ఇరం మంజిల్ లో తెలంగాణ శాసనసభ నూతన భవనాలు
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (19-07-2019)
తెలంగాణ రాష్ట్ర
రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున విశాలమైన ఆవరణలో వున్న ఒక విలాసవంతమైన భవనమే
సుమారు 150 సంవత్సరాల
క్రితం నిర్మించబడ్డ ఎర్ర మంజిల్ లేదా ఇరం మంజిల్. ప్రస్తుతం పంజాగుట్ట మెట్రో
రైల్వే స్టేషన్ ను దాదాపు ఆనుకుని ఒక ఎత్తైన గుట్టమీద వున్న ఈ అపూర్వ కట్టడాన్ని 1870 సంవత్సరంలో నవాబ్ సఫ్దార్ జంగ్ ముషీర్-ఉద్-దౌలా
ఫక్రుల్ ముల్క్ అనే ఒకనాటి హైదరాబాద్ రాష్ట్ర సంస్థానాదీశుడు, ప్రభువు
(నోబుల్మాన్) నిర్మించాడు.
నిజాం నవాబు కింద పనిచేస్తూవున్న
సంస్థానాదీశుల్లో ఒక రకమైన అధికార సోపానక్రమం అమల్లో వుండేదని హైదరాబాద్ నగరం మీద
అనేకరకమైన వ్యాస రచనలు, గ్రంథాలు రాసిన మాజీ ఐఏఎస్ అధికారి
నరేంద్ర లూథర్ ఇరం మంజిల్ మీద రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. వారిలో అందరికంటే
అధికులు పాయిగాలు. నిజాం కుటుంబంతో వైవాహిక సంబంధ బాంధవ్యాలు కూడా కలిగిన వారు
కేవలం పాయిగా ప్రభువులు మాత్రమే. ఇతరులకు ఆ అవకాశం లేదు. పాయిగాగాల తరువాత స్థానం
ఉమ్రా-ఎ-ఉజాం, అంటే, గొప్ప ప్రభువులు అన్నమాట. వీరిలో
అత్యదికులు షియా ముస్లింలు కాగా రెండు హిందూ కుటుంబాలు కూడా వుండేవి. అలాంటి
ఉమ్రా-ఎ-ఉజాం కు చెందిన గొప్ప ప్రభువుల్లో ఒకరు నవాబ్ ఫకర్-ఉల్-ముల్క్. ఆయన
కుమారుడే 1859-1934 మధ్యకాలంలో జీవించిన ఫక్రుల్ ముల్క్. ఆయన అసలు పేరు
మీర్ సర్ఫరాజ్ హుస్సేన్. ఆయన బిరుద నామాలు అనేకం. ఆయన్ను సఫ్దార్ జంగ్ అనీ, ముషీర్-ఉద్-దౌలా అనీ, ఫక్రుల్ ముల్క్ అనీ సంబోధించే వారు. పాత బస్తీ నుండి
బయటకు వచ్చి నవీన హైదరాబాద్ నగరంలో నివాసం ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి ప్రభువు, నవాబు ఆయనే.
ఫక్రుల్ ముల్క్ కు, ఆయన సోదరుడికి మధ్య తలెత్తిన ఆస్తి తగాదా
పర్యవసానంగా, ఆయన అప్పట్లో వుంటున్న అసద్ మంజిల్ ను ఖాళీ చేసి
వేరే ఎక్కడైనా ప్రశాంతమైన స్థలానికి వెళ్లాలని నిజాం నవాబు సూచించారని నరేంద్ర
లూథర్ తన వ్యాసంలో పేర్కొన్నారు. ఆ సలహాకు అనుగుణంగా పంజాగుట్టలోని (ఎర్రగడ్డ) ప్రాంతంలో
ఒక ఎత్తైన గుట్ట మీద, హుస్సేన్ సాగర్ తటాకం ఆహ్లాదకరంగా కనిపించేలా, ఒక విశాలమైన, అందమైన భవనాన్ని కట్టడానికి ఫక్రుల్ ముల్క్
నిర్ణయించుకుని దాన్ని అమలు పరిచాడు. అలా మొదలై, పూర్తయింది ఆ కట్టడం.
నరేంద్ర లూథర్ మరో ఆసక్తికరమైన
కథనాన్ని కూడా తన వ్యాసాలలో పేర్కొన్నారు. ఫక్రుల్ ముల్క్ కు, ఆయనపైకు బాగా తెలిసన
ఒక పాయిగా సర్ వికార్-ఉల్-ముల్క్ కు మధ్య పందెం పడిందట. ఎవరెక్కువ ఎత్తైన స్థలంలో
భవనం కట్టగలరో తేల్చుకుందామనుకున్నారు. ఫలితంగా వికార్ మంజిల్, ఇరం మంజిల్ కట్టడాలు నిర్మించడం జరిగింది. రెండు
భవనాలు కూడా దాదాపు ఒకే ఎత్తుకలవి కావడంతో వారి పోటీ డ్రాగా ముగిసింది. ఫక్రుల్
ముల్క్ అప్పట్లో ఖాళీ చేసిన అసద్ మంజిల్ తరువాత కాలంలో నిజాం కళాశాల భవనం అయింది.
సమీపంలోని ఫతే మైదాన్ ఆటల స్టేడియం అయింది.
ఎత్తైన
స్థలంలో వున్న ఇరం మంజిల్ భవనం సుమారు 2.2 లక్షల చదరపు
అడుగుల వైశాల్యంలో రెండస్తుల నిర్మాణం. ఇప్పుడు అది వున్న ప్రదేశాన్ని ఎర్రగడ్డ
అనీ, రెడ్ హిల్ అనీ పిలుస్తున్నారు. పర్షియా
భాషలో పారడైజ్ మాన్షన్ గా నవాబ్ ఫక్రుల్ ముల్క్ నామకరణం చేసిన ఆ భవనాన్ని ఎర్రటి
రంగులో పెయింట్ చేసారప్పట్లోనే.
రాజ విందులకు, ఇతర రకాల
గొప్ప-గొప్ప కార్యక్రమాలకు, విందు-వినోదాలకు, మొదట్లో ఇరం మంజిల్ భవనాన్ని ఉపయోగించేవారు. తరువాత దాన్ని రికార్డుల
స్టోర్ గా వాడడానికి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1940 దశకం వరకూ నవాబ్ వారసుల
ఆధీనంలోనే వుండేదా బంగళా. కొన్నేళ్ళకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆధీనంలోకి
పోయింది. ప్రస్తుతం ఆ భవనంలో రహదారులు, భవనాల శాఖ, సాగునీరు, కమాండ్ ఏరియా అభివృద్ధి
శాఖ వారి కార్యాలయాలున్నాయి. పాత నిర్మాణం పక్కనే సుమారు రెండు లక్షల చదరపు అడుగుల
విస్తీర్ణంలో సాగునీటి శాఖ వారి మరికొన్ని కార్యాలయాలున్న జల సౌద భవనం కూడా వుంది.
అలనాటి
కాలంలో నిర్మించబడ్డ రెండస్తుల ఇరం మంజిల్ భవనంలో సుమారు 150 గదులున్నాయి. అంతా
ఇండో-యూరోపియన్ తరహా నిర్మాణమే. ఒకానొకప్పుడు దాన్ని వారసత్వ కట్టడాలలో చేర్చారు
కూడా. ప్రస్తుతం కాదు. లూయీ XVI ఫర్నిచర్,
డ్రాయింగ్ హాల్, విందు హాల్, డెకోరేటివ్ పనులతో అడుగడుగునా అద్భుతంగా
కనిపించేదా భవనం ఒకప్పుడు అని అంటారు. అక్కడే 9 గోల్ఫ్ మైదానాలు, ఒక పోలో మైదానం, 200 గుర్రాలుండడానికి అనువైన స్థలం, 100 పాడిగేదెలతో, ఆవులతో ఒక డైరీ ఫార్మ్
కూడా వుండేవట. అత్యంత ఖరీదైన ఫర్నీచర్ వుండేదా బంగళాలో.
ఇరం మంజిల్
భవనం నుండి చూస్తే కనుచూపు దూరంలో హుస్సేన్ సాగర్ అందంగా దర్శనం ఇచ్చేది అప్పట్లో.
ఇప్పుడైతే పరిసర ప్రాంతమంతా భవనాలే రావడంతో లేక్ వ్యూ ఏ మాత్రం లేకుండా పోయింది.
బయట పోయే వాళ్లకు కూడా ఎత్తైన ప్రదేశంలో వున్న ఆ భవనం, దాని ముందు ప్రాంతం చక్కగా
కనిపించేది ఒకప్పుడు. ఇప్పుడేమో అన్ని రకరకాల నిర్మాణాలు, సైన్ బోర్డులు, ప్రకటనల బోర్డులు....అలా ఎన్నో
వచ్చాయి. ఇప్పుడు అటుగా పోయేవారికి ఏమాత్రం కనిపించదు బయటనుండి.
కుటుంబం
చేసిన అప్పుల నుండి విముక్తి కావడానికి సర్ మిర్జా ఇస్మాయిల్ ప్రధానిగా 1946-47 వున్నప్పుడు ఇరం మంజిల్
భవనాన్ని ప్రభుత్వానికి అమ్మడం జరిగింది. మిర్జా ఆ భవనంలో అనేక మార్పులు-చేర్పులు
చేశాడని ఆయన మనుమడు, హైదరాబాద్ సివిల్ సర్వీస్ కు చెందిన మీర్ మోవజ్జం హుస్సేన్
పేర్కొన్నారు ఒకానొక సందర్భంలో. మీర్ మోవజ్జం హుస్సేన్ యునిసెఫ్ డైరెక్టర్ గా కూడా
పనిచేశారు. మైసూర్ తరహా మొక్కలను కూడా భవన ప్రాంగణంలో నాటించారట సర్ మిర్జా
ఇస్మాయిల్.
1956 లో హైదరాబాద్ రాష్ట్రం విలీనం
జరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటైన తరువాత ఇరం మంజిల్ భవనాన్ని
పబ్లిక్వర్క్స్ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకుంది. దాని
అవసరాలకు అనుగుణంగా ఆ శాఖ ఆ భవనంలో కొన్ని మార్పులు-చేర్పులు చేసింది. సహజంగానే
అప్పట్లో దాని ఉపయోగం అధికారిక కార్యకలాపాలకు కాబట్టి ఆఫీసుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంతో
దాని ఒకప్పటి అందం కొంత పోయిందనే అనాలి. భవనం ప్రవేశ స్థలంలో ఒక షెడ్ ను ఏర్పాటు
చేయడం, అక్కడ సైకిళ్లను పార్క్ చేసే వెసలుబాటు
కల్పించడంతో ఆ మొత్తం స్థలం ఒక రకమైన నివాసయోగ్య స్థలంగా రూపాంతరం చెందింది అనాలి.
వారసత్వ చిహ్నాలు అలా ఒక్కటొక్కటే మాయమయ్యాయి.
ఈ నేపధ్యంలో తెలంగాణా రాష్ట్ర
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇరం మంజిల్ వున్న ఆవరణలో నూతన శాసనసభ భావన
సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించడం, దానికొరకై
భూమిపూజ చేయడం, పునాదిరాయి వేయడం జరగడంతో మరోమారు ఆ భవనం
వార్తల్లోకి ఎక్కింది. ఈ నిర్ణయం జరగడంతోనే దాన్ని వ్యతిరేకిస్తున్న కొందరు
వ్యక్తులు అది వారసత్వ కట్టడమనీ, దాన్ని కూల్చడం భావ్యం కాదనీ వాదనలు లేవదీస్తున్నారు.
అది కట్టి 150 సంవత్సరాలు కావడం, ఇంకా-ఇంకా
అది అలానే వుంచితే దాని మనుగడ ప్రశ్నార్థకం కావడం, భవనం
శిధిలావస్థ లాంటివి పరిగణలోకి తీసుకున్న పలువురు మాత్రం దాన్ని చాల కాలం అలాగే
ఉపయోగించడం క్షేమకరం కాదని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన
నూతన వారసత్వ భవనాల చట్టం కిందికి ఇంకా ఈ భవనాన్ని తీసుకురానందున, వారసత్వ భవనాల జాబితాలో దాన్ని ఇంకా చేర్చనందువల్ల,
ప్రస్తుతానికి దీనిని వారసత్వ కట్టడంగా భావించనవసరం లేదని మరికొంతమంది వాదన.
భారతదేశంలో ఎక్కడా లేని విధంగా,
తెలంగాణ రాష్ట్రం, ఒక చెప్పుకోదగ్గ రీతిలో వారసత్వ కట్టడాల బిల్లును చట్టసభల్లో
ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందింది. చట్టంగా రూపుదిద్దుకుంది కూడా. మొట్టమొదటిసారిగా, ఎక్కడా లేని విధంగా, తీసుకురాబడిన ఈ చట్టం పరిధిలో
యావత్ వారసత్వ రంగాన్ని సహజమైన వాటితో సహా, పురావస్తు స్మారక
చిహ్నాలతో సహా, చారిత్రాత్మక భవనాలతో సహా, అన్ని రకాల వారసత్వ కట్టడాలతో సహా చేర్చడం జరిగింది. గతంలో ఇలా ఎక్కడా
జరగలేదు. చట్టం తేవడానికి పూర్వరంగంలో, హైదరాబాద్ లో వున్న 137 భవనాలను వారసత్వ జాబితాలో
చేరుస్తూ 1995 లో విధించిన హూడా జోనింగ్
నిబంధనలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఆ నిబంధనలు అసంపూర్ణమని, అస్తిరమని, తగినంత లేవని, అవి కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే
వర్తించేవిగా వున్నాయని అందుకే అవి రద్దు చేస్తున్నామని ప్రభుత్వం చెప్పింది.
కాలానుగుణంగా, ప్రజల అవసరాలకు
అనుగుణంగా, ప్రభుత్వ అవసరాలు దీటుగా, భవిష్యత్ తరాల వారికి అన్ని రకాల ఉపయోగపడేలా ఇరం మంజిల్ వున్న ప్రదేశంలో
నూతన శాసనసభ భవనాలను కట్టడం అత్యంత అవశ్యం. ఆ విధంగా ఆ భవనాన్ని, ఆ ప్రదేశాన్ని సరైన రీతిలో ఉపయోగానికి తేవడం ఒక శుభపరిణామం అనాలి.
ఈభవనాల వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానంలో ఉంది. అటువంటప్పుడు వనం వారు ప్రభుత్వవాదనకు డప్పుకొడుతూ ఇలా వ్యాసం ప్రకటించటం ఎంతమాత్రం హర్షణీయం కాదు. తగిన పరిరక్షణచర్యలు తీసుకొని వారసత్వభవనాలను కాలానికి నిలచేలా చేయటం సాధ్యమే. వీలైనంతకాలం వాటిని కాపాడటం మన ప్రభుత్వాల విధి. కట్టి 150 సంవత్సరాలు కావడం, ఇంకా-ఇంకా అది అలానే వుంచితే దాని మనుగడ ప్రశ్నార్థకం కావడం, భవనం శిధిలావస్థ లాంటివి కూల్చివేతకు ప్రాతిపదికలైతే తాజ్‍మహల్ కూడ కట్టి ఇంకా చాలాకాలమే ఐనది, ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో చెప్పలేం, శిధిలావస్థదేముంది - మన ప్రభుత్వాలనిర్లక్ష్యం ఆసంగతి చూసుకుంతుంది. కాబట్టి తాజ్ కూడా కూల్చివేయవచ్చని వనం వారి సిధ్ధాంతం అన్నమాట. ఇలాంటి వక్రీకరణలతో దొరతనాన్ని ఆకాశానికి ఎత్తి ఇలా నయాబిల్డింగుల తెలంగాణా తేవటాన్ని వనంవారు ప్రస్తుతిస్తున్నారు. న్యాయస్థానం తీర్పు వచ్చాక ఈ వ్యాసం వ్రాయటం కష్టం కావచ్చునని కొంచెం ముందుగానే వ్రాసినట్లున్నారు - ప్రాప్తకాలజ్ఞ్లులు!
ReplyDelete