ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి)
రామాయణంలో ఛందః ప్రయోగాలు
బాల కాండ-8
వనం జ్వాలానరసింహారావు
రావణుడు వర గర్వంతో అన్ని లోకాలవారిని-ముఖ్యంగా వయసులో వున్న స్త్రీల మాన ప్రాణాలను-పురుషుల ప్రాణాలను నాశనం చేసాడని, వాడు మనిషి చేతులో తప్ప ఇతరుల వల్ల చావడని, సామాన్య మానవులెవరు వాడిని చంపలేరని, అందువల్ల విష్ణుమూర్తే మానవావతారంలో వాడిని చంపాలని దేవతలిచ్చిన సలహాను అంగీకరించిన మహావిష్ణువు దశరథుడు పుత్ర కామేష్ఠి యాగం చేస్తున్న ప్రదేశం నుండి అదృశ్యమయ్యాడు. విష్ణుమూర్తి యజ్ఞ సభనుండి అంతర్థానమైన తర్వాత ఆయనకు రామావతారంలో సహాయపడేందుకు, బలవంతులను - కామ రూపులను- గోళ్ళు, కోరలు ఆయుధాలుగా కలవారిని-అసహాయశూరులను సృజించమని, దేవతలను ఆదేశిస్తాడు బ్రహ్మ. ఇలా జన్మించిన వానరుల విషయం ప్రస్తావిస్తూ ఒక పద్యాన్ని "ఉత్సాహం" లోనూ, మరొకటి "మత్తకోకిలము" వృత్తంలోనూ, మూడోది "మనోహరిణి" వృత్తంలోనూ రాసారీవిధంగా కవి.
ధీమతుల్ ప్రధాయుతుల్ సుధీరతావిరాజియుల్
భీమవేగభూరిశౌర్య విక్రమేడ్యయూథపుల్
భూమిశతసహస్రశతము పుట్టి క్రాలు చుండఁ గన్-9
ఛందస్సు: ఉత్సాహం కు ఏడు సూర్య గణాలు, ఒక గురువు, ఐదవ గణం మొదటి అక్షరం యతి.
మత్తకోకిలము: అట్టిమర్కటయూథపాళుల యందు మిక్కిలి మేటులై
దిట్టలై రవిపుత్రుఁ డాదిగ దేజరి ల్లిరి యూథనా
థేట్టు లీ ప్లవగేంద్రులున్ జని యింపఁ జేసిరి ధీరతా
పట్టభద్రుల శౌర్య రుద్రుల స్వామికార్యవినిద్రులన్-10
ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.
మనోహరిణి: జలధర బృందా చలకూటనిభుల్
బలమదవంతుల్ ప్లవగ ప్రముఖుల్
వెలసిరి సీతా విభుసాహ్యముకై
బలకొని చక్షు ర్భయదాకృతులున్-11
తాత్పర్యం:
వారు కోరిన రూపాలు ధరించగలరు.తేజంతో ప్రకాశిస్తూ-బుద్ధివల్ల పూజించబడుతూ-కీర్తిమంతులుగా-మంచి ధైర్యవంతులుగా-భయంకర వేగంతో- గొప్ప శౌర్యంతో-పరాక్రమంతో ఆ వానర సేనానాయకులందరూ భూమిపై తిరగసాగారు. ఆ సేనానాయకుల గుంపులలో,మిక్కిలి గొప్పవారైన సుగ్రీవుడులాంటివారు,వారికి నాయకుడై వుండసాగారు.ఈ వానరులకు కూడా ధైర్యవంతులు, శౌర్యవంతులు, స్వామికార్యధురీణులు పుట్టారు. మేఘ సమూహాలవలె బలసినవారై, కొండ శిఖరాలలాగా ఉన్నత దేహాలు కలిగి, బల గర్వాలతో, భయంకర ఆకారాలతో, శ్రీరాముడికి సహాయం చేసేందుకొరకు జన్మించారా వానర శ్రేష్ఠులు.
No comments:
Post a Comment