సీతను విడిచి ఎందుకు వచ్చావని లక్ష్మణుడిని అడిగిన రాముడు
శ్రీమదాంధ్ర
వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-68
వనం జ్వాలా
నరసింహారావు
ఆంధ్రభూమి
ఆదివారం సంచిక (07-07-2019)
పర్ణశాలకు వెళ్తున్న
శ్రీరాముడు తనను కలవడానికి వస్తున్న తమ్ముడు లక్ష్మణుడిని దారిలో చూసి శోకంతో
తపిస్తూ ఇలా అన్నాడు. “నువ్వు సీతను రక్షిస్తావని నమ్మి కదా సీతను ఒంటరిగా నీ
స్వాధీనంలో వుంచి నేనిలా వచ్చాను? నేను
కాపాడలేక నీకాపని అప్పచెప్పానా? ఆ
స్త్రీరత్నాన్ని అడవిలో ఒంటరిగా వదలిపెట్టి ఇక్కడేదో మునుగిపోయినట్లు ఆదరబాదరాగా
పరుగెత్తుకుంటూ వచ్చావు. నిన్ని చూసింది మొదలు నాకేదో భయంగా వుంది లక్ష్మణా.
వచ్చినవాడివి సీతను కూడా తీసుకుని రావచ్చుకదా?
ఆమె లేకుండా నువ్వు ఒక్కడివే రావడం దూరం నుండే చూసిన నాకు గుండె పగిలింది. ఎడమ
భుజం, ఎడమ కన్ను అదిరాయి. అయ్యో! కొంప మునిగింది కదా అనుకున్నాను”.
ఇలా రామచంద్రమూర్తి తనమీద నింద వేయడంతో,
దోషం ఆరోపించడంతో, ఆయన పడుతున్న దుఃఖబాధను గమనించి,
ఇంతకు పూర్వమే సీత మాట్లాడిన మాటలకే నొచ్చుకున్న లక్ష్మణుడు మరింత నొచ్చుకుని ఇలా
జవాబిచ్చాడు అన్నకు. “అన్నా! ఆ ధ్వని నీ గొంతుక ధ్వని అని మోసపోయి స్వతంత్రించి
నాకై నేను రాలేదు. ‘సీతా, లక్ష్మణా,
కావరే’ అనే ధ్వని అరణ్యంలో కలూగగా సీత విని భయపడి నన్ను పొమ్మని,
నీమీద ప్రేమవల్ల నన్ను బలవంతపెట్టింది. అలా తొందరపెట్టడంతో,
‘రాముడికి భయం లేదమ్మా....ఆయనకు అపాయం కలగచేసేవాడు లోకంలో
లేడమ్మా....అది రాముడి గొంతు కాదమ్మా....ఎవడో మాయలమారి పనది అమ్మా....రాముడు తనను
రక్షించమని మరొకరిని వేడుకుంటాడా?’ అని ఆమెకు
నమ్మకం కలిగేలా ఎంతో చెప్పాను. ‘వదినా,
ఎందుకమ్మా ఇంతగా భయపడతావు?
రామచంద్రుడికి రాక్షసుల వల్ల యుద్ధంలో భయం కలుగుతుందా?
ఇదేమిటమ్మా? ఆ గొంతు ఆయనదని నమ్మతగునా? అది ఆయన
గొంతు కాదని, రాక్షసుడే అలా అరిచాడు. అమ్మా తొందరపడకుండా నిబ్బరించుకో’ అని
చెప్పాను”.
“అన్నా! ఇంకా ఇలా అన్నాను.
‘రామచంద్రుడనగా ఏమని తలచావమ్మా?దేవతలనైనా
తన భుజబలంతో కాపాడగల ఆయన తనం ఉ రక్షించమని నిన్ను కోరుతాడా?
ఇది నిజమని నీవెలా నమ్ముతావమ్మా? ఎవడో,
ఏదో కారణంతో మా అన్న గొంతులాంటి గొంతుతో రక్షించమని అరిచాడు. ఆ ధ్వని మార్పు వింటే అది మా అన్నది
కాదని అర్థమవుతుంది. కాబట్టి తొందరపడవద్దు. శాంతించు. నువ్వు కూడా నీచ స్త్రీలాగా
దుఃఖపడవచ్చా? ప్రపంచంలో ఇంతవరకు పుట్టినవారిలో, ఇక
ముందు పుట్టబోయేవారిలో యుద్ధంలో రామచంద్రుడిని ఎదిరించి గెలవగలవారు లేరు. కాబట్టి
నీ మనస్సులో కలిగిన భయం వదలి నిశ్చింతగా వుండు. దేవతలందరూ ఏకమై వచ్చినా
రామచంద్రుడిని యుద్ధంలో జయించలేరు. ఇక ఈ నీచ రాక్షసులు ఏం చేయగలరు?’
అని నేను చెప్పగా మతిభ్రమ కలిగిన సీత ఇలా అంది. ‘నువ్వు నన్ను కోరి అన్న చావాలన్న
పాప చింతతో వున్నావు. నీ కోరిక కొనసాగుతుందా?
లక్ష్మణా! నీ అభిప్రాయం తెల్సింది. నువ్వు నాకు సీత లభించేట్లు చేస్తే నేను నీకు
సహాయం చేస్తానని నువ్వు, భరతుడు
అంగీకారానికి వచ్చారు. ఆ ఒడంబడిక తరువాతే నువ్వు రాముడి వెంట వచ్చావు. అలా కాకపొతే
తనను కాపాడమని అన్న అరిస్తే కాపాడడానికి పోని తమ్ముడు ఎవరైనా వుంటారా?
నువ్వు రహస్య వర్తనం కల పగవాడివి కాని, రాముడికి
తమ్ముడివి కాదు. ఎప్పుడు వీలవుతుందా, ఎప్పుడు
సీతను హరిస్తానా? అన్న ఆశతో నా కోసమే నా మగడి వెంట
వచ్చావు’. ఈ మాటలు వినగానే నా పెదవులు అదిరాయి. కళ్ళు ఎర్రగా అయ్యాయి. కోపం
పట్టలేక, అక్కడ వుండలేక ఆశ్రమం వదిలి వచ్చాను. అన్నా! వున్నా విషయం చెప్పాను.
“
లక్ష్మణుడు ఇలా చెప్పడంతో, రాముడు, “పాప
రహితుడా! నువ్వు సీతను విడిచి రావడం సరైన పనికాదు. ఇప్పుడేమనుకున్నా ఏం ప్రయోజనం?
స్త్రీలకు కోపం వస్తే ఏదో అంటారు. అందునా,
భర్తకు కీడు కలిగిందని భయంతో,
శోకంతో, పీడించబడ్డ వారి విషయం
చెప్పాల్నా? ఇవన్నీ నువ్వు ఆలోచించకుండా
సీత కోప్పడ్డదని నువ్వు కూడా కోపంతో నా శౌర్యం, నా
శక్తి తెలిసికూడా ఆడదాన్ని ఒంటరిగా అడవుల్లో వదిలి వచ్చావే?
ఏమనాలి నిన్ను? ఎదుటివారు కోప్పడితే నేనూ
కోపగించుకోవాలి అనుకున్నావే కాని దానివల్ల కలిగే అపాయాన్ని ఆలోచించలేదుకదా? ఆడది
నిన్ను కఠినంగా మాట్లాడిందని కోపగించి ఇలా రావడం తగునా?
స్త్రీజాతికిది సహజం. తిట్టిన తిట్టనీ....మనపని మనం చేసుకుందాం...అని సహించి ఊరక
వుండాల్సింది. నేను వచ్చిన తరువాత ఈ వృత్తాంతం అంతా చెప్పితే నేను విచారించేవాడిని
కదా? నేను భార్య మాటలు విని నిన్ను
సందేహించే వాడినని అనుకున్నావా? అలా
కాకుండా దూరంగా విడిచి రావడం మంచిదా? నా
ఆజ్ఞ జవదాటావుకదా?
తల్లితండ్రుల ఆజ్ఞలు పరస్పర విరుద్ధమైనప్పుడు నేనెలా ప్రవర్తించానో అనేది కూడా
ఆలోచించ లేదుకదా? జింక
శరీరంతో ఆశ్రమం నుండి నన్ను తీసుకువచ్చిన రాక్షసుడు, నేనొక
బాణం వేయగా, అది తగిలి జింక శరీరం వదిలి, రాక్షస
వేషంలో తీక్షణమైన నా బాణాల దెబ్బలను సహించలేక ప్రాణాలు కోల్పోతూ దూరంగా వినపడేట్లు
నా గొంతులాంటి గొంతుతో, నేనే
అరచినట్లు అరవగా అది విని నువ్వు సీతను విడిచి వచ్చావు”.
No comments:
Post a Comment