Wednesday, July 10, 2019

భారత్ ఆర్ధిక స్వప్నం ఫలించేనా? : వనం జ్వాలా నరసింహారావు


భారత్ ఆర్ధిక స్వప్నం ఫలించేనా?
వనం జ్వాలా నరసింహారావు
తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి
ఆంధ్రజ్యోతి దినపత్రిక (11-07-2019)
పార్లమెంటుకు నిర్మలా సీతారామన్ సమర్పించిన 2019-20 కేంద్ర బడ్జెట్లో ఆమె ప్రతిపాదించిన కొన్ని సానుకూల చర్యల పర్యవసానంగా భారత్ ఆర్ధిక వ్యవస్థ 2024 సంవత్సరం కల్లా ఐదు అమెరికన్ ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. నిర్మలా సీతారామన్ ప్రతిపాదనలన్నీ అవసరమే ఐనప్పటికీ, రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా ప్రధాన నిశ్చితార్థాల ఫాక్టర్ (ఇష్యూ) మార్కెట్లయిన భూమి, కార్మికులు, ఋణం, వ్యవసాయం, అలాగే, సేవాకార్యక్రమాలైన విద్య, వైద్యం తత్సంభందిత రంగాలలో కావాల్సిన మౌలిక సంస్కరణలు సుస్పష్టంగా కనపడని పరిస్థితి నెలకొంది. ఆర్ధిక అంకగణిత లెక్కలు, వృద్ధి అంచనాలు ఆశాజనకంగా కనిపించేట్లు కేంద్రం జాగ్రత్త పడ్డప్పటికీ, తెలంగాణా లాంటి నూతన, కొత్తగా ఏర్పడిన డైనమిక్ రాష్ట్రాలను ప్రోత్సహించి, తద్వారా దేశాభివృద్ధిని సాధించి, అసలు-సిసలైన సహకార సమాఖ్య స్ఫూర్తికి పునరంకితం అయితే బహుశా బాగుండేదేమో! ఇలా జరిగిన దాఖలాలు బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా కనిపించలేదనే అనాలి.

భారత రైతు విపరీతమైన ఒత్తిడికి గురై, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా కష్టాల కడలిలో డోలాయమాన స్థితిలో వున్న నేపధ్యంలో, తెలంగాణ ప్రభుత్వం దేశానికే మార్గదర్శినిగా భావించాల్సిన “రైతుబంధు” పథకాన్ని ప్రవేశపెట్టి, అమలు చేసి, తద్వారా 52 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరేలా ఎకరానికి రెండు పంటలకు (జూన్ నెల ముందు ఖరీఫ్ కు, నవంబర్ నెల ముందు రబీ పంటకు) కలిపి రు. 10,000 ల వ్యవసాయ పెట్టుబడిని సమకూర్చింది. జాతీయ-అంతర్జాతీయ ప్రశంసలను అందుకున్నఈ వినూత్న పథకం రూపకల్పన విషయంలోనూ, అమలు విషయంలోనూ, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం కంటే ఎన్నో రెట్లు మేలయిన పథకం. వాస్తవానికి రైతుబంధు పథకం నమూనాలో పీఎం కిసాన్ సమ్మాన్ కూడా మరికాస్త మెరుగుపరచి, రైతుకు అర్థవంతమైన రీతిలో వ్యవసాయ పెట్టుబడిని అందించి, వారి ఆదాయాన్ని పెంచితే బాగుండేది. దీనికి సంబంధించిన ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం విచారకరం. 

10,000 రైతు ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు చేయడం ఆహ్వానించాల్సిన అంశమే. అయితే మార్కెటింగ్ పరంగా కావాల్సిందల్లా, కేంద్ర సంస్థల ద్వారా ధాన్యం సేకరణను మరింత పకడ్బందీగా విస్తరించి, మరిన్ని పంటలను సేకరణ జాబితాలో చేర్చి, కనీస మద్దతు ధరను పటిష్టంగా అమలు చేయడమే. పెద్ద ఎత్తున శీతల గిడ్డంగుల, ఇతర గిడ్డంగుల మౌలిక వసతులను సమకూర్చినట్లయితే గ్రామీణ ప్రాంతాలలో మూలధన పెట్టుబడులు విరివిగా విస్తరించే వీలు కలుగుతుంది. ఇది జరగలేదు. తెలంగాణాలో నాబార్డ్ సమకూర్చిన గిడ్డంగుల మౌలిక సదుపాయాల నిధులు పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని, నాలుగు సంవత్సరాలలో గిడ్డంగుల సామర్థ్యాన్ని ఎనిమిది రెట్లు పెంచింది ప్రభుత్వం. దీన్ని ఇతర రాష్ట్రాలలో కూడా అవలంభిస్తే బాగుటుందని బడ్జెట్లో చెప్పాల్సింది.

   2024 సంవత్సరానికల్లా అన్ని గ్రామీణ ఆవాసాలకు నల్లాల ద్వారా తాగునీటి సౌకర్యం కలిగించాలన్న ఆలోచనతో చేపట్టిన బృహత్పథకం అమలుకు “జల శక్తి మంత్రిత్వ శాఖ” ను ఏర్పాటు చేస్తామని చెప్పడం ఆహ్వానించాల్సిన పరిణామం. ప్రారంభ దశలో దేశవ్యాప్తంగా 256 జిల్లాలలో, 1592 బ్లాకుల్లో “జల్ జీవన్ మిషన్” పేరుతో అమలు కానున్నదీ పథకం. ఈ నేపధ్యంలో తెలంగాణాలో అమలవుతున్న వినూత్నమైన, ఆబాలగోపాలం ప్రశంసలను అందుకున్న మిషన్ భగీరథ పథకం ప్రస్తావన తేవాల్సింది బడ్జెట్లో. వాస్తవానికి, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ఆనతి కాలంలోనే శ్రీకారం చుట్టిన మిషన్ భగీరథ ద్వారా నల్లాల ద్వారా శుద్ధిచేసిన తాగునీటిని 24,000 గ్రామీణ నివాసాలలో, 80 లక్షల గృహాలకు సరఫరా అవుతున్నది. ఈ పథకానికి రు. 42,000 కోట్ల వ్యయం అవుతున్నది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం యావత్ భారత దేశానికి తాగునీటిని నల్లాల ద్వారా అందించాలన్న ధ్యేయంతో జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రవేశ పెట్తున్నట్లయితే బడ్జెట్లో ప్రతిపాదించిన రు. 10,000 కోట్లు ఏ మూలకూ సరిపోవు. అంతేకాకుండా నీతిఆయోగ్ సిఫార్సుల మేరకు మిషన్ భగీరథ పథకానికి ప్రోత్సాహకంగా విరివిగా నిధులను మంజూరు చేయాలి. ఈ పథకం అమలు ద్వారా దేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా వుండడమే కాకుండా నాయకత్వ దూరదృష్టి, రాష్ట్ర సామర్థ్యం ప్రస్ఫుటంగా కనబడుతున్నది.   

                 
జల్ శక్తి మంత్రాలయం చేపట్టబోయే మరో ముఖ్యమైన కార్యక్రమం వర్షపు నీటి పెంపకాన్ని, భూగర్భ జలాల రీచార్జింగ్ ను చేపట్టడం. ఈ విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన, ముందు వరసలో వుంది. మిషన్ కాకతీయ పథకం ద్వారా, మూడేళ్లలో 40,000 గొలుసుకట్టు చెరువుల పూడిక తీసి, పూర్తిగా పునరుద్ధరించింది. ఈ పథకానికి కూడా నీతి ఆయోగ్ నిధులివ్వమని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినప్పటికీ బడ్జెట్లో ఆ ప్రస్తావన లేకపోవడం విచారకరం.

మూడు కోట్లమంది చిరు వ్యాపారులకు, చిన్న దుకాణాదారులకు పెన్షన్ ప్రయోజనం కలిగించేందుకు ఉద్దేశించిన “ప్రధాన మంత్రి కర్మయోగి మాన్ ధాన్ యోజన” పథకం ఆహ్వానించదగ్గదే. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాల అమలుకు వృద్ధాప్య పించన్ల కింద నెలకు కేవలం రు. 200 మాత్రమే, అదీ కూడా తెలంగాణలో కేవలం 6.67 లక్షల మందికి మాత్రమే ఇవ్వాలన్న ప్రతిపాదన సమంజసం కాదు. ఈ మొత్తాన్ని పెంచాలి. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం తన సొంత వనరులతో వృద్ధాప్య పించన్ కింద నెలకు రు. 2016, దివ్యాంగులకు అదే పించన్ ను రు. 3016 ఇస్తున్నది. దీనివల్ల 47.88 లక్షల మందికి ప్రయోజనం కలుగుతున్నది.    
  
మత్స్యకారుల కోసం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం తీసుకురావడం ఆహ్వానించదగ్గ విషయమే. మంచినీటి చేపల పెంపకం ద్వారా ఉత్పత్తి, ఉత్పాదకత గణనీయంగా పెంచడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి చర్యాలనే చేపట్టింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగిన తరువాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పెద్ద-పెద్ద రిజర్వాయర్లు రూపుదిద్దుకుంటాయి. వీటిలో చేపల పెంపకం, ఉత్పత్తి విరివిగా పెరుగుతుంది. ఈ రంగంలో తెలంగాణ ప్రభుత్వం అవలంభించి, అమలు చేసిన మంచి అభ్యాసాలను దేశవ్యాప్తంగా చేపట్టడానికి బడ్జెట్లో ప్రస్తావన తెచ్చినట్లయితే బాగుండేది. అలా చేసినట్లయితే ఇతర రాష్ట్రాలలో అవలంభించడానికి ఆస్కారం వుండేది.

భారత జాతీయ రహదారుల అథారిటీని పునర్నిర్మాణం చేయడం, రైల్వేలలో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యాన్ని ప్రవేశ పెట్టడం, గాస్ గ్రిడ్లకు, నీటి గ్రిడ్లకు, ప్రాంతీయ విమానాశ్రయాలకు బ్లూ ప్రింట్ల రూపకల్పన ఆహ్వానించాల్సిన మరికొన్ని అంశాలు. అయితే, ఈ దిశగా పూర్తి లాభం చేకూరాలంటే, ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియలోని కొన్ని మౌలిక అంశాలను సృజించాలి. భూసేకరణ లాంటి ప్రక్రియలను సరళమైనవిగా, వేగవంతమైనవిగా చేయాలి. లేకపోతే, నిలిచిపోయిన ప్రాజెక్టులు విలువైన ఆర్ధిక వనరులను ఉపయోగంలోకి రాకుండా చేస్తాయి. ఈ సమస్యలను పరిగణలోకి తీసుకోవాలి. తెలంగాణలో ప్రభుత్వం భూసేకరణను సరళీకృతం, వేగవంతం చేయడానికి భూసేకరణ చట్టానికి రాష్ట్రావసరాలకు అనుగుణంగా సవరణలు చేసింది. ప్రాజెక్టు కింద భూములు, ఇతర సంపద కోల్పోయిన నిర్వాసితులకు మెరుగైన పరిహారాన్ని ఇచ్చింది. మానవీయ కోణంలో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల, దాని అమలు వల్ల, ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి వీలైంది. ఫలితంగా, పన్ను కట్టేవారి వేలాది కోట్ల రూపాయలకు రక్షణ దొరికింది. ఇది కూడా ఇతర రాష్ట్రాలలో అవలంభించదానికి వీలుగా బడ్జెట్లో ప్రస్తావించినట్లయితే బాగుండేది.

పీఎం ఆవాస్ యోజన కింద 1.95 కోట్ల ఇళ్లను సమకూర్చడం మంచిదే. కాకపోతే కేవలం కుల గణన డాటా నుండి మాత్రమే లబ్దిదారుల ఎంపిక జరగాలని నిబంధన విధించడం వల్ల ఈ నిధుల వాడకానికి రాష్ట్రాలకు కొన్ని ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. ఆత్మగౌరవ ప్రతీకగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రెండు పడక గదుల నిర్మాణానికి అనువుగా వుండేట్లు ఈ నిబంధనను సరళించినట్లయితే బాగుంటుంది.           
     
పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం చాలా పెద్ద ఎత్తున వుంది. 25% కార్పోరేట్ పన్ను తగ్గింపు కేవలం రు. 400 కోట్ల టర్నోవర్ వున్న కంపెనీలకు మాత్రమే కాకుండా అన్నిటికీ వర్తింప చేస్తే బాగుండేది. రు. 2 కోట్లు, రు. 5 కోట్ల పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం వున్న వ్యక్తులకు మాత్రమే ఆదాయపు పన్ను పెంచడం అనేది సింబాలిక్ గా కనిపిస్తున్నది. ఉద్యోగాల కల్పనలో కీలక పాత్ర పోషించే ఈ వ్యాపారస్తులకు ఇదొక విధంగా ఎదురుదెబ్బే. స్టార్ట్-అప్ లకు ప్రత్యేక (పన్ను) లెక్కింపులు, ముందుగా నింపిన ఆదాయపు పన్ను ఫారాలు, ముఖరహిత అంచనాలు, పౌరులకు పన్ను చెల్లింపుల సరళీకృతం, పారదర్శకం లాంటివి కూడా ఆహ్వానించాల్సిన అంశాలే. పాన్ కార్డ్, ఆధార కార్డుల అనుసంధానం, ఏంజల్ టాక్స్ తొలగింపు కూడా మంచి పరిణామాలే.     

చాలా వస్తువులకు సంబంధించి సుంకాల పెంపుదల ఆందోళన కలిగిస్తున్న అంశం. భారత దేశం 8% జీడీపీ వృద్ధి రేట్ దిశగా పయనించాలంటే, దేశ పారిశ్రామిక రంగం అంతర్జాతీయంగా పోటీ రూపేణా కాని, నాణ్యత రూపేణా కాని, నిలదొక్కుకోవాలి. అప్పుడే ఎగుమతులు పెరగడానికి ఆస్కారం వుంటుంది. “మేక్-ఇన్-ఇండియా” సాధించాలంటే ఇదొక్కటే మార్గం. సుంకాల పెరుగుదల వల్ల ట్రేడింగ్ భాగస్వాములు ప్రతీకార పెరుగుదలకు శ్రీకారం చుట్తే, భారత వినియోగదారుడికి చివరకు లభించేది నాణ్యత లోపించిన వస్తువులే. ప్రపంచ సరఫరా విఫణిలో చైనా ఖాళీ చేసిన స్థానాన్ని భారత దేశం భర్తీ చేయాలంటే, సుంకాల పెంపుదల తిరోగమన చర్యగా, ఒక ప్రతిబంధకంగా మారుతుంది.

విదేశీ కరెన్సీలో ఋణాల సేకరణ మంచిదే అయినప్పటికీ, విదేశీ మారక ద్రవ్యం తెచ్చుకోవడంలో వున్న ప్రమాదాన్ని (రిస్క్) తగిన వ్యూహాల ద్వారా, ఎగవేత సాధనాలను సరైన మార్గంలో ఉపయోగించడం ద్వారా మానేజ్ చేయగలగాలి. దీనివల్ల దేశీయ నిధులకు సంబంధించి రద్దీ, పోటీ తగ్గడమే కాకుండా, ప్రయివేట్ రంగానికి బాంకింగ్ వ్యవస్థ ద్వారా క్రెడిట్ లభ్యత పెరిగి, ఆర్ధిక పెరుగుదలకు దారితీస్తుంది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ కు రూపాయి పెంచడం ద్వారా కేంద్ర వనరులలో కొంత పెరుగుదల వుండవచ్చు కాని, వినియోగదారుడి నడ్డి విరిచినట్లే. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు లేకపోలేదు.   
    
అమెరికా కరెన్సీలో ఐదు ట్రిలియన్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్థ దిశగా భారతదేశం పయనిస్తే అది అందరు భారతీయులకు గర్వకారణమే అనడంలో సందేహం లేదు. కాకపోతే అలా ఆ స్థాయికి ఎదగడానికి అవసరమైన వ్యూహం బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా, స్పష్టంగా కాకపోయినా, కనీసం నామ మాత్రంగానైనా ప్రస్తావించలేదు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. అయినా కోర్కె వెలిబుచ్చినందుకు మంత్రిగారికి అభినందనలు.  

No comments:

Post a Comment