ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి)
రామాయణంలో ఛందః ప్రయోగాలు
బాల కాండ-3
వనం జ్వాలానరసింహారావు
పంచ చామరం: ఇ టా చతుర్ముఖుండ రాగఁ నిష్ట శిష్టపాళితోఁ
దటాలున న్మునిప్రభుండు తద్దభక్తి యుక్తిమై
నిటాలమందుఁ గేలుదోయి నిల్చి మ్రొక్కి నిల్చితా
ని టేటికో ననుం గనంగ నేగుదెంచె ధాతయున్-2.
పంచ చామరం వృత్తానికి జ-ర-జ-ర-జ-గ గణాలు. పదో అక్షరం యతి. చతుర్ముఖ బ్రహ్మకు పంచ చామర సేవ చేశారు వాసు దాసుగారు.
రామాయణాన్ని రచించేందుకు వాల్మీకిని నియమించడానికి సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఆయన ఆశ్రమానికి వస్తాడు. అప్పటికే జంటగా పక్షులు కలిసున్న సమయంలో, ఒక దాన్ని కొట్టి చంపడం ధర్మం కాదని నిశ్చయించుకున్న వాల్మీకి ఆ పనిచేసిన బోయవాడిని శపించాడు. శపించిన మాటలే పద్య రూపంలో కావడం అర్థంకాని వాల్మీకి నోట వచ్చిన పద్యానికి కారణం తానేనని తెలియక తికమక పడుతున్నాడని తెలిసిన బ్రహ్మ, అది యాదృచ్ఛికంగా వచ్చింది కాదని, తన పనుపున సరస్వతీ దేవి వాల్మీకి నోటినుండి పలికించిందని అంటూ, రామాయణాన్ని కావ్యంగా రచించి, భూ లోకంలో దాన్ని ప్రచారంలోకి తెమ్మని చెప్పి వెళ్లిపోయాడు.
కవిరాజ విరాజితము:
సరససమాసవిలాసవిభాసము సాధునుతంబు సుసంధిగమున్
వరమ ధురోపనతార్థ సువాక్యని బద్ధము యోగసమంజసము
న్ఖరదశకంఠవధాధికమున్ సుమ నస్సు ఖదంబు మునీరితమున్
స్ఫురదురుసద్గుణభూషణభూషిత మున్ గనుఁ డీ రఘురాము కథన్-3
కవిరాజ విరాజితము ఛందస్సు: "నగణము నారు జగణములు వగణము గలది కవిరాజ విరాజితము". దీనికి ఒక సిద్ధాంతం ప్రకారం 8-7-7 స్థానాలలోనూ, ఇంకో సిద్ధాంతం ప్రకారం 14వ స్థానంలోనూ యతి వుంటుంది. ఈ పద్యంలో యతి రెండో సిద్ధాంతాన్ని అనుసరించి రాయబడింది.
తాత్పర్యం: రసవత్తరమైన సమాసాలతో, సుకరమైన సంధులతో ప్రకాశించేదిగా-సజ్జనులతో స్తోత్రం చేయబడేదిగా-సమత్వం, మాధుర్యం,అర్థ వ్యక్తి లాంటి గుణాలు కల బోసి వాక్య బద్ధమైన కావ్యంగా-యోగం, రూఢ్యర్థాలతో కూడినదిగా-రావణాసురుడి వధను అధికరించి చెప్పేదిగా-మనస్సుకు సుఖమిచ్చేదిగా-పామర కవులకు బదులుగా మునీశ్వరుడు చెప్పిందిగా-చక్కటి కావ్య గుణాలతో అలంకరించినది గా, తాను రచించ బోయే రామాయణాన్ని-అందులోని శ్రీరామ చరిత్రను దర్శన సమానమైన ధ్యానంతో శ్రద్ధగా లోకులందరినీ వినమని కోరతాడు వాల్మీకి.
No comments:
Post a Comment