Thursday, July 4, 2019

108 అంబులెన్స్ సేవలతో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయానుబంధం : వనం జ్వాలా నరసింహారావు


108 అంబులెన్స్ సేవలతో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయానుబంధం
వనం జ్వాలా నరసింహారావు, ఇఎంఆర్ఐ మాజీ కన్సల్టెంట్
సూర్య దినపత్రిక (05-07-2019)
భారత దేశ చరిత్రలో, గత డెబ్బైరెండు సంవత్సరాలలో తీసుకున్న విధాన నిర్ణయాలలో, కీలకమైందిగా "లాభాపేక్ష రహిత ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం" భావించవచ్చు. ఆ ప్రక్రియను ఆరోగ్య వైద్య రంగంలో "రాజీవ్ ఆరోగ్య శ్రీ" పథకంగా అప్పటి ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టి, యావత్ భారతదేశానికి మార్గదర్శకంగా మలిచిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిది. ఆ గొడుగు కింద అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న 108 అత్యవసర సహాయ సేవలు రాజశేఖరరెడ్డికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. 2007-2008 సంవత్సరంలో అప్పటి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ అధ్యయనంలో "కరుణామయి, కారుణ్య దేవతగా" వర్ణించబడిన" 108 అంబులెన్స్-అత్యవసర సహాయ సేవలతో రాజశేఖర రెడ్డికి ఉన్న అనుబంధం, ఆ సంస్థలో కన్సల్టెంట్-లీడ్ పార్టనర్ గా పనిచేసిన వ్యక్తిగా ఎన్ని విధాలుగానో నేను గుర్తు చేసుకోవచ్చు.

జనవరి 8, 2009 రోజు నాకింకా జ్ఞాపకముంది. ఆ సమీక్షా సమావేశానికి మా సీయీవోతో కలిసి ఎప్పటిలాగే నేనూ వెళ్లాను. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆ రోజున అన్న ప్రతి మాటా-ఇచ్చిన భరోసా పదే-పదే జ్ఞప్తికొస్తూనే వున్నాయి. ఆ క్రితం రోజున ఇఎంఆర్ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు భైర్రాజు రామలింగ రాజు, సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో జైలుకెళ్లాల్సి వచ్చింది. తక్షణమే 24 గంటల వ్యవధిలో, వైద్య-ఆరోగ్య శాఖ అధికారుల సమక్షంలో, అప్పటి ఆర్థిక మంత్రి (ఆ తరువాత ముఖ్యమంత్రి) రోశయ్య హాజరుకాగా, రాజశేఖరరెడ్డి, ఇఎమ్ఆర్ఐ అధికారులను పిలిపించి 108 అత్యవసర సహాయ సేవలందించే విషయంలో నిశితంగా సమీక్షించారు. తప్పులెంచడానికి గాని, మమ్మల్ని మందలించడానికి గాని జరిపిన సమీక్ష కాదది. కేవలం సంస్థను ఆదుకోవడానికే!  

మిన్ను విరిగి మీద పడ్డా-ఎటువంటి పరిస్థితులెదురైనా ఆ సేవలు ఆగిపోకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలను అటు ప్రభుత్వాధికారులకు-ఇటు మాకూ ఇచ్చారాయన. అవసరమైతే, ప్రభుత్వం అప్పటివరకూ భరిస్తున్న 95% నిర్వహణ వ్యయాన్ని నూటికి నూరు శాతానికి పెంచడానికి సిద్ధమేనన్నారు. యాజమాన్య  వాటాగా (ప్రయివేట్ భాగస్వామ్యంగా) అప్పటివరకూ ఇఎమ్ఆర్ఐ భరిస్తున్న ఖర్చులను కూడా, తప్పదను కుంటే ప్రభుత్వమే సమకూరుస్తుందని హామీ ఇచ్చారాయన. అయితే అప్పట్లో ఆర్థిక మంత్రిగా వున్న రోశయ్య, పూర్తిగా ప్రభుత్వమే భరించడమంటే, అది ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకు విరుద్ధమవుతుందని, విమర్శలకు దారితీస్తుందని సూచించారు.

ప్రయివేట్ భాగస్వామ్య వాటా ఖర్చు కింద తక్షణం ఎంత కావాల్సి వస్తుందని సీయీవో వెంకట్ ను అడిగారు ముఖ్యమంత్రి. జవాబుగా ఆయన అయిదు కోట్లన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారన్న మాటలు నిజంగా ఆయన గొప్పతనానికి నిదర్శనం అనాలి. "రోశయ్య గారూ, పోనీ ఒక పని చేద్దాం. ప్రభుత్వ పరంగా ఇవ్వడం విధానానికి విరుద్ధమన్న విమర్శ వస్తుందని మీరు భావిస్తే, మనమే ఎవరన్నా తెలిసినవాళ్ల ద్వారా ఇఎమ్ఆర్ఐకి అవసరమైన ఆ అయిదు కోట్ల రూపాయలు ఏర్పాటు చేద్దాం" అన్నారు. ఎంత మంచి మనసాయనదో ఆ మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు.

2009 నాటి ఎన్నికల రణరంగంలో తలమునకై వున్నా, ఎప్పటికప్పుడు, 108 అత్యవసర సహాయ సేవలందించే సంగతి మరిచిపోలేదాయన. 108 సేవలు తమ పార్టీ గెలుపుకు కారణమయ్యాయని, 108-104 సేవలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశానని కూడా చెప్పారప్పుడు. బహుశా ప్రపంచ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా, అత్యవసర సహాయ సేవలకు ప్రత్యేకంగా ఒక మంత్రివర్గ శాఖను ఏర్పాటు చేయడం ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ర్ట్రంలోనే జరిగిందనాలి.

స్వర్గీయ రాజశేఖర రెడ్డి మొదటి సారి 2004లో అధికారంలోకి రావడంతోనే అత్యవసర సహాయసేవల అమలు కార్యరూపం దాల్చడం మొదలైంది. ఆరోగ్య-వైద్య-అగ్నిమాపకదళ సంబంధిత అత్యవసర సహాయ సేవలను అందించేందుకు నెలకొల్పిన ఇఎమ్ఆర్ఐ ఏప్రియల్ 2, 2005 , నాటి  ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సమక్షంలో, ప్రభుత్వంతో మొట్టమొదటి "అవగాహనా ఒప్పందం" కుదుర్చుకుంది. ఆగస్ట్ 15, 2005 న హైదరాబాద్ లో అంబులెన్సుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి, అప్పటి ఆరోగ్య-ఆర్థిక శాఖల మంత్రి (ఆ తర్వాత ముఖ్యమంత్రి) రోశయ్య వచ్చారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా ఆరంభమైన సేవలను, వరుసగా, తిరుపతి-విశాఖపట్నం-విజయవాడ-వరంగల్ పట్టణాలలో కూడా ప్రారంభించింది ఇఎమ్ఆర్ఐ ఆ క్రమంలో. దరిమిలా అత్యవసర సహాయ సేవలను గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించడానికి జనవరి 26, 2007 న రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం జరిగింది.  

ఆగస్ట్ 14, 2007 , ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో నిర్వహణ వ్యయం విషయం చర్చకొచ్చింది. 108-అత్యవసర సహాయ సేవలందించడానికి ఇఎమ్ఆర్ఐ కి, "ప్రత్యక్ష నిర్వహణ వ్యయం" కింద 95% వరకు ప్రభుత్వం భరించడానికి అంగీకరించిందని, యాజమాన్య పరమైన వ్యయాన్ని సంస్థ భరించాల్సి వుంటుందని చెప్పారు. అత్యవసర సహాయ సేవలను "రాజీవ్ ఆరోగ్య శ్రీ" పథకం గొడుకు కిందకు తేవాలన్న నిర్ణయం కూడా ఆ రోజునే తీసుకున్నారు రాజశేఖర రెడ్డి. ఆ తరువాత రాజీవ్ ఆరోగ్య శ్రీ సేవలను జాతికి అంకితం చేసినప్పుడు హోటల్ తాజ్ కృష్ణాలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల కలాం అధ్యక్ష్యతన జరిగిన సమావేశంలో పాల్గొన్న నాకు అలనాటి రాజశేఖర్ రెడ్డి ఉపన్యాసం ఇంకా గుర్తుంది.
   

డిసెంబర్ 18, 2007 న ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మరో సమీక్షా సమావేశంలో ఇఎమ్ఆర్ఐ ఆధ్వర్యంలో అమలవుతున్న అత్యవసర సహాయ సేవల ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం సూత్రప్రాయంగా మరో నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి కట్టుబడ్డ ప్రభుత్వం, సంబంధిత అధికారులు, అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి సంభాని చంద్రశేఖర్, దరిమిలా తొలుత 150 అంబులెన్సులు, మలి విడతగా మరో 150 అంబులెన్సులు, మొత్తం 802 అంబులెన్సులు సమకూర్చారు.  

రెండో విడత అధికారం చేపట్టే నేపధ్యంలో, మే నెల 25, 2009న రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చూడడానికి రాజ్ భవన్ కు వెళ్ళాను. ప్రమాణ స్వీకారం అయింతర్వాత సీఎం కార్యదర్శి సుబ్రహ్మణ్యం గారి దగ్గర్నుంచి మర్నాడు జరగబోయే ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం గురించి ఫోన్ వచ్చింది. మర్నాడు ఉదయం (మే నెల 26, 2009) పదకొండు గంటలకు సమావేశం జరిగింది. ఆరోగ్య-వైద్య శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శి జె. సత్యనారాయణ, కమీషనర్ అనిల్ పునీఠ, 108-104 సేవల ప్రభుత్వ సలహాదారు పీ.కె.అగర్వాల్, (ఆర్థిక శాఖ) సీనియర్ మంత్రి శ్రీ రోశయ్య, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఆ సమావేశంలో వున్నారు.

సంస్థా పరంగా, యాజమాన్య నిర్వహణ పరంగా ఇఎమ్ఆర్ఐ ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందులను అర్థం చేసుకున్న రాజశేఖర రెడ్డి జీ.వీ.కె సంస్థల అధ్యక్షుడికి స్వయంగా ఫోన్ చేసి, అనునయంగా-ఆప్యాయంగా మాట్లాడుతూ, ఇఎమ్ఆర్ఐకి నిధులను సమకూర్చవలసిన ఆవశ్యకతను వివరించిన పద్ధతి నిజంగా శ్లాఘనీయం. ఆయన రాజనీతిజ్ఞతకు నిదర్శనం. "అన్నా... ఇంతకు ముందే నీతో చెప్పాను గదా! ఎన్నికల హడావిడిలో మరో మారు చెప్పడం కుదరలేదు. ఎవరో మహారాష్ర్ట్ర నుంచి పిరమిల్ అనే సంస్థ యాజమాన్యం ఇక్కడకు వచ్చి, మన  108 అత్యవసర సహాయ సేవల నిర్వహణలో ఎందుకు  ప్రయివేట్ భాగస్వామి కావాలి? మీరందరూ లేరా? మా ప్రభుత్వానికి అత్యంత ఆదరణీయమైన ఈ పథకానికి యాజమాన్య పరంగాను, ప్రయివేట్ భాగస్వామ్య పరంగాను అవసరమైన నిధులను మీరెందుకు సమకూర్చకూడదు? సమకూర్చమని కోరుతున్నాను. ప్రభుత్వం ఎలాగూ 95% మేర నిర్వహణ పరమైన నిధులను సమకూరుస్తుంది కదా !" అని అన్నారాయన తో.

జీవీకే ఒప్పుకోవడంతో ఇఎమ్ఆర్ఐ దరిమిలా జీవీకే ఇఎమ్ఆర్ఐగా మార్పు చెందడం జరిగింది. రాజశేఖర రెడ్డి సూచనమేరకు, బోర్డ్ సభ్యుల కోరిక మేరకు, ఇఎమ్ఆర్ఐ చైర్మన్ గా జీవీకే ఆ రోజునే పదవీ బాధ్యతలు స్వీకరించారు. సమావేశం పూర్వ-ఉత్తర రంగాల్లో అత్యవసర సహాయ సేవల విషయంలో విలువైన సూచనలు చేశారు. అందులో ఎన్ని అమలుకు నోచుకున్నయో భగవంతుడికే తెలుసు.  108 అత్యవసర సహాయ సేవలను అమలుపర్చే ఇఎంఆర్ఐ సంస్థలో పనిచేస్తున్న సందర్భంగా రాజశేఖర్ రెడ్డిని చాలా సార్లు కలుసుకున్నాను. ప్రతి సమావేశంలోనూ, ఆయన వ్యక్తిత్వం, అంకిత భావం, ఆత్మీయానుబంధం ఆయన చెప్పే ప్రతి మాటలోనూ ప్రస్ఫుటంగా కనిపించేది. ఆ సమావేశాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల, అధికారులకిచ్చిన ఆదేశాల వల్ల, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, ఆ రాష్ట్రంలో అమలవుతున్న పథకం స్ఫూర్తితో ఇతర రాష్ట్రాలలోనూ లక్షల ప్రాణాలు కాపాడబడ్డాయి. భవిష్యత్ లో లక్షలాది ప్రాణాలను రక్షించడానికి దోహద పడ్డాయి. యావత్ భారత దేశానికే ఆదర్శ ప్రాయంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో ఆరంభమయిన 108 అత్యవసర సహాయ సేవలు, ప్రస్తుతం పదిహేను రాష్ట్రాలకు పాకాయి. ఆయన ఆశయానికి అనుగుణంగా ఆ సేవలను ఉభయ తెలుగు రాష్ట్రాలలో నడపడమే రాజశేఖర్ రెడ్డికి నిజమైన నివాళి.  (జులై 8, 2019 న వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి సందర్భంగా)

1 comment:

  1. "ఆరోగ్యశ్రీ" పధక రూపకల్పనలో వై.ఎస్. కు ఆంతరంగికుడు, వై.ఎస్. ప్రభుత్వ సలహాదారుడు అయిన కీ.శే. డి ఎ సోమయాజుల పాత్ర కూడా ఉందా చెప్పగలరు.

    ReplyDelete