Saturday, May 13, 2017

తెలుగు మహసభలు! అప్పుడూ, ఇప్పుడూ : వనం జ్వాలా నరసింహారావు

తెలుగు మహసభలు! అప్పుడూ, ఇప్పుడూ
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (13-05-2017)

విశ్వనగరం హైదరాబాద్లోప, రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకుని, తెలంగాణ ప్రభుత్వ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో "తొలి తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభలు" జూన్ నెలలో నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. యావత్ ప్రపంచం గుర్తించే విధంగా, కలకాలం జ్ఞాపకం వుండేలా, చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా సభలు నిర్వహించాలని సిఎం అభిలాష. తెలంగాణ సాహితీ వైభవాన్ని చాటే విధంగా నిర్వహించనున్న ఈ మహాసభలకు దేశ, విదేశాల్లో ఉన్న సాహితీ ప్రియులను, తెలుగు భాష అభిమానులను ఆహ్వానించనున్నారు. మహాసభల్లో భాగంగా అవదానాలు, కవి సమ్మేళనాలు, వివిధ సాహిత్య ప్రక్రియలపై సదస్సులు నిర్వహించడం, తెలంగాణ మహనీయ కవుల అముద్రిత గ్రంథాలను వెలుగులోకి తీసుకురావడం జరగబోతోంది.

తెలుగు భాష-సాహిత్యాభివృద్ధి వ్యాప్తికి తెలంగాణలో జరిగిన-జరుగుతున్న కృషి ప్రపంచానికి తెలిసేలా వుండబోతున్నాయీ మహాసభలు. తోటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్తోత పాటు ప్రపంచం నలుమూలల తెలుగు భాషాభివృద్ధికి, వివిధ రకాల సాహితీ ప్రక్రియలో విశేష కృషి చేసిన వారందరూ ఈ మహసభల్లో పాల్గొనడానికి ప్రభుత్వపరంగా ప్రయత్నాలు మొదలయ్యాయి. రాష్ట్ర ఆవిర్భావ దినమైన జూన్ 2న తెలుగు మహాసభల అంకురార్పణ జరిపి, ఆ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాహితీ ప్రముఖులను, తెలుగు పండితులను ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. లాంచనంగా అంకురార్పణ జరిగిన తర్వాత జూన్ నెల రెండవ భాగంలో వారం, పది రోజుల పాటు సభలను నిర్వహించాలని, వివిధ సాహిత్య ప్రక్రియలకు సంబంధించిన కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని సీఎం చెప్పారు.

తెలుగు భాషాభివృద్దికి, ప్రత్యేకించి తెలంగాణ తెలుగు భాషాభివృద్ధికి, సాహితీ వికాసానికి తెలంగాణకు చెందిన పలువురు మహానుభావుల కృషికి ఈ సభల్లో సరైన గుర్తింపు రాబోతున్నది. అన్ని సాహిత్య ప్రక్రియల్లో తెలంగాణ వారు ప్రదర్శించిన విశేష ప్రతిభా పాటవాలు, బమ్మెర పోతన నుంచి మొదలు పెట్టి, మధ్యకాలం నాటి సాహిత్యం, నేటి ఆధునిక సాహిత్యం వరకు అనేక మంది చేసిన అనేక రచనలు ఈ మహసభల్లో చర్చాంశాలు కానున్నాయి. సాహిత్య ప్రక్రియలను సుసంపన్నం చేసిన వారందరినీ స్మరించుకునే వేదిక కాబోతున్నాయీ మహాసభలు. సంప్రదాయ సాహిత్యం, అవధాన సాహిత్యం, ఆధునిక సాహిత్యంలో తెలంగాణ వ్యక్తులు చేసిన కృషి తెలిసేలా సాహిత్య సభలు నిర్వహించాలని సీఎం కోరిక. సినీరంగం, పాత్రికేయ రంగం, కథా రచన, నవలా రచన, కవిత్వం, హరికథ, బుర్రకథ, యక్షగాణం, చందోబద్ధమైన ప్రక్రియలు.. తదితర అంశాల్లో తెలంగాణ సాహితీమూర్తులు ప్రదర్శించిన ప్రతిభాపాటవాలు ప్రధానాంశాలుగా తెలుగు మహాసభలు జరగడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని ముఖ్యమంత్రి అన్నారు. ఈ మహాసభలకు అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేసియా, గల్ఫ్ తదితర దేశాల్లో తెలుగు భాష, సాహిత్యానికి సేవలందిస్తున్న వ్యక్తులను, సంస్థలను భాగస్వాములు చేయాలని కూడా సీఎం అన్నారు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వున్నప్పుడు నాలుగు పర్యాయాలు ప్రపంచ తెలుగు మహసభలు జరిగాయి. ప్రధమ ప్రపంచ తెలుగు మహాసభలు స్వర్గీయ జలగం వెంగళరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో, 1975 వ సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభోగంగా జరిగాయి. ఆ ఏడు ఉగాది నాడు (ఏప్రియల్ 12) మొదలైన మహాసభలు ఏడురోజులపాటు జరిగి, ఏప్రియల్ 18 న ముగిసాయి. ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు భాషాభిమానులు, సాహీతీ-సాంస్కృతిక ఉద్దండ పిండాలు, కవులు, కళాకారులు, రాజకీయ ప్రముఖులు, పాత్రికేయులు, అవధానులు, మేధావులు, శాస్త్రవేత్తలు.....ఇలా, వీరూ-వారూ అనే భేదం లేకుండా, "కాకతీయ నగర్" గా నామకరణం చేయబడ్డ లాల్ బహదూర్ స్టేడియంలోని ఒకే వేదికపై సమావేశమై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తెలుగు భాషలోని తీయందనాన్ని, గొప్పతనాన్ని తనివితీరా ఆస్వాదించారు.

ఏడురోజుల పాటు జరిగిన ఆ భాషోత్సవాలలో ప్రతిదినం లక్ష మందికిపైగా ప్రేక్షకులు పాల్గొన్నారని అంచనా. అనునిత్యం సెమినార్లు-గోష్ఠులు జరిగిన ప్రదేశాన్ని "నాగార్జున పీఠం" గా పిలిచారు. 1500 మందికి పైగా పాల్గొన్న ఈ గోష్ఠుల్లో, మొత్తం 28 అంశాలపైన, సుమారు 100 కు పైగా శాస్త్రీయ పేపర్లను సభ ముందుంచడం విశేషం. కాకతీయనగర్ లోని "శ్రీకృష్ణ దేవరాయనగర్" వేదికమీద సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సంగీతం, నాటకం, జానపద నృత్యాలు, హరికథలు, బుర్రకథల్లాంటి వందకుపైగా కార్యక్రమాలకు అది వేదికైంది. ఔత్సాహిక కళాకారులెందరో వీటిలో పాలుపంచుకున్నారు. రెండులక్షలకు పైగా వీటిని వీక్షించారని అంచనా."శాతవాహన నగర్" ప్రదేశంలో "తరతరాల తెలుగు జాతి" పేరుతో రెండున్నర వేల తెలుగుజాతి చరిత్రా విశేషాలతో కూడిన కళాత్మక ప్రదర్శన్ నిర్వహించడం జరిగింది. ఇందులో ఆయిల్ పెయింటింగ్స్, ఫొటోలు, ఛార్టులు, బొమ్మలు లాంటివి ప్రదర్శించారు.

మహాసభల్లో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన సుమారు 240 మంది జాతీయ-అంతర్జాతీయ వ్యక్తులను సన్మానించారు. మొత్తంమీద 16 దేశాలనుండి 980 మంది ప్రతినిధులు, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 4500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. సభలు ప్రారంభమైన మొదటి రోజున చార్మీనార్ నుండి సభావేదిక వద్దకు ఊరేగింపుగా నాలుగైదు గంటల పాటు నడిచి వేలాదిమంది చేరుకున్నారు. ఊరేగింపుకు నాటి సీఎం జలగం వెంగళ రావు నాయకత్వం వహించారు. "మా తెలుగుతల్లికి మల్లెపూదండ..." పాటతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.


మొదటి ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నవారిలో నేనూ ఒకడిని. మహాకవి శ్రీ శ్రీ తెలుగు మహాసభలను విమర్శిస్తూ పోటీ మహాసభలు పెట్టడం, అరెస్టు కావడం, అప్పటి సీఎం చొరవతో విడుదల కావడం నాకు ఇంకా గుర్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, మహాకవి శ్రీశ్రీ ల మధ్య ఎంతోకాలంగా వున్న వాగ్వాదాలకు పరాకాష్ఠగా మొదటి తెలుగు మహాసభల వివాదం కూడా సాగింది. దీనిలో విశ్వనాథ, శ్రీశ్రీ పేరున ఈ మహాసభలను వ్యతిరేకిస్తూ ఒక లేఖ పత్రికలకు విడుదల కాగా తన సంతకాన్ని శ్రీశ్రీయే ఫోర్జరీ చేశారని విశ్వనాథ ఆరోపించారు. ఆ మహాసభలకు విశ్వనాథ హాజరుకాగా, శ్రీశ్రీ వ్యతిరేకించడం, బహిష్కరణకు పిలుపునివ్వడం వల్ల ఒక రాత్రి బొలారం పోలీస్ స్టేషన్లో నిద్రచేశారు.

అన్నింటికన్నా నాకు ఇంకా బాగా గుర్తుంది అప్పటికి పట్టుమని పాతికేళ్లన్నా నిండని నరాల రామిరెడ్డి అష్ఠావధానం. ఆ అవధానంలో మరీ గుర్తుంది ఆయన పూరించిన ఒక పద్యం. "బీరు, బ్రాంది, విస్కీ, రమ్, జిన్, అమ్మాయి" లను కలుపుతూ, చెడు అర్థం రాకుండా పద్యం చెప్పమని కోరారొక ప్రేక్షకుడు. దానికి జవాబుగా అవధాని పద్యాన్ని ఇలా "మత్తేభం" వృత్తంలో చెప్పారు:

"అతివా! గుండెల బీరువా తెరచి నీకర్పించు కుంటిన్ గదా!
అతుల ప్రేమ మనోజ్ఞ రత్నమట న భ్రాందీ కృత శ్యామతా
న్విత మౌ నీ కచ సీమ వెల్గు హృదయా విష్కీర్ణ సౌందర్యమౌ
రతివో రంభవొ రాధికా రమణివో రావే జగజ్జిన్నుతిన్"

ప్రేక్షకుల్లో ఒక్క సారి నవ్వులు విరజిల్లాయి. ఇలాంటి సాహిత్య ప్రక్రియలెన్నో జరిగాయప్పుడు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే!

రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు స్వర్గీయ టంగుటూరి అంజయ్య ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మలేషియాలో రాజధాని కౌలాలంపూర్ లో ఏప్రియల్ 14, 1981 నుంచి ఏప్రియల్ 18, 1981 వరకు ఐదురోజులపాటు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం, అంతర్జాతీయ తెలుగు సంస్థ, మలేషియా తెలుగు అసోసియేషన్ సంయుక్తంగా ఈ సభలు నిర్వహించాయి. సీఎం స్వయంగా ఆ సభలకు హాజరయ్యారు. అప్పటి మలేషియా ప్రధాని డాక్టర్ మహతి బిన్ మొహమ్మద్ ముఖ్య అతిథిగా సభల ప్రారంబోత్సవానికి హాజరయ్యారు. మొదటి మహాసభల మాదిరిగానే అన్నిరంగాలకు చెందిన మహనీయులెందరో ఈ సభల్లో పాల్గొన్నారు. ఇతర సాంప్రదాయ కార్యక్రమాలకు అదనంగా "తరతరాల తెలుగు జాతి" పేరుతో ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసారు నిర్వాహకులు. అలనాటి రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ నీలం సంజీవరెడ్డి ప్రత్యేకంగా ఇచ్చిన సందేశంలో..."విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారి ఆత్మీయత, అనురాగాలు, ప్రేమాభిమానాలకు మనం సరైన రీతిలో స్పందించాలి" అని అన్నారు. ఆయన సందేశం ఎందరిలోనో ఎంతో స్ఫూర్తిని తెచ్చిపెట్టింది. మారిషస్, ఫిజి, దక్షిణాఫ్రికా, శ్రీలంక, తదితర దేశాల నుండి ఎందరో ప్రతినిధులు ఆ సమావేశాలకు హాజరయ్యారు.

రెండవ ప్రపంచ తెలుగు మహాసభలలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు డిసెంబర్ 10, 1990 నుండి డిసెంబర్ 13, 1990 వరకు నాలుగు రోజులపాటు మారిషస్ దేశంలోని మక్కా ప్రాంతంలో గల మహాత్మాగాంధీ ఇన్స్టివట్యూట్ లో జరిగాయి. మారిషస్ గవర్నర్ వీరాస్వామి రింగుడు, ప్రధాని సర్ అనిరుధ్ జగన్నాథ్ ముఖ్య అతిథులుగా సభలకు హాజరయ్యారు. మొదటి రెండు సభలకు మాదిరిగానే తెలుగు భాషకు చెందిన అతిరథ-మహారథులెందరో సభల్లో పాల్గొన్నారు. మారిషస్ సమగ్రాభివృద్ధికి తెలుగు వారి కృషిని మారిషస్ ప్రధాని ప్రత్యేకంగా పేర్కొన్నారు.

ఇక నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలు మూడు రోజులపాటు డిసెంబర్ 27, 2012 నుండి డిసెంబర్ 29, 2012 వరకు నిత్యం గోవిందనామ స్మరణలతో మారుమోగే శేషాచల గిరుల్లో-తిరుపతిలో జరిగాయి. మహాసభలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ తెలుగు మహాసభల్లో పలువురు విశిష్ట వ్యక్తులను సన్మానించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ తెలుగు భాషా మహోత్సవం ప్రారంభ కార్యక్రమానికి నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ తదితర మంత్రులు హాజరయ్యారు. వందేమాతరం, మా తెలుగు తల్లి గీతాలను సుశీల, బాలసరస్వతి, భూదేవి ఆలపించారు. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన 108 మంది ప్రముఖుల చిత్రాలను సభా ప్రాంగణంలో ఆహ్వానితులకు కనపడేవిధంగా ఏర్పాటు చేశారు. సువిశాల స్థలంలో ప్రధాన వేదికతో పాటు ఐదు ప్రత్యేక కళా వేదికలు, ఐదు సదస్సు వేదికలు, తెలుగు పుస్తక ప్రదర్శన, పురావస్తు ప్రదర్శన, శాసనాల ప్రదర్శన, చేనేత హస్తకళల ప్రదర్శన, తెలుగు పుష్ప ప్రదర్శన, తెలుగు రుచులలో లభించే ఆహార శాలలు, గ్రామీణ క్రీడా ప్రదర్శనలు, సురభి నాటక ప్రదర్శనలు, మధుర చలనచిత్ర ప్రదర్శనలు నెలకొల్పారు నిర్వాహకులు. దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు సభలకు హాజరు కావడం విశేషం.

ఇక ఇప్పుడు తలపెట్టిన మహాసభలు విజయవంతంగా నిర్వహించబడాలంటే గతం కంటే మరింత ఎక్కువగా కృషి జరగాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోడ సభల నిర్వహణ లక్ష్యానికి, తెలంగాణాలో నిర్వహణ లక్ష్యానికీ తేడా వుంది. సహజంగా ఏర్పాటు చేసే పలు కమిటీలకు అదనంగా, పలు ప్రభుత్వ శాఖలకు రొటీన్గాి పనులప్పచెప్పడానికి అదనంగా, మామూలుగా క్రమపద్ధతిలో పూర్వరంగ సమావేశాలు జరపడానికి అదనంగా కొంత వినూత్నంగా ఆలోచన చేస్తే బాగుంటుంది. బహుశా సీఎం సూచన, ఆలోచన కూడా అదే కావచ్చు. ఉదాహరణకు, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ సాంస్కృతిక సంస్థలను ఎలా కలుపుకు పోవాలి? రాష్ట్రేతర సంస్థలతో ఎలా సమన్వయం చేసుకోవాలి? ప్రముఖ పాత్రికేయులను, ఎలెక్ట్రానిక్ మీడియా అధినేతలను ఎలా సభలో నిర్వహణలో భాగస్వాములను చేయాలి? లాంటి విషయాలపై నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ కనపరిస్తే మంచిదేమో! వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను ఎలా సమన్వయం చేసుకోవాలి కూడా ఆలోచన చేయాలి.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో, రాష్ట్ర స్థాయి సమావేశాల కంటె ముందు జిల్లా స్థాయి సమావేశాలు జరిపితే ఎలా వుంటుందోనన్న ఆలోచన కూడా చేయాలి. సరైన, ఆకర్షనీయమైన ఒక లోగోను రూపొందిస్తే బాగుంటుందేమో ఆలోచన చేయాలి. సీఎం సూచించిన విధంగా తెలంగాణ భాష, సంస్కృతి, సాహిత్యం, చరిత్ర, శాసనాలు, తదితర అంశాలపై రచనలు ముద్రిస్తే బాగుంటుందేమో. ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్న"కళాభారతి" లాంటి సాంస్కృతిక వేదికలకు ఈ సందర్భంగా లాంచనంగా భూమిపూజ జరుపుకుంటే బాగుంటుందేమో! కేవలం విదేశాల్లో-పొరుగు రాష్ట్రాల్లో వున్నవారిని పిలవాలని అనుకోవడమే కాకుండా అక్కడా మహాసభల గురించి విస్తృత ప్రచారం కలిగించుతే మంచిది.

తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయానికి, భాషకు, సాహిత్యానికి ఒక అపురూప కలయిక కావాలీ ప్రపంచ తెలుగు మహాసభలు. తెలంగాణ కేంద్ర బిందువుగా కవి సమ్మేళనాలు, అవధాన ప్రక్రియలు, సంగీత కార్యక్రమాలు, నృత్యనాటక జానపద కళా ప్రదర్శనలు అంగరంగ వైభోగంగా జరగడానికి ఈ మహాసభలొక వేదిక కావాలి. మళ్లీ-మళ్లీ జ్ఞప్తికి తెచ్చుకునేవిగా, మరచిపోవాలన్నా మరువలేనివిగా వుండాలీ మహాసభలు.


No comments:

Post a Comment