నిర్మల బడ్జెట్‌లో
పిపిపిలు
వనం జ్వాలా నరసింహారావు
మన తెలంగాణ దినపత్రిక
(09-07-2019)
కేంద్ర ఆర్థిక
మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను సమర్పిస్తూ పబ్లిక్ ప్రైవేటు
భాగస్వామ్యానికి సంబంధించి రెండు ప్రస్తావనలు చేశారు. భారతీయ రైల్వేలకు సంబంధించి
ముంబై మరి కొన్ని చిన్న నగరాల్లో చేపట్టాల్సిన భారీ పనులను ఉదాహరణలుగా పేర్కొంటూ
ఢిల్లీ మీరట్ మార్గంలో ప్రతిపాదించిన ర్యాపిడ్ రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్
(ఆర్‌ఆర్‌టిఎస్) లాంటి స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్‌పివి) ద్వారా సబర్బన్
రైల్వేలలో మరింతగా పెట్టుబడులు పెట్టడానికి రైల్వేలను ప్రోత్సహించడం జరుగుతుందని
నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ మేరకు మరిన్ని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలను
(పిపిపి)లు ప్రోత్సహించడం ద్వారా మెట్రో రైల్వే పథకాలలో పెట్టుబడులను పెంచడానికి
ప్రతిపాదనలు చేయడంతోపాటు మంజూరైన పనులు పూర్తి అయ్యేలా చూస్తామని ఆమె అన్నారు.
అలాగే ప్రధాన
మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత అభియాన్ కింద రెండు కోట్ల మందికి పైగా గ్రామీణ
భారతీయులకు ఇప్పటి వరకు డిజిటల్ పరిజ్ఞానాన్ని కల్పించడం జరిగిందని మరో
ప్రస్తావనలో ఆర్థిక మంత్రి చెప్పారు. దేశంలోని ప్రతి పంచాయితీల్లోని స్థానిక సంస్థల్లో
ఇంటర్‌నెట్ కనెక్టివిటీని యూనివర్శల్ సర్వీస్ ఆబ్లిగేషన్ 2019)ఫండ్ నుంచి సహాయంతో పబ్లిక్‌ప్రైవేటు భాగస్వామ్యం విధానం కింద వేగవంతం చేయడం
జరుగుతుందని కూడా ఆమె చెప్పారు. దీనివల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ అంతరం తగ్గుతుందని మంత్రి చెప్పారు.
2018 2030ల మధ్య రైల్వేలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 50 లక్షల కోట్లు అవసరమని ఆమె చెప్తూ, ఏడాదికి రూ. 1.5 నుంచి 1.6 లక్షల కోట్లు మాత్రమే రైల్వేలు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో మంజూరయిన
ప్రాజెక్టులు సైతం పూర్తి చేయడానికి దశాబ్దాల కాలం పడుతుందని అంటూ పిపిపి
విధానాన్ని సూచించారు. రైల్వేలో అభివృద్ధిని వేగవంతం చేయడానికి, రైలు మార్గాల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రోలింగ్ స్టాక్ (బోగీలు, ర్యాక్‌లు) తయారీకి,
ప్రయాణికులు, సరుకు రవాణా సేవలు
అందించడానికి పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుందని
నిర్మలా సీతారామన్ తెలియజేశారు.
అయితే ప్రభుత్వ
ప్రాజెక్టులలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని చేపట్టడానికి ఎందుకింత
ప్రాధాన్యత ఇస్తున్నారు?
ఇది కొత్త విధానమా లేక కొంత కాలంగా ఉన్నదేనా? స్వాతంత్య్రం పొందిన కొత్తల్లో ప్రభుత్వశాఖల్లో రెడ్ టేపిజాన్ని పని తీరులో
ఉన్న నిరాసక్తతను అధిగమించడానికి, అలాగే పౌరులకు మెరుగైన
సేవలు అందించడానికి దేశ వ్యాప్తంగా పలు ప్రభుత్వ రంగ సంస్థలు (పిఎస్‌యు) ఏర్పాటు
చేయడం జరిగింది. అయితే అవి నష్టాలను ఎదుర్కొంటూ ఉండడంతో ప్రభుత్వ రంగ సంస్కరణలు
ప్రవేశ పెట్టడంతో పెద్ద సంఖ్యలో పిఎస్‌యులు మూతబడానికి దారి తీసింది. ఆ తర్వాత
దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం విదేశీ పెట్టుబడులకు భారత ఆర్థిక వ్యవస్థ
ద్వారాలు తెరుచుకుంటున్న సమయంలో భారతీయ, విదేశీ కంపెనీల మధ్య
కేవలం ఒక ఏడాదిలోనే పలు జాయింట్ వెంచర్లు ఏర్పాటయ్యాయి. అయిత ఆ తర్వాత అవి ఆశించిన
ఫలితాలు అందించడంలో విఫలం కావడంతో ఐదేళ్లలోపే అవి విడిపోవడం మొదలయింది.
జాయింట్ వెంచర్ల
ద్వారా ఒకటి ఒకటి కలిపితే మూడుగా అవ్వాలన్న భాగస్వామ్యాల లక్షం. అయితే చాలా
సందర్భాలలో రెండింటి కన్నా తక్కువగా నెరవేరడం జరిగింది. దీనికి కారణం‘సాంస్కృతిక’
సమస్య. సమగ్రమైన ఉమ్మడి ఆలోచనా విధానం, జాయింట్ వెంచర్లకు
సంబంధించిన ఆర్థిక విలువలకు మించి ముందుకు వెళ్లడం, భాగస్వాములకు సంబంధించిన సాంస్కృతిక విలువలకు సరితూగడం లాంటివి అప్పట్లో
వాటిలో మృగ్యమయ్యాయి. అలా భారత దేశంలో కొన్ని మినహాయించి జాయింట్ వెంచర్ల నిర్వహణ
అత్యంత క్లిష్ట సాధ్యమని రుజువైంది. ఈ అనుభవం నేపథ్యంలో ఇతర దేశాల మాదిరిగానే భారత
దేశంలోకూడా ‘పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం’ ఆలోచన రూపుదిద్దుకొని క్రమంగా బలపడుతూ
వస్తోంది. లాభాపేక్ష లేని ప్రైవేటు రంగంతో ప్రభుత్వం పిపిపి రూపంలో చేతులు కలపడం
వల్ల ఈక్విటీ,
సామర్థం, జవాబుదారీతనం, నాణ్యత,
వ్యవస్థ అందుబాటులోకి రావడం మెరుగుపడతాయనే భావన కలిగింది. ఈ
విధానాన్ని సమర్థించే వారు సైతం పిపిపి విధానం వల్ల వనరులు, టెక్నాలజీ,
నైపుణ్యం మెనేజ్‌మెంట్ విధానాలు, వ్యయ సామర్థం తదితర రూపాల్లో ఒక దాని నుంచి మరొకటి లాభపడతాయని వాదిస్తున్నారు.
పబ్లిక్ ప్రైవేటు
భాగస్వామ్యం అనేది చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలలో అమలవుతున్న విధానమే. ఈ
విధానంలో ప్రభుత్వ (పబ్లిక్) సేవలకు అవసరమైన నిధులను ప్రభుత్వం పూర్తిగాని, పాక్షికంగాని సమకూర్చి ప్రభుత్వం, ఒకటి లేదా అంతకు మించిన
స్వచ్ఛంద సంస్థలు లేదా ప్రైవేటు రంగ భాగస్వామ్యం ద్వారా ఇవి నిర్వహించబడతాయి. సామాజిక
బాధ్యతలో భాగంగా ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలతో పాటుగా మరికొన్ని కార్పొరేట్ సంస్థలు
భారత్‌తో సహా చాలా ప్రజాస్వామిక, అభివృద్ధి చెందుతున్న
దేశాలలో పౌర సేవలను అందిస్తున్నాయి. వాటిలో కొన్ని సంస్థలు నిబద్ధతతో, సామర్థంతో ఈ సేవలు అందించడాన్ని చూసిన ప్రభుత్వం సంప్రదాయంగా తామందిస్తున్న, ప్రభుత్వ కార్యకలాపాలుగా భావిస్తున్న సేవలను అందించడంలో వాటికి మరింత
భాగస్వామ్యం కల్పించడానికి సిద్ధమయ్యేలా చేసింది. దీనితో పౌర సేవలను అందించాల్సిన
ప్రభుత్వం పాత్ర ఒక ప్రైవేటు స్వచ్ఛంద సంస్థతో ఒక అర్థవంతమైన వ్యవస్థ ద్వారా
చేతులు కలపడం ద్వారా ఆ సేవలను అందించడానికి మారింది.
అలాంటి ఏర్పాట్లనే
ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలు (పిపిపి) గా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ
సేవలను అందించే బాధ్యత ఇప్పటికీ ప్రభుత్వం పైనే ఉంది. స్వచ్ఛంద సంస్థ (ఎన్‌జిఒ)
లేదా అలాంటి సంస్థ మొదట్లో మౌలిక సదుపాయాలు, నాయకత్వం, టెక్నాలజీ అభివృద్ధి చేయడంలో పెట్టుబడి పెట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని
సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా సంబంధిత సేవలను అందించడం జరుగుతుంది. దీనివల్ల
ప్రభుత్వంపై అదనంగా ఎలాంటి ఆర్థిక భారం పడడం జరుగదు. ప్రభుత్వం దరిమిలా ప్రధాన
సేవలను అందించే బాధ్యతను తన వద్దనే ఉంచుకొంటూనే సంబంధిత సేవకు బడ్జెట్‌లో
కేటాయించిన పెట్టుబడి,
నిర్వహణ వ్యయం పరిమితిలోనే పిపిపి సాయమందించడం ద్వారా
దాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ప్రభుత్వం ప్రైవేటు సంస్థల మధ్య కుదిరే ఒప్పందాలు
అవగాహన ఒప్పందం (మెమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్) లేదా పిపిపి ఒప్పందం రూపంలో
దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక ఒప్పందాలకు లోబడి ఉంటాయి. ఈ ఒప్పందాల్లో ఇరుపక్షాలు
పాటించాల్సిన స్థూల విధి విధానాలను నిర్దేశించి ఉంటాయి.
పబ్లిక్ ప్రైవేటు
భాగస్వామ్యానికి సాధికారికత కల్పించడానికి ఈ అవగాహన ఒప్పందాలు తప్పని సరి. అన్ని
పిపిపిలు కూడా ప్రభుత్వం (పబ్లిక్) ముఖ్యమైన పాత్రను, సేవ కార్యకలాపాల పరిధిని, ప్రాధాన్యతను, లక్షాలను,
ఫలితాన్ని నిర్దేశించేవిగా ఉండి ఆ సేవలను అందించే నిర్వహణ
స్వేచ్ఛను దాని ప్రైవేటు భాగస్వామికి ఇస్తుంది. పిపిపిలు డిజైన్, నిర్మాణ,
నిర్వహణ లేదా బిల్‌ఓన్ ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ ్డ( బిఒటి)
లాంటి చాలా రూపాల్లో ఉంటాయి. అయితే ప్రభుత్వ లక్షాలు, ప్రాజెక్టు స్వరూపం,
ఆర్థిక వనరుల లభ్యత, ప్రైవేటు రంగ భాగస్వామి
తీసుకు వచ్చే నైపుణ్యం లాంటి వాటి ఆధారంగా ఎంచుకొనే రూపం ఉంటుంది. అంతేకాదు
భాగస్వామిగా ఉండే ప్రైవేటు రంగ సంస్థ విలువలు, లక్షాలు లాంటి వాటిపైన
కూడా అది ఆధారపడి ఉంటుంది. దాదాపు దేశ వ్యాప్తంగా పౌరులందరికీ ముఖ్యంగా అట్టడుగు
వర్గాల వారికి 108 అంబులెన్సు అందించడం లాంటి అత్యవసర సేవలను అందించడం లాంటి సామాజిక సేవా
కార్యకలాపాల్లో ఈ పిపిపిని విస్తృతంగా ఉపయోగించుకోవడం జరుగుతోంది. ఈ విధానాన్ని
మొట్టమొదటగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది.
సామాన్య పౌరుల
దృష్టిలో దాని అర్హతను మెరుగుపర్చడానికి భాగస్వామ్యాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో
జరిగే ప్రక్రియగా చేయడం అవసరం. అందరి దృష్టిలో ఎలాంటి అనుమానాలు, అపోహలు రాకుండా చూడడం కోసం బాధ్యతల స్పష్టంగా నిర్వచించడం అలాగే బహిరంగ
ప్రక్రియ,
పకడ్బందీ ప్రణాళిక ఉండడం కూడా చాలా ముఖ్యం. అందువల్ల
భాగస్వామ్యంలో అధికారాల సంబంధాలను కూడా అర్థం చేసుకోవడం అత్యవసరం. అయితే పిపిపి
అంటే ఆ రంగాన్ని ప్రైవేటీకరించడం అని కాదు. భాగస్వామ్యమంటే ప్రభుత్వ వనరులను
తక్కువగా కేటాయించడం లేదా ప్రభుత్వ బాధ్యతను తగ్గించడం అని అర్థం కాదు. ప్రభుత్వ
సేవలను అందించడానికి అది ఒక మార్గం మాత్రమే. అయితే ఈ పిపిపి విధానం విజయవంతం
కావడమనేది అవగాహన ఒప్పందంలోని నియమ నిబంధనలకు స్ఫూర్తికి సంబంధిత రాష్ట్ర
ప్రభుత్వాలతోపాటు ప్రైవేటు భాగస్వామి పూర్తిగా కట్టుబడి సన్నద్ధతతో పని చేయడంపై
ఆధారపడి ఉంటుంది. లేని పక్షంలో నష్టపోయేది పేద పౌరులే. అప్పుడు మాత్రమే అది అవగాహన
ఒప్పందం ద్వారా పిపిపికి సాధికారికత కల్పించడంగా చెప్పబడుతుంది.
No comments:
Post a Comment