ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి)
రామాయణంలో ఛందః ప్రయోగాలు
బాల కాండ-13
వనం జ్వాలానరసింహారావు
విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలన్న తలంపుతో ఘోరమైన-కఠోరమైన తపస్సు చేస్తున్న సమయంలో,సమీపంలోని తీర్థంలో స్నానమాడేందుకు,అతి మనోహరమైన సౌందర్యంతో-మన్మథుడి ఆయుధమేమోనని అనుకుండే విధంగా కనిపిస్తున్న ఒక అప్సరస, విశ్వామిత్రుడిని మోసగించే ఉద్దేశంతో వచ్చింది. ఆమె సౌందర్యాన్ని వర్ణించేందుకు "కవిరాజవిరాజిత వృత్తం" లో ఒక పద్యాన్ని రాసారీవిధంగా వాసు దాసుగారు.
కవిరాజవిరాజితము:
నళినవిలోచన నూనమనోహర నవ్యశరీర విహారరతన్
జలదవినీల శిరోరుహఁ గోరక చారురదన్ శిశిరాంశుముఖి
న్జలకము లాడ ఘనాంతరచంచల నాఁ గని మారశరాహతుఁ డై
కలఁ గుచుఁ దామరపాకుజలం బనఁ గాంతను డాసి వచించె నిటుల్-16
ఛందస్సు: "నగణము నారు జగణములు వగణము గలది కవిరాజ విరాజితము". దీనికి ఒక సిద్ధాంతం ప్రకారం 8-7-7 స్థానాలలోనూ, ఇంకో సిద్ధాంతం ప్రకారం 14వ స్థానంలోనూ యతి వుంటుంది.
తాత్పర్యం:
కమలాల లాంటి కళ్లతో, పూవువలె మనోహరమైన మెచ్చుకోవాల్సిన శరీరంతో, రతిక్రీడలో ఆసక్తితో, మేఘాలలాంటి నల్లటి కురులతో, మొగ్గలలాంటి దంతాలతో, చంద్రుడిలాంటి ముఖంతో అందంగా వున్న ఆ అప్సరస, మేఘాల మధ్య మెరుపుతీగలాగా నీళ్లల్లో స్నానం చేస్తుంటే విశ్వామిత్రుడు చూశాడు. చూసి, కామ బాణ పీడితుడై, మనస్సు కలవరపడగా, తామరాకుమీద పడిన నీళ్లు చలించినట్లు మనస్సు చలించడంతో, ఆ అందగత్తెను సమీపించి ఇలా అన్నాడు.
No comments:
Post a Comment