Saturday, November 16, 2013

ఈ రహదారులతో వాహన ప్రమాదాలు ఎలా ఆగుతాయి? : వనం జ్వాలా నరసింహారావు

ఈ రహదారులతో వాహన 
ప్రమాదాలు ఎలా ఆగుతాయి?  
వనం జ్వాలా నరసింహారావు

రహదారులపై ప్రమాదాలు ఆగేదెప్పుడు?

నమస్తే తెలంగాణ దినపత్రిక (26-11-2013)

రహదారులు తరచుగా రక్తసిక్తమౌతున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక వాహనం ప్రమాదం బారిన పడడం, అనేకమంది ప్రాణాలు కోల్పోవడం చూస్తూనే వున్నాం. ప్రమాదాలు జరిగిన కొన్ని రోజుల వరకుసంబంధిత వాహనాల ట్రావెలర్స్ యజమానులను ప్రశ్నించడం, వీలుంటే కొన్ని వాహనాలను కొంతకాలం పాటు సీజ్ చేయడం, మళ్లీ అన్నీ మర్చిపోవడం మినహా, శాశ్వత పరిష్కార మార్గాలు అన్వేషించిన దాఖలాలు లేవు. ప్రమాదాలకు కారణాలు వాహనం నాణ్యతా లోపం, డ్రైవర్ తప్పిదం లాంటివి కొంతమేరకైతే, రాష్ట్ర-జాతీయ స్థాయి రహదారుల అస్థవ్యస్థ నిర్మాణం మరో ప్రధానమైన కారణం అనాలి. ఈ మధ్య కాలంలో నాలుగు-ఆరు లేన్ల రహదారుల నిర్మాణం అక్కడక్కడా కొంత మేరకు జరిగినప్పటికీ, ఆ రహదారులలో ప్రయాణం చేసే వాహనాలను నడిపేవారికి, నిర్దిష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతో, డ్రైవర్లు తమకిష్టమైన పద్ధతిలో వాటిని నడపడం, ప్రమాదాలకు గురికావడం జరుగుతోంది. వాహనాల వేగాన్ని అరికట్టే మార్గాలు కూడా సరిగ్గా లేవనే అనాలి.

మౌలికరంగ అభివృద్ధి విషయంలో, చంద్రబాబు కాలం నాటి విజన్ 2020 లక్ష్యాల దగ్గరనుంచి, ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాల లక్ష్యాల వరకు, వాటిని సాధించే ప్రయత్నంలో, సమర్ధవంతమైన చర్యలేవీ తీసుకున్న దాఖలాలు లేవు. రహదారుల ఏర్పాటులో వున్న అనేక లోపాలను సవరించి వర్తమాన-భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రోడ్లను అభివృద్ధిపరచాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ మధ్య కాలంలో, అధునాతన పద్ధతులలో నిర్మించామని చెప్పుకుంటున్న హైదరాబాద్-విజయవాడ తరహా నాలుగు లేన్ల జాతీయ రహదారుల విషయంలో కూడా, క్యారేజీ వే వైశాల్యం తగినంతగా లేకపోవడం, వాహనాల వేగానికీ-ప్రయాణానికీ అనువుగా రోడ్లు లేకపోవడం, వాహనాల వేగాన్ని తట్టుకోవడానికి వీలైనంత మందంగా రోడ్ల నిర్మాణం లేకపోవడం, హైవేల మీద తగినంత వైశాల్యంలో బౌండరీలు లేకపోవడం, రాత్రి వేళల్లో ప్రమాదాలు జరగకుండా నివారించడానికి వీలుగా రోడ్లపై వుండాల్సిన గుర్తులు, డిస్ ప్లే బోర్డులు అవసరమైనంత సంఖ్యలో ఉండకపోవడం, ప్రమాదాలకు కారణమౌతున్నాయి. రాష్ట్రంలో విపరీతంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తిరుగుతున్న లారీలు, ప్రైవేట్-ప్రభుత్వ బస్సులు, ఇతర వాహనాలు, పార్కింగ్ చేయడానికి కూడా వీలైన స్థలాలు హైవేల మీద లేవనేది వాస్తవం. కాకపోతే, గతంలో కంటే ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగైనప్పటికీ, నాలుగు లేన్లు కదా అన్న ధైర్యంతో వాహనాలు నడిపేవారికి, అవి వేయాల్సిన పద్ధతిలో వేయకపోవడంతో జరగనున్న ప్రమాదాలను గుర్తించ లేకపోతున్నారు వాహనం నడిపేవారు. ఈ నేపధ్యంలో, కనీసం అమెరికా లాంటి కొన్ని దేశాలలో అమల్లో వున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేసి, వాటిని మన దేశంలో-రాష్ట్రంలో కూడా మన అవసరాలకు అనుగుణంగా అనుకరిస్తే మంచిదేమో! ఒక్క సారి అమెరికా హైవే వ్యవస్థను పరిశీలించితే, సురక్షితమైన ప్రయాణానికి కొన్ని పాఠాలను నేర్చుకునే వీలవుతుంది. నేర్చుకున్న వాటిని అమలు చేసే ప్రయత్నాలు కూడా చేస్తే మరీ మంచిది.

అమెరికా హైవేల మీద వాహన ప్రయాణం ఎంతో హుషారుగా, హాయిగా, ఆనందంగా వుంటుంది. వివిధ రకాల వాహనాలు, చెరోవైపున వున్న నాలుగు-ఆరు లేన్ల రహదారిపై, తమకనువైన లేన్లలో, గంటకు కనీసం 55-65 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంటాయి. కొందరు అప్పుడప్పుడు పరిమితిని మించి వేగంగా ప్రయాణించినప్పటికీ, రహదారి పెట్రోలింగ్ పోలీసుల దృష్టిలో పడే అవకాశాలున్నందువల్ల, తరచుగా ఆ పని చేయడానికి సాహసించరు. భారత దేశంలో వివిధ రాష్ట్రాలను అనుసంధానిస్తూ జాతీయ రహదారులున్నట్లే, అమెరికాలో ఇంటర్ స్టేట్ రోడ్లుంటాయి. మనమిక్కడ ఎన్. హెచ్. వన్, ఎన్. హెచ్. టు అని పిలిచినట్లే అక్కడ కూడా సంఖ్యలను ఉపయోగిస్తారు. తేడా అల్లా, ఒక రాష్ట్ర సరిహద్దులోకి ప్రవేశించిన తరువాత ఆ హైవే నంబర్ మారిపోతుంది. ఉదాహరణకు "ఏ" అనే రాష్ట్రం నుంచి "బి" అనే రాష్ట్రం మీదుగా "సి" అనే రాష్ట్రానికి ప్రయాణిస్తే "ఏ-బి" రాష్ట్రాల మధ్య వున్న హైవేకు ఒక సంఖ్య, "బి-సి" రాష్ట్రాల మధ్య వున్న హైవేకు మరో సంఖ్య వుంటాయి. దేశ ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలిపే హైవేలకు బేసి సంఖ్యలు, తూర్పు-పశ్చిమ ప్రాంతాలను కలిపే హైవేలకు సరి సంఖ్యలు వుంటాయి. హైవేల మధ్య మన దేశంలో లాగా నామ్ కే వాస్తే డివైడర్లు వుండవు. అత్యంత విశాలమైన డివైడర్లు వుండడం వల్ల ఎదురుగా వస్తున్న వాహనాలు ఎట్టి పరిస్థితుల్లోను మనం నడిపే వాహనానికి ఎదురుపడే అవకాశమే వుండదు. ఇక్కడ లాగా, రహదారులను బాగుచేసే సందర్భంలో, ఒకే సైడు రోడ్డు మీద ఇరువైపులా వచ్చే వాహనాలను అనుమతించడం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. అలాంటి విశాలమైన డివైడర్లు వుండడం వలన, ఎదురుగా వస్తున్న వాహనం మన పక్క నుంచి దూసుకుపోతున్న అనుభూతి కానీ, ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీ కొట్టే అవకాశం కానీ వుండదు. వాహనాలు ఢీ కొట్టుకుని ప్రమాదం జరగడానికి వీలే లేదు.


హైదరాబాద్-విజయవాడ హైవే

"ఇంటర్ స్టేట్" రోడ్ల మీద చెరోవైపున రెండు లేక మూడు ఛానల్స్ లేదా పాస్ వేస్ వుంటాయి. వాహనం నడిపేవారు తాను వెడలుతున్న వేగాన్ని బట్టి అందుకు కేటాయించిన పాస్ వేలో మాత్రమే ప్రయాణం చేయాల్సి వుంటుంది. తన ముందు పోతున్న వాహనాన్ని ఓవర్ టేక్‌ చేయాలనుకుంటే, ఇక్కడి లాగా, ఎడంవైపు నుంచో-కుడి వైపు నుంచో అడ్డం దిడ్డంగా పోవడానికి నిబంధనలు అంగీకరించవు. అక్కడ ఓవర్ టేక్‌ చేయాలంటే, వెనుక వున్న వాహన చోదకుడు తాను ప్రయాణిస్తున్న ఛానల్ కు ఎడమవైపున్న ఛానల్ లోకి ప్రవేశించి, తదనుగుణంగా వేగాన్ని నియంత్రించుకుని, ముందుకు సాగి పోవాలి. ఈ మొత్తం ప్రక్రియ మరే ఇతర వాహనానికి ఇబ్బంది కలగని రీతిలో చేయాలి. వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి, అతడి పక్కన కూచున్న వ్యక్తి, సీట్ బెల్ట్ తప్పని సరిగా పెట్టుకోవాలి. వాహనాల డ్రైవింగ్ సీట్ ఎడమ వైపున వుంటుంది కాబట్టి, వాహనాలన్నీ రోడ్డుకు కుడి వైపున ప్రయాణించాలి. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఫైన్ పడడం తప్పనిసరి. దానినే అక్కడ "టికెట్" జారీ చేయడం అంటారు. వాహనం రిజిస్టర్ అయిన రాష్ట్రంలో లేదా డ్రైవర్ లైసెన్స్ తీసుకున్న రాష్ట్రంలో వాహనం నడుపుతున్న వ్యక్తి నిబంధనలు వుల్లంఘిస్తే, ఆ వివరాలను లైసెన్స్ నంబర్ ఆధారంగా ఎక్కిస్తారు. మరో రాష్ట్రంలో పట్టుబడితే, ఫైన్ అనేక రెట్లుంటుంది. ప్రతి తప్పిదానికీ కొన్ని పాయింట్లుంటాయి. ఆ పాయింట్ల పరిమితి దాటగానే లైసెన్స్ రద్దవుతుంది. ఒకసారి రద్దయితే దానిని రెన్యువల్ చేయించుకోవడం అంత సులభం కాదు. ఇక మద్యం సేవించి వాహనం నడపడం భయంకరమైన నేరం. ఓపెన్ చేసిన మద్యం బాటిల్ కూడా కారులో వుండడానికి వీలు లేదు.

హైవేల మీద ప్రయాణిస్తూ నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో పెట్రోలింగ్ పోలీసు వాహనం, ఈ వాహనానికి పక్కగా ప్రయాణిస్తూ, ఆపాల్సిందిగా సంజ్ఞలు చేయడం జరుగుతుంది. పోలీసుల సందేశం అందుకున్న మరు నిమిషంలో డ్రైవర్ హైవే పక్కనున్న "షోల్డర్" లో తన వాహనాన్ని నిలిపివేయాలి. ప్రయాణానికి కేటాయించిన రహదారికి అనుబంధంగా రోడ్డు పొడవునా వున్న ఈ షోల్డర్ కేవలం వాహనాలను నిలపడానికి మాత్రమే ఉపయోగించాలి. చెడిపోయిన వాహనాలను కూడా అలానే పక్కన పార్క్ చేస్తారు. మన దగ్గర అలా షోల్డర్ సౌకర్యం లేకపోవడంతో రోడ్డు పైన ఎక్కడ పడితే అక్కడ నిలబెడతారు. వాహనాన్ని నిలిపిన తరువాత డ్రైవర్ సీట్లో కూచున్న వ్యక్తి కిందకు దిగాల్సిన పని లేదు. పెట్రోలింగ్ పోలీసు అధికారే వాహనం దగ్గర కొచ్చి డ్రైవర్ ఏ నిబంధనను ఉల్లంఘించాడో తెలియచేస్తాడు. దానికి శిక్ష ఏంటో కూడా వివరిస్తాడు. అక్కడ ఏ విధమైన వాదనలకు తావుండదు. డ్రైవర్ తప్ప ఇతరులెవరు జోక్యం చేసుకోకూడదు. "నాకు ఆ అధికారి తెలుసు...ఈ అధికారి తెలుసు" లాంటి మాటలు అక్కడ చెల్లుబాటు కావు. హైవేల మీద వాహనాలు నిబంధనలను ఉల్లంఘించడం "రాడార్" ద్వారా తెలుసుకుంటారు పోలీసులు. మనం ఎంత స్పీడ్ తో వాహనం నడుపుతున్నామో కూడా తెలిపే ఎలక్ట్రానిక్ స్క్రీన్ బోర్డులుంటాయి రహదారి పక్కన.

హైవేలంతటా రకరకాల "ఎగ్జిట్స్" వుంటాయి. ప్రయాణం చేస్తున్న హైవే నుంచి వైదొలగి, ఈ ఎగ్జిట్స్ ద్వారా సంబంధిత అవసరం కోసం వాహనాన్ని మరల్చాల్సి వుంటుంది. చమురు నింపుకోడానికి, భోజనం చేయడానికి, పలహారాలు చేయడానికి, బస చేయడానికి, ఆసుపత్రి సౌకర్యానికి, హాలీడే, క్యాంప్....ఇలా రకరకాల ఎగ్జిట్స్ ను ఉపయోగించుకుని తమ అవసరాలను తీర్చుకోవచ్చు. అదే విధంగా రహదారుల పక్కనున్న పట్టణాల్లోకి, నగరాల్లోకి, గ్రామాల్లోకి ప్రవేశించడానికి కూడా ఎగ్జిట్స్ వుంటాయి. వీటికి అదనంగా, కనీసం ప్రతి 30 మైళ్లకు ప్రత్యేకమైన విశ్రాంతి స్థలాలుంటాయి. కాల కృత్యాలు తీర్చుకోవడానికి, కాసేపు విశ్రమించడానికి కూడా ఎగ్జిట్స్ వుంటాయి. అక్కడుండే వెండర్ మెషిన్స్ లో ఆహార పదార్ధాలు, కూల్ డ్రింకులు అమర్చబడి వుంటాయి. వివిధ ఎగ్జిట్ ప్రాంతాలను సాధారణంగా ప్రయివేట్ వ్యక్తులే నిర్వహిస్తుంటారు. విశ్రామ స్థలాలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. అక్కడ, ప్రయాణీకులు ఆ రాష్ట్రం గురించిన సమాచారాన్ని బుక్ లెట్స్ ద్వారా పొందే సౌకర్యం వుంటుంది. ఎగ్జిట్స్ లో మనకు క్యాంటీన్లు, రెస్టారెంటులు కనిపిస్తాయి. మెక్సికన్లు, ఇటాలియన్లు, చైనీస్ వాటిని నడుపుతుంటారు. ఇండియన్ రెస్టారెంటులు కూడా అక్కడక్కడ దర్శనమిస్తాయి. మన డాబాలకు వీటికి పోలికే లేదు. ఆహార నాణ్యత విషయంలో కాని, శుచి శుభ్రత విషయంలో కాని, సరఫరా చేసే విషయంలో కాని వాటి కవే సాటి.

మనం ఏదైనా అవసరార్థం ఒక ఎగ్జిట్ మార్గంలోకి ప్రవేశించిన తరువాత మళ్లీ హైవే మీదకు రావడానికి, ఇక్కడి హైవేల మాదిరిగా, వెనక్కు మళ్లడం కాని, రోడ్డుకు అడ్డంగా రాంగ్ రూట్ లో పోవడం కాని చేయాల్సిన పనిలేదు. అదే మార్గంలో కొంత దూరం పయనించి ముందుకు సాగితే, ఆ ఎగ్జిట్ కు అనుబంధంగా వున్న మరో రోడ్డు మనల్ని హైవే మీదకు చేరుస్తుంది. అది కూడా పూర్తిగా వన్ వేనే కాబట్టి ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం వుండదు. అదే విధంగా హైవేకు ఎడమవైపున్న ఒక ఎగ్జిట్ లోకి ప్రవేశించాలనుకుంటే, మనం కుడివైపున ఎగ్జిట్ కనిపించేంతవరకూ ప్రయాణం చేసి, దాని ద్వారా మరో మార్గాన్ని అందుకోవడం కానీ, అవసరమైన ఎగ్జిట్ లోకి ప్రవేశించడం కానీ చేయాల్సి వుంటుంది. హైవేలు, దానికి అనుబంధంగా వుండే మార్గాలు ఎట్టి పరిస్థితుల్లోను ప్రమాదానికి వీలు కలిగించే విధంగా ఉండకపోవడం గమనించాల్సిన విషయం.

          అంతర్ రాష్ట్ర రహదారులైనా, రాష్ట్రంలోని రహదారులైనా, దాదాపు ఇదే రకమైన సౌకర్యంతో, ఎంతో క్షేమకరంగా వుంటాయి. ఒక వాహనానికి మరో వాహనం అడ్డుపడడం కానీ, ఎదురెదురుగా రావడం కానీ, వేగంలో హెచ్చు తగ్గులు చేస్తూ చికాకు పుట్టించడం కానీ, మనకు కనిపించదు. అన్ని వాహనాలు కూడా చక్కని వేగంతో ఏ విధమైన సమస్యలు లేకుండా సజావుగా సాగి పోతుండడం మనకు అక్కడ కనిపిస్తుంది. వాహనాలు సాఫీగా సాగడానికి ఏమైనా ప్రతిబంధకాలు ఏర్పడితే అవి కేవలం ట్రాఫిక్ జాంల వల్ల మాత్రమే. అవి కూడా అరుదుగా కనిపిస్తాయి.

          మన దేశంలో, రాష్ట్రంలో, ఇంతవరకు వేసిన హైవేల ఆధునీకరణ కోసం, కొత్తగా నిర్మించ బోయే రోడ్ల నిర్మాణం కోసం, అమెరికా లాంటి దేశాల రహదారి వ్యవస్థను కొంత మేరకు అధ్యయనం చేస్తే బాగుంటుందేమో! 



4 comments:

  1. I wonder so many times that these ministers and government officers visit other countries so many times. None of them got the idea to even copy US road system. Very sad.

    ReplyDelete
  2. కొంత శాతం కాదండి 100 %

    ReplyDelete
  3. నేను భారతదేశం ఒచ్చినపుడు,నా చిన్ననాటి స్నాహితుడి తో స్కూటర్ మీద వెళుతూ,ఇక్కడ రోడు చాలా ప్రమాదకరంగా వున్నై కదరా,ఏ లారి గుద్దితే
    పైకి పోటమే అన్నాను,సరిగ్గా ఏడాది క్రితం ఆయనా లారికిందా పడ్డాడు,
    నాదగ్గర ఒక ప్రశ్న్ వుంది, ఇండియా, దొంగల,దేశమా తెలివి తక్కువా దేశమా

    ReplyDelete
  4. చాలా చక్కగా వ్రాసారు సర్.. అయితే రహదారులతో పాటు వాహన చోదకులు కూడా సరైన పద్దతిలో లేరు. మనకున్నవి ఇవే రహదారులు, మనమేమి ఎక్కడి నుండో ఊడిపడలేదు, కాబట్టి ఉన్న రహదారులలోనే జాగ్రత్తగా వెళదామన్న సెన్సు ఎక్కువ శాతం మందికి లేదు. ప్రక్కన పోలీసులు వచ్చి ప్రతివారికి చెప్పేంతమంది పోలీసులు ఉన్న దేశం కాదు. జనాభాతో పోలిస్తే బయటి దేశాలకన్నా మన దేశంలో పోలీసుల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. ఏవైనా ఇప్పుడిప్పుడే మన రోడ్లు కూడా బాగుపడుతున్నాయి. అయితే, మనకున్న రాజకీయ వ్యవస్థ వలన పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి

    Vin ni గారు ఇండియా ఏ దేశమైనా దొంగల కోసం జేబులో డబ్బులు వేసుకెళ్ళవలిసిన ఖర్మ ఉన్న దేశం మాడుకు కాదు. రోడ్ల విషయంలో ఇండియా లాగానే ప్రతీ దేశం ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పైపైన సిటిల దగ్గరలోనే తిరుగుతాము కానీ లోపల రూరల్ ప్రాంతాలలోనికి వెళ్ళలేము కదా. "మన గురించి మనం తెలుసుకున్నట్లుగా వేరొకరి గురించి తెలుసుకోలేము" కదా.

    ReplyDelete