Thursday, November 21, 2013

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో ఛందః ప్రయోగాలు...బాల కాండ-11: వనం జ్వాలానరసింహారావు

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) 
రామాయణంలో ఛందః ప్రయోగాలు
బాల కాండ-11
వనం జ్వాలానరసింహారావు


మిధిలానగరానికి ప్రయాణం కొనసాగిస్తూ, విశ్వామిత్రుడు, శ్రీరామ లక్ష్మణులతో-ఋషీశ్వరులతో కలిసి, గంగ దాటి, ఉత్తరం వైపున్న ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ, ప్రాకారాలతో, కుల పర్వతాలను మించిన మేడల గుంపుల కాంతులతో, తియ్య మామిడి లాంటి ఫల వృక్షాలతో స్వర్గాన్నే మరిపిస్తున్న విషాల నగరంలోకి ప్రవేశించగానే, రాజకుమారుడైన రామచంద్రమూర్తి, మహాత్ముడైన విశ్వామిత్రుడితో, ఆ నగరాన్ని ఏలే రాజెవ్వరని-ఏ వంశం వాడని, అడిగాడు. సమాధానంగా మునీంద్రుడు ఆ కథంతా చెప్పాడు. 

పాలసముద్రం చిలికి-అందులోంచి పుట్టిన అమృతాన్ని భుజించినట్లైతే, తమకు మరణముండదని-ముసలితనం రాదని ఆలోచించి, మందర పర్వతాన్ని కవ్వంగా-వాసుకు తాడుగా, పాలసముద్రాన్ని చిలకడం మొదలెట్టారు దేవదానవులు. అలా వారు వేయి సంవత్సరాలు చిలకగా, ఆ రాపిడిని సహించలేక, వాసుకి విషాన్ని కక్కాడు. ఆ వేడికి కొండ రాళ్లు పగలడంతో పాటు, భయంకరమైన హాలాహలం రాక్షసులను, దేవతలను భస్మం చేయసాగింది. అంతులేని తాపాన్ని కలిగిస్తున్న హాలాహలాన్ని విష్ణువు చెప్పినట్లే మింగి, విషాన్ని కంఠంలో ధరించాడు. దేవతలు తిరిగి పాలసముద్రాన్ని చిలుకుతుండగా మందర పర్వతం పుటుక్కున మునిగింది సముద్రంలో. అది చూసిన దేవతలు, ప్రపంచాన్ని-ముఖ్యంగా తమను రక్షించే విష్ణుమూర్తిని, కొండ మునుగుతున్నదని-దాన్ని పైకెత్తి పట్టగల సమర్థుడు ఆయనేనని-ఆయనను సేవిస్తుండే వారు ఆపదల పాలవుతుంటే వూరకుండరాదని-ఆశ్రిత రక్షణ చేసి, తమను కాపాడమని ప్రార్థించారు. ఈ సందర్భంగా "మత్తకోకిలము" వృత్తంలో రాసారీపద్యాన్ని కవి.

మత్తకోకిలము:  ఆ హరించి విషంబు నిట్లు పురారి యేగిన, దేవతల్
మొహరించి మరిన్  మధింపఁ గ  మున్గెఁ గొండ పయోనిధిన్
 బాహి యందు నుతించి రంతటఁ బంకజాక్షుని నీజగ
 ద్వ్యూహరక్షకు నందు మాకును బూఁ ట వీవ  కదా హరీ ! -14

ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి. 

No comments:

Post a Comment