ప్రజలే కేంద్రంగా కొత్త పురపాలన
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (23-07-2019)
1965 నాటి తెలంగాణ పురపాలక చట్టం, 1994 నాటి మునిసిపల్ కార్పోరేషన్ చట్టం
స్థానంలో నూతనంగా 2019 తెలంగాణ పురపాలక చట్టం బిల్లుకు శుక్రవారం (19 జులై) నాడు
రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ఆమోదం తెలిపాయి.
లాంచనంగా గవర్నర్ ఆమోదముద్ర పడి అది చట్టం అయింది. గెజెట్ నోటిఫికేషన్ కూడా
విడుదలైంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వయంగా చొరవ తీసుకుని ప్రతి
అంశం క్షుణ్ణంగా పరిశీలించి, అధికారులతో, నిపుణులతో సుదీర్ఘంగా చర్చించిన నేపధ్యంలో, ఆయన
స్వీయ పర్యవేక్షణలో, మేధోమథనంతో, ప్రజలే కేంద్రబిందువుగా రూపుదిద్దుకున్నది ఈ
చట్టం.
భారత
దేశం మొత్తంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ కు ఒక ప్రాధాన్యం వుంది.
త్వరితగతిన వృద్ధి చెందుతున్న పట్టణ సమ్మేళనాలలో అన్నిటికన్నా అతివేగంగా అభివృద్ధి
జరుగుతున్నది ఇక్కడే. ఔటర్ రింగ్ రోడ్ లోపల వున్న 97 రెవెన్యూ గ్రామాలు కాలం గడిచే
కొద్దీ, పట్టణ లక్షణాలు
సంతరించుకుని 2028 లో 26 మునిసిపాలిటీలుగా మారాయి. వీటిలో బడంగ్పేట్, బండ్లగూడా
జాగీర్, బోడుప్పల్, పీర్జాదిగూడా, జవహర్ నగర్, నిజాంపేట, మీర్పేటలు మునిసిపల్
కార్పోరేషన్లుగా మారుతున్నాయి. ఇవి, వీటితో పాటు ఔటర్ రింగ్
రోడ్ లోపల వున్న హైదరాబాద్ మహానగర మునిసిపల్ కార్పొరేషన్ పైనా, హైదరాబాద్ మెట్రో
డెవలప్మెంట్ అథారిటీ పైనా, ఒక ప్రత్యేకమైన దృష్టి సారించాల్సి వుంటుంది. ఇక మీద
రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ తో సహా, మొత్తం 13 మునిసిపల్ కార్పొరేషన్లు వుండబోతున్నాయి.
కొత్తగా ఏర్పాటు కాబోతున్న 7 మునిసిపల్
కార్పొరేషన్లను కలుపుకుని 2018 లో రాష్ట్ర ప్రభుత్వం 68 పట్టణ స్థానిక సంస్థలను
(అర్బన్ లోకల్ బాడీస్-యుఎల్బీలు) ఏర్పాటు చేసింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 13
మునిసిపల్ కార్పోరేషన్లను, 128 యుఎల్బీలను
కలుపుకుని మొత్తం 141పట్టణ స్థానిక సంస్థలున్నాయి. వీటిలో ప్రస్తుతం 122 పట్టణ
స్థానిక సంస్థలకు, 10 మునిసిపల్ కార్పొరేషన్లకు (కొత్తవి 7
కాకుండా కరీంనగర్, రామగుండం,
నిజామాబాద్) ఎన్నికలు జరగాల్సి వుంది. గతంలోగా కాకుండా ఎన్నికల తేదీలను ప్రకటించే
అధికారం ప్రభుత్వానికే వుండేలా చట్టం నిబంధనలు విధించింది.
ఇప్పుడు
తెచ్చిన నూతన చట్టం రాక ముందు తెలంగాణ రాష్ట్రంలో ఐదు రకాల పురపాలక చట్టాలుండేవి.
ఈ చట్టాలలోని పలు నిబంధనలు పురాతనమైనవిగానూ, ఔచిత్యం కోల్పోయినవిగానూ ప్రభుత్వం భావించి, వాటిని మెరుగుపరచడానికి కొత్త చట్టం తేవాల్సిన అవసరాన్ని గుర్తించింది. పాత
చట్టం నేపధ్యంలో పట్టణ ప్రాంతంలోని ప్రజలు అనేక రకాల కష్ట-నష్టాలకు, ఇబ్బందులకు గురి కావడం, అవినీతి విచ్చలవిడిగా
పెరిగి పోవడం, ఏ పని కూడా లంచం ఇవ్వకుండా జరగక పోవడం ప్రభుత్వం గుర్తించి,
ప్రత్యామ్నాయం దిశగా అడుగులు వేసింది. తత్పర్యవసానమే నూతన పురపాలక చట్టం, నూతన పట్టణ విధానం.
సున్నా
స్థాయి అవినీతి సహనం, పూర్తి స్థాయి పారదర్శకత, సాంకేతిక సహాయంతో నిర్ణీత కాలంలో పౌర సేవల లభ్యం, ఆ క్రమంలో మునిసిపల్ సిబ్బందితో ముఖాముఖి పరస్పర సంబందాల తగ్గింపు, పౌరుల మీద అధిక మోతాదులో నమ్మకం ప్రాతిపదికగా, చట్ట రూపేణా ఒక సంస్థాగత
విధానం రూపుదిద్దుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన
ప్రభుత్వం సంకల్పించింది. ఈ దిశగా, స్వీయ ధృవీకరణ పద్ధతిని
ప్రవేశపెట్టి, తప్పుడు ధృవీకరణ ఉద్దేశపూరకంగా ఇచ్చినవారికి కఠినమైన శిక్ష పడేలా
చట్టంలో జాగ్రత్త పడింది ప్రభుత్వం. గతంలో చట్టాల లొసుగుల ఆధారంగా జరిగే ఆస్కారం
వున్న అనేక అవినీతికి ఆధారమైన అంశాలను ఒక రకమైన సస్త్రచికిత్సా విధానం పద్ధతిలో ఈ
చట్టంలో లేకుండా జాగ్రత్త పడ్డది ప్రభుత్వం. ఇవన్నీ చట్టంలో పొందుపర్చడం కూడా జరిగింది.
కొత్త పురపాలక చట్టం తెచ్చినప్పటికీ, 1955 నాటి జీహేచెంసీ, 2008
నాటి హేచేమ్డీయే చట్టాన్ని ప్రస్తుతానికి యధావిధంగా కొనసాగించాలని ప్రభుత్వం
నిర్ణయించింది. నూతన పురపాలక చట్టంలోని నియమ-నిబంధనలు ఆసక్తికరంగా, ఆకట్టుకునే రీతిలో వున్నాయి.
నూతన
చట్టం మీద అవగాహన కల్పించడానికి చైర్ పర్సన్లకు, వార్డ్ సభ్యులకు, ఒక క్రమ పద్ధతిలో, అప్పుడప్పుడూ
శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు. దీనికొరకై “అర్బన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్”
ను ఏర్పాటు చేసి, దానిద్వారా శిక్షణ ఇవ్వడంతో పాటు, అన్నిరకాల పట్టణ రంగ ఆవిష్కరణలను చేపట్టే విధంగా ఈ సెంటర్ ను
తీర్చిదిద్దుతుంది ప్రభుత్వం. వాస్తవానికి ఎన్నికల్లో పోటీచేయాలనుకుంటున్న వారందరూ, మునిసిపాలిటీలలో పనిచేస్తున్న వారంతా ఈ చట్టాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం
చేసుకుంటే మంచిది.
పురపాలక
సంఘాల అభివృద్ధి క్రమంలో ప్రజల భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ప్రతి వార్డులో
నాలుగు వార్డ్ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కమిటీలలో స్వయం సహాయక బృందాల
సభ్యులతో, నివాసదారుల
సంక్షేమ సంఘాల సభ్యులతో కూడిన యువకులకు, మహిళలకు, సీనియర్ సిటిజన్లకు, ఇతరులకు ప్రాతినిధ్యం
వుంటుంది. వార్డుకు సంబంధించిన అనేక అంశాలలో ఈ కమిటీ మునిసిపాలిటీకి సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు, పారిశుద్ధ్య, హరితహారం కార్యక్రమాలను కూడా సునిశితంగా పర్యవేక్షిస్తుంది.
జిల్లా
కలెక్టర్ అధ్యక్షతన సామాజిక అడవుల అంశం చూసే డివిజనల్ ఫారెస్ట్ అధికారి, సంబంధిత
మునిసిపల్ కమీషనర్ సభ్యులుగా ఏర్పాటయ్యే ఒక కమిటీ ప్రతి పురపాలక సంఘానికి గ్రీన్
కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తుంది. మొత్తం మునిసిపల్ బడ్జెట్లో గ్రీన్ బడ్జెట్
పదిశాతానికి తగ్గకుండా వుండాలని చట్టం చెప్తున్నది. ఈ విధంగా హరితహారం లక్ష్యాలను నేరవేరుస్తున్నది
ఈ చట్టం. వార్డు మెంబర్లకు, సంబంధిత
అధికార్లకు నాటిన మొక్కలను బతికించే బాద్య అప్పచెప్తూనే, లా జరగకపోతే వారి పదవులు, ఉద్యోగాలు పోయేలా కతినమైన నిబంధనలను పొందుపర్చడం జరిగింది చట్టంలో.
పురపాలక
సంఘాల ఉన్నతాధికారైన మునిసిపల్ కమీషనర్ కు ఒక నిర్దుష్టమైన జాబ్ చార్ట్ వుంటుంది. పౌరసదుపాయాల
కల్పన బాధ్యత ఆయనదే. అందులో ప్రధానంగా, రహదారుల, మురుగునీటి కాల్వల, మౌలిక సదుపాయాల నిర్మాణం, నిర్వహణ; మంచినీటి సరఫరా నిర్ధారణ: పారిశుద్ధ్య పనుల నిర్ధారణ; ఘన, ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ; ఇంటింటికీ పోయి చెత్త సేకరణ పనుల నిర్ధారణ; క్రమం తప్పకుండా వీధుల స్వీపింగ్; వ్యర్థపదార్థాల
సురక్షిత రవాణా; మురికివాడల అభివృద్ధి; పట్టణ నిరాశ్రయులకు
రాత్రి ఆశ్రయం (నైట్ షెల్టర్) నిర్వహణ; బస్ షెల్టర్ల ఏర్పాటు; శ్మశానవాటికల, వైకుంఠధామాల,
విద్యుత్ శ్మశాన వాటికల నిర్వహణ; వీధి దీపాల నిర్వహణ; పార్కింగ్ స్థలాల ఏర్పాటు, నిర్వహణ; రహదారుల మధ్య డివైడర్ల ఏర్పాటు, నిర్వహణ; కబేళాల నియంత్రణ-నిర్వహణ, పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాటు-నిర్వహణ, తదితర అంశాలున్నాయి. జిల్లా కలెక్టర్ ప్రత్యక్ష నియంత్రణ, పర్యవేక్షణలో మునిసిపల్ కమీషనర్, ఇతర సిబ్బంది
పనిచేస్తారు.
ఆస్తి
పన్ను విధింపు దగ్గరనుండి చెల్లింపుల వరకూ పారదర్శకంగా, జవాబుదారీతనంగా వుండడానికి,
పౌరులకు లావాదేవీల సౌలభ్యం కలిగించడానికి, యూనిట్ ప్రాతిపదికగా ఆస్తిపన్ను లెక్క చేయడం జరుగుతుంది.
స్వీయ ధృవీకరణ పద్ధతిలో, ఆన్లైన్లో, వారి-వారి ఫ్లాట్ల విస్తీర్ణం ఆధారంగా, దాని ఉపయోగం ఆధారంగా, పౌరులు ఎంత ఆస్తిపన్ను
చెల్లించాలో దరఖాస్తు చేసుకోలి. తదనుగుణంగా ఆస్తిపన్ను విధించడం జరుగుతుంది. పట్టణాలలోని
నిరుపేదలు, ఇండ్ల నిర్మాణం చేసుకోవడానికి ఆసరాగా వుండీ
చట్టం. ఒకవైపున ప్రభుత్వం తన పౌరుల మీద ప్రబలమైన నమ్మకం వుంచుతూనే, మరో వైపున నియంత్రణా విధానం ద్వారా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు స్వీయ
ధృవపత్రాలు ఇచ్చినవారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంది. వారికి భారీ మొత్తంలో
పెనాల్టీ విధించడం కూడా జరుగుతుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ చట్టాన్ని దుర్వినియోగం
కాకుండా చర్యలున్నాయీ చట్టంలో. జనన, మరణ ధృవీకరణ పత్రాలు, భూమి ఉపయోగ ధృవీకరణ పత్రాలు, ధృవీకరణ పత్రాలలో
తప్పొప్పుల సరిదిద్దడం, ఇతర రకాలైన మునిసిపాలిటీలు జారీ
చేయాల్సిన ధృవీకరణ పత్రాలు అన్నీ కూడా ఒక నిర్దుష్టమైన కాలపరిమితిలో,
దరఖాస్తుదారుడి స్వీయ ధృవీకరణ పత్రాల ఆధారంగా, దాంతోపాటు
అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించిన వెంటనే, ఆన్లైన్లో ఇవ్వడం
జరుగుతుంది. ఇంటి నంబర్ల విషయంలో కూడా నూతన పద్ధతిని అవలంభించాలని చట్టంలో వుంది.
మునిసిపాలిటీల
సమతుల్యమైన, ఆరోగ్యకరమైన
అభివృద్దే ధ్యేయంగా, అది చేపట్టి అమలుచేయాల్సిన అభివృద్ధి పనుల తప్పనిసరి అవసరాలకు
అనుగుణంగా, క్రమబద్ధమైన పద్ధతిలో సక్రమమైన, ప్రణాలికా
బద్ధమైన బడ్జెట్ ను ప్రతి మునిసిపాలిటీకి రూపొందించడం జరుగుతుంది. మునిసిపాలిటీ
బడ్జెట్ రూపకల్పనలో జిల్లా కలెక్టర్ ప్రధానమైన పాత్ర పోషిస్తాడు. మునిసిపాలిటీ
సొంత వనరులకు అదనంగా, ఆర్ధిక సంఘం డివోల్యూషన్ కింద లభించే
నిధులకు మాచింగ్ గ్రాంటుగా రాష్ట్ర ప్రభుత్వ నిదులుంటాయి. మాచింగ్ గ్రాంట్ కింద
ఏదైనా లోటు వుంటే మరుసటి సంవత్సరానికి బదలాయించడం జరుగుతుంది.
మునిసిపల్
కార్యాలయానికి వెళ్లే అవసరం లేకుండా, మునిసిపల్ అధికారులతో పరస్పరం ముఖాముఖిగా కలిసే అవసరం లేకుండా, ఇంతవరకూ ఇబ్బందులకు లోనవుతూ పొందుతున్న భవన నిర్మాణ అనుమతులు, ఇక నుండి, ఈ చట్టం పుణ్యమా అని, అవినీతికి, అడ్డంకులకు ఆస్కారం ఏమాత్రం లేకుండా పౌరులు
పొందే వీలు కలిగింది. ఏరియా ఆధారంగా ఒక్కొక్క రకమైన భవనానికి ఒక్కొక్క
నిర్దుష్టమైన పధ్ధతిలో నిర్మాణ అనుమతులు పొందే వీలు వున్నదీ చట్టంలో. అనుమతుల్లేని
లే-ఔట్ల విషయంలో, అనుమతుల్లేని నిర్మాణాల విషయంలో
ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వుండి, పర్యవేక్షణ చేసి, తగురకమైన కఠిన చర్యలు చట్టం పరిధిలో చేపట్టడానికి జిల్లా స్థాయిలో, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, ఆయన అధ్యక్షతన, ఒక
ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడానికి చట్టం వీలు కలిగిస్తుంది. చట్ట
విరుద్ధంగా, సక్రమైన అనుమతులు లేకుండా, పొందిన అనుమతికి
విరుద్ధంగా చేసిన నిర్మాణాలను ముందస్తు నోటీసు లేకుండా కూల్చివేయడానికి చట్టం వీలు
కలిగించింది. ప్రణాళికాబద్ధంగా కొత్త ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ఒక
నూతనమైన ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది ఈచట్టంలో.
కాలాగుణంగా
వస్తున్న మార్పులకు అనుగుణంగా, పట్టణప్రాంత ప్రజల అభీష్టానికి, ఆకాంక్షలకు అనుగుణంగా, రూపుదిద్దుకున్నదీ నూతన పురపాలక చట్టం. అత్యంత పారదర్శకంగా మాత్రమే
కాకుండా, సున్నా స్థాయి అవినీతి సహన చట్టంగా, అత్యంత శక్తివంతమైందిగా ఉన్నదీ చట్టం. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు
జరిగిపోయేలా నిబంధనలున్నాయీ చట్టంలో. ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాన్ని ఇక పూర్తీ
స్థాయిలో వినియోగించుకోవాల్సింది పౌరులే!