Friday, November 15, 2013

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో ఛందః ప్రయోగాలు..బాల కాండ-7: వనం జ్వాలానరసింహారావు

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) 

రామాయణంలో ఛందః ప్రయోగాలు

బాల కాండ-7

వనం జ్వాలానరసింహారావు



సుమంత్రుడి సలహా విన్న దశరథుడు, వశిష్ఠుడికి విషయాన్నంతా తెలియపరచి, ఆయన సూచన ప్రకారం ఋశ్యశృంగుడిని తన రాజ్యానికి తీసుకొచ్చేందుకు రోమపాదుడి దగ్గరకు పోతాడు. ఆయన పయనమై పోతున్న త్రోవను వర్ణిస్తూ "ప్రహరణకలిత" వృత్తంలో ఒక పద్యం రాసారు వాసు దాసుగారీవిధంగా:

ప్రహరణకలిత: వనములు  నదులున్  వరుసగఁ  గనుచున్
జనపతి  చనెఁ ది న్న నిపయనములన్
మునికులతిలకున్ మును  చని  కనెఁ  బా
వనశుచిరుచిన్  వరఋషి తనయున్-7

ఛందస్సు: "ప్రహరణకలిత" వృత్తానికి న-న-భ-న-వ గణాలుంటాయి. ఎనిమిదో అక్షరం యతి.
తాత్పర్యం: దారిలో నదులను-పర్వతాలను దాటుకుంటూ, రోమపాదుడి చంపా నగరానికి చేరుకుంటారు. వెళ్లిన వెంటనే, ముందుగా ఋశ్యశృంగుడి దర్శనం చేసుకుని, తర్వాత రోమపాదుడి వద్దకు వెళ్తాడు దశరథుడు.

సంతాన లాభం అనుగ్రహించమని దశరథుడు యజ్ఞం చేస్తున్న సమయంలో, అక్కడకు, గంధర్వులు-దేవతలు-సిద్ధులు-ఇతర దేవతలు, పరమ ఋషులు, తమ తమ హవిర్భావం కొరకై బ్రహ్మదేవుడితో కలిసి వచ్చారు. వచ్చిన వారంతా బ్రహ్మను చూసి, రావణాసురుడు తమను పెట్తున్న బాధలను ఆయనకు మొర పెట్టుకుంటారు. దశరథుడి అభీష్ఠాన్ని నెరవేర్చేందుకు, పరమ కరుణాలుడైన భగవంతుడు భూలోకంలో అవతరించదలచి దేవతలున్నచోటికే వచ్చాడు ఆ సమయంలో. వచ్చిన విష్ణుమూర్తి ఏకాగ్రమనస్సుతో బ్రహ్మ సమీపంలో వుండగా, దేవతలాయనకు నమస్కరించి, స్త్రోత్రం చేసి, ఆయన మనస్సును సంతోష పరిచి, భక్తితో తమ బాధలు చెప్పుకున్న విషయాన్ని "సుగంధి" పద్యంలో రాసారు కవి ఇలా:

సుగంధి: నిన్ను  వేఁడు  వార  మయ్య  నీరజాక్ష! మమ్ము  నా
పన్నులం  బ్రపన్ను లం బ్రపంచము  న్దయామతిం
జెన్ను  మీరఁ  గావవే,  ప్రసిద్ధుఁ  డిద్ధకీర్తిసం
పన్నుఁ  డున్ వదాన్యుఁ డుం  దపస్వితుల్య  తేజుఁ డున్-8

ఛందస్సు: సుగంధికి  ర-జ-ర-జ-ర  గణాలు 9 వ అక్షరం యతి.

తాత్పర్యం: కమలాలలాంటి కళ్ళున్న మహానుభావా! ఆపదలతో బాధపడుతున్నాం. నిన్ను ప్రపత్తి చేసినవాళ్ళం. అందుకే నిన్నే ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని-ప్రపంచాన్ని దయతో రక్షించు. ప్రపంచంలో సత్ప్రవర్తనకలవాడని ప్రసిద్ధికన్నవాడు, మంచి కీర్తి సంపాదించినవాడు, దాత, ఋషితేజంకలవాడు, కకుత్థ్స వంశంలో పుట్టినవారిలో శ్రేష్ఠుడు దశరథుడు కొడుకులు కావాలని సంకల్పించి యజ్ఞం చేస్తున్నాడు. 

No comments:

Post a Comment