సీత
రక్షించినా, రాముడు రక్షించినా ఒకటే !
ఆంధ్ర
వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా
నరసింహారావు
సూర్య
దినపత్రిక (08-05-2017)
లంక నుండి
తిరిగొచ్చిన హనుమంతుడు, తనరాక కొరకు ఎదురు చూస్తున్న వానరుల మనస్సు కుదుట
పడేటట్లు రెండే-రెండు మాటలు చెప్తాడు ఆరంభంలో: "చూచితి-సీత" నని. ఆ తర్వాత తాను
లంకకు పోయి వచ్చిన విధమంతా, అంతవరకు సుందరకాండలో జరిగిన విషయమంతా, సంగ్రహంగా నివేదించాడు ("దండకం" గా వ్రాసారు
వాసుదాసుగారు). ఆ దండకం లో "త్రిజట" వాక్యాలను నమ్మి, రాక్షస స్త్రీలు
సీతాదేవిని శరణాగతి కోరినట్లు, ఆమె వారికి అభయ ప్రదానం చేసినట్లు చెప్పాడు. అయితే, తననే రక్షించుకోలేని సీతాదేవి, తనను చెరనుండి తప్పించమని హనుమంతుడుని కోరుకున్న సీతాదేవి, ఇతరులనెట్లు రక్షించగలదన్న సందేహం కలగొచ్చు.
సీతాదేవి
తనను తాను కాపాడుకోలేక హనుమంతుడుని ప్రార్ధించడం జరగలేదు. అలా అనుకోవడం సమంజసం కాదు. లంకంతా సీతాదేవి
పాతివ్రత్యం అనే తపస్సుతో దగ్ధమైందనీ, రామచంద్రమూర్తి
నిమిత్త మాత్రుడేననీ, హనుమంతుడు చెప్పాడు. తనను తాను రక్షించుకున్నా, హనుమంతుడు
రక్షించినా, రామచంద్రమూర్తికి అపకీర్తి వస్తుందని ఆ ప్రయత్నం
మానుకుంది సీతాదేవి.
సీతాదేవి
అభయప్రదానం చేస్తూ రక్షించ గలిగినా, ఆ అధికారం
తనకున్నదని స్వతంత్రించి చెప్పకూడదు కదా! అంటే సీతాదేవిలో "ఉపాయం" వుందేకాని, "ఉపేయం" లేదన్న సందేహం
రావడం కూడా సబబు కాదు. లక్ష్మీనారాయణులు, సీతారాములు, పరస్పర భిన్నులు కారు. లక్ష్మీదేవి భగవంతుడి కరుణా శక్తే! లక్ష్మి రక్షించినా, నారాయణుడు రక్షించినా, సీత రక్షించినా, రాముడు రక్షించినా ఒకటే! రాముడు లేని కరుణ (సీత) రక్షించలేదు. కరుణ (సీత) లేని రాముడూ
రక్షించలేడు. కృప రక్షించిందంటే రాముడు రక్షించినట్లే! సీత, లక్ష్మి, కరుణ, కృప, దయ: ఇవన్నీ పర్యాయ
పదాలే! అందుకే భక్తులు, లక్ష్మీవిశిష్ట నారాయణుడినీ, సీతావిశిష్ట రాముడినీ ఉపాసించాలని శాస్త్రాలు చెప్పుతున్నాయి. ఒకరి పేరు చెప్పితే రెండవ వారున్నట్లే! సీతతో
పనిలేదు....రాముడు చాలుననీ, లేక, రాముడితో
పనిలేదు....సీత చాలుననీ అనరాదు. ఎండలేని సూర్యుడు, వెన్నెల లేని
చంద్రుడు, అలల్లేని సముద్రాన్ని అనుభవించలేము.
"అహం" భగవంతుడైతే...."అహంత" లక్ష్మీ దేవి
అవుతుంది. సీతాదేవి అనుగ్రహించిన వారిని రాముడూ
అనుగ్రహించినందు వల్ల ఆమెలో "ఉపాయత్వం" వున్నదనీ, రాక్షస స్త్రీలను ఆమె కాపాడినందు వల్ల ఆమెలో "ఉపేయత్వం" (స్వతంత్ర రక్షణ
శక్తి) వుందనీ తెలుసుకోవాలి.
హనుమంతుడు
కిష్కిందకు వస్తూనే, రామ, లక్ష్మణ, సుగ్రీవులను చూస్తూ, శ్రీరామచంద్రమూర్తితో, సీతను గురించి సర్వస్వం తెలియ చెప్పే విధంగా, మూడే-మూడు మాటలంటాడు. "నియత-ప్రాణయుక్త-దేవి" అన్న ఆ మూడు మాటలు
వింటూనే, సుగ్రీవుడు రామకార్యం ఫలించిందనీ, తన మాట చెల్లించు కున్నాననీ సంతోషిస్తాడు. "నియత": అంటే పాతివ్రత్య నియమం కలదనీ, "ప్రాణయుక్త": అంటే జీవించి
వున్నదనీ, "దేవి": అంటే సీతాదేవి అనీ
ఆ మూడు మాటలకర్ధం. సీతాదేవి ప్రాణాలతో బ్రతికున్నా, శీలం చెడిందయితే చచ్చిన దానితో సమానమైంది కనుక, "శీలం" కలదని (నియత) మొదట అంటాడు. శీలం కలిగిన విషయం
నిజమే! చనిపోతే శీలం వున్నా లాభం ఏమిటి? కాబట్టి జీవించే వున్నది (ప్రాణయుక్త) అంటాడు. "దేవి" శబ్దం తనకు
సీతాదేవి మీదున్న భక్తి, గౌరవం చెప్పడానికే! ఆమె మీద
హనుమంతుడుకి ఎంత గౌరవం, భక్తీ వున్నాయంటే, శుభ కార్యాలకు
పనికిరాని దక్షిణ దిశ కూడా, సీతాదేవి వున్న కారణాన, ఆయనకు వందనీయమయింది. శ్రీరాముడికి, సీత గురించి చెప్పే
ముందర, సీతాదేవున్న దక్షిణ దిశగా తిరిగి, వినయంగా శిరస్సు వంచి, నమస్కరించిన తర్వాతనే రాముడి్తో మాట్లాడుతాడు హనుమంతుడు.
హనుమంతుడు
సీతాదేవి ఇచ్చిన చూడామణిని, శ్రీరాముడికి ఇచ్చినప్పుడు, దాన్ని చూసి, అమితంగా దుఃఖించిన రాముడు, అంత దుఃఖంలో కూడా, తనను సీత దగ్గరకు తీసుకు పొమ్మంటాడే కాని, ఆమెనెందుకు తీసుకు రాలేదనికానీ, తీసుకు రమ్మని కానీ
అనడు. ఇక హనుమంతుడు రామచంద్రమూర్తికి సీతా వృత్తాంతమే
చెప్పాడు కాని, తను పడ్డ కష్టాలను ఒక్కటైనా చెప్పలేదు. చెప్పితే ఆత్మ స్తుతవుతుందికద!
అందుకే-ఇందుకే, చదవాలి సుందరకాండ. ఈ విషయాలన్నీ ఇంకా
వివరంగా తెలుసు కోవాలంటే, తప్పక చదవాలి సుందరకాండను. మళ్లీ-మళ్లీ చదవాలి. అనన్య సామాన్యమైన
హనుమత్కాండ ఇది. చదివిన కొద్దీ-ఆస్వాదించిన కొద్దీ, అనేక ప్రశ్నలు, తీరు-తీరు సమాధానాలు
పుట్టుకొస్తాయి. సుందరకాండ ఎందుకు చదవాలని మొదలెట్టి, పూర్తిగా చదివిన వారికి, ఇన్నాళ్లూ ఎందుకు చదవకుండా వున్నామా అన్న వెలితి
క్షణంలో పోతుంది. చదవాలనే జిజ్ఞాస వున్నవారికి, చదివితేనే తెలుస్తుంది ఎందుకు చదవాలనే విషయం.
సుంరరకాండ
"పీఠిక" లో, శ్రీ వాసుదాస స్వామి గారు చెప్పినట్లు, సంస్కృత రామాయణం
అర్ధం గ్రహించి, పారాయణం చేస్తే సర్వ శ్రేయస్కరం. అలా కాకుండా, మూలమందున్న విషయ సారాంశమంతా వున్న "ఆంధ్రవాల్మీకి రామాయణం, సుందరకాండ మందరం" పారాయణం చేసినా అంతే శ్రేయస్కరం. ఇది అనుభవపూర్వకంగా ఎందరో మహానుభావులు, మాన్యులు, సామాన్యులు, ధీమాన్యులు కూడా నిర్ధారించిన వాస్తవం. అందుకే చదవాలి వాసుదాస స్వామివారి మందరం మనమందరం...మనం అందరం!
"అర్ధం తెలియని చదువు వ్యర్ధం....అర్ధం తెలీక పోతే
మనసు రంజిల్లదు" అని శ్రీ వాసుదాసు గారు అన్నట్లు, సుబోధమగు ఈ గ్రంథాన్ని ఈరీతిలో-"సుందరకాండ మందర
మకరందం"- పఠించినా సత్ఫలితాలు శ్రేయ పరంపరలు కలుగుతాయి. ఇది చదివిన వారికి భగవంతుడైన శ్రీరామచంద్ర్డుడు మేలు చేయాలని శ్రీ
సీతారాముల చరణ కమలాల మ్రోల సాగిలపడి వేడుకొంటున్నాను.
No comments:
Post a Comment