Monday, May 22, 2017

ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : సుందర హనుమంతుడు నిజంగా సుందరుడే-2 : వనం జ్వాలా నరసింహారావు


ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
సుందర హనుమంతుడు నిజంగా సుందరుడే-2
 వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (22-05-2017)

            "యమ-నియమములు" హనుమంతుడికు వుండడం సుప్రసిధ్ధం. అభ్యాసమందు ప్రాణాయామం కంటే ప్రత్యాహారం కష్టసాధ్యం. ప్రాణాయామ దశలో, తానింత లావు-పొడవు కలవాడినన్న స్తూల దేహజ్ఞానముండవచ్చు. ప్రత్యాహార దశకు చేరుకునేటప్పటికి, దేహం అతి స్వల్పమైనట్టుగ భావించి, దేహసంధులన్నీ తొలగించి, సడలించిన గాని, ప్రత్యాహారం సాధ్యం కాదు. ఉదాహరణకు హనుమంతుడు పిల్లి ఆకారంలోకి మారడం. అదేవిధంగా ఎంత మెల్లగా మనస్సును లోనికి ప్రవేశింప చేయాలన్న పట్టుదల వున్నప్పటికీ, ఏదో ఒక ప్రతిబంధకం అడ్డుపడే అవకాశం వుంది. ఉదాహరణకు లంకా రాక్షసి.....దాన్ని జయిస్తేనేగాని ఆత్మ దర్శనం సాధ్యపడదు. ఆత్మసాక్షాత్కారం పొందిన పెద్దల ద్వారానూ.....ఉదాహరణకు సంపాతి, శ్రుతివలన, ఆత్మ హృదయగుహలో వున్నట్లు తెలుసుకోవచ్చు. అయినప్పటికీ దానిని కనులారా కనుగొనాలంటే, హనుమంతుడు చేసిన రీతిలో, రాత్రి వేళ ఆయన శ్రమించిన రీతిలో, మరల-మరల శ్రమించాల్సి వుంటుంది. ఇలాంటప్పుడు కూడా భ్రాంతి (మండోదరి) దర్శనం లాంటి విఘ్నాలు సంభవించవచ్చు. ఈ గండాలన్నీ గడిస్తేనేగాని ఆత్మదర్శనం కలగదు. అదేమాదిరిగా, సీతాసంభాషణ, లంకా దహనం, వానరులతో సీతావృత్తాంతం చెప్పడం, సీతాదేవిపై భక్తి, ఇవన్నీ సాధకులకు అనుభవ గోచరాలు.

            సీతాదేవికున్న ఒకే ఒక కోరిక, రామసమాగమం. అది అనన్యసాధ్యం. రాముడు ఎట్లాగైనా తన్ను రక్షిస్తాడని ఆమె నమ్మకం. అందుకే హనుమంతుడు ప్రాధేయపడినా ఆయనతో వెళ్లడానికి  ఇష్ట పడకుండా వుంటుంది. అంగీరించలేదు కూడా.

            యోగ మార్గంలో సంచరించేవారికి ప్రధమ విఘ్నం తన హితులు-సన్నిహితుల వల్లనే కలుగుతుంది. దాన్నే "సాహాయిక రూప విఘ్నం"అంటారు. అది విఘ్నమే కాబట్టి అభ్యాసి దాన్ని ఆమోదించ కూడదు, అంగీకరించనూ కూడదు. ఉదాహరణకు మైనాకుడి చరిత్ర. ఆ పరీక్షలో నెగ్గిన తర్వాత, అభ్యాసి శుధ్ధ శక్తిని పరీక్షించేందుకు దేవతలే విఘ్నం కలిగిస్తారు. ఉదాహరణకు సురస వృత్తాంతం. దానికీ లోను కాకూడదు. ఇది కూడా గెల్చిన తర్వాత భూత గ్రహాలు పీడిస్తాయి (సింహిక వృత్తాంతం). ఇట్టి యోగసిధ్ధిని హనుమంతుడు పరభక్తి సాధనంగా చేసుకున్నాడు.

            సుందరకాండలో ప్రధమాక్షరం "" (తతో రావణీతాయా). కడపటి అక్షరం కూడ "" (తతో మయా వాగ్భిరదీ నభాషిణా). ఇది "తత్" అనే దాన్ని బోధిస్తుంది.

అదే విధంగా సుందరకాండలో ప్రతి సర్గలో మొదటి అక్షరం ""కారమో, ""కారమో వుంటుంది. లేదా "సీత" శబ్దం కాని, పర్యాయ పదం కాని వుంటుంది. అదీ తప్పితే రెండవ శ్లోకం మొదటి అక్షరం "-" తప్పదు. "-"లు "సీత"ని సూచించడం స్పష్టంగా తెలుస్తోంది. సీతేకదా సుందరకాండకు అధిష్టాన దేవత. వీటిని పర్యాలోచించి చూస్తే, సుందరకాండ పఠనం వల్ల భుక్తి-ముక్తి కలుగుతుంది అని అర్థమవుతుంది. కాకపోతే శ్రధ్ధ-భక్తి వుండాలి. ఇహ పర సాధనానికిది మార్గాన్ని సుగమం చేస్తుంది.


            సంస్కృత రామాయణం అర్ధం గ్రహించి పారాయణం చేస్తే సర్వ శ్రేయస్కరం. ఆంధ్రవాల్మీకి రామాయణం పారాయణం చేసినా అంతే శ్రేయస్కరం. అయితే, అర్ధం తెలియని చదువు వ్యర్ధం. అర్ధం తెలీక పోతే మనసు రంజిల్లదు. మనసు రంజిల్లక పోతే భక్తి కుదరదు.

            అందుకే సుబోధకమగు ఈ గ్రంథాన్ని ఈరీతిలో పఠించే వారికి కూడా సత్ఫలితాలు కలుగుతాయి. మూలమందున్న విషయ సారమంతా దీంట్లో కూడా వుంది. ఇది చదివిన వారికీ, పారాయణం చేసినవారికీ, భగవంతుడు సకల శ్రేయస్సులు ఒసంగుననీ, తద్వారా దైవభక్తి లోకంలో వర్ధిల్లుననీ.....శ్రీరామచరణానందుడు, భక్తచరణ పరచరణుడు, వాసుదాసస్వామి, భగవంతుడినీ, శ్రీరామచంద్రుడినీ ప్రార్థించారు. End


No comments:

Post a Comment