ప్రజాస్వామ్య
పండుగలు ఎన్నికలు
వనం జ్వాలా
నరసింహా రావు
ఆంధ్రజ్యోతి
దినపత్రిక (07-05-2017)
లోక్
సభ, రాష్ట్ర శాసనసభలకు ఒకే సారి
ఎన్నికలు జరుగుతే బాగుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ నీతీ ఆయోగ్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రులకు
సూచించినట్లు, పలువురు సీఎంలు ఆయన ప్రతిపాదనకు
సానుకూలంగా స్పందించినట్లు వార్తలొచ్చాయి. వాస్తవానికి మొదట్లో సాధారణ ఎన్నికలంటే ఒకే సారి
ప్రధాని చెప్పిన తరహాలో ఎన్నికలు జరపడమే జరిగేవి. క్రమేణా ఆయారాం-గయారాంల ప్రాభల్యం పెరిగి శాసన సభల కాలపరిమితిలో మార్పులు రావడం, గవర్నర్ పాలనలు ఇత్యాది కారణాల వల్ల క్రమం పూర్తిగా మారిపోవడం జరిగింది. ప్రధాని
సూచన అమలవుతే మంచే జరుగుతుందనడంలో సందేహం లేదు.
అత్యధిక
జనాభాతో, అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా పేరొందిన భారతదేశం, ప్రపంచంలో అత్యంత భారీ స్థాయి
ఎన్నికలు జాతీయ స్థాయిలో ఐదేళ్లకోసారి నిర్వహించడం జగమెరిగిన విషయం. 2014 లో
జరిగిన 16వ సాధారణ ఎన్నికల్లో దాదాపు
83.4 కోట్ల మందికి ఓటు హక్కుంది. వీరికొరకు, 9,27,553 పోలింగ్ స్టేషన్లను, 543 నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసింది
ఎన్నికల కమీషన్. ఆ ఎన్నికల్లో, ఇండిపెండెంట్లతో సహా 465 రాజకీయ పార్టీలకు చెందిన 8251 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 10 విడతలుగా
జరిగిన ఈ భారీ ఎన్నిక తీరుతెన్నులను, ఎన్నికలకు
సంబంధించిన అనేక ఇతర అంశాలను, 7వ ‘‘ఓటర్ల
జాతీయ దినోత్సవం"
సందర్భంగా, భారత ఎన్నికల కమిషన్ ప్రచురించిన
‘‘అన్ ఫోల్డింగ్ ఇండియన్ ఎలక్షన్స్–జర్నీ ఆఫ్ ది లివింగ్ డెమోక్రసీ’’ అన్న పుస్తకంలో (జనవరి 25, 2017 న ఆవిష్కరించిన) పుస్తకంలో పేర్కొనడం జరిగింది.
ఈ
"కాఫీ
టేబుల్ పుస్తకం" కాపీని రాష్ట్ర ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖర
రావుకు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సి.ఇ.ఓ.) డాక్ట్రర్ నాసిమ్ జైదీ బహుకరించారు. దీనితో పాటుగా జత చేసిన
ఆయన లేఖలో, ఈ పుస్తకం గురించి వివరిస్తూ
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్, భారత సాంప్రదాయ ప్రజాస్వామ్య
వ్యవస్థ దినదినాభివృద్ధి చెందడానికి ఎన్నికలు ఎలా తోడ్పడ్డాయో, సోదాహరణంగా వివరించే ప్రయత్నం ఇందులో జరిగిందని పేర్కొన్నారు. ఎన్నికలనేవి ప్రజాస్వామ్యంలో
పండుగతో సమానమని, అవి భాష, ప్రాంతం, కులం, మతం లాంటి వాటికి అతీతంగా సాగే పటిష్ఠ ప్రక్రియ అని పేర్కొన్నారు. భారతదేశంలో ఎన్నికల పరిణామక్రమం, వాటి వివరాలు, వాటి
అనుబంధ సమాచారం, వాటితో ముడిపడి ఉన్న తదితర ముఖ్య
సమాచారాల సమాహారం ఈ పుస్తకం అని, ఇది భారత ఎన్నికల విశేషాల భాండాగారమని, ఇందులో ఎంతో విలువైన సమాచారంతో పాటుగా ఆశ్చర్యాన్ని కలిగించే
పలు అంశాలు తెలుసుకోవలసిన ఆసక్తికరమైన సమాచారం నిక్షిప్త పరచటం జరిగిందని సీఇఓ తన లేఖలో
వివరించారు.
పుస్తకానికి సి.ఇ.ఓ. రాసిన సందేశంలో, ప్రజాస్వామ్యం పట్ల మనకున్న పరిపూర్ణ విశ్వాసాన్ని, నమ్మకాన్ని దశలవారీగా జరుగుతున్న ఎన్నికల్లో వ్యక్త పరుస్తామనీ, జాతి స్వేచ్ఛను బాహ్యప్రపంచానికి వెలిబుచ్చడానికి, స్వేచ్ఛాయుతంగా జరిగే ఎన్నికలే దర్పణం అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్యానికి పూర్వం నుండి నేటి ఆధునిక ఎలక్ట్రానిక్
ఓటింగ్ మిషన్ల పర్వం వరకు ఓటు హక్కు వినియోగక్రమాన్ని స్వతంత్ర ఎన్నికల కమిషన్
నిర్వహించిన క్రియాశీలక పాత్రను, పాటించిన ‘‘మోడల్ కోడ్’’ పద్దతిని, వయోజన ఓటింగ్ విధానాన్ని, తదితర ప్రాధాన్యతాంశాలను ఈ పుస్తకంలో సవివరంగా తెలియచేయడం జరిగింది. అవి
పాఠకులతో పంచుకునే ప్రయత్నమే ఇది. రాజ్యాంగ హక్కుల కొరకు, ప్రాతినిధ్య ప్రభుత్వం కొరకు, జరిగిన అవిశ్రాంత
పోరాటంలో, పరోక్ష ఎన్నికలకు అవకాశం కలిగించే ప్రభుత్వ
ప్రాతినిధ్య 1892 చట్టం బ్రిటీష్ ఇండియాలో రూపుదిద్దుకుంది
మొట్టమొదటిసారిగా. అంతకు ముందు, భారత కౌన్సిల్ చట్టం 1861 శాసన మండలిలో నామినేషన్ పద్ధతిన భారతీయులకు
ప్రాతినిధ్యం కలిగించింది. బ్రిటీష్ భారతప్రభుత్వం 1919లో తెచ్చిన చట్టం ప్రకారం 140 సీట్లకు గాను 100 మందిని నేరుగా
బ్రిటీష్ ఇండియాలో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి అభ్యర్థులుగా ఖరారు చెయ్యటం, తద్వారా 1920 నుండి 1934 మధ్య కాలంలో ఐదు
సార్లు ఎన్నికలు రావటం జరిగింది. 1923లో ఎన్నికల డిపాజిట్ కింద కేవలం రూ.250 వసూలు చేయటం జరిగిందని, పోలైన ఓట్లలో 8వ వంతు పొందలేని పక్షంలో, డిపాజిట్ సొమ్మును కోల్పోవలసి వస్తుందనే షరతులను క్రోడీకరించటం జరిగిందని, ఓటర్లలో అధిక శాతం నిరక్షరాశ్యులు కావడం వల్ల, నాటి నుండే ఎన్నికల చిహ్నాలను అమల్లోకి తేవడం జరిగిందనే పలు ఆసక్తికర
అంశాలు కూడా ఈ పుస్తకంలో వున్నాయి.
భారత దేశానికి స్వాతంత్ర్యం రావటంతో, వయోజన ఓటు హక్కు
ప్రాతిపదికగా, మొట్ట మొదటి సాధరాణ ఎన్నికలు దేశవ్యాప్తంగా 1951-52 లో, లోక్ సభకు, రాష్ట్ర శాసన సభలకు ఏకకాలంలో
నిర్వహించటం జరిగింది. అప్పట్లో 21 సంత్సరాలు (నేడు
అదే 18 సంవత్సరాలకు తగ్గించారు) దాటిన ప్రతి పౌరుడూ ఓటు
హక్కు వినియోగించుకోడానికి అర్హులే. ఓటరు నమోదు
ప్రక్రియ అధిక వ్యయ ప్రయాసలకు ఓర్చి నిర్వర్తించాల్సి వచ్చింది అప్పట్లో. అప్పట్లో ఒటర్ల సంఖ్య 17.3 కోట్లు. ఎన్నికల నోటిఫికేషన్ జారీచేయడంతో
సెప్టెంబర్ 10,1951లో మొదలైన ఎన్నికల ప్రక్రియ జూన్ 4, 1952 తో ముగిసింది.
తొలి లోక్ సభ మొత్తం 499 సీట్లకు గాను ఎన్నికలు జరిగిన 489 సీట్లలో 72 స్థానాలను ఎస్సీలకు, 26 స్థానాలను ఎస్టీలకు కేటాయించారప్పట్లో. మొత్తం 1874 మంది పోటీ చేసారు. అదేవిధంగా 3,283 శాసనసభ స్థానాలకు వివిధ రాష్ట్రాల నుండి 15,361 మంది అభ్యర్థులు నిలబడటం జరిగింది. ప్రపంచ దేశాలు ఈ ఎన్నికల ఆశక్తిగా తిలకించాయి. నాటి ఎన్నికల అధికారి సుకుమార్ సేన్ పర్యవేక్షణలో ఎన్నికల నిర్వహణ
విజయవంతంగా పూర్తి చేయటం జరిగింది. అప్పట్లో
కాడిజోడెద్దులు, చెట్టు, హస్తం, గుడిశ, చెవులు, కంకి, కొడవలి వంటివి ఎన్నికల చిహ్నాలుగా ఉపయోగించటం జరిగింది.
భారత సాంకేతిక పరిశ్రమల పరిశోధన సంస్ధ తయారుచేసిన ఇండెలిబుల్ నీలి రంగు
ఇంకును 1951లో ఓటర్లకు ఉపయోగించారు. ఆ తరువాత 1962లో నుండి మైసూర్ పెయింట్స్ వార్నిష్ లిమిటెడ్
ద్వారా దీనిని తయారు చేయటం జరుగుతున్నది. మొదటి సాధారణ
ఎన్నికలలో 24,73,850 లోహ డబ్బాలను, 1,11,095 చెక్క
డబ్బాలను బ్యాలెట్ బాక్స్ ల రూపంలో వినియోగించటం జరిగింది. అప్పట్లో ప్రతి అభ్యర్థికి ఒక్కో డబ్బాను వినియోగించేవారు. కొందరు ఒటర్లు బ్యాలెట్ బాక్సును పూజా సామాగ్రిలా పవిత్రంగా భావించి
పూలను నైవేద్యంగా బాక్సుల్లో వేయగా, కొందరు అభ్యర్థులను
దూషిస్తూ రాసిన కాగితాలను ఆ డబ్బాలలో జారవిడిచే వారు.
సూత్రప్రాయంగా
రాజ్యాంగం అమలుకు నిర్ణయించిన 26 నవంబర్ 1949 నాటి నుంచే, భారతదేశంలో రాజ్యాంగ బద్ధతగల సర్వస్వతంత్రంగా పనిచేసే ఎన్నికల సంఘం
ఏర్పాటుకు నిర్ణయం జరిగింది. ఆర్టికల్ 324 నిర్ధేశించిన
ప్రకారం భారత ఎన్నికల కమిషన్ లో ముగ్గురు సభ్యలుండాల్సి వుండగా, ఒక్క ప్రధాన ఎన్నికల కమిషనరు మాత్రమే మార్చి 21, 1950 నుండి అక్టోబర్ 15, 1989 వరకు, ఆ తరువాత తిరిగి జనవరి 2, 1990 నుండి సెప్టెంబర్ 30, 1993 వరకు ఏక
సభ్య సంఘంగా కొనసాగింది. అక్టోబర్ 1, 1993 నుండి మాత్రం
త్రిసభ్య సంఘంగా కమిషన్ పనిచేయడం మొదలు పెట్టింది. పార్లమెంటరీ
ఇంపీచ్మెంట్ పద్దతిని అనుసరించి మాత్రమే ప్రధాన ఎన్నికల కమిషనర్ ను ఆ పదవి నుంచి
తొలగించే వీలుంది తప్ప ఇతర మరే విధంగా అది జరగడానికి అవకాశం లేదు. ప్రతి
రాష్ట్రానికి, కేంద్ర పాలిత ప్రాంతానికీ, ఒక ప్రధాన ఎన్నికల అధికారిని భారత ఎన్నికల కమిషన్ ప్రతినిధిగా నియమించటం
జరుగుతుంది. ప్రధాన ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ను ఆయా
ప్రాంతాల వాతావరణాన్ని బట్టి, వ్యవసాయ ప్రక్రియను బట్టి, విద్యార్థుల పరీక్షల సమయాన్ని బట్టి, అక్కడి పండుగలను
బట్టి, అమలులో ఉన్న ప్రభుత్వ శలవు దినాలను బట్టి, తదితర కోణాలను పరిగణలోకి తీసుకుని నిర్ధేశించటం ఆనవాయితీగా జరుగుతుంది.
తొలి
ప్రధాన ఎన్నికల కమిషనర్ గా సుకుమార్ సేన్ తో ఆరంభమై, లబ్ద
ప్రతిష్టులైన ఎందరో ప్రముఖులు (కెవికె. సుందరం, ఎస్పి సేన్ వర్మ, నాగేంద్ర సింగ్, టి స్వామినాథన్, ఎస్ఎల్ షఖ్ధర్, ఆర్కె త్రివేది, ఆర్వి ఎస్ పేరి శాస్త్రి, వియస్ రమాదేవి, టిఎన్ శేషన్, యంఎస్ గిల్, జెఎం లింగ్డో, టిఎస్ క్రిష్ణమూర్తి, బిబి
టండన్, ఎన్ గోపాలస్వామి, నవీన్
బి చావ్లా, ఎస్ వై ఖురేషి, విఎస్ సంపత్, హెచ్ఎస్
బ్రహ్మ, ప్రస్థుత డాక్టర్ నాసిమ్ జైదీ) అ స్థానాన్ని అధిష్టించడం జరిగింది.
సుదీర్ఘ ఎన్నికల
చరిత్రలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవియం) లే నవీన బాలెట్లుగా మారాయి. వీటిని ఉపయోగంలోకి
తేవడం ద్వారా ద్వారా, ఎన్నికల్లో భారీ సామాగ్రి రవాణా తప్పడం, వ్యయం కూడా కుదించబడడం, మానవ వనరుల అవసరం తగ్గడం, చెల్లని వోట్లకు-దొంగ ఓట్లకు ఆస్కారం లేకపోవడం, ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగవంతం కావడం జరిగింది. ప్రయోగాత్మకంగా ఈ
పద్దతిని ప్రవేశపెట్టిన ఎన్నికల సంఘం, 2004లో జరిగిన 14వ సాధరణ ఎన్నికల్లో అన్ని లోక్ సభ నియోజకవర్గాల్లో ఉపయోగించారు. ఎన్నికల కమిషన్ ‘‘నన్ ఆఫ్ ది ఎబోవ్’’ (నోటా) పద్దతిని కూడా 2013 ఎపెక్స్ కోర్టు ఆదేశాలకు లోబడి ప్రవేశపెట్టడం
జరిగింది. తద్వారా ఓటుహక్కు వినియోగదారుడికి ‘‘తాను ఎవరికీ ఓటు చేయను’’ అనే హక్కును కల్పించింది ఎన్నికల సంఘం. అదేవిధంగా ఓటర్ ‘‘వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్’’ (వి.వి.పి.ఎ.టి) పద్దనిని తొలి సారిగా నాగాలాండ్ లోని ‘‘నాక్ సేన్’’ అసెంబ్లీ పరిధిలో 2013 సెప్టెంబర్ నెలలో ప్రవేశపెట్టటం జరిగింది. తద్వారా ఓటు హక్కు వినియోగించుకునే ప్రతి పౌరునికి తాను వేసే ఓటు తాను
అనుకున్న అభ్యర్థికి మాత్రమే పడుతుంది అనే భరోసా
కల్పించింది ఎన్నికల కమిషన్.
ఈ
నేపథ్యంలో ఓటర్లుగా నటిస్తూ పదేపదే దొంగ ఓట్లు వేయాలని ప్రయత్నించే ప్రభుద్దులను అరికట్టడానికి
ఎన్నికల కమిషన్ ‘‘ఫోటో ఆధారిత ఓటరు గుర్తింపు
కార్డులను, ఫోటో ఎలక్టరల్ ఫోటో ఐడెంటిటి
(ఎపిక్) కార్డుల" ను జారీ
చేసింది. కాలక్రమంలో ఓటరు గుర్తింపు కార్డు
పౌరుల చిరునామా గుర్తింపు కార్డుగా రూపాంతరం చెందింది. తొలి సారిగా 1960 సంవత్సరంలో కలకత్తా నైరుతీ పార్లమెంటరీ
నియోజకవర్గంలో ఆ తరువాత 1993లో జాతీయ స్థాయిలో ఎపిక్ కార్డులను
ప్రవేశ పెట్టింది కమీషన్. క్రమేపీ ఓటర్ల జాబితాను కంప్యూటరీకరించింది.
ఎన్నికల
నోటిఫికేషన్ తేది నుండి ముగింపు తేది వరకు అమలులో వుండే ఎన్నికల ప్రవర్తనా నియమావళి
అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులకు వర్తిస్తుంది. ఓటర్లను ప్రభావితం చేయకుండా, నియంత్రణలో ఉంచేందుకు ఈ చర్యలు తోడ్పతున్నప్పటికీ, ఎన్నికల కోడ్ కు చట్టబద్ధత
లేదు. ఇది సాధారణ ఎన్నికలకు
సంబంధించిన నేపథ్యమైతే, రాజ్యాంగ బద్దంగా ఎన్నికవాల్సిన
భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల ఎంపికలో ఇంకా
పేపర్ బ్యాలెట్ పద్ధతినే ఎన్నికల సంఘం కొనసాగించటం విశేషం.
భారత ఎన్నికలను
యావత్ ప్రపంచంలోని పాత్రికేయులు, మేధావులు, రాజకీయ నాయకులు, రాజనీతిజ్ఞులు....ఇంకా ఎందరెందరో ఆసక్తిగా గమనిస్తుంటారు. ఏదేమైనా
భారతదేశానికి సంబంధించి నంతవరకూ ఎన్నికలు ప్రజాస్వామ్యంలో పండుగల లాంటివే!
‘‘అన్ ఫోల్డింగ్ ఇండియన్
ఎలక్షన్స్–జర్నీ ఆఫ్ ది లివింగ్
డెమోక్రసీ’’ పుస్తకం ఆధారంగా)
No comments:
Post a Comment