ఆకాశవాణి లో
దివి అనుభవాలు
వనం జ్వాలా
నరసింహారావు
ఆంధ్రభూమి
దినపత్రిక (20-05-2017)
అవి నేను హైదరాబాద్
సమీపంలోని రామచంద్రాపురంలో వున్న భారత్ హెవీ ఎలెక్ట్రికల్స్ లిమిటెడ్ హయ్యర్
సెకండరీ పాఠశాలలో లైబ్రేరియన్ గా పని చేస్తున్న రోజులు. హైదరాబాద్ ఆకాశవాణి
వార్తావిభాగంలో పనిచేస్తున్న తురగా కృష్ణమోహన్ రావు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో
ఆయన పనిచేసిన ఉద్యోగంలో విలేఖరిగా చేరిన స్నేహితుడు-బంధువు భండారు శ్రీనివాసరావుతో తరచూ రేడియో స్టేషన్ కు
వెళ్తుండేవాడిని. అడపదడప ఆకాశవాణిలో అవకాశం దొరికినప్పుడల్లా చిన్నాచితకా
కార్యక్రమాలు చేసేవాడిని. అలా వెళ్తున్న సమయంలో వార్తావిభాగంలో పనిచేస్తున దివి
వెంకట్రామయ్య గారితో పరిచయం ఏర్పడ్డం, ఆ పరిచయం
అచిరకాలంలోనే స్నేహంగా మారడం, ఇప్పటికీ ఆ స్నేహం కొనసాగడం జరిగింది. అలా ఏర్పడ్ద
పరిచయం-స్నేహం వల్ల వెంకట్రామయ్య గారిలో వున్న రచయితను, సాహితీపరుడిని, కథకుడిని అందరిలాగా నేనూ గమనించడం, ఆయన్ను వీలున్నంతవరకు ఎప్పుడూ ఏదైనా రాస్తుండమని అడగడం జరిగేది.
కారణాలేవైనా ఆయనెప్పుడూ మా మాటలు పట్టించుకోలేదు. చివరకు ఆయన మరో మిత్రుడు
"రచన" శాయి అడిగినప్పుడు కాదనలేకపోయారు...మారు మాట్లాడకుండా రచనకు
ఉపక్రమించారు వెంకట్రామయ్య గారు. ఫలితంగా ఎమెస్కో వారి పుణ్యామా అని వెలువడింది
"ఆకాశవాణి లో నా అనుభవాలు" అనే పుస్తకం. డీవీ గారి జీవితంలో, ఆయనకు ఎన్నో అపూర్వమైన అనుభవాలు కలిగించిన "ఆకాశవాణి అనే ఒక గొప్ప
సంస్థ, వ్యవస్థ" గురించి ఆయన ఆభిప్రాయాల సంకలనమే ఈ
పుస్తకం.
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో మూడున్నర
దశాబ్దాల పాటు,
వార్తా విభాగంలో న్యూస్ రీడర్ పదవితో సహా, నాటక రచయితగా, నటుడిగా, ప్రయోక్తగా
పనిచేసిన సాహిత్యరంగ ప్రముఖుడు, కథకుడు దివి వెంకట్రామయ్య రాసిన “ఆకాశవాణిలో నా
అనుభవాలు” పుస్తకాన్ని
చదవడం మొదలు పెట్టిన వారికి అది పూర్తి అయ్యే వరకు పరిపరి విధాల ఆసక్తిని, జిజ్ఞాసను రేకెత్తిస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. “శబ్దం కన్నా
నిశ్శబ్దం మంచిది...
మాటకంటే మౌనం గొప్పది” అంటూ "నా మాట" గా పుస్తకాన్ని పరిచయం చేసిన వెంకట్రామయ్య
వ్యవస్థా పరంగా అనేక లోటు పాట్లు ఉన్న ఆకాశవాణిలో తన అనుభవాలు గొప్పవి
కాకపోయినప్పటికీ వాటిలో కొన్నిటిని పాఠకులతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎనౌన్సర్ గా రేడియో రంగ ప్రవేశం చేసిన వెంకట్రామయ్య కొద్దిరోజులకే
తాను రాక ముందు నుంచే పనిచేస్తున్న సీనియర్లతో తాను ఎలా అనుబంధం, సాన్నిహిత్యం పెంచుకుంది అన్న విషయాలు చాలా ఆసక్తికరంగా వున్నాయి ఈ పుస్తకంలో.
మొదటి సారి ఆకాశవాణి ఇంటర్వూకు
హాజరైనపుడు సెలక్షన్ కమిటీ సభ్యుల్లో ఒకరైన మహాకవి దేవులపల్లి కృష్ణ శాస్త్రి
వెంకట్రామయ్య ఇంటి పేరు అడిగి తెలుసుకుని అది దేవులపల్లి కాదంటూ, “దివి నుంచి
భువికి దిగి వచ్చావు అన్న మాట” అని వ్యాఖ్యానించడాన్ని పేర్కొన్నారు డీవీ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో వెంకట్రామయ్య చేరిన నాటికి అక్కడ పని
చేసి పదవీ వరమణ చేసిన, ఇంకా అప్పటికి పని చేస్తున్న పలువురు
లబ్ధప్రతిష్టులైన వారి గురించి, వారితో ఆయన సహచర్యం, సాన్నిహిత్యం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పుస్తకంలో
పేర్కొన్నారు.
వీరిలో దేవులపల్లి కృష్ణ శాస్త్రి, త్రిపురనేని గోపి చంద్, ముని మాణిక్యం, నరసింహారావు, బాలాంత్రపు రజనీకాంత రావు, బుచ్చిబాబు, న్యాయపతి రాఘవరావు, చిత్తరంజన్, దండమూడి మహీదర్, రావూరి భరద్వాజ, తురగా కృష్ణమోహన్ రావు, నళినీ మొహన్ లాంటి ఎందరో వారున్నారు. వీరందరితో
తాను ఎలా కలిసి మెలిసి పని చేసింది వారి అనుభవాలు, తనకు
ఎలా ఉపయోగపడింది సవివరంగా పుస్తకంలో పేర్కొనడం జరిగింది. ప్రముఖ రచయిత, గొప్ప పాఠకులు, నిరంతర అధ్యయన శీలి బుచ్చిబాబు (శివరాజు వెంకట
సుబ్బారావు)తో సుమారు నాలుగేళ్ల పాటు ఆయన ప్రత్యక్ష, పర్యవేక్షణలో పని చేసే అవకాశం తనకు లభించిందని వెంకట్రామయ్య అంటారు.
ఆకాశవాణిలో తెలుగు ప్రకటనలకు వాడే భాష చాలారోజులవరకు వాడుక భాష కాకుండా
గ్రాంథికంగా వుండేదని, అన్ని రకమైన ప్రకటనలకు ఒకే రకమైన భాష ఉపయోగిస్తూ, వైవిధ్యం లేకుండా పోయేదని, తాను కొంత చొరవ
తీసుకుని ఆ పద్ధతిలో బుచ్చిబాబు అనుమతితో కొన్ని మార్పులు తీసుకుని రాగలిగానని
డీవీ రాశారు. బుచ్చిబాబు మరణించిన దుర్వార్తను తానే రాసి చదవాల్సి వచ్చిందని, అలాగే జవహర్లాల్ నెహ్రూ హటాన్మరణం వార్త కూడా తానే ప్రకటించానని వెంకట్రామయ్య
రాశారు. నెహ్రూ చనిపోయినప్పుడు డ్యూటీలో వున్న వెంకట్రామయ్య "ఒక ముఖ్య
ప్రకటన...ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కొద్దిసేపటి క్రితం కొత్త ఢిల్లీలో
ఆకస్మికంకంగా మరణించారని తెలియపర్చడానికి చింతిస్తున్నాం" అని చెప్పారు
వెంకట్రామయ్య. అలాంటి ముఖ్యమైన వార్త, విషాదకరమైన వార్త
శ్రోతలకు వినిపించేటప్పుడు కంఠ స్వరంలో విషాదం, గాంభీర్యం
కనపర్చాలికాని, మరీ ఏడుస్తున్నట్లుగా మాట్లాడ కూడదని రాశారాయన. తనకు కూడా ఉద్వేగం వచ్చిందనీ, కాని అదుపులో
వుంచుకున్నానని అంటారు.
ప్రభుత్వం చేతుల్లో వున్న అత్యంత శక్తివంతమైన సాధనం ఆకాశవాణి అయినప్పటికీ, అటువంటి సాధనాన్ని వినియోగించుకోవడంలో ఎంతో కొంత విచక్షణ కనపర్చాలని, నిగ్రహం పాటించాలని, అంటారు వెంకట్రామయ్య. ప్రభుత్వ ప్రచార
కార్యక్రమాలు కూడా శ్రోతలను ఆకర్షించుకుని, ఆకట్టుకోవాలే కాని
విసుగెత్తించకూడదనేది ఆయన అభిప్రాయం. ఆకాశవాణి ఘోరాలను
గురించి కూడా ఆయన రాశారు. మునిమాణిక్యం నరసింహారావు, జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి
ప్రస్తావన తెచ్చారాయన. మునిమాణిక్యం అసిస్టెంట్ ప్రొడ్యూసర్ గా చేరి, పదవీవిరమణ చేసేదాకా అదే ఉద్యోగంలోను, జలసూత్రం జూనియర్ గ్రేడ్ స్క్రిప్టు
రచయితగా చేరి అదే గ్రేడ్ లో రిటైర్ అయ్యేదాకా పని చేయాల్సి వచ్చింది. ఇది అన్యాయమంటారు డీవీ. అలనాటి
మహానుభావులే కాకుండా,
ఆకాశవాణిలో
"ఆర్టిస్ట్" వర్గానికి చెందిన వారి గతి ఈ నాటికీ ఇంతేనని, "పేరు గొప్ప...ఊరు దిబ్బ" అనే
సామెత ఆకాశవాణి కళాకారులకు అక్షరాలా వర్తిస్తుందని అంటారాయన.
ఆకాశవాణి ఒక మాస్ మీడియం అనీ, ప్రజాబాహుళ్యం కోసం
ప్రసారాలు జరిపే శ్రవణ మాధ్యమం అనీ, రంగస్థలం మీద
నటించినట్లుగా రేడియోలో నటించకూడదనీ, చతుర్విధాభినయాలలో
ఇందులో కావాల్సింది వాచికాభినయం మాత్రమేనని ఆయన తన అభిప్రాయంగా రాశారు. పాత
రోజుల్లో, అదీ టెలివిజన్ లేని రోజుల్లో, సినిమా తరువాత అత్యంత ప్రజాదరణ కలిగిన, ప్రచారం కలిగిన, బహుజన మాధ్యమం రేడియో మాత్రమేనని,
ఒక్కసారి రేడియోలో మాట్లాడితే
చాలు, ఒక్క కార్యక్రమంలో పాల్గొంటే చాలు అని
అనుకునేవారు చాలామంది అంటారాయన."రేడియో రచనలకు పెద్దగా సాహిత్య
విలువలుంటాయని ఎవరూ భావించనక్కర లేదు. అటువంటి విలువల కోసం వెదకాల్సిన అవసరమూ
లేదు. రేడియో రచనలకుండే పరిమితులు వేరు. ఆ రచనల ప్రయోజనం వేరు. ఆకాశవాణి లాంటి
సుప్రతిష్ఠతమైన సంస్థల్లో కూడా, ఎన్నేళ్లపాటు పనిచేసిన వారిలో కూడా, రేడియో రచనలకుండే నిర్ధిష్ట లక్షణాలు
తెలిసినవారు చాలా తక్కువ. ఇది నాకు కలిగిన ఆవేదనాపూరితమైన అనుభవం" అని
రాశారు.
సహౌద్యోగి దండమూడి మహీదర్ ద్వారా చందమామ వ్యవస్థాపక సంపాదకుడు, "విజయాధినేత" చక్రపాణితో పరిచయమైంది వెంకట్రామయ్యకు.
"సినిమాకథ అనేది సూటిగా, మెలికలూ, మలుపులూ మరీ ఎక్కువ
లేకుండా వుండాలి. సామాన్య ప్రేక్షకులకీ, చిన్న పిల్లలకీ
కూడా విషయం తేలిగ్గా అర్థం అయ్యేట్లుగా వుండాలి. కథలో ఏడుపులూ, మొత్తుకోళ్లూ, అనవసరమైన సెంటిమెంట్లూ, అతిగా వుండకూడదు. హాల్లో కూర్చున్నంత సేపూ చూడ్డానికీ, బయటకొచ్చిన తరువాత తల్చుకోవడానికీ, చూడనివాళ్లకు
చెప్పడానికి కూడా ఆ సినిమా హాయిగా వుండాలి" అన్న చక్రపాణి గారి సినీ
సిద్ధాంతాన్ని తన పుస్తకంలో నెమరేసుకున్నారు డీవీ. తొలి
పరిచయంలోనే తనతో ఆయన చనువుగా, స్వేఛ్చగా, సూటిగా ఎన్నో విషయాలు మాట్లాడి తనను
ఆశ్చర్యపరిచిన విషయం పేర్కొన్నారు. తనకు తాగమని "బీర్" కూడా ఆఫర్
చేసారనీ, తానే సున్నితంగా వద్దన్నాననీ, పగలు-అదీ-డ్యూటీలో వున్నప్పుడు తాగనని
అన్నానని రాశారు. తనతో చక్రపాణిగారికి సినీ స్క్రిప్టు రాయించాలని ఆలోచన వున్న
విషయాన్ని స్నేహితుడు మహీదర్ ఆయన చనిపోయిన తరువాత చెప్పడం తనకు ఆశ్చర్యం
కలిగించిందంటారు డీవీ.
వెంకట్రామయ్య గారికి ఆకాశవాణి అనుభవంతో
పరిచయమైన మరో సినీ ప్రముఖుడు దుక్కిపాటి మధుసూధన రావు. అలా కలిగిన పరిచయం వల్ల
అన్నపూర్ణావారి "బంగారు కలలు" సినిమాలో కొంత భాగానికి స్క్రిప్టు రాసే
అవకాశం కలిగింది వెంకట్రామయ్య గారికి. కాకపోతే మొదటి కలయికలో "మీ గురించి
నాకేమీ తెలియదు" అని ఆయన అన్న మాటలకు అప్పటికే రచయితగా, రేడియో ప్రవక్తగా, రేడియో "రాంబాబు" గా
సమాజంలో ఎంతో మందికి తెల్సిన తనను అలా
అన్నందుకు కొంచెం బాధ కలిగింది వెంకట్రామయ్యకు. దుక్కిపాటి తాను మొదట రాసిన
స్క్రిప్టును "పొయటిక్" భాష అని అనడం, వాక్యాలు
ఇంకా చిన్నగా వుండాలనడం,
మళ్లీ తిరగ రాయాలనడం, అలా చేసిన తరువాత దాన్ని చదివిన ఆయన
పూర్తి సంతృప్తి వ్యక్తపరచడం,
ఒక అనుభవంగా పేర్కొన్నారు
రచయిత. ఇక ఆయనతో కలిసి తీద్దామనుకున్న మట్టిమనిషి ప్రాజెక్టు గురించి సుదీర్ఘంగా
రాశారు పుస్తకంలో.
వెంకట్రామయ్య తన పుస్తకంలో తనతో కలిసి పని చేసిన వారందరి గురించి విపులంగానో, క్లుప్తంగానో
రాశారు. కాజువల్ ఆర్టిస్టుల గురించీ రాశారు. ఆయన తమ గురించి రాసిన వాక్యాలను
వారందరూ విలువైనవిగా భద్రపరుచుకునే విధంగా రాశారాయన. భండారు శ్రీనినవాస రావు
గురించి ప్రత్యేకంగా కేటాయించిన ఒక శీర్షికలో నా గురించిన ప్రస్తావన కూడా
తెచ్చారు. నేను చేసింది చిన్నదైనా ప్రత్యేకంగా పేర్కొనడం ఆయన గొప్పతనానికి
నిదర్శనం.
మొత్తం మీద అందరూ, ముఖ్యంగా ఆకాశవాణి గురించి తెలుసుకోవాల్సిన
అందరూ చదవాల్సిన, చదివించాల్సిన అపురూపమైన పుస్తకం
ఇది.
No comments:
Post a Comment