రాముడికి సమాధానం చెప్పిన లక్ష్మణుడు
శ్రీమదాంధ్ర
వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-70
వనం జ్వాలా
నరసింహారావు
ఆంధ్రభూమి
ఆదివారం సంచిక (21-07-2019)
ఎంతగానో కలతచెందిన మనసుకల శ్రీరామచంద్రుడు,
సీతాదేవి రాక్షసుల చేతిలో చిక్కి మరణించిందేమోనని అనుమాన పడతాడు. అలా కాకపొతే
ఇంతలోనే ఎక్కడి పోయి వుంటుందని అనుకుంటాడు. “అయ్యో! అందమైన కమ్మలతో,
చంద్రబింబం, కమలాలతో
సమానమైన సీత ముఖం ఇప్పటికే ఎంత వాడిపోయిందో కదా?
మనోహరమైన సంపెంగ పూవు లాగా వుండే ఆమె పచ్చని దేహంతో ముత్యాల సరాలు ఆమె వంటిమీద
వేలాడుతుంటే, ఆమెను అదే పనిగా అరుస్తుంటే రాక్షసులు నరికి వేశారేమో?
చిగురైన, కోమలమైన ఆమె చేతులను తెగేవిధంగా విరిచి చెరుకు తుంటలాగా
తింటున్నారేమో? చెరకు తుంటలాగా భావించి ఆమె నడుమును రేమ్డులాగా విరిచి పాపాత్ములు
తింటున్నారేమో? దుష్ట రాక్షసులు సీతను చంపారేమో?
అన్నా! లక్ష్మణా! నేను చిత్త భ్రమలో వున్నాను కాబట్టి,
బహుశా, నాకు సీత కనపడలేదేమో? నీకైనా
కనిపించిందా? చిన్నారి చిన్నదానా! నిన్ను నేను మళ్లీ చూడగలనా?”
ఇలా ఏడుస్తూ శ్రీరాముడు వేగంగా ఒక వనం తరువాత మరో వనంలొ వెతుకుతూ,
భ్రమతో, సీతా-సీతా అని పిలుస్తూ
వెర్రివాడిలాగా శోకించాడు.
సీతాదేవిని తలచుకుంటూ శ్రీరాముడు భయంతో,
శోకంతో రెండు చేతులెత్తి “హో” అని ఏడ్చాడు. అలా ఏడుస్తూనే,
“ఏరా తమ్ముడా! లక్ష్మణా! సీత ఆశ్రమంలో లేదుకదరా?
ఎక్కడికి పోయిందో కదరా? ఘాతుకంగా
ఏదైనా తిన్నదేమో? ఎవరైనా ఎత్తుకుని పోయారేమో కదరా?
కమలాల లాంటి కళ్ళున్న సీతాదేవిని విడిచి నేను ఒక్క నిమిషమైనా బ్రతకగలనా?
నా చెలీ! మళ్లీ నిన్ను కళ్లారా చూడగలనా? అయ్యో!
స్త్రీ రత్నమా! బాలా రత్నమా, నా ఏడుపు
అలా వుండనీ, నువ్వు మచ్చిక చేసుకున్నందున నీతో తిరిగిన క్రీడామృగాలు నిన్ను
విడిచినందువల్ల విశేషంగా ఏడుస్తున్నాయే? అదికూడా
నీకు తెలియదా? సీతాదేవిని విడిచిన దుఃఖాతిశయంతో మరణించి స్వర్గానికి పొతే,
అక్కడ నా తండ్రి ‘ఏమిరా! రామా! నీకు నేనేం చెప్పానురా?
పద్నాలుగు సంవత్సరాలు అడవిలో వుండమన్నాను కదా?
ఆ గడువు ముగిసిందా? ఇక్కడికి వచ్చావెందుకురా?
ఛీ!’ అని అసత్యవాదిని, మోసగాడిని,
మర్యాద తప్పినవాడిని అయిన నన్ను చీవాట్లు పెట్తాడు. నా మంచి కీర్తి అంతా వదిలిపోయే
విధంగా నామీద దయలేకుండా నన్ను వదిలి నువ్వు ఇలా పోవచ్చా?
నన్ను విడిచి నువ్వు ఎక్కడికో పోగాలిగావు కాని,
నేనలా పోలేను కదా? ఇంక నా గతేంటి?
ఈ శరీరాన్ని నేనెలా మోసుకుని తిరగ్గలను?” అంటాడు.
సీతాదేవిని ఇలా వెతుక్కుంటూ బురదలో
మునిగిన ఏనుగులాగా సహించలేని బాధతో వున్న అన్నకు లక్ష్మణుడు హితవాక్యాలను
చెప్పడిలా.
“అన్నా! ఎందుకిలా దుఃఖంతో బాధపడతావు?
ఈ వంకల్లో, వాగుల్లో, గుహలలో,
లోయలలో, కానలలో, కోనలలో, కొండగుహల్లో,
సీతను వెతికితే ఆమె కనిపించదా? ఎక్కడా
వుండకుండా ఎక్కడికి పోతుంది? దీరుల్లో
శ్రేష్టుడా! లే..లెమ్ము. సీతాదేవికి వనసంచారం అంటే ఇష్టమని నీకు తెలియదా?
స్నానానికే పోయిందో, వికసించిన కమలాల కోసమే పోయిందో,
నవ్వులాటకై దాక్కుందేమో లేక మనల్ని భయపెట్టడానికి దాక్కుందేమో?
సీతాదేవి ఎక్కడికి పోగలదు? మనం
ప్రయత్నం చేసి వెతుకుతే దొరక్క పోతుందా? అవశ్యం
దొరుకుతుంది. నువ్వు బాధను వదలుకో. దుఃఖపడవద్దు”. ఈ మాటలు విన్న రాముడు మళ్లీ లేచి
అడవిలో తిరిగి వెతకడం మొదలుపెట్టాడు.
కొండలు,
గుట్టలు, కోనలు, నదులు,
కాన్లు, కొలకులు వెతికి-వెతికి సీతాదేవి జాడ లేకపోయేసరికి రామచంద్రమూర్తి
లక్ష్మణుడితో ఇలా అన్నాడు. “ లక్ష్మణా! దండకారణ్యం అంతా వెతికాం. వృధా కష్టం
అయింది కదా? ఆ మదగజగామిని ఎక్కడికి పోయిందో,
ఏమో? నేనేమి చేయాలిప్పుడు?”.
జవాబుగా లక్ష్మణుడు, “అన్నా,
పూర్వం బలి దగ్గరనుండి బలాత్కారంగా భూమిని గ్రహించినట్లు నువ్వు సీతను మళ్లీ
పొందగలవు”. అప్పుడు రామచంద్రమూర్తి ఇలా అన్నాడు.
“ఈ ప్రదేశమంతా వెతికాం. శ్రమ కలిగిందే
కాని సీతైతే కనబడలేదు. ఈ పర్వతంలో అనేక గుహలున్నాయి. ఎక్కడని మనం వెతకగలం?”
అని అంటూ, కాసేపు మూర్ఛపోవడం, కాసేపు
నేలమీద పడడం, కాసేపు ఏడవడం, “బాలా!
సీతా! సీతా! ఎక్కడికి పోయావే?” అని
నేలమీద పడిపోయాడు. తమ్ముడు లక్ష్మణుడు సమాధాన పరచడానికి ఏవేవో మాటలు చెప్పినా
వాటిని అంగీకరించకుండా దుఃఖంతొ బాధపడుతూ పరితపించాడు. సీతాదేవిని కానక రామచంద్రుడు,
తానూ భరించాల్సిన భార్యను ఆపదల నుండి రక్షించ లేదే అనుకుంటాడు. ఆశ్రితురాలైన
పతివ్రతను వదలడం మహా పాపకార్యం అనుకుంటాడు. మన్మథ బాణ పీడితుడైన రాముడు “సీతా” అని
గట్టిగా ఏడ్చాడు.
No comments:
Post a Comment