ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి)
రామాయణంలో ఛందః ప్రయోగాలు
బాల కాండ-6
వనం జ్వాలానరసింహారావు
రతీదేవిని మించిన సుందరమైన భార్యలు-అసమాన పరాక్రమం వున్నా, సంతానం లేనందున, సుఖాలెన్ని వున్నా-కుమారులవలన కలిగే భోగ భాగ్యాలతో సరితూగవని-తన తపస్సు వ్యర్థమనీ బాధపడేవాడు దశరథుడు. పుత్రులు కలిగేందుకు అశ్వమేథ యాగం చేస్తాననీ-అలా చేస్తే సంతానం కలగొచ్చనీ తన మంత్రులతో పురోహితులతో అంటాడు. అందులో భాగంగా పుత్రకామేష్టి యాగం కూడా చేయాలనుకుంటాడు.
పుత్ర కామేష్టి యాగం చేయ సంకల్పించిన దశరథుడితో ముఖ్యమంత్రి సుమంత్రుడు తనకు తెలిసిన ఒక ఉపాయాన్ని-దేన్నైతే సనత్కుమారుడు ఋషులందరూ వింటుండగా వెల్లడిచేశాడని వశిష్ఠాది మునులంటుండగా తాను విన్నాడో, దాన్ని చెపుతానని అంటాడు. ఆ ఉపాయంతో, పుత్రులు లేరన్న చింత తొలగిపోతుందని, అది పుత్రులు కలిగేందుకు నిర్విఘ్నమైన ఉపాయమని అంటాడు. కాశ్యపుడు అనే మునికి-హరిణిలకీ గొప్ప తపస్వి-పుణ్యవంతుడైన ఋశ్యశృంగుడనే కొడుకున్నాడనీ, అతడు పుట్టినప్పటినుండీ అడవుల్లోనే విహరించేవాడని సుమంత్రుడంటాడు. అడవుల్లో తిరిగే అతడు తన తండ్రిని చూడడానికి వచ్చే మునులను తప్ప ఇంకెవ్వరినీ చూడలేదు. ఎల్ల వేళలా తండ్రి ఆజ్ఞానుసారం తపస్సు చేస్తుండేవాడు. ఈ విషయాలను చెప్తూ బ్రహ్మచర్యం గురించి కూడా వివరిస్తాడు సుమంత్రుడు దశరథుడికి. ఇక్కడో పద్యాన్ని "తరలము" వృత్తంలో రాసారీవిధంగా:
తరలము: జననమాది రసాస్థలిన్ వన చారియై సతతంబు నా
మునివరేణ్యుఁ డు గానఁ దండ్రికి మ్రొక్క వచ్చెడియోగులన్
ఘనతపస్వులఁ గాని యన్యముఁ గానఁ డెద్దియు, నిత్య మ
య్యనఘుఁ డుగ్రతపంబులన్ జన కాజ్ఞచొప్పున వర్తిలున్-4
ఛందస్సు: న-భ-ర-స-జ-జ-గ గణాలు. పన్నెండో స్థానంలో యతి.
ఋశ్యశృంగుడి చరిత్రను సవివరంగా చెప్పమని కోరిన దశరథుడితో, సుమంత్రుడు, ఇంతకుముందు చెప్పినదాన్నే మరింత సమగ్రంగా తెలియచేస్తాడు. ఆ సందర్భంలో "మత్తకోకిలము" వృత్తంలో ఒక పద్యాన్ని, "తరలము" లో ఇంకొక పద్యాన్ని రాస్తారు. అవి:
మత్తకోకిలము: ఆ ఋషీంద్రుఁ డు పుట్టు వాదిగ నంబుజాయతనేత్ర ల
న్వార లెట్టిరొ యాలకింపఁ డు పల్క నేటికిఁ జూచుటల్
వారముఖ్యులు ధారణీశ్వర వంచనాపర లౌటచే
నేరుపుల్ పచరించి తేరఁ గ నేర్తు రెంతయుఁ దిన్నఁ గన్-5
తరలము: జనన మందిన దాదిఁ గా బుర సంభవంబు నేదేనియున్
జనపదోద్భవమైనఁ జూచిన జాడ లేదు, నెలంత ల
న్వినియు నేని నెఋంగఁ, డుగ్రసు నిష్ఠు డౌటఁ దపంబునన్
దనదునాశ్రమ భూమి వీడఁడు దండ్రిఁ దన్పు సపర్యలన్-6
ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి. తరలము నకు న-భ-ర-స-జ-జ-గ గణాలు. పన్నెండో స్థానంలో యతి.
తాత్పర్యం:
పుట్టినప్పటినుండి ఇంతవరకూ స్త్రీలను ఋశ్యశృంగుడు చూడలేదు కనుక, వారెలా వుంటారో ఎరుగడని-అందువల్ల ఆయనను తీసుకునిరాగలిగేది స్త్రీలేనని మంత్రులంటారు. కుల కాంతలకు బదులు వార కాంతలైతే, ఏదో విధంగా వంచనతో వశపర్చుకుని, ఋశ్యశృంగుడిని తీసుకుని రాగలుగుతారని-ఈ పనికి వారినే పంపిద్దామని సలహా ఇస్తారు మంత్రులు. నగరంలోగాని-పల్లెల్లోగాని అందరికీ కనిపించే ఏ వస్తువునూ పుట్టినప్పటినుండి చూసినవాడు కాదు ఋశ్యశృంగుడు. స్త్రీలెలా వుంటారో అసలే తెలియదు. నియమ నిష్ఠలతో తపస్సు చేయడంలోనో-విరామం దొరికినప్పుడు తండ్రికి సేవలు చేయడంలోనో మాత్రమే సమయాన్ని గడిపేవాడు ఋశ్యశృంగుడు. ఆశ్రమాన్ని విడిచి ఎప్పుడూ-ఎక్కడకూ పోయినవాడు కాదాయన. ఇతిహాసాలు-పురాణాలు చదివి, స్త్రీలు ఎలా వుంటారోనని చదివిన వాడూ కాదు. అలాంటి ఋశ్యశృంగుడి దగ్గరికి వెళ్లాలంటే, అక్కడున్న విభండకుడు శపిస్తాడన్న భయంతో, వార కాంతలు చాలా దూరంలో వుండే, సరైన సమయం కొరకు ఎదురు చూశారు.
No comments:
Post a Comment