Sunday, May 14, 2017

సుందర హనుమంతుడు నిజంగా సుందరుడే ...... ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


సుందర హనుమంతుడు నిజంగా సుందరుడే
ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (15-05-2017)

శ్రీమద్రామాయణంలోని ఏడు కాండలలో సుందరకాండ ఉత్తమోత్తమమనీ, సకలాభీష్ట ప్రదమనీ ఆర్యుల విశ్వాసం. అందుకే శ్రధ్ధా భక్తులతో ప్రతిరోజు పారాయణం చేస్తూ కృతార్ధులవుతున్నారనే సంగతి అందరికీ తెలిసిందే. సుందరకాండ పారాయణం చేస్తే, వ్యాధులు, కారాగృహ బంధనాలు, గ్రహపీడలు, సంతానం లేమితనం, దారిద్ర్య సంబంధమైన కష్టాలు తొలగిపోవడంతో పాటు భక్తి-ముక్తి కలుగుతుంది. ఇది మూఢ విశ్వాసం కానేకాదనీ, సహేతుకమనీ ధృవపడింది.

            రావణాది రాక్షసుల మూలాన, హీనస్థితి చెందుతున్న ధర్మాన్ని వుధ్ధరించడానికీ, రాక్షస సంహారం చేయడానికీ, శ్రీమన్నారాయణుడు, శ్రీరామచంద్రమూర్తిగా అవతరించిన విషయం వాల్మీకి స్పష్టంగా తెలియచేసాడు.

            ఇతర దేవతలందరికంటే, అన్ని అవతార మూర్తులకంటే శ్రీరాముడిలో వాత్సల్యం, అభయ ప్రదానగుణం, సౌశీల్యం, కారుణ్యం, సత్యసంధత విశేషంగా వున్నాయి. శ్రీరామచంద్రమూర్తి శీఘ్రంగా అభీష్టాలను ప్రసాదిస్తాడనీ, సీతమ్మ అంతకంటేననీ అందరి నమ్మకం."స్మరణమాత్ర సంతుష్టాయ" అనే శ్రీరామ కవచంలోని వాక్యాలను గుర్తుచేసుకోవాలి. ఇట్టి శ్రీరామచంద్రుడి కంటే గూడా ప్రేమస్వరూపిణి సీతాదేవి క్షిప్రప్రసాదిని. అంటే అప్పటికప్పుడే అనుగ్రహించగల అనురాగమయి సీతమ్మ.

            రావణాసురుడు దేవతా స్త్రీలను, మానవ స్త్రీలను చెరపట్టి పతివ్రతలను చెరుస్తూ దుఃఖ పెడ్తుంటే శ్రీమహాలక్ష్మి సహించలేక పోయింది. ఆకారణాన వేదస్వరం నుండి వేదవతిగా-అయోనిజగా జన్మించి రావణాసురుడిని శపిస్తుంది. మళ్లీ అయోనిజై సీతగా పుట్టి శ్రీరాముడిని పెళ్లాడి ఆయనతో అడవులకు వెళ్తుంది. రావణాసురుడిని చంపేందుకు ఒక కారణం కావాల్సినందున, జింకను పట్టి తెమ్మని భర్తను కోరుతుంది. రావణుడి చేతికి చిక్కి వాడిని చంపగలిగిన శక్తి వున్నప్పటికీ, తాను ఆపని చేయక, భర్తతో అతడినీ-అతడి వారందర్నీ చంపించి ముల్లోకాలకు ఆనన్దం కలిగిస్తుంది.

            ఇక ఉత్తర కాండలో ప్రస్తావించబడిన విషయానికొస్తే.....రామాజ్ఞ ప్రకారం లక్ష్మణుడు సీతాదేవిని వాల్మీకి ఆశ్రమ సమీపంలో వదుల్తాడు. ఏటివొడ్డున ఆమె ఒంటరిగా దుఃఖిస్తుంటే చూసిన వాల్మీకి శిష్యులు ఆయనకీ విశయం తెలియచేస్తారు. తన యోగదృష్టితో జరిగిందంతా తెలుసుకొన్న వాల్మీకి పాదుకలైనా ధరించక, పరుగున పోయి సీతను పూజించి తన వెంట తీసుకునివచ్చి ముని భార్యలకప్పగిస్తాడు. సీతాదేవి మహిమను, అమెపై పడ్డ నిందను గ్రహించిన వాల్మీకికి అంతులేని పరితాపం కలుగుతుంది. ఆ పతివ్రతాశిరోమణిపై నింద వేయడం సరికాదనీ, ఆమె వృత్తాంతాన్ని జగద్విదితం చేయాలనీ, నిందను తొలగించాలనీ వాల్మీకి సంకల్పిస్తాడు. తన సంకల్పాన్ని కార్య రూపం ధరింపచేసే విధానాన్ని నారదుడి వల్ల రహస్యంగా ఉపదేశం పొంది, రామాయణంగా రచించి, సీతాదేవి పుత్రులతో సభల్లో పాడించి, ఆమెను పరీక్షకు నిలువచేసి, ఆమెకు కల్గిన అపకీర్తిని తొలగిస్తాడు వాల్మీకి మహర్షి. సీత అవతారమూర్తని ముల్లోకాలలో ప్రసిధ్ధం చేసాడు. ఆమెను లోకపావని అని సంభావిస్తాడు.

రామాయణం ఏడు కాండలు పూర్తిగా శ్రధ్ధగా చదివిన వారికి స్ఫురించే విషయం రాముడిపై వాల్మీకికున్న అపార భక్తి-గౌరవాలు. అంతకు మిక్కిలిగా సీతపై వున్న భక్తి భావన. అందుకే సీతను అధికరించి చెప్పబడిన సుందరకాండ అన్ని విధాలుగా సుందరంగానూ, సారవంతంగానూ తీర్చిదిద్దుతాడు వాల్మీకి. "పరాశర సంహిత"లో చెప్పినట్లు, సుందర హనుమంతుడు నిజంగా సుందరుడే. సీత అతిరూపవతి, త్రిలోకసుందరి. అందుకే, సుందరులనధికరించి చెప్పిన కాండ సుందర కాండగా పిలువబడ్తున్నది. భగవత్ సౌన్దర్యం కూడా వర్ణించబడింది సుందరకాండలో.


            గజేంద్రుడికి మోక్షం ప్రసాదించిన భగవంతుడిని, రాక్షసుల బాధలనుండి తమను విముక్తులను చేయమని దేవతలు ప్రార్ధిస్తే, ఆయన శ్రీరామచంద్రమూర్తిగా భూమిపై అవతరిస్తాడు. అనంత కళ్యాణగుణాలన్నీ శ్రీరాముడిలో వున్నాయని రామాయణంలోని ప్రతి కాండలో వర్ణిస్తాడు వాల్మీకి. జగత్సంహారకశక్తి ఒక్క శ్రీరాముడి లోనే కలదని సుందరకాండలో చెప్పబడింది. భగవంతుడగు శ్రీమహావిష్ణువు తన మాయ చేత ఎన్నోరూపాలు ధరించగలడనీ, వహించగలడనీ రామాయణంలో చెప్పడం జరిగింది.

            "అర్థ పంచక జ్ఞానం" "ఆచార్యుల" ద్వారానే కలుగుతుందని హనుమంతుడి చర్య వలన బోధపడ్తుంది. ప్రాప్యమగు బ్రహ్మ స్వరూపం, జీవాత్మ స్వరూపం, ఉపాయ స్వరూపం, ఫల స్వరూపం, విరోధి స్వరూపమనే అర్థ పంచక జ్ఞానం సుందరకాండలో నిరూపించబడింది.

            దశ-ఇంద్రియ అధిష్టితమైన దేహమే లంక. ఆహంకార, మమకారాలు రావణ-కుంభకర్ణులు. ఇంద్రజిత్తు, ఇతరులు కామ, క్రోధాలు. వీటిలో బంధించబడిన చేతనుడే సీత. వివేకమే విభీషణుడు. భగవంతుడు తన్ను రక్షిస్తాడో లేడో అన్న సందేహంతో పరితపిస్తున్న చేతనుడికి అర్థ పంచక జ్ఞానాన్ని కలిగించి ఉద్దీవింప చేసిన విధానం హనుమంతుడి చర్యవలన విషదమవుతుంది.

            సంసారాన్ని తరించగోరి, ఆత్మవిచారం చేసే యోగికి అవసరమైన అభ్యాసాదివిధం హనుమంతుడి చర్యవలన తెలుసుకోవచ్చు. హనుమత్కృపే మనస్సు. యోగానికి ఎనిమిది అంగాలు: "యమము నియమము ఆసనము ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానం - సమాధి". వీట్లో మొదటి అయిదు బాహ్యాంగాలు.

"అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం" అనేవి యమములు. "శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ప్రణిదానం" అనేవి నియమములు. పద్మాసనాదులే ఆసనాలు. శ్వాసబంధమే ప్రాణాయామం. ఇంద్రియాలను విషయాలలో వ్యాపించనీయక లోనికి ఆకర్షించి చిత్తంలో నిలపడమే ప్రత్యాహారం.
           


No comments:

Post a Comment