భగవత్
దాస్యం "యోగ-జ్ఞానాల" కంటే కూడా గొప్పది
ఆంధ్ర
వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా
నరసింహారావు
సూర్యదినపత్రిక
(29-05-2017)
సుందరకాండలో
వివరించబడిన రెండు ప్రధాన విషయాలు: సీతాదేవిలో
కనిపించిన ప్రేమ, ప్రవృత్తి. ఓడ నడిపేవాడికి
ధనరూపంలో కూలి ఇచ్చినట్లే, శ్రధ్ధాభక్తులనే కూలిని భగవంతుడికియ్యాలి. సంసారాన్ని దాటాలన్న కోరికున్నవారికి ఇది అత్యంత ఆవశ్యం. ఆ కూలివ్వకపోతే భగవంతుడు నావను దాటించడు. సంసారమనే నావను
దాటితే లాభమేమిటని ప్రశ్నించే వారికి, దొరికే జవాబు
మోక్షమనే సుఖం.
హనుమంతుడు "మహాయోగి-మహాజ్ఞాని"అనే విషయం నిర్వివాదం. అంతటి ఘనుడు కూడా, లంక వెళ్లేటప్పుడు రామ ముద్రికను, వచ్చేటప్పుడు సీతమ్మ చూడామణిని తోడుంచుకుని మరీ సముద్రాన్ని దాటుతాడు. లంకలో వున్నంత సేపూ భగవత్ దాస్యం "యోగ-జ్ఞానాల"కంటే కూడా గొప్పదని నమ్మాడు. "దాసుడ రామచంద్రునీ" కని, రహస్యంగా అనకుండా, దిక్కులు మారుమ్రోగేటట్లు చాటి చెప్పాడు. "రామదాసుడ"నని ఎప్పుడు
హనుమంతుడు అన్నాడో, అప్పుడే, హనుమంతుడుకి
చల్లదనం కలిగించాలని అగ్నిహోత్రుడిని అజ్ఞాపిస్తుంది సీతమ్మ తల్లి. తన స్వభావం మానుకోలేనని రామచంద్రుడితో సముద్రుడనగలిగాడు కానీ, సీత అడిగినప్పుడు కాదనే ధైర్యం అగ్నిహోత్రుడికి లేకపోయింది. రామబాణం కంటే కూడా, సీతాదేవి వాక్కు అమోఘమనే అర్ధం దీనివలన
స్పష్టమవుతోంది.
"శ్రీరామదాసోహ"మనే షడక్షర మంత్రం
హనుమంతుడికి లంకలో ఎలాంటి బాధలు కలగకుండా రాక్షసులను జయించడానికి తోడ్పడింది. అందుకే, శ్రీరామదాసోహమని ఎవరన్నప్పటికీ, వారిని సంసారసాగరం దాటించి రామపాద సన్నిధికి చేర్చగలదా మంత్రం. షడక్షరమంత్ర మహిమ తెలుసుకోవడం ఎవరి తరమూకాదు.
"శ్రీ-సీత" శబ్దాలను పరిశోధన చేస్తే, దేవతల్లో, మనుష్యులలో, పశు, పక్ష్యాదులలోని మగవారి పేర్లన్నీ విష్ణుమూర్తివిగానూ, ఆడవారి పేర్లన్నీ లక్ష్మీదేవివి గానూ విషదమవుతుంది. లక్ష్మీనారాయణులు, సీతారాములు, ఇరువురూ సమానులే. లోకంలో పురుష వాచకాలన్నీ "రామ" అనీ, స్త్రీ వాచకాలన్నీ "సీతాదేవి"అనీ, ముల్లోకాల్లో వీరిరువిరికంటే వేరైందేదీలేదనీ తెలుసుకోవాలి.
చేతనాత్మక తత్వాన్నీ, లక్ష్మీనారాయణుల సమత్వాన్నీ, చిద-చిదీశ్వర తత్వాలను, మూడింటినీ కూడ, "శ్రీ-సీత" శబ్దాలను పరిశోధిస్తే విషదమవుతుంది. ఈమూడింటి ఏకీభావం, ఇంతకంటే పరమైన మహాత్మ్యం కలిగిందేదీ లేదన్నవిషయం
కూడా బోధపడ్తుంది. భగవంతుడంటే "ఆనందం-నిశ్చయం" అనే శ్రుత్యర్ధం కూడ సీత శబ్దం బోధిస్తుంది. అంటే, "స"కారానికి, స్త్రీ లింగ రూపం "సీ" కాబట్టీ, "సీ" శబ్దానికి భగవతి-లక్శ్మీదేవి అనే అర్ధం కూడా స్ఫురిస్తుంది. అలాగే "త"కారానికి "నిశ్చయ"మనే భావం, "త"శబ్దానికి "దయ" అనే అర్ధం
ఏర్పడుతోంది. సీతాదేవి ఎంతటి దయావతో రామాయణం చదివేవారికి వేరే
చెప్పాల్సినపనిలేదు.
సీతా శబ్దం లాగానే, "స"కార, "త"కార శబ్దాలతో, "సతీ"-"సత్"-"సేతు"-"సత్య" అనేవి కూడా వున్నాయి. వీటికీ సీతాదేవికీ సంబంధం వుండవచ్చుకదా! సతీ శబ్దం
సాధారణంగా పతివ్రతకు పేరు. అలానే దర్శన మాత్రాన్నే పాపాలు పోగొట్టేది "సతి". ఇది సామాన్య సతుల
లక్షణం. అందు సీతాదేవి ఎట్టి సతియో రామాయణం చదివేవారికి
చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారి ఆమె కటాక్షం మనమీద పడ్డా, ఆమె దర్శనం మనకొక్కసారి కలిగినా, మన పాపాలన్నీ
నశించి, కృతకృత్యులమవుతామన్న విషయంలో సందేహం ఏమాత్రం లేదు. ఆమె దర్శన ప్రాప్తి లేనప్పుడు అట్టి పుణ్యాత్మురాలి చరిత్ర పఠించినా
సర్వపాపాలు హరించి పోతాయికదా! అందుకే చదవాలి సుందరకాండ.
నీళ్లు వృధాగా పోకుండా రెండొడ్డుల నడుమ అడ్డంగా
నిర్మించే కట్టను "సేతు"వంటారు. కట్టలు నిర్మించే ఉద్దేశ్యం నీళ్లు వ్యర్ధం కాకుండా పైర్లు వృధ్ధి
చేసుకోవటమే కదా? అదే విధంగా సీతాదేవిని మనం ఆశ్రయిస్తే, మన జన్మ ప్రవాహాలు వ్యర్ధమై పోకుండా ఫలవంతమయ్యేటట్లు చేసి, ఐహిక సుఖాలు కలిగిస్తాయి. "సేతు"వుకు మరో అర్థం...ఈ ఒడ్డున వున్నవారు ఆవలి ఒడ్డుకు
పోవటానికి అవసరమైన నిరపాయసదుపాయం. సీతాదేవి కూడా, భగవత్ ప్రాప్తి
కోరి, తనను ఆశ్రయించే వారికి సేతువు లాంటిదే. కాబట్టే ఆమెను పురుషకారంగా భక్తులు-ప్రపన్నులు
ఆశ్రయిస్తారు. పురుషకారం అంటే మన యోగ్యతలతో నిమిత్తం లేకుండానే, స్వామివారికి, మనల్ని గురించి మంచిమాటలు చెప్పి మేలు చేయడమన్నమాట!
ఇక "సత్య" పాదంలోని "స"కారానికి "జీవుడ"నీ; "త"కారానికి "పరబ్రహ్మమ"నీ; "య"కారానికి ఈండింటినీ చేర్చే
శక్తైన "లక్ష్మి"అనీ అర్ధం. కాబట్టి లక్ష్మీదేవే "జీవాత్మ"ను, "పరమాత్మ"తో చేరుస్తుందని
అర్ధం.
మనకు గోచరించేది
జీవుల తోను, ప్రకృతి తోను వుండే "చిదచిద్విష్ఠం". ఈ రెంటికీ
అంతర్యామి ఈశ్వరుడు. ఆయన మన కంటికి కనిపించడు. అయినా మనం చేరవలసింది ఆయన్నే. చేరేదెట్లా అనేదే
ప్రశ్న. ఆయనో గృహస్తుడి లాంటి వాడు. జీవ, ప్రకృతులే గృహం. ఆ గృహంలో ఆయన తన
ఇష్టులతో, శిష్టులతో సంతోషంగా కాలక్షేపం చేస్తుంటాడు. గృహ కృత్యాలను ఆయన భార్య నిర్వహిస్తుంది. పతివ్రత కాబట్టి
ఆమె తన భర్తకు, ఏ విచారం కలుగకుండా, ఆనందంగా కాలం గడిపే
అవకాశం కలిగిస్తుంది. అట్టి భార్యే లక్ష్మీదేవి. భర్తను విడిచి పెట్టకుండా సర్వదా ఆయనకు ఆనందం కలిగించే రీతిలో
వ్యవహరిస్తుంటుంది. ఆయన అభిమతానికి అనురూపంగా ప్రవర్తిస్టుంటుంది. ప్రపంచ వ్యవహారం నిర్వహిస్తుంది కూడా. "జీవ,ప్రకృతులు" ఆమె ఆజ్ఞానుసారం వర్తించేవే. ఇందు"జీవులు" బిడ్డలు. ఇల్లు, ఇంటి చుట్టూ వున్న తోటలోని వినోద వస్తువులే "ప్రకృతి". బిడ్డలు తోటలో
ఆడుకున్నంత సేపు ఆమె తన పనిలో నిమగ్నమై వుంటుంది. బిడ్డలు ఆటలు
చాలించి ఆకలితో ఎప్పుడొస్తారో అప్పుడు అమ్మ, వారిని లోనికి
పిల్చి, తగిన ఆహారం ఇస్తుంది. ఇవన్నీ గ్రంథాల్లో స్పష్ఠంగా చెప్పిన విషయాలే. బిడ్డలు మళ్లీ ఆటలకు పోకుండా మాతా, పితల సేవలో దిగితే, వారిని తండ్రికి అప్పగించి, ఆ సేవలోనే వుంటుంది. బిడ్డలకు అపాయం కలగకుండా అవసరమైన వారిని ఏర్పాటుచేసే బాధ్యత తండ్రిది. ఇదే "అంశావతారం". ఒక వేళ ఆఅపాయం కష్ట
సాధ్యమైన కార్యమైతే స్వయంగా తానే బయలుదేరి, భార్య దగ్గర
తగుపరికరాలను తీసుకొని, అవసరమైన వేషం ధరించి, అపాయాన్ని తప్పించి, వేషం మార్చుకుంటాడు. ఇదే "పూర్ణావతారం".
భర్తకొరకు వచ్చి ఆయన్ను కలవదల్చుకున్న
వారెవరైనప్పటికీ, భార్య అనుగ్రహించి తలుపు తీసి, దారి చూపేవరకు ప్రవేశించలేరు. ఈ తలుపు తానైనా
తీస్తుంది....లేదా....భర్త పంపిన వారితోనైనా చేయిస్తుంది. అలా పంపబడినవాడే "ఆచార్యుడు". మనం స్వశక్తితో ఎంత కాలమైనా, ఎన్ని కల్పాలకైనా లోనికి పోలేం. మన ఏడ్పులు విని, ఆమె మనస్సు కరిగి తలుపులు తీస్తేనే మనం లోపలికి పోగలుగుతాం. ఇంతకు మించి వేరే మార్గం లేదు.
"తలుపులు" అనే నామ రూపాలతో
వ్యాపించి ఉన్న దాన్నే "మాయ"అనీ, "ప్రకృతి" అనీ, "కర్మ"అనీ, రకరకాలుగా పిలుస్తారు. ఇదంతా శ్రీదేవి చిద్విలాసం. కాబట్టి భగవత్ ప్రాప్తి కోరేవారికి శ్రీదేవి అనుగ్రహం అనివార్యం. భగవంతుడు పంపిన ఆచార్యుడు కూడా, ఈమె అనుగ్రహం లేందే
ఏపనీ చేయలేడు. బయటకు పోనూలేడు, లోనికి రానూలేడు. కాకపోతే, శ్రీదేవి భర్త సంకల్పం ప్రకారమే సమస్త కార్యాలు
చేస్తుందే కాని ఆయన ఆజ్ఞను అతిక్రమించి ఏమీ చేయదు.
కావున భగవత్ సంకల్పమే"శ్రీ"...."శ్రీ"యే భగవత్ సంకల్పం. భగవత్ సంకల్పం, ఆ వ్యవహారం అంతా ఈమె మూలాన్న జరగాల్సిందే. భగవత్
కరుణాస్వరూపిణైన ఈశక్తినే సాత్వికులు "శ్రీ"అనీ, "లక్ష్మి"అనీ కొలుస్తారు. రామ కటాక్ష
ప్రాప్తికి సీతానుగ్రహం అవశ్యం.
సుందరకాండ పఠించే వారు ప్రత్యుత్తరం కోరి చదవ వలసిన
కొన్నిముఖ్య విశయాలు:
·
బధ్ధ జీవ తారతమ్యం
·
లంకలోవున్న రాక్షస స్త్రీలు
·
చెరనుండి తప్పించుకోదలచీ ఆపని చేయలేని దేవతా స్త్రీలు
·
కర్మవశాత్తు లంకకు చేరి, అందు లగ్నం కాక, ప్రసన్నయై
భగవత్ సహాయంతో తప్పించుకున్న సీత
·
యధేచ్చగా లంక ప్రవేశించి, అందులో చిక్కుకోకుండా, దాన్నే దగ్దం చేసిన హనుమంతుడు(వీరు మహాత్ములు-ఋషులు)
పైన వివరించబడిన నాలుగు విధాలైన జీవాత్మలు సుందరకాండ లో
కనిపిస్తారు.
·
జీవాత్మ-పరమాత్మలకు గల సంబంధం సీతారాముల సంబంధం లాంటిది
·
జీవాత్మ తరణోపాయం....ఇది సీతాదేవి చర్య వలన అర్ధమవుతుంది.
·
శిష్య-ఆచార్య లక్షణాలు....ఇది సీత-ఆంజనేయ
చర్యవలన తెలుస్తుంది.
·
జీవాత్మలకు సేవ్యుడు నిర్విశిష్ట రాముడా? సీతావిశిష్ట రాముడా?.....ఇది హనుమంతుడి చర్యవలన విశదమవుతుంది.
·
ఆత్మావలోకన పరుడైన యోగి లక్షణం హనుమంతుడి చర్యవలన
తెలుస్తుంది.
·
సీతాదేవి ఉపాయమా? ఉపేయమా?....రెండూనా?
·
యోగికి, ప్రపన్నుడికి భేదమేంటి?
ఈ ముఖ్య విషయాలన్నింటికీ
ప్రత్యుత్తరం సుందరకాండలో దొరుకుతుంది. ఎన్నిసార్లు సుందరకాండ చదివితే అంత వివరంగా సమాధానాలు
దొరకుతాయి. ఇక సీతా, హనుమంతులను
విడిచినవారికి రామచంద్రుడి అనుగ్రహ ప్రాప్తం కలుగదు. సుందరకాండ
ఈ ఇరువురి చరిత్రే. అందుకే పలువురి ఆదరణకు నోచుకున్నది.
పారాయణ రూపంలో జనావళిచే ఆదరించబడుతున్నది. వారి,
వారి అభీష్టాలను నెరవేర్చి సంతోషపెట్టేదీ సుందరకాండ. సుందరకాండను వాసుదాస స్వామి శ్రీరామచంద్రమూర్తికి విన్నవించేటందుకు ఆయన్ను
సంబోధిస్తూ: "శ్రీదేవికి నివాస స్థానమైనవాడా! సంసార సాగరాన్ని దాటేందుకు "గురువు"
అనే గొప్ప పడవను నడిపేవాడా! అట్టి సాగరాన్ని
దాటేందుకు కావాల్సిన శ్రధ్ధా భక్తులను అనుగ్రహించువాడా! శాశ్వత
సుఖాన్నిచ్చేవాడా! జానకీదేవి హృదయకమలములందు నివసించేవాడా!"
అని అంటారు.
సంసారి చేతనుడిని ఉధ్ధరించేందుకు ఆచార్యుడు చేసే ప్రయత్నం, దూతకృత్యం, పతివ్రతా లక్షణం, వివరంగా
సుందరకాండలో చెప్పడం జరిగింది. End
No comments:
Post a Comment