచ్చునేమో కాని, ఇక్కడ ఖాళీగా ఉన్న నాకు (ఈ రోజు ఆదివారం. ఒంటరిగా ఆఫీసులో ఉన్నాను) ఏదో రాయాలనిపించి, నీవు కూడా పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుని ఆనందించుతావని వ్రాస్తున్నాను.’

‘మనకు ముఖం తెలియని వాడెవడో బాబా గురించి ఉత్తరం వ్రాస్తూ, ఇలాంటి ఉత్తరం 100 ప్రింట్ చేయించి Mr Ex లక్ష రూపాయలు లాటరీ కొట్టాడు, Mr Y నిర్లక్ష్యం చేసి తలపగిలి లేదా పాము కాటుకు గురై చచ్చాడని అంటూ, ఇలాంటివే 100 ప్రింట్ చేసి బట్వాడా చేయాలని వ్రాస్తూ వుంటారు. హిందూ మతం దిగజారడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? మన రోజుల్లో మనకు తెలిసింది, తెలియని వాళ్లకి విడమర్చి చెప్పేవాళ్లం. ఈ రోజుల్లో చెప్పడం చేతకాదు కొందరికి. చెప్పితే నేర్చుకుంటాడోమో అని ఈర్ష్య కూడా.’

‘ఆ రోజుల్లో Cricket గురించి, Sixer, Four, Wide, Wicket అంటూ చెప్పింది నీవే. ఈ రోజుల్లో ప్రతి పిల్లాడికి తెల్సుననుకో. ఇంత భారతం వ్రాయడానికి, ఇన్ని విషయాలు మననం చేసుకోవడానికి ధనస్సు రాశిలో వ్రాసిన వారఫలాలు కూడా కాకతాళీయంగా ఏకీభవిస్తున్నాయి! (ఒక పేపర్ క్లిప్పింగ్‌ను వాడి వుత్తరానికి జత పర్చాడు. అందులో వార ఫలాలలో ధనస్సు రాశివారికి ‘చిన్ననాటి జ్ఞాపకాలు రాగలవు’ అని వుంది. బహుశా శర్మ జన్మ రాశి ధనస్సు కావచ్చు).’

ఎల్విఎస్ఆర్ శర్మ 2002 సంవత్సరంలో చనిపోయిన తరువాత కారణాలేవైనా అతడి కుటుంబ సభ్యులతో సంబంధాలు కొనసాగలేదు. శర్మ గురించి రాస్తున్నప్పుడు వాడి పిల్లల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. శర్మకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు వున్నసంగతి బాగా గుర్తున్నది కానీ, వారు ఎక్కడ వుండేది, ఏమి చేస్తున్నది, తెలుసుకోవడమెట్లా అని ఆలోచిస్తుంటే శర్మ ఉన్నరోజుల్లో విజయవాడ సత్యనారాయణపురం వీధిలో ‘గణేష్ టిఫిన్ సెంటర్ అనే పేరుతో వాడు అద్దెకున్న ఇంటి నుంచే ఇడ్లీలు తయారుచేసి వేడివేడిగా పొద్దున్న పొద్దున్నే తిన్నట్లు జ్ఞప్తికి వచ్చింది. ఆధారం దొరికింది అని నన్ను నేనే మెచ్చుకుని, ఈ విషయం, శర్మ సంగతి వివరాలు చెప్పి, విజయవాడతో బ్రహ్మాండగా పరిచయం వున్న మా శ్రీమతి కజిన్ సోదరుడు తుర్లపాటి పరేష్ (అద్భుతమైన వచన రచయిత) సహాయం కోరాను.

నా ఫోన్ రిసీవ్ చేసుకుంటూనే ‘బావగారూ అంటూ ఆప్యాయంగా పలకరించి, నాక్కావాల్సింది వినడమే కాకుండా, ఒక సీజనల్ డిటెక్టివ్ లాగా పరిశోధన చేసి, ఎల్విఎస్ఆర్ శర్మ ఇద్దరు కుమారుల పేర్లు, మొబైల్ నంబర్లతో సహా, శర్మ ఒకప్పుడు నడిపిన ‘గణేష్ టిఫిన్ సెంటర్ నే వాడి పెద్దబ్బాయి అంజిబాబు అదే ఇంటి నుండి నడుపుతున్న విషయం, అదిప్పుడు ఆ పేరుగా వుంటూనే ‘అంజి ఇడ్లీ షాప్ గా, ‘గణేష్ భవన్’ గా కూడా పిలిస్తున్న సంగతి చెప్పాడు. చిన్న కొడుకు రమేష్ (MSc Mathematics) విజయవాడలోని ఒక పాపులర్ డిగ్రీ (నారాయణ) కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న సంగతీ క్లుప్తంగా చెప్పాడు.

నేను తక్షణమే శర్మ ఇద్దరు కొడుకులతో మాట్లాడాను. వాళ్లతో మాట్లాడినప్పుడు శర్మతో మాట్లాడిన ఫీలింగ్ కలిగిందంటే అతిశయోక్తికాదు. ఇద్దరు పిల్లల స్వరం అచ్చు శర్మ స్వరంలాగే వున్నది. ఫోన్ చేసినప్పుడు ఇద్దరూ వారివారి వృత్తి, ప్రవృత్తి పనుల్లో బిజీగా వున్నప్పటికీ మాట్లాడారు. ఆశ్చర్యంగా చిన్నబ్బాయి రమేష్ అప్పుడే కృష్ణానది మధ్యకు వెళ్లి అక్కడ గంటసేపు కూర్చుని వచ్చానన్నాడు. ఎందుకంటే తన శరీరాన్ని ‘రీచార్జ్ చేయడానికి క్రమం తప్పకుండా ఇలా చేస్తుంటానని అన్నప్పుడు అతడి తండ్రి శర్మ కళ్లల్లో మెదిలాడు. ఇద్దరినీ, వారు హైదరాబాద్ వచ్చినప్పుడన్నా, లేదా, నేను విజయవాడ వెల్లినప్పుడన్నా కలుసుకుందామని చెప్పాను. 

ఇదిలా వుండగా, ఫేస్ బుక్ పోస్టులు పెట్టడంలో దిట్ట, ‘బులెట్, వందేమాతరం రైళ్లలా పరుగులెత్తే’ పరేష్ తుర్లపాటి ఈ అంశం మీద ‘24 గంటల్లో దొరికిన ఆచూకీ’ శీర్షికతో చక్కటి పోస్ట్ పెట్టాడు. దాన్ని దాదాపు యధాతథంగా, పరేష్ పర్మీషన్ తీసుకుని రాస్తున్నాను.  

‘హెడ్డింగ్ చూసి ఇదేదో క్రైమ్ స్టోరీ అనుకుంటున్నారా ? అయితే మీరు పిండిలో కాలేసినట్టే. అన్నట్టు పిండి అంటే గుర్తొచ్చింది. ఎప్పుడో మిస్ అయిన స్నేహితుడి ఆచూకీ కనిపెట్టింది ఇడ్లీ పిండే అంటే నమ్ముతారా? ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆ మధ్య గన్నవరం నుంచి నేరుగా మొగల్రాజపురంలోని ఇడ్లీ పాకకు వెళ్ళి ఇడ్లీలు తిని టిఫిన్ చాలా బావుందని మెచ్చుకుంటూ ఓ వీడియోలో చెప్పిన సంగతి మా రచ్చబండ కబుర్లు సైట్ లో ఈ మధ్యనే పబ్లిష్ చేసిన ఆర్టికల్ ను గుర్తుచేసుకుంటూ ఒకప్పుడు ‘ఇడ్లీ అంటే బాబాయ్ హోటలే’ కానీ ఇప్పుడు విజయవాడలో అటువంటి ఇడ్లీ పాకలు కొన్ని వెలిసి చక్కటి రుచులను అందిస్తున్నాయి అనుకుంటుండగా ఫోన్ మోగింది.’

‘చూస్తే మా బావగారు జ్వాలా నరసింహా రావు గారు. ఫోన్ ఎత్తగానే “పరేష్ ! నీకు బెజవాడ కొట్టిన పిండి కదా. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. విజయవాడలో ఎల్విఎస్ఆర్ శర్మ (లింగాల వెంకట సత్యనారాయణ శర్మ), లేదా లింగాల శర్మ అని నా చిన్ననాటి స్నేహితుడు ఉండేవాడు. అయితే అతను ఇప్పుడు లేడు. వీలుంటే అతని కొడుకులు ఎవరన్నా విజయవాడలో ఉన్నారేమో కనుక్కుని చెప్పగలవా?” అనడిగారు. బెజవాడ గురించి అనగానే నాలో క్యూరియాసిటి ఎక్కువగా ఉంటుంది.’

‘ఎందుకంటే బెజవాడ నాకు బోలెడుమంది ఆత్మీయులను ఇచ్చింది. అయితే ఈ లింగాల శర్మ గారెవరో నాక్కూడా తెలీదు. మరి ఆయన వారసులను ఎక్కడని వెతకాలి? అని ఆలోచిస్తుండగానే ఆయనే ఓ క్లూ ఇచ్చారు. “నా స్నేహితుడు విజయవాడ సత్యనారాయణపురంలో ఇంట్లోనే ఇడ్లీలు అమ్మేవాడు” అన్నారు. ఈ క్లూ చాలు నాకు.  విజయవాడలో ఉంటున్న నా బాల్య మిత్రుడు రమణ శర్మకు ఫోన్ చేసి విషయం చెప్పా. "ఏంటీ నువ్వు లింగాల శర్మ గారి గురించి వెతుకుతున్నావా?” అని నవ్వాడు. అవునని చెప్పా.’

"నువ్వు వెతుకుతున్న  శర్మ గారు 1982లో కేదారేశ్వర పేటలోని మా ఇంట్లో 312 రూపాయల అద్దెకు దిగారు. చాలా మంచి వ్యక్తి. ఇంట్లోనే ముందుగదిలో ఇడ్లీలు వేసి అమ్మేవాడు. ఆయన ఇడ్లీలకు పేరు రావడంతో బిజినెస్ పెరిగింది. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకు అంజిబాబు ఆ టిఫిన్ సెంటర్ ను రన్ చేస్తున్నాడు. ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయవాడ వస్తే అంజిబాబు ఇడ్లీలు పార్సిల్ వెళతాయని. సినీ నటుడు తనికెళ్ళ భరణి తో సహా చాలామంది సినీ సెలబ్రిటీస్ అంజిబాబు కస్టమర్లే” అని చెప్పాడు.

 ‘వెతకబోయిన తీగ కాలికి దొరికింది. వెంటనే అతని నెంబర్ తీసుకుని మా బావగారికి పంపించా. (ఇక్కడ మా బావగారు జ్వాలా నరసింహ రావు గారి గురించి రెండు మాటలు చెప్పాలని పది మాటలు చెప్పాడు. అవిప్పుడు అప్రస్తుతం). ఎప్పుడో కలిసి చదువుకున్న విజయవాడకు చెందిన లింగాల శర్మ గారిని గుర్తుపెట్టుకుని మరీ ఆయన కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం మా జ్వాలా బావగారు పడిన తపన నిజమైన స్నేహానికి నిర్వచనం. ఏదైతేనేమి శర్మగారి ఇడ్లీలు ఆయన చిన్ననాటి స్నేహితునికి క్లూ ఇచ్చి ఆయన కొడుకుతో ముచ్చటించే అవకాశం లభించింది!’ చాలా గొప్పగా రాశావు పరేష్!

సత్యనారాయణపురంలోని అంజి ‘వెన్న లేదా నేతి ఇడ్లీ’ ప్రత్యేక రుచులతో ప్రసిద్ధి చెందినది. ఇంటి నుండి నడిపే ఇడ్లీ హోటల్ విజయవాడకు వచ్చే వారందరూ సందర్శించాల్సిన స్థలం. ‘అంజిబాబు ఇడ్లీహోటల్’ రుచులకు చిరునామా. ఆహారానికి మాత్రమే కాకుండా, ఆత్మీయతకు, ఆదరణకు, విశ్వాసానికి ప్రతీక అని  చెప్పుకుంటారు. హోటల్‌ నడుపుతున్న అంజిబాబు నా బాల్యస్నేహితుడు స్వర్గీయ  ఎల్విఎస్ఆర్ శర్మ పెద్ద కుమారుడు. తండ్రి సంప్రదాయాన్ని, శ్రద్ధను, పట్టుదలతో కూడిన జీవనవేదాన్ని, స్వయంకృషి, వినయం, పరస్పర గౌరవంతో కూడిన సదాచారాన్ని అంజిబాబు పుణికిపుచ్చుకున్నాడు. శర్మ నిబద్ధత, నైతిక విలువలు అంజిబాబులో ప్రతిఫలిస్తున్నాయి. హోటల్ చుట్టూ విశ్వాసమయమైన కస్టమర్ల వలయం ఏర్పడింది.

బాల్యస్నేహం గుర్తుంచుకోగల శక్తి భగవంతుడు ఇవ్వడం నాపూర్వజన్మ పుణ్యఫలం. స్నేహం కాలాన్ని దాటి అన్వేషణగా మారినప్పుడు, అది ఒక జీవిత తాత్వికాన్వేషణకే మారుతుంది. ఎల్విఎస్ఆర్ శర్మ మౌనంగా బోధించిన జీవనవిద్యకు నిదర్శనం జీవితంలో పైకెదిగిన వాడి ఇద్దరు కుమారులే. వాడు నాకు రాసిన ఉత్తరం ఓ నిశ్శబ్ద జీవచరిత్ర. ఒక సజీవ ఆత్మకథ. శర్మ పిల్లలు తండ్రి సంప్రదాయాన్ని, సంస్కారాన్ని నిలిపారు. అది నిజమైన జీవనవిజయం. ఎల్విఎస్ఆర్ శర్మ జీవనయానం, అనేకానేక అంశాలమీద అనర్ఘళమైన పట్టు, రాజకీయ అంశాల మీద అవగాహన, తదితర సద్గుణాల ప్రభావం నామీద బాగా పడింది. వాడికి నివాళి.

 

No comments:

Post a Comment