Thursday, July 10, 2025

వ్యక్తిత్వ వికాసం, జీవన పాఠాలు, స్వీయానుభవాల పరిపక్వత-7 ...... స్వయం కృషితో జాతీయ స్థాయికెదిగిన దళిత నాయకుడు మల్లు అనంతరాములు : వనం జ్వాలా నరసింహారావు

 వ్యక్తిత్వ వికాసం, జీవన పాఠాలు, స్వీయానుభవాల పరిపక్వత-7

స్వయం కృషితో జాతీయ స్థాయికెదిగిన దళిత నాయకుడు మల్లు అనంతరాములు

వనం జ్వాలా నరసింహారావు

ఫిబ్రవరి 7, 1990 ఉదయం రాజ్ భవన్ ప్రాంగణంలో నివసిస్తున్న మా ఇంటికి ‘బ్రేక్ ఫాస్ట్ అతిథి’ గా వచ్చిన డాక్టర్ మల్లు అనంతరాములు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించారు. రాజీనామా చేసిన కుముద్ బెన్ జోషి స్థానంలో నియమితులైన కృష్ణకాంత్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా, అదే రోజున, మరి కొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాజభవన్ కు మల్లు వస్తున్నందున, నేను ఆయనను మా ఇంటికి ఆహ్వానించాను. డాక్టర్ చెన్నారెడ్డిని రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఎన్నుకోవడంతో, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా రాజీనామా చేసిన ఆయన స్థానంలో, అధిష్ఠానం మల్లును పీసీసీ అధ్యక్షుడుగా నియమించింది. ఆ హోదాలో ఆయన గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.

పీసీసీ అధ్యక్షుడుగా నియామకం కావడానికి రెండు నెలల పూర్వం, 1989 నవంబర్ నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, రెండో పర్యాయం, మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూల్ రిజర్వు డు నియోజక వర్గం నుంచి లోక్ సభ సభ్యుడుగా ఎన్నికయ్యారు మల్లు. ఉదయం బ్రేక్ ఫాస్టులోను, ఆ తర్వాత గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవంలోను, ఎప్పటిలాగా చురుగ్గా, సరదాగా, అందరితో గలగలా కబుర్లు చెప్పుకుంటూ గడిపిన మల్లు అనంతరాములు, ఆ మధ్యాహ్నమే హఠాత్తుగా మరణించారన్న వార్తను ఆయనకు సన్నిహితంగా మెలిగిన వారితో సహా ఎవరూ నమ్మలేక పోయారు. అప్పట్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రెండవ పర్యాయం రాష్ట్ర ముఖ్యమంత్రిగా వుండగా, నేను ఆయనకు పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్న సందర్భం.

మల్లు మరణవార్త తెలుసుకున్న నేను హుటాహుటిన తార్నాకా వెళ్లి ఆ సంగతి సీఎంకు చెప్పగానే వెంటనే సంతాప సందేశం ఇవ్వమన్నారు. రాయడం మొదలు పెట్టగానే (అప్పటికి ఇంకా కంప్యూటర్ల యుగం అంతగా రాలేదు. ఎలెక్ట్రానిక్ టైప్ రైటర్లు మాత్రం వచ్చాయి). అదే సమయంలో టెలిప్రింటర్ మీద (ఇంకా ఫాక్స్ మిషన్లు మొదలు కాలేదు) రాజీవ్ గాంధీ సంతాప సందేశం వచ్చింది. రాష్ట్ర శాసన సభకు, దేశ వ్యాప్తంగా లోక్ సభకు, జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయాల్లో మల్లు వహించిన పాత్రను అధ్యక్షుడు రాజీవ్ గాంధి, ఘనంగా పొగుడుతూ మల్లుకు నివాళులు అర్పించారు. 1989 శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధాన కీలక వ్యక్తి (‘ద చీఫ్ ఆర్కిటెక్ట్ బిహైండ్ కాంగ్రెస్ మాసివ్ విక్టరీ) మల్లు అనంత రాములు అని ఆయన సందేశంలో వుండడం చెన్నారెడ్డి గారికి అంతగా రుచించలేదని ఆయన హావభావాల ద్వారా అవగాహన అయింది.

ముఖ్యమంత్రి ఇవ్వాల్సిన సందేశాన్ని నేను తయారుచేసి చెన్నారెడ్డికి చూపగానే, ఒక్క క్షణం ఆయన కనుబొమలు పైకని, ‘జ్వాలా, నీకు అనంతరాములు అంత సన్నిహితుడా అని ఒకింత అసహనంగా అన్న మాటలు ఇంకా జ్ఞాపకం వున్నది. రాజకీయాల నైజమే, దాని స్వబావమే అంత! అనుక్షణం అనుమానాల పుట్ట. ఆ తరువాత ముఖ్యమంత్రి అధికారిక సంతాప సందేశం విడుదల చేశాం. మల్లును అందులో ఆకాశానికి ఎత్తేసారు ‘డాక్టర్ సాబ్’. మల్లు మరణ వార్త తెలిసిన వెంటనే ముఖ్య మంత్రి చెన్నారెడ్డి స్వయంగా ఆయన మాటల్లో చెప్పిన సంతాప సందేశాన్ని సీఎం పీఆర్వోగా పత్రికల వారికి, ఆయన కుటుంబ సభ్యులకు పంపాను.

పెద్దవాళ్ల మధ్య పెద్దవాడి గాను, చిన్న వాళ్ల మధ్య పెద్ద తరహా గాను, ఒక్కొక్కప్పుడు చిన్నల్లో చిన్నగా, పెద్దల్లో పెద్దగా మెలుగుతూ, అందరినీ, అందునా తనవారనుకున్న అందరినీ, అహర్నిశలూ తన వారిగానే భావించే మనస్తత్వమున్న అనంతరాములు మల్లు, స్వయం కృషితో అంచలంచెలుగా ఎదిగిన అరుదైన దళిత నాయకుడు. పదవిలో వున్నా, లేకపోయినా, సన్నిహితులకు, అంతగా పరిచయం లేని ఇతరులకు, తన చేతనైన సహాయం చేయడానికి ఎప్పుడూ వెనుకాడేవాడు కాదు మల్లు.

ఒకే జిల్లాకు చెందిన మా ఇద్దరిది దశాబ్దాల పరిచయం. ఆయన వున్నప్పుడి నుండీ మొదలైన అదే పరిచయం, కొంత వ్యత్యాసంగా, రాజకీయాలలో, పదవులలో సమున్నత స్థాయికి చేరుకున్న ఆయన ఇద్దరు సోదరులతో కూడా కొనసాగింది. వీరిలో డాక్టర్ మల్లు రవి ప్రస్తుతం మూడో పర్యాయం లోక్ సభ సభ్యుడుగా వున్నారు. ఒక పర్యాయం ఆయన శాసనసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. హైదరాబాదులోని గాంధీ వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించిన రవి, ఎంబిబిఎస్, డిఎల్ఓ పట్టాలు పొందారు. మరొక సోదరుడు మల్లు భట్టి విక్రమార్క నాలుగు పర్యాయాలు శాసనసభ సభ్యుడిగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. చీఫ్ విప్ గా, డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన అనుభవంతో పాటు, ప్రస్తుతం తెలంగాణ ఉపముఖ్యమంత్రిగా వున్నారు. ఉన్నత విద్యావంతుడు. హైదరాబాద్‌లోని నిజాంకళాశాల నుండి గ్రాడ్యుయేషన్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు

కాకపోతే ఆప్యాయత, అనురాగం, స్నేహధర్మం, సహానుభూతి మనస్తత్త్వం, సహాయం చేశారనుకునేవారిని ఎల్లప్పుడూ జ్ఞాపకం వుంచుకుండే మంచితనంలాంటి విషయాలలో తరం మారకపోయినా, అంతరం మారిందేమో అన్న భావన అప్పుడప్పుడు కలిగినప్పుడు, ఎందుకు వ్యక్తులు ఇలామారుతున్నారా? అని ఒకింత బాధ చోటుచేసుకుంటుంది. అదే రాజకీయాల మహాత్మ్యం, వ్యక్తుల మధ్య వైయుక్తిక భేదాలు కావచ్చు. లేదా మన లోపం కావచ్చు అని సరిపెట్టుకోవాల్సిందే.

మొట్టమొదటి సారి, మా జిల్లా నుంచి కాకుండా, మహబూబ్ నగర్ జిల్లానుంచి 1980 లో లోక్ సభ కు ఎన్నికైన తర్వాత, రాజకీయంగా కూడా మా మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఢిల్లీ నుంచి ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా, నాకు, భండారు శ్రీనివాసరావుకు ముందస్తుగా సమాచారం ఇవ్వడం, వచ్చిన తర్వాత, ఇక్కడున్నన్ని రోజులు కలిసి మెలిసి వుండడం తప్పని సరిగా జరిగేది. నేను ఆరోజులలో చేస్తున్నది అతిసాదారణమైన చిన్న ఉద్యోగం. అయినా తనసాటి స్థాయి వ్యక్తిగా గౌరవంగా చూడడం అనంతరాములు ప్రత్యేకత.

ఒక సాధారణ ‘వీ ఎల్ డబ్ల్యూ’ గా పని చేసి, వారి ఆసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ ఉద్యోగుల సమస్వయ కమిటీకి చైర్మన్‌గా ఎన్నో సంవత్సరాలపాటు పనిచేశాడు. 1978లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ సంస్థలో ఉన్నత పదవులను అలంకరించిన అతి కొద్దిమంది అరుదైన వ్యక్తులలో, అందునా దళితుల్లో మల్లు అగ్రశ్రేణి వ్యక్తి. అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టిలో పడడం ఆయన కార్య దక్షతకు, పట్టుదలకు నిదర్శనం. వీ ఎల్ డబ్ల్యూ యూనియన్ క్రియాశీలక వ్యక్తిగా మల్లులో నిబిడీకృతమైన నాయకత్వ లక్షణాలు, ఖమ్మం జిల్లా నాయకులతో సహా రాష్ట్ర స్థాయి నాయకులకు ఆయనను చేరువ చేసింది. ఆయన ఉపన్యాసాలు శ్రోతలను ఉర్రూతలూగించేవి.

ఎమర్జెన్సీ నేపధ్యంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర స్థాయిలో అధికారం, రాష్ట్ర స్థాయిలో పట్టు కోల్పోయిన ఇందిరా గాంధి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి మల్లు అనంతరాములు లాంటి వారి అవసరం కలిగింది. ఆ అవసరాన్ని నిబద్ధతతో, నెహ్రూ-గాంధీ కుటుంబ విధేయతతో త్రికరణశుద్ధిగా ఆచరించిన మహోన్నత వ్యక్తి మల్లు అనంతరాములు.  1978 లో జరిగిన రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో, ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఎన్నో ఎన్నికల సభల్లో ఆయన ఉపన్యాసాలు, కాంగ్రెస్ కార్యకర్తలను ప్రోత్సహించడంతో పాటు, రాష్ట్ర నాయకత్వాన్ని మెప్పించాయి.

అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మల్లు నాయకత్వ లక్షణాలను గుర్తించి, ఆ తర్వాత రెండేళ్లకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో, నాగర్ కర్నూల్ రిజర్వుడ్ నియోజక వర్గం లోక్ సభ స్థానానికి టికెట్ ఇప్పించారు. ఆయన ఘనవిజయం సాధించడంతో, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగడం ఆరంభమయింది. పార్లమెంటు సభ్యుడుగా ఢిల్లీలో అడుగు పెడుతూనే, కేంద్ర నాయకులతో సాన్నిహిత్యం పెంచుకుంటూ, దాన్ని తన స్వప్రయోజనాలకు వాడుకోకుండా, నియోజక వర్గం అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి ఉపయోగించుకుంటూ, ప్రజలకు చేరువయ్యారు.

అప్పటి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి జనార్థన్ పూజారి తోడ్పాటుతో, నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో పలు ప్రదేశాల్లో రుణ మేళాలు ఏర్పాటు చేసి, షెడ్యూల్డు కులాల, తెగల వారికి, వెనుక బడిన వర్గాల వారికి ఎన్నో విధాలుగా ఆర్థిక సహాయం అందేలా చూశారు అనంతరాములు. జనార్దన పూజారి రుణ మేళాలు అంటే, సమాజంలోని బలహీన వర్గాలవారికి బ్యాంకు రుణాలను సులభంగా అందించడం కోసం నిర్వహించిన కార్యక్రమాలు. ఇవి రుణాల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియను సరళీకృతం చేయడానికి, బ్యాంకు రుణాలను మరింత అందుబాటులోకి తేవడానికి నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాల వల్ల, అనేకమంది బ్యాంకు రుణాలను పొంది, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం కలిగింది. రుణమేళాలు భారీ ఎత్తున నిర్వహిస్తున్న సందర్భంలో, నాకు గుర్తున్నంతవరకు అప్పట్లో ఆ ప్రాంత స్టేట్ బాంక్ రీజనల్ మేనేజర్ గా భండారు రామచంద్రరావు వున్నారు.

నాగర్ కర్నూలుతో సహా, స్వస్థలమైన ఖమ్మం జిల్లా వాసులకు కూడా సహాయ పడే వారాయన. కార్య శీలతకు, కాంగ్రెస్ పార్టీకి అహర్నిశలూ అంకితమై పనిచేస్తున్న వారికి పార్టీలో గుర్తింపు దొరకడం కష్టం కాదని మల్లు నిరూపించారు. ఖమ్మం జిల్లా స్వంత గ్రామం లక్ష్మీపురంలో, ఆత్మీయుల మధ్య పార్టీ వ్యవహారాలు చర్చిస్తున్న సందర్భంలో, నాటి ప్రధానమంత్రి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజీవ్ గాంధి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నలభై సంవత్సరాల క్రితం, దేశ రాజధాని నుంచి ఒక కుగ్రామానికి ప్రధాన మంత్రి దగ్గర నుంచి నేరుగా పిలుపు రావడం ఒక అసాధారణమైన విషయం. కేవలం మల్లు ప్రతిభే దానికి కారణం. పదమూడు రాష్ట్రాల పార్టీ బాధ్యతలను అప్పగించుతూ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా మల్లును నియమిస్తున్నట్లు రాజీవ్ గాంధి నుంచి సమాచారం అలా చేరింది ఆయనకు. అది ఆయన రాజకీయ ఎదుగుదలకు జాతీయస్థాయిలో దోహదపడ్డప్పటికీ, రాష్ట్రస్థాయిలో కొందరికి ఆయనపట్ల ఈర్ష్యాసూయలు కలగడానికి దారితీశాయని నా ప్రత్యక్ష అనుభవం ద్వారా చెప్పగలను.

న్యూ ఢిల్లీలోని మల్లు కార్యాలయం ఎప్పుడూ అత్యంత కోలాహలంగా వుండేది. జాతీయ స్థాయికెదిగిన పలువురు కాంగ్రెస్ నాయకులను మల్లు అనంతరాములు దగ్గరనుండి కలిసే అవకాశం ఆయనకు కలిగింది. అలాగే తన దగ్గర కొచ్చిన ప్రతి వారినీ, తన కార్యాలయం గది నుండి బయట వరకు వచ్చి పంపడం ఆయన మర్యాదకు నిదర్శనం. ఎప్పుడన్నా పని ఒత్తిడుల వల్ల అలా వీలు కాకపోతే తప్ప, సాధారణంగా ఆయన ఆ మర్యాద పాటించేవారు. తమకు చిరకాలంగా తెలిసినప్పటికీ, అధికారం రాగానే, ఏమీ ఎరగనట్లు వ్యవహరించే ఈ కాలం పలువురు రాజకీయ నాయకుల మనస్తత్త్వానికి పూర్తి భిన్నంగా, ఇతరులకు పరిచయం చేసేటప్పుడు, తన స్నేహితుల గురించి చాలా గొప్పగా చెప్పడం మల్లు లోని మహత్తరమైన సద్గుణం.

తనను కలవడానికి వచ్చిన వారెవరైనా, అడిగిన పని తనకు సాధ్యం కాదని అనే అలవాటు ఆయనలో లేదు. ప్రయత్న లోపం వుండదని దానర్థం. ఒకపర్యాయం నాకు, భండారు శ్రీనివాసరావుకు అత్యంత ఆప్తుడైన ఒక స్నేహితుడు, తప్పనిపరిస్థితులలో, తన చెల్లెలి విషయంలో ఒక సహాయం కోరాడు. ఆ సహాయం చేయడం సరైనదని భావించిన మేము ఆ విషయం మల్లు అనంతరాములు దృష్టికి తీసుకుపోవడానికి, ఆయనకు  ముందస్తుగా తెలియచేసి, ధిల్లీకి వెళ్లాం. ఇప్పటి రాజకీయ నాయకులలాగా కాకుండా మా ముగ్గురిని అప్పటి కేంద్ర బాంకింగ్ వ్యవహారాలను చూసే ఎడువార్డో ఫలెరో (Eduardo Faleiro, Minister of State for Economic Affairs) దగ్గరికి తీసుకువెళ్ళి, మాగురించి అత్యద్భుతంగా పరిచయం చేసి, మేము హైదరాబాద్ కు తిరిగి వచ్చేలోగా ఆ పని అయ్యేట్లు చూశారు మల్లు అనంతరాములు. అలాగే నాబార్డ్ లో ఒక సమీప బంధువు విషయంలో మంచి మనిషి మల్లు అనంతరాములు చేసిన సహాయం ఎప్పటికీ గుర్తుండే అంశం.  

మల్లు పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా, రాజీవ్ గాంధి ఆయనను నేషనల్ ఫార్మ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడుగా నియమించారు. ఆ పదవిలోనూ మల్లు రాణించారు. రాజీవ్ గాంధీకి మరింత చేరువ కావడానికి ఆ పదవి తోడ్పడింది. పార్టీ ప్రయోజనాలకై చాలా మందికి తెలియని ఎన్నో గురుతర బాధ్యతలను రాజీవ్ గాంధి ఆయనకు అప్ప చెప్పారు. ఎంఏ వరకు చదువుకున్న మల్లు పార్లమెంటు సభ్యుడైన తర్వాత రీసెర్చ్ చేసి, పీహెచ్ డి తెచ్చుకుని, డాక్టర్ అనంతరాములు మల్లు అయ్యారు. డాక్టరేట్ వచ్చిన విషయం మాతో చాలా ఆనందంగా పంచుకున్నాడు.

ఎన్టీ రామారావు సారధ్యంలో రాష్ట్రంలో అధికారంలో కొచ్చిన తెలుగు దేశం పార్టీని ఓడించడానికి చెన్నారెడ్డి నాయకత్వంలో 1989 లో ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ, మరో పర్యాయం, మల్లు అనంతరాములుకు నాగర్ కర్నూలు లోక్ సభ టికెట్ ఇచ్చింది. వాస్తవానికి ఆయనకు శాసన సభకు పోటీ చేయాలని మనసులో కోరికగా వుండేది. వీలుంటే ఖమ్మం జిల్లాలో ఏదైనా నియోజక వర్గం నుంచి టికెట్ వస్తే బాగుండేదనుకునేవారాయన. కాకపోతే, ఖమ్మంలోని రిజర్వుడు నియోజక వర్గాల నుంచి గతంలో పోటీ చేసిన వారు కాని, సిట్టింగ్ అభ్యర్థులు కాని పోటీ చేస్తుండడంతో మల్లుకు అవకాశం దొరకడం కష్టమైంది.

ఎన్నికల పూర్వరంగంలో మాస్కోలో అప్పట్లో వుంటున్న భండారు శ్రీనివాసరావు, ఒకపర్యాయం హైదరాబాద్ కు వచ్చినప్పుడు, మేమిద్దరం, అనంతరాములు కలిసి ఆలోచనచేసి, అప్పట్లో పాలేరు రిజర్వడ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆయన పోటీ చేస్తే గెలిచే అవకాశాల అధ్యయనం కోసం నేను, శ్రీనివాసరావు కలిసి నియోజకవర్గంలో విస్తృతంగా, incognito పర్యటన చేశాం. మాకు అప్పుడు వాహనం ఏర్పాటు చేసింది కాంగ్రెసేతర పార్టీ ప్రముఖులు. కారణాలు బహిర్గతం చేయకూడనివి. అనంతరాములు విజయం తధ్యమనీ, పోటీచేయమని మావంతు సలహా ఇచ్చాం. కాని అనేకానేక రాజకీయ కారణాల వల్ల అది సాధ్యపడలేదు.

తనకు పార్టీ విజయం ముఖ్యమని, రాష్ట్రంలోను, దేశంలోను, ప్రత్యేకించి తనకప్పగించిన పదమూడు రాష్ట్రాలలోను, అభ్యర్థుల విజయానికి తన పూర్తికాలం వినియోగిస్తానని, 1989 ఎన్నికల్లో శాసనసభకు కానీ, పార్లమెంటుకు కానీ  పోటీచేయనని చెప్పినప్పటికీ, రాజీవ్ గాంధీ మల్లును నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయాల్సిందిగా ఆదేశించారు. తన నియోజక వర్గంతో పాటు, ఇతర నియోజక వర్గాలలోను మల్లు ప్రచారం చేశారు. మరోమారు ఎంపీగా గెలిచారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా, రాష్ట్రంలో వచ్చింది. ఆ ఎన్నికలలో దాదాపు ప్రతిరోజు నేనున్న రాజ్ భవన్ కు వచ్చి, ఉదయం నుండి సాయంత్రం వరకూ తనవెంట నన్ను ప్రచారానికి తీసుకుని వెళ్లేవాడు.

నాగర్ కర్నూల్ లోక్ సభ, కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గాల్లో ప్రచారం కొరకు రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు, చెన్నారెడ్డి, మల్లు అనంతరాములు, మణిశంకర్ అయ్యర్, చిత్తరంజన్ దాస్, తదితరులతో పాటు నేనుకూడా వున్నాను. అప్పట్లో ఇంకా హై-ఫై సెక్యూరిటీ ఇబ్బందులు ఆరంభంకాలేదు. హైదరాబాద్ కు తిరుగు ప్రయాణంలో, మార్గమధ్యంలో ఆగడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నిసీట్లు గెలుస్తామని రాజీవ్ గాంధీ చెన్నారెడ్డిని ప్రశ్నించినప్పుడు, 40-42 మధ్యన అనగానే, అన్ని తక్కువా ఆని ఆయన ఆశ్చర్యం వ్యక్తంచేయడం ఇంకా నాకు గుర్తున్నది. అవి లోక్ సభ సీట్లని, శాసనసభకు 194 సీట్లు గెలుస్తామని వివరణ ఇచ్చారు చెన్నారెడ్డి.

‘డాక్టర్ సాబ్! అలా అయితే మీరే కాబోయే ముఖ్యమంత్రి అని రాజీవ్ గాంధీ అనడం కూడా జ్ఞాపకం వున్నది. చెన్నారెడ్డి అన్నట్లుగానే ఇంచుమించు 194 శాసనసభ స్థానాలు గెలవడం, చెన్నారెడ్డికి వ్యతిరేకత వచ్చినప్పటికీ రాజీవ్ గాంధీ ఆయన్నే సిఎం చేయడం చరిత్ర. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దూతలుగా హైదరాబాద్ వచ్చిన మూపనార్, ఎన్డీ తివారీలు, చెన్నారెడ్డి ముఖ్యమంత్రి కావడానికి పోటీ బాగా వున్నప్పటికీ ఆయన్నే లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా, సిఎంగా నిర్ణయించారు. స్నేహధర్మం పాటించే, మల్లు అనంతరాములు తన మంచితనం ఉపయోగించి కల్వకుర్తి నియోజకవర్గం నుండి ఎన్టీఆర్ ను ఓడించి, ఎమ్మెల్యేగా గెలిచిన చిత్తరంజన్ దాస్ కు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కేలా చూశారు.

ఇక్కడ మరొక్క విషయం చెప్పాలి. మర్రి చెన్నారెడ్డి స్థానంలో పీసీసీ అధ్యక్షుడుగా నియామకం జరిగిన నాటి రాత్రి పదిగంటల సమయంలో ఫోన్ చేసి, ఆ విషయం చెప్పి, మర్నాడు హైదరాబాద్ వస్తున్న సంగతి కూడా చెప్పారు మల్లు అనంతరాములు స్వయంగా. పీసీసీ అధ్యక్షుడుగా ఆయన నియామకం చేయడానికి బలవత్తరమైన కారణం వుండొచ్చు. బ్రతికున్నట్లయితే, మర్రి చెన్నారెడ్డిని పదవి నుండి దించిన తర్వాత, బహుశా మల్లుకు ముఖ్య మంత్రి అయ్యే అవకాశం వచ్చి వుండేదేమో! వుండేదేమో కాదు, తప్పక వచ్చేది.

నేను ముఖ్య మంత్రి చెన్నారెడ్డి పీఆర్వో గా పని చేస్తున్నప్పటికీ, మల్లు పీసీసీ అధ్యక్షుడుగా హైదరాబాద్ వచ్చినప్పుడు బేగంపేట విమానాశ్రయానికి రిసీవ్ చేసుకోవడానికి పోవడమే కాకుండా, ఆయన వెంట వూరేగింపులో కొంత దూరం ప్రయాణం కూడా చేశాను. అలా చేయడం నేను తప్పుగా భావించలేదు. స్నేహధర్మం పాటించే అనంతరాములుకు, అదే స్నేహధర్మంతో ఆయన వెంట ఊరేగింపులో పాల్గొన్నాను. అలాచేయడం దరిమిలా నాకు ఉద్యోగరీత్యా నష్టం కలగచేసింది. అయినా ఎంతో తృప్తి మిగిల్చింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా మల్లు పలువురి మన్ననలను, ప్రశంసలను అందుకున్నారు. ఎన్నో నూతన ఒరవడులకు నాంది పలికారు. ముఖ్య మంత్రికి, గాంధీ భవన్ కు మధ్య వారధిగా పని చేశారు. ముఖ్యమంత్రిని కలవడానికి ఆయన ఎప్పుడు వెళ్లినా, ఇతర సందర్శకులలాగానే వ్యవహరించేవారు. కలిసిన సందర్భాలలో ఆయన ఎదుర్కున్న కొన్ని అవమానాలు కూడా లేకపోలేదు. అవన్నీ రాజకీయాలలో అంతర్భాగం అనాలి.

అది యాధృఛ్చికమో, దైవ సంకల్పమో కాని, మల్లు అనంతరాములు హఠాత్తుగా మరణించడానికి కొన్ని గంటల ముందు, ఆయన తమ్ముడి (నాగర్ కర్నూల్ లోక్ సభ ఎంపీగా మూడు పర్యాయాలు గెలిచిన మల్లు రవి, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ) మామగారు, అప్పట్లో రాష్ట్ర కాబినెట్ మునిసిపల్ శాఖ మంత్రి కోనేరు రంగారావు పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఒక ప్రముఖ భారతీయ జనతాపార్టీ నాయకుడు, చెన్నారెడ్డి ప్రభుత్వంలో మునిసిపల్ శాఖను నిర్వహిస్తున్న ఒక ఐఏస్ అధికారిమీదా, మునిసిప శాఖ మంత్రి మీదా అవినీతి ఆరోపణల పర్యవసానమే కోనేరు రంగారావు పదవికి రాజీనామా చేసేదాకా సాగింది. అవనీ అత్యంత ఆసక్తికరమైన, అలనాటి పరిణామాలు. ఒక ముఖ్యమంత్రి సమయం, సందర్భం వచ్చినప్పుడు ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి వస్తుందో తెలుసుకునే రాజకీయ కోణం. అవన్నీ వివరంగా మున్ముందు. 

గవర్నర్ ప్రమాణ స్వీకారం, కాబినెట్ మంత్రి రాజీనామా, పీసీసీ అధ్యక్షుడి హఠాన్మరణం అన్నీ ఒక్క నాడే, ఫిబ్రవరి 7, 1990 న సంభవించాయి. మల్లు మరణించి సరిగ్గా 35 సంవత్సరాలైంది. సాధారణ ఉద్యోగిగా జీవితం ప్రారంభించి, పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికై, నేషనల్ ఫార్మ్స్ డెవలప్ మెంట్ చైర్మన్ పదవిని పొంది, అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, పదమూడు రాష్ట్రాల ఇన్-చార్జ్ గా బాధ్యతలు నిర్వహించిన మల్లును, ఒక దళిత నాయకుడిని, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మరచి పోయిందా, లేదా అని ప్రశ్నించుకుంటే జవాబు దొరకడం కష్టం. భావి తరాలవారు, ఆ మాటకొస్తే నేటి తరం వారుకూడా, ఆయన్ను గుర్తుంచుకునేట్లు, ఆయన జ్ఞాపకార్థం ఒక శాశ్వత ఏర్పాటు ఏదైనా చేస్తే మంచిది. నాలో రాజకీయ వాసన కలగడానికి మల్లు అనంతరాములు కూడా ఒక కారణమే! వాస్తవానికి ప్రధాన కారణం అనికూడా అనాలి.

1 comment: