ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి)
రామాయణంలో ఛందః ప్రయోగాలు
బాల కాండ-2
వనం జ్వాలానరసింహారావు
వాల్మీకి కంటికి సమీపంలో, మనోహరంగా కూస్తూ, వియోగం సహించలేని క్రౌంచ పక్షుల జంట కనిపించింది. ఆ సమయంలో, తాను చూస్తున్నానన్న లక్ష్యం కూడా లేకుండా, సహజంగా జంతువులను హింసించే స్వభావమున్న బోయవాడొకడు, రెండు పక్షులలో మగదాన్ని బాణంతో చంపి నేల కూల్చాడు. క్రూరుడైన బోయవాడిపై దయ వీడి శపించాడు వాల్మీకి. సంస్కృత రామాయణంలో ఆ శ్లోకం ఇలా వచ్చింది వాల్మీకి నోట:
"మానిషాద ప్రతిష్ఠాం త్వ! మగ మ శ్శాశ్వతీ స్సమాః
యత్క్రౌంచ మిథునాదేక! మవధీః కామమోహితం"
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో వాసుదాసుగారిలా తెనిగించారు ఆ శ్లోకాన్ని:
"తెలియు మా నిషాదుండ ప్రతిష్ఠ నీక
ప్రాప్తమయ్యెడు శాశ్వతహాయనముల
గ్రౌంచ మిథునంబునందు నొక్కండు నీవు
కామమోహిత ముం జంపు కారణమున"
రామాయణం రాద్దామని సంకల్పించిన వాల్మీకి నోట వెలువడిన ప్రథమ శ్లోకమిది. ఆంధ్ర వాల్మీకి రామాయణ రచనలో వాసు దాసుగారు మొట్టమొదట రాసిన పద్యమూ ఇదే. "మానిశాద" శ్లోకం అంతవరకు తెనిగించినవారు లేరంటారు కవి. వ్యాఖ్యాతలు రాసిన అన్ని అర్థాలు వచ్చేట్లు రాయడం కష్టమనీ, దీన్ని తెనిగించగలిగితే మిగిలిందంతా తెనిగించడం తేలికవుతుందనీ భావించి, తనను తాను పరీక్షించుకోదల్చి, తొలుత ఆ పద్యాన్ని రాసానంటారు వాసుదాసుగారు.
రామాయణం రాద్దామని సంకల్పించిన వాల్మీకి నోట వెలువడిన ప్రథమ శ్లోకంలో, ఆంధ్ర వాల్మీకి రామాయణ రచనలో వాసుదాసుగారు మొట్టమొదట రాసిన మొదటి పద్యంలో నాలుగు పాదాలున్నాయి. పాదానికి 13 అక్షరాలు. సాంఖ్యశాస్త్రం ప్రకారం 13 ప్రణవాన్ని బోధిస్తుంది. ఎందుకంటే, వర్ణసమామ్నాయంలో 13వ అక్షరం "ఓ" విష్ణు అనే అర్థమున్న "మానిషాద" శబ్దం "అ" కారాన్ని సూచిస్తుంది. "ప్రతిష్ఠ” స్త్రీ లింగం. ఇక్కడ స్త్రీ వాచకం ప్రకృష్టమైంది. ప్రతిష్ఠ అనేది లక్ష్మీ వాచకమైన "ఉ" కారాన్ని బోధిస్తుంది."నీక" అనేది "ఉ" కార మొక్క అవథారణార్థకాన్ని తెలుపుతుంది. "క్రౌంచ మిథునంబునందు నొక్కండు", ప్రకృతి పురుషుల్లో కుటిల గతి కలది ప్రకృతి అనీ, దాని సంబంధంవల్ల అల్పమైన జ్ఞానమున్నవాడు (బద్ధ జీవుడు) పురుషుడని అర్థం చేసుకోవాలి. ఇది "మ" కారాన్ని బోధిస్తుంది.
వాసుదాసుగారు రాసిన మొదటి పద్యం రామాయణార్థాన్ని సంపూర్ణంగా సూచిస్తుంది. "మానిషాదుండ... ... అంటే లక్ష్మికి నివాస స్థానమయిన శ్రీనివాసుడా, శ్రీరాముడా" అనే పదం బాలకాండ అర్థాన్ని సూచిస్తుంది. "ప్రతిష్ఠ నీక శాశ్వతంబగు" అనే పదం పితృవాక్య పరిపాలన, రాముడి ప్రతిష్ఠను తెలియచెప్పే అయోధ్య కాండ అర్థాన్ని సూచిస్తుంది. "శాశ్వతహాయనముల" అనే పదంలో రాముడు దండకారణ్యంలో ఋషులకు చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్చి నందువల్ల ఆయనకు కలిగిన ప్రతిష్ఠను తెలియచేసే అరణ్య కాండ అర్థాన్ని సూచిస్తుంది. దాని ఉత్తరార్థంలో కిష్కింధ కాండార్థాన్ని సూచిస్తుంది. క్రౌంచ దుఃఖం సీతా విరహతాపాన్ని తెలియచేసే సుందర కాండ అర్థాన్ని సూచిస్తుంది. ఇలా రకరకాలుగా రామాయణార్థం సూచించబడిందీ పద్యంలో.
No comments:
Post a Comment