Monday, May 29, 2017

రుణ మాఫీ నుంచి పెట్టుబడిదాకా : వనం జ్వాలానరసింహారావు

రుణ మాఫీ నుంచి పెట్టుబడిదాకా
వనం జ్వాలానరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (30-05-2017)

          జూన్ 2, 2014 న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుండి నేటి దాకా, ఈ మూడేళ్ల కాలంలో సీఎం చంద్రశేఖర రావు నాయకర్వంలో ప్రభుత్వం చేపట్టిన ఆనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో అగ్ర భాగాన నిలిచేది రైతు సంక్షేమం. బహుశా...ఏ రాష్ట్రంలో....ఆ మాటకొస్తే ఏ దేశంలో...ఇంత పెద్ద ఎత్తున రైతుల ప్రయోజనాలు కాపాడుకుంటూ, అహర్నిశలూ వారి గురించే ఆలోచన చేస్తూ పనిచేస్తున్న ప్రభుత్వం లేదంటే అతిశయోక్తి కాదేమో! రైతుల పంట రుణాలు మాఫీ చేయడం, ఇన్ పుట్ సబ్సిడీ అందించడం, ఉచిత విద్యుత్ సరఫరా చేయడం, గోదాముల నిర్మాణంతో పాటు వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నది. రాష్ట్రంలో ఎక్కువ మంది ఆధారపడే రంగం వ్యవసాయం. ఎక్కువ మంది బతికేది వ్యవసాయంతోనే. అందుకే వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. రైతులు వలస వెళ్లకుండా దిగుబడి, తలసరి ఆదాయం పెంచేందుకు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అమలు పరుస్తున్నది ప్రభుత్వం. రైతులు పండించిన పంటలకు గిట్టుబాట ధర కోసం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. ఋణమాఫీతో రైతు సంక్షేమానికి శ్రీకారం చుట్టిన సీఎం వ్యవసాయానికి అవసరమైన అన్నిరకాల పెట్టుబడులకు ఎకరాకు ఎనిమిది వేల సబ్సిడీ ఇవ్వడానికి నిర్ణయించడం వ్యవసాయ రంగం పైనా, రైతు సంక్షేమం పైనా ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం. ఆద్యతన భవిష్యత్ లో కోటి ఎకరాలకు నీరు వచ్చిన నాడు తెలంగాణ రాష్ట్రం సశ్యశ్యామలమై, అసలు సిసలైన బంగారు తెలంగాణ గా రూపుదిద్దుకోవడం అవశ్యం.

          రైతు సంక్షేమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమాల జాబితాలో సంక్షేమ పథకాల సంఖ్య ఒకటి కాదు పదుల్లో వుంటాయి.....రుణమాఫీ; సకాలంలో ఎరువులు, విత్తనాలు సరఫరా చేయడం; నకిలీ, కల్తీకి పాల్పడే వ్యాపారులపై పిడి యాక్టు అమలు చేయడం; రైతులు ఎరువులు కొనుక్కోవడానికి, వ్యవసాయ పెట్టుబడికి ప్రతీ ఎకరాకు రూ.8000 వేలు ఇవ్వడం; ఇంటర్ నెట్ ద్వారా వ్యవసాయ సమాచారం చేయడం; భూసార పరీక్షలు చేయించడం; భూ రికార్డులు సవరించాలని నిర్ణయించడం; సాదా బైనామాలను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించడం; ప్రతీ 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయాధికారిని నియమించడం; రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం తేవడం; మైక్రో ఇరిగేషన్ కు ప్రాధాన్యత ఇవ్వడం; పాలీ హౌజ్, గ్రీన్ హౌజ్ సాగు కోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు సబ్సిడీ ఇవ్వడం; వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రోత్సహించడం; ప్రత్యేకంగా ఒక హార్టీకల్చ్రర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం; ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు; ఫారెస్టు కాలేజీ నెలకొల్పడం; వ్యవసాయ పాలిటెక్నిక్ ల ఏర్పాటు; పాత బకాయిలతో సహా ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడం; భారీ ఎత్తున గోదాముల నిర్మాణం; గోదాముల్లో నిల్వ చేసుకున్న సరుకు విలువలో 75 శాతం మేర రైతులకు రుణం ఇచ్చే ఏర్పాటు; వ్యవసాయ మార్కెట్లలో రైతులకు రూ. 5 కే బోజనం పెట్టడం; హమాలీల కూలి రేట్లు పెంపుదల; వ్యవసాయానికి 9 గంటల కరెంటు సరఫరా; 2018 చివరి నాటికి రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చే ప్రయత్నం; వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు; మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు; దేశానికే తలమానికమైన విత్తన భాండాగారంగా తీర్చిదిద్దడం; ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడం.....ఇలా ఎన్నో....ఎన్నెన్నో వున్నాయి. ఇంకా ఇంకా చేయాలన్న తపన భవిష్యత్ లో మరిన్ని రైతు సంక్షేమ కార్యక్రామల రూపకల్పనకు దారితీస్తుందనడంలో కూడా సందేహం లేదు. వివరాల్లోకి పోతే....


అధికారంలోకి వచ్చిన వెను వెంటనే, టీఆర్‌ఎస్‌ పార్టి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామి మేరకు, రాష్ట్రంలోని రైతులందరికి 2014న మార్చి 31 వరకు ఉన్న రూ. లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేసింది ప్రభుత్వం. 2017 ప్రారంభం నాటికి మూడు విడుతల్లో రైతుల బాకీలను తీర్చిన ప్రభుత్వం.. నాలుగవ, తుది విడుత కింద ప్రభుత్వం ఎప్రిల్ 11, 2017 నాడు రూ.4వేల కోట్లను వ్యవసాయ శాఖకు విడుదల చేసింది. దీంతో మొత్తంగా రైతులకు రూ.16,374 కోట్ల రుణమాఫీ సంపూర్ణమయ్యింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 35.3 లక్షలమంది రైతులకు ప్రయోజనం కలిగిందివిత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సకాలంలో రైతులకు అందే విధంగా చర్యలు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. గతంలో మండలానికి ఒకే ఒక విత్తన విక్రయ కేంద్రం ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేసేవారు. దీని వలన రైతులు క్యూలో గంటల తరబడి, రోజుల తరబడి నిలబడేవారు. లాఠి చార్జి వంటి సంఘటనలు కూడా చోటు చేసుకునేవి. కానీ తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో సరిపడే విత్తనాలను ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతు ముంగిటకే రాయితీపై పంపిణీ చేయబడుతుంది. రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ముందుగానే స్టాక్ తెప్పించి గోదాముల్లో నిల్వ చేస్తున్నది ప్రభుత్వం. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ నకిలీ, కల్తీకి అవకాశం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

          రాష్ట్రంలోని 55 లక్షల మంది రైతులకు మే, 2018 నుంచి దాదాపు 25 లక్షల టన్నుల ఎరువులను ఉచితంగా అందిస్తామని ఎప్రిల్ 13, 2017 జనహితలో రైతులతో జరిగిన సమావేశంలో  ముఖ్యమంత్రి ప్రకటించారు. రైతులకు ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున వర్షాకాలం, యాసంగి  రెండు పంటలకు కలిపి రు.8,000 అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పండ్లు, పూల తోటలకు కూడా నాలుగు వేల రూపాయలు ఇవ్వనుంది. ప్రతి రైతు ఖాతాలో ఈ డబ్బులు డిపాజిట్ చేస్తుంది ప్రభుత్వం. తొలి పంటకు మే నెల మొదటి వారంలో, రెండో పంటకు అక్టోబర్ లో ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున రైతు ఖాతాలో సొమ్ము డిపాజిట్ చేస్తారు. ఈ పథకం పకడ్బందీగా, అవినీతికి ఆస్క్రారం లేకుండా వుండడానికి గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి రైతు సమాఖ్యలను ఏర్పాటు చేసే ఆలోచన చేసింది ప్రభుత్వం. ఆధునిక సాంకేతిక వ్యవసాయ సమాచారాన్ని, సేవలను రైతులకు ఇంటర్ నెట్ వంటి ఆధునిక మాధ్యమాల ద్వారా త్వరితంగా, సమర్ధవంతంగా రైతులకు అందించడం జరుగుతున్నది. రైతాంగానికి సాంకేతిక సలహాలను ఇచ్చిఏయే భూములలో ఎటువంటి పంటలను పండించాలో నిర్ణయించడానికి భూసార పరీక్షలు చేయిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.

రాష్ట్రంలో భూ వివాదాలన్నీ సత్వరం పరిష్కరించి, భూ రికార్డులు సవరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వ్యవహారాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. సాదా బైనామాలను (గ్రామీణ ప్రాంతాల్లో 5 ఎకరాల లోపు) ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించింది. దాదాపు 11.19 లక్షల మందికి 1638.58 ఎకరాల భూమిని సాదా బైనామాల ద్వారా ఉచిత రిజిస్ట్రేషన్ జరిగింది. వారంతా పట్టాలు పొందారు. ఈ భూమి విలువ 9,487 కోట్ల రూపాయలు. వారసత్వంగా వచ్చిన భూములను పది రోజుల్లోగా మ్యుటేషన్ చేశారు అధికారులు. ఇతర భూములు రిజిస్ట్రేషన్ అయిన 15 రోజుల్లో మ్యుటేషన్ కావాలని నిబంధన పెట్టింది. అన్యాక్రాంతానికి గురైన భూములను వాపస్ తీసుకుని అర్హులకు అందించింది. ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయాధికారి అందుబాటులో ఉంచి రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం కింద 50% రాయితీతో హైబ్రిడ్ కూరగాయల విత్తనాల సరఫరా చేయడం జరిగింది. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించే అవకాశమున్న మైక్రో ఇరిగేషన్ కు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. ఈ పథకం ద్వారా షెడ్యూల్డ్ కులాలు, తెగల రైతులకు 100% రాయితీ, వెనుకబడిన తరగతులకు, సన్న, చిన్నకారు రైతులకు 90% రాయితీ, ఇతర రైతులకు 80% రాయితీలు ఇవ్వడం జరుగుతున్నది.

కూరగాయలు, పండ్లు, పూలు పండించడానికి అనువుగా ఉండే పాలీ హౌజ్, గ్రీన్ హౌజ్ కల్టివేషన్ కోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు 95 శాతం సబ్సిడీ, ఇతర రైతులకు ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ జరుగుతున్నది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచేందుకు ప్రభుత్వం ఫామ్ మెకనైజేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నది. కూరగాయల సాగులో ఆధునిక నూతన పద్ధతులను అందుబాటులోకి తీసుకువచ్చి నాణ్యమైన దిగుబడులను పెంచడమే కాకుండా రైతుకు గిట్టుబాటు ధరల కోసం హార్టికల్చర్ కార్పొరేషన్ ఏర్పాటు జరిగింది. పంట రుణాలను మాఫీ చేయడమే కాకుండా, ప్రభుత్వం 2009 నుంచి రైతులకు చెల్లించాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ పాత బకాయిలను కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చెల్లించింది. గిట్టుబాటు ధర వచ్చేవరకు రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణాన్ని చేపట్టింది. గోదాములు కట్టడమే కాదు, గోదాముల్లో నిల్వ చేసుకున్న సరుకు విలువలో 75 శాతం మేర రైతులకు రుణం ఇస్తున్నారు. రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ముందుగానే స్టాక్ తెప్పించి ఈ గోదాముల్లో నిల్వ చేస్తున్నది ప్రభుత్వం.


వ్యవసాయ సాగుకు తగినంత నీరు బోరు లేదా బావుల ద్వారా అందుబాటులో ఉన్నప్పటికీ నిరంతర కరెంటు కోతల వల్ల వ్యవసాయాన్ని సాగు చేసుకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన సమస్య విద్యుత్తే కనుక ప్రభుత్వ వారికి 9 గంటల పాటు విద్యుత్తు ను ఎప్రిల్ 1, 2016 నుంచి సరఫరా అందిస్తున్నది. రాష్ట్రంలోని 35 శాతం కరెంటు ఉచిత విద్యుత్ కోసమే వినియోగిస్తున్నారు. 2018 సంవత్సరం చివరికల్లా, రైతులకు 24 గంటల కరెంటు అందివ్వడానికి, ప్రణాళికలు సిద్ధం చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగా అదనంగా సబ్ స్టేషన్లు, పవర్ ట్రాన్స్ ఫార్మర్స్, కె.వి. లైన్లను ఏర్పాటు చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. డిసెంబర్ 2016 నాటికి 2,58,195 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు రైతులకు మంజూరు చేసిన ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న మరో 63,700 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేయాలని అధికారులకు అదేశం ఇచ్చింది. దేశంలో మరెక్కడా లేని విధంగా, చరిత్రలో మొదటి సారిగా తెలంగాణలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను రిజర్వేషన్ ద్వారా భర్తీ చేయడం జరిగింది. దీని వల్ల ఎస్సీ, ఎస్టీ, బిసి, మహిళల్లోని రైతులు మార్కెట్ చైర్మన్లు అయ్యే అవకాశం కలిగింది. ప్రపంచంలోనే విత్తనాభివృద్ధికి అనువైన అత్యుత్తమ నేలలున్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే తలమానికమైన విత్తన భాండాగారం గా మారుస్తున్నదీ ప్రభుత్వం. పంట నష్టాలతో ఆత్మహత్య చేసుకుంటున్న రైతు కుటుంబాలకు 6 లక్షల పరిహారం ఇస్తున్నదీ ప్రభుత్వం. రైతు ప్రయోజనాలు కాపాడడానికి ఇంకా...ఇంకా...ఏం చేయాలనే ఆలోచనలో వున్న సీఎం మరికొన్ని ప్రయోజనాలను వారికి కలిగించే దిశగా అడుగులేస్తున్నారు. రాష్ట్రంలో వున్న సుమారు 97% మందికి పైగా సన్న, చిన్నకారు రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ విధమైన చట్టాలున్నా వాటిని సవరించాల్సిన ఆవశ్యకత వుందని ప్రభుత్వం భావిస్తోంది. 

ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు లంచం ఇచ్చి పని చేయించుకునే అవసరం లేకుండా, రాకుండా వుండాలనేది ప్రభుత్వ సంకల్పం. అది భూముల రిజిస్ట్రేషనే కావచ్చు, ఎంకబరెన్స్ సర్టిఫికేటే కావచ్చు, మ్యుటేషన్ ప్రక్రియే కావచ్చు, పట్టాదారు పాసు పుస్తకం పొందడమే కావచ్చు, పాస్ పుస్తకంలో అదనంగా ఎంట్రీలు వేయించుకోవడమే కావచ్చు, రైతు చనిపోయిన తరువాత వారసులకు భూమి యాజమాన్య హక్కులు దఖలు చేయడమే కావచ్చు...మరేదైనా రైతు సంబంధిత సమస్యే కావచ్చు....అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వంలో పనులు వేగంగా జరగాలనేదే ప్రభుత్వ ఆలోచన. ఈ దిశగా బహుశా రాబోయే రోజుల్లో మరికొన్ని సంస్కరణలను ప్రభుత్వం చేపట్టబోతుందనడంలో సందేహం లేదు. రైతుల ప్రయోజనాలు వంద శాతం రక్షించబడాలనేదే సీఎం ధ్యేయం, లక్ష్యం, ఆలోచన. ఆయన మదిలో మెదిలిన గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి రైతు సమాఖ్యలు రైతుల బహుళ ప్రయోజనకారిగా, రైతులను ఈ దిశగా చైతన్యపరచడానికి దోహద పడేవిగా వుండాలనేది సీఎం కోరిక.

No comments:

Post a Comment